పాపం పాతదే! కోపమే కొత్తది!!

టాపు(లేని) స్టోరీ:

IndiaRape_7048234అంతా కొత్త కొత్తగా వుంది.

వీధుల్లో కొత్త ముఖాలు.కొత్త అరుపులు. కొత్త ప్లకార్డులు. కొత్త నినాదాలు.

అల్లర్లు చేయటంలో అరవీసం శిక్షణలేని ముఖాలు. లాఠీలను ఎదురిస్తున్నాయి.

ఎండలో కొస్తే కమిలి పోయే లేత ముఖాలు. దుమ్ములేపుతున్నాయి. దుమ్ము పులుముకుంటున్నాయి.

ఖరీదయిన కాన్వెంట్లలో చదివి, ఐఐటి,ఐఐఎం, మెడికల్‌ కాలేజీల్లోని డార్మిటరీల్లో యవ్వనాన్ని గడిపి, కార్పోరేట్‌ సంస్థల ఎసీ గదల్లో ఉద్యోగాలు చేసేవాళ్లు- ఇలా సాదాసీదా కార్మికుల్లాగా, రైతు కూలీల్లాగా రోడ్ల మీద ఆందోళనలేమిటి?

వీళ్ళని ఎదుర్కోవటం పోలీసులకు కొత్త, కోర్టులకు కొత్త, రాజకీయపక్షాలకు కొత్త. అంతెందుకు పేరొందిన మీడియా సంస్థలకు కూడా కొత్తే.

వీరెవ్వరి వత్తాసూ లేకుండా ఇండియాగేట్‌ను ముట్టడిస్తున్నారు. కొత్తగాక మరేమిటీ?

ఈ కొత్త ఉద్వేగంతోనే కొత్త సంవత్సరంలోకి వచ్చేస్తున్నాం.

పోలింగ్‌ రోజున చిన్న క్రికెట్‌ మ్యాచ్‌ వుంటే చాలు, ఈ కుర్రకారెవ్వరూ, టీవీలు వదలి పోలింగ్‌ బూత్‌లకు రారు. వీళ్ళకి రాజకీయాలు పట్టవు- అని తేల్చిపారేశారు.

కానీ ప్రజస్వామ్యపు నాలుగు స్తంభాలనూ( శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖలతో పాటు మాధ్యమాలనూ) కుదిపి పారేశారు.

వీరు ఉద్రేకపడిపోయిన విషయాలేమీ కొత్త వి కావు. పాత రుగ్మతలనే తాము కొత్తగా చూసినట్టు ఆవేశపడ్డారు. ఈ ఆవేశంలో కల్తీలేదు. కన్నీళ్ళు తమంతటతామే వచ్చాయి. పిడికిళ్ళు తామంతట తామే బిగుసుకున్నాయి.

వీళ్లు రెండు సార్లు, రెండు విషయాలమీద రోడ్డెక్కారు. ఒకటి: అత్యాచారం, రెండు: అవినీతి.

ఈ రెండూ స్వరాజ్యానికి పూర్వమూ వున్నాయి. తర్వాతా వున్నాయి.

స్వేచ్చావిపణి వచ్చి విద్యా, ఉద్యోగాలు కార్పోరేటు పరమయిన తర్వాత పుట్టుకొచ్చిన ఈ యువత చాలా విషయాలను పట్టనట్టే వుంటాయి.

గుజరాత్‌లో అల్లర్లు రేగినప్పుడు, అక్కడి ప్రభుత్వమే ఒక పక్షం వహించి వుండగా వేరే మత విశ్వాసం కలిగిన వారిపై అత్యాచారాలు, హత్యలూ జరుగుతున్నా , ఈ యువత నోరెత్త లేదు. అప్పుడు వీధల్లో ‘అర్థ రాత్రి స్త్రీయే కాదు, పట్టపగలు గాంధీ మహాత్ముడు ఒంటరిగా నడచినా క్షేమంగా ఇంటికి’ చేరలేని పరిస్థితి.

