మంచి వాళ్ళలో పిచ్చివాడిని గుర్తించినంత సులువు కాదు, పిచ్చివాళ్ళలో మంచి వాడిని గుర్తించటం. ఒక్కొక్క సారి పిచ్చాసుపత్రిలో వైద్యుణ్ణి పోల్చుకోవటం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే పిచ్చివాళ్ళు కూడా తెల్ల కోట్లు వేసుకుని, మెడలో స్టెతస్కోపు వేసుకుని తిరగవచ్చు.
వెనకటికి పండిట్ నెహ్రూ కాబోలు ప్రధాన మంత్రిగా వున్నప్పుడు ఓ పిచ్చాసుపత్రిని సందర్శించారు. లోపలికి వెళ్ళగానే, ఒక వ్యక్తి నెహ్రూను మర్యాదగా పలకరించి, ‘పే పేరేమిటీ?’ అన్నాడు.
‘జవహర్ లాల్ నెహ్రూ’ అని నెహ్రూ చెప్పారు.
‘ఫర్వాలేదు. నీ జబ్బు తగ్గిపోతుంది. నేను ఇక్కడ చేరిన కొత్తలో కూడా నా పేరడిగితే నీలాగే- జవహర్ లాల్ నెహ్రూ- అని చెప్పాన్లే. ఇప్పుడు నా పేరే చెప్పుకుంటున్నాను.’ అన్నాడు.
నెహ్రూకి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదు. ఆయన సందర్శించింది పిచ్చాసుపత్రి కాబట్టి- తొందరగానే పోల్చుకున్నాడు.
కానీ నేరస్తుల్లో అధిక భాగం జైళ్ల వెలుపలే వుండిపోయినట్టు, పిచ్చివాళ్ళలో అధిక భాగం పిచ్చాసుపత్రి వెలుపలే వుండిపోతున్నారు.
శారీరకంగా అనారోగ్యవంతుణ్ణి రోగి అని ఎలాగంటున్నాం, మానసికంగా అనారోగ్య వంతుణ్ని పిచ్చివాడూ- అంటున్నాం.
అయితే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అనారోగ్యంగా వున్న వాళ్ళని ఏమనాలి? వాళ్ళూ రోగులే. వాళ్ళూ పిచ్చివాళ్ళే.
ఆర్థిక రోగులంటే, అర్థికంగా చితికి పోయిన వారని కాదు. అలాగే పేదలో, సంపన్నులో అని కాదు. డబ్బే లోకం- అని అనుకునే వారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే- ‘డబ్బు’ చేసిన వారు. కనుపాపాయిలో స్థానంలో కను ‘రూపాయి’లు మొలిచిన వారు.
వెనకటికో ఆదర్శప్రేమికుడొచ్చి ఓ అమ్మాయి ముందు తన ప్రేమ ప్రతిపాదనను ఇలా పెట్టాడు: నువ్వంటే నాకు ప్రాణం. పైసా కట్నం తీసుకోను. నన్ను నీ ‘జీత’ భాగస్వామిని చేసుకో!
నిజమే మరి. ఆమెకు నెలకు రెండు లక్షల జీతమొస్తుంది.
ఇలాంటి ‘అర్థ’రోగులు అడుగడుగునా తారసిల్లతారు.
III III III
ఇక సామాజిక రోగుల్ని కూడా ఇలాగే నిర్థారించాలి.
సామాజికంగా అగ్రభాగాన వున్న వారో, లేక అట్టడుగున వున్నారో ఈ రోగుల కిందకు రారు. సామాజికంగా అస్వస్థత చేసిన వారిని మాత్రమే ఇలా గణించాలి.
అత్తా స్త్రీయే, కోడలూ స్త్రీయే-కానీ స్టౌ వెలిగించి కోడలి చీరకు నిప్పంటించటంలో ఆనందం పొందే అత్త వుందే..ఆమె రోగే!
సీనియరూ విద్యార్థే. జూనియరూ విద్యార్థే. కానీ దుస్తులు తీయించి డ్యాన్సు చేయిస్తూ వికటాట్టహాసం చేసే సీనియర్ వున్నాడే- వాడు రోగి.
అగ్రవర్ణుడూ కూలీయే, అవర్ణుడూ కూలీయే. అయినా, కానీ ‘లంచ్ బ్రేక్’లో అవర్ణుణ్ని ఆమడ దూరం పంపించి కానీ లంచ్ బాక్సు తెరవడు చూడండీ- వాడు కూడా రోగే.
వీళ్ళంతా సాంఘిక రోగులే.
III III III
వాడు ఒక పార్టీ బ్రోకరు, వీడు ఇంకో పార్టీ బ్రోకరు
అయినా ఒక పార్టీ బ్రోకరు, ఇంకో పార్టీ బ్రోకరు డబ్బు పంచుతుండగా పట్టించి ఆనందిస్తుంటాడు.
ఒకడు ఒక నేతకు అనుచరుడు. ఇంకొకడు ఇంకొక నేతకు అనుచరుడు.
అయినా ఈ అనుచరుడు, ఆ అనుచరుణ్ణి తన్ని, తాను పోలీస్ స్టేషన్లు అదనంగా తన్నులు తినటానికి వెళ్తూ అనందిస్తాడు. వీళ్లు రోగులు కాకుండా వుంటారా?
ఇంత మంది పిచ్చి వాళ్ళు బహిరంగంగా తిరిగే లోకంలో మనం తిరిగేస్తున్నాం. వీధిలో తిరిగే అన్నీ పిచ్చికుక్కలేకాదు, కొన్నిమంచి కుక్కలు వుండక పోవా- అన్న భరోసాతో తిరిగేస్తున్నాం.
మనమే కాదు, పసిపిల్లలూ తిరిగేస్తున్నారు.
ఢిల్లీలో, గల్లీలో, ఎవడికే పిచ్చి వుందో ఎవరికి తెలుసు?
పిచ్చివాడు బస్సుల్లో వుంటారో, మనం బస చేసే ప్లాట్లలో ఎవరూ ఊహించగలరు?
ఆరోగ్యవంతులు- వైద్యులుగానూ, చైతన్యవంతులుగానూ మారి చికిత్సనందించక పోతే- పిచ్చివాళ్ళకు సంకెళ్ళు వేసి చికిత్స నందించక పోతే, మెల్లగా ఆ పిచ్చి మనకంటుకుంటుంది.
-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రిక 21 ఏప్రిల్2013 వ తేదీ సంచికలో ప్రచురితం)