ఖైర్లంజీలో ఊరు మొత్తం దళిత కుటుంబానికి చెందిన తల్లినీ, కూతుర్నీ వివస్త్రల్ని చేసి, పాశవికంగా హత్య చేసినప్పుడు కూడా ఈ యువత కిమ్మనలేదు. ఈ కొత్త యువత కుల వివక్షకు వ్యతిరేకంగా గానీ, మతోన్మాదానికి వ్యతిరేకంగా గానీ స్పందించరు. పోనీ ‘లైంగిక వివక్ష’ మీద అంత వ్యతిరేకత వుందంటే, కాప్‌ పంచాయితీలు ప్రేమ జంటలకు మరణ శిక్షలు విధిస్తున్నప్పుడు కూడా కిమ్మన లేదు.

కానీ ఈ రెంటి విషయాల్లోనూ కోపం వచ్చింది. వీరికి ఉద్యోగాలు ప్రయివేటు రంగంలో. ప్రభుత్వ రంగంతో పనివుండదు. వృధ్ధుడికి ఇచ్చే రెండువందల రూపాయిల పించనులో ప్రభుత్వోద్యోగి యాభయి రూపాయిలు కొట్టేసినప్పుడు కలిగే బాధ వీరిది కాదు. ఎప్పుడయినా ఏ ట్రాఫిక్‌ కానిస్టేబులో, ఈ కుర్రాళ్ళు వెళ్తున్న బైక్‌ను ఆపి వందరూపాయిలు లంచమడిగినప్పుడు మాత్రం వీరికి రక్తం మరిగిపోతుంది. మరి ఇప్పుడు ఈ అత్యాచారాన్ని వ్యతిరేకంగా ఎందుకు స్పందించారు. ఎందుకంటే ఈ బాధితురాలిలో తొలి సారిగా అమ్మాయిలయతే తమనే చూసుకున్నారు. అబ్బాయిలయితే తమ భార్యల్నే, ప్రియురాళ్ళనో, చెల్లెళ్ళనో చూసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు బీపీవోల్లాంటి చోట ఆడపిల్లలు సైతం విధిగా పనిచేయాలి. నగరాల్లో రాత్రిళ్లు ఒంటరిగా చేరగలగాలి. అందుకే ఈ స్పందన. నిజానికి స్త్రీలపై అత్యధికంగా జరుగుతున్న అత్యాచారాలు- సమాజంలో వున్న అట్టడుగు వర్గాల పైనే జరుగుతోంది. వీరిలో అత్యధిక శాతం తమకు తెలిసిన వారే చేస్తారు.( ఇందులో బంధువులూ, మిత్రులూ, సహోద్యోగులు కూడా వుండవచ్చు.) ఈ కొత్తగా వచ్చిన ఆవేదనను సమాజపు అట్టడుగు పొరల్లో వున్న బాధితులవైపు కూడా కొత్తగా ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త యువత చూస్తుందని ఆశిద్దాం.

న్యూస్‌ బ్రేకులు:

ఇవి ‘చేతులు’ కావు

(తెలంగాణ పై జరిగిన)అఖిల పక్ష సమావేశానికి చంద్రబాబు ఎందుకు రాలేదు?

-జూపల్లి కృష్ణారావు, టీఆర్‌ఎస్‌ నేత

అవును కదా. వచ్చి వుండాల్సింది. సోనియా గాంధీ కూడా వచ్చినట్టు లేరే…!?

ప్రపంచ తెలుగు మహాసభల్లో అవినీతి ఏరులై పారింది.

-గాలి ముద్దు కృష్ణమ నాయుడు, టీడీపీ నేత

ఆహా! ఆరోపణను కూడా తేట తెలుగులో చేశారు.

ట్విట్టోరియల్‌

జనప్రదమా? జయప్రదమా?

conferenceప్రపంచ తెలుగు సభలు, ప్రపంచంలో మూడోకంటికి తెలీకుండా జరిగిపోయాయి. అంతే కాదు తెలుగు నాట రెండో ప్రాంతానికి (తెలంగాణకి) సంబంధం లేకుండా కూడా జరిగిపోయాయి. కళా,సాహిత్య రంగాలలో ‘అతిరథ మహారథుల్ని'( రథాలు తోలుకునే కాలంలో వాళ్ళను)కూడా పిలిచారు. ఎంత గుట్టు చప్పుడు కాకుండా వారిని పిలిచారంటే, అ విషయం పిలవబడ్డ వాళ్ళకు కూడా తెలీదు. ‘ఫలానా కవి గారిని కవిత చదవటానికి వేదిక మీదకు రావలిసిందిగా కోరుతున్నాం’ అని మైకులు పిక్కటిల్లేటట్లు పిలిచారనుకోండి. ఆయన ఎప్పటికీ రాడు. ఎందుకంటే తనను పిలిచిన విషయం తెలీక ఆయన తనవూరిలోనే తానుండిపోతారు.శ్రీవారిని దర్శించుకునే తిరుపతి యాత్రికులు ట్రాఫిక్‌ నిబంధనల కారణంగానో, బోరు కొట్టో దారి తప్పి సభలు దగ్గరకు వస్తే, సభలు (భక్త) జన ప్రదమయ్యాయి. ఈ జనాన్ని చూసి జయప్రదమయ్యాయని నిర్వాహకులు మురిసి పోయారు. పక్కరాష్ట్రంలోవున్న తెలుగు వాడయిన తొలి పౌరుణ్ని( రోశయ్యను) కూడా ఈ జనంలో చూసుకోలేక పోయారంటే, వారి తెలుగు భక్తి ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు. ఒక్క వంటల్లోనూ, సూచికల్లోనూ మినహా మిగిలిన అన్ని విషయాల్లో ‘తెలుగు’ తక్కువ తనం పరిఢవిల్లింది.

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

నెలతక్కువ

పలు ట్వీట్స్‌: ఇన్నేళ్ళలో తేలని తెలంగాణ ఒక్క నెలలో తేలిపోతుందా?

కౌంటర్‌ ట్వీట్‌:నెల తక్కువ నేతలు అంతకు మించి ఏం చేస్తారు లెండి!

ఈ- తవిక

మృగవిహారం

‘బస్సంటే

ఎందుకూ భయం.

అదీ ఇల్లు లాంటిదే.’

‘అదే నాభయం.

ఇళ్ళల్లో మృగాలే

బస్సులూ ఎక్కుతున్నాయి.’

 బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘ప్రపంచ తెలుగు సభలూ ముగిశాయి. తెలంగాణ పై అఖిల పక్షమూ ముగిసింది. తేలిందేమిటి?’

‘ఇక్కడ తెలుగు లేదు. అక్కడ తెలంగాణ లేదు.’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

కొత్త యేడాది వస్తే మార్చాల్సింది క్యాలెండర్‌ని కాదు. గోడక్కొట్టిన మేకును. ఊడిపోగలదు.

(సూర్య దినపత్రిక 1జనవరి2013 వ తేదీ సంచికలో ప్రచురితం)

2 comments for “పాపం పాతదే! కోపమే కొత్తది!!

  1. సతీష్ చందర్ గారూ. ఈ మీడియా మిడిమేలపుది. నట్టనడుమ నడివీపున రాచపుండు లాంటిది. యువతకు ఒక ఉద్యమం పేరిట రోడ్డెక్కడం ఫాషన్ అయింది. మీడియాలో ప్రచారం కోసమే వారి హడావిడి. డిల్లీలో ఇంత ఘోరం జరిగిందని గుండెలు బాదుకున్న యువత డిసెంబరు 31 రాత్రి ఎలా నిస్సిగ్గుగా వ్యవహరించింది. మహిళలు ఎందరు తాగి తూలారు. అంతెందుకు మీడియా మిత్రులు ఆ రాత్రి ఎన్ని బాటిళ్ళు ఖాళీ చేశారు. అన్నా హజారేనూ పొగుడుతారు, కేజ్రీవాలాను అందలం ఎక్కిస్తారు. చంద్రబాబునూ ఆరాధిస్తారు. జగన్ కోటలో చేతులు కట్టుకుని జీ హుజూర్ అంటారు. కేసీఆర్ కు చేమ్చాలవుతారు. అందుకే మనలను (మీడియాను) చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయి. “హాట్స్ ఆఫ్ టు సతీష్ చందర్ పెన్”.

Leave a Reply