టాపు(లేని) స్టోరీ:
అందరికీ అన్నీ అలవాటయిపోయాయి. రాజకీయాల్లో ఎవరి పాత్రలు వారు చాలా రొటీన్ గా పోషించేస్తున్నారు. ఉద్యమాలూ, ఆందోళనలూ కూడా పండగలూ, పబ్బాలూ అంత పాతవయిపోయాయి. భైటాయింపులనూ, వాకౌట్లనూ పెళ్ళి తంతులంత సునాయసంగా జరిగిపోతున్నాయి. ఏ మంత్రానికి మోత మోగించాలో ముందే తెలిసిపోయిన బాజా భజంత్రీల్లా ప్రసారమాధ్యమాలు స్క్రోలింగులూ, బ్రేకింగులూ, లైవ్‌లూ నడిపించేస్తున్నాయి. ఏం జరిగినా చూసిన సినిమాయే చూస్తున్నట్టుంది.
అసెంబ్లీ ముట్టడి! టీ-జాక్ పిలుపునిచ్చింది. రేపు సమైక్యాంధ్ర జాక్ కూడా పిలుపు నివ్వవచ్చు. నినాదాలు మారతాయి. జెండాలు మారతాయి. కానీ అదే తంతు. పిలుపు రాజకీయ సంస్థలో, ఉద్యమ సంస్థలో ఇస్తాయి. అంతే. మిగిలిన పనంతా ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రభుత్వమంటే ముఖ్యమంత్రీ, మంత్రులూను. వీరు కూడా బాధ్యతను తాము సొంతంగా స్వీకరించరు. ‘ఈవెంట్ మేనేజ్‌మెంట్’లో సిధ్ధహస్తులయిన వారికి ఒప్పగించేస్తారు. ఇందులో ఆరితేరిన వారు పోలీసులు. వీరు మొత్తం నగరాన్ని కళ్యాణమంటపంగా భావించేసి, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో నిర్ణయించేస్తారు. ఎవరి విడిదిల్లో వారు వుండేలా ‘బారికేడ్లు’ పెట్టేస్తారు. ‘ప్రోటోకాల్’ ను అనుసరించి ఏ శ్రేణి ఉద్యమకారుల్ని ఎక్కడెక్కడ అడ్డుకోవాలో ఇట్టే గ్రహించేస్తారు. మరీ ముఖ్యంగా విద్యార్థులను ‘ముఖ్యఅతిథులు’గా భావించి క్యాంపస్‌లలోనే విడిదిలు ఏర్పాటు చేస్తారు. అయతే కార్యక్రమాల్లో వారూ,పోలీసులూ ఒకరినొకరు ముచ్చట్లాడుకునే సన్నివేశముంటుంది. పోలీసులు వారి మీద లాఠీలు ఝళిపించటమూ, వారేమో తిరిగి రాళ్ళురువ్వటమో, ఆ పైన పోలీసులు వారి చేత(టియర్ గ్యాస్ వదలి) ‘కంట తడి’ పెట్టించటమూ అన్నీ ‘లాంఛనం’ ప్రకారం నడిచిపోతాయి.
అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాక, ముహూర్తం రానే వస్తుంది. శాసన సభ సమావేశాల్లో ముందుగా ఉత్సవం హడావిడి మొదలవుతుంది. ప్రతిపక్ష శాసన సభ్యులు స్పీకర్ పోడియం దగ్గర భైటాయించటం వంటి పనులు మొదలవుతాయి. ‘పెళ్ళికూతుర్ని’ మేనమామ వివాహవేదికకు ‘బుట్టలో పెట్టి’ తీసికొచ్చినంత మురిపెంగా ‘మార్షల్స్’ ఒక్కొక్కరినీ మోసుకుని వెళ్తుంటారు. పెళ్ళికి ముందు పెళ్ళికూతురయినా బరువు తగ్గటానికి ఉపవాసముంటుందేమో కానీ, మన శాసన సభ్యులు ‘మార్షల్స్ మీద’ దయతో నైనా ఒక్కో కిలో కూడా తగ్గి రారు. బయిటకు వచ్చాక ఇక మిగిలింది. పల్లకీలు ఎక్కించటం. (అదే లెండి పోలీసు వాహనాలు ఎక్కించటం). అరెస్టు చేయటానికి పోలీసులు చూపే చొరవకన్నా, సదరు శాసనసభ్యులూ, ఇతర అగ్ర నాయకులూ చూపించే ఉత్సాహం ఎక్కువగా వుంటుంది. ఈ పని వీలయినంత వరకూ ‘లంచ్ టైమ్’కు ముందు పూర్తికావాలని సహజంగానే నాయకులు కోరుకుంటారు. అయితే ఈ సమయంలో ‘భజంత్రీలు( ప్రసార సాధనాల) ఉనికి తప్పని సరి. వారులేకుండా ఈ కార్యక్రమానికి గుర్తింపే వుండదు. వారు కెమెరాలతో సిధ్ధంకాగానే.. ‘తోపులాటలు’ వుండాలి. తమకి ఈ అరెస్టులు ఏమాత్రం ఇష్టంలేనట్లు పెనుగులాడాలి. ఈ సన్నివేశం ముగియగానే, దాదాపు కార్యక్రమాలు ముగింపునకు వస్తాయి. ఆ తర్వాత నిజంగా ఆందోళన చేస్తున్న ఉద్యమ కారుల్ని, ఎలాంటి భజంత్రీలు లేకుండానే ‘ఈడ్చి పారేస్తూ’ ట్రక్కుల్లో తోసేస్తారు. వివిధ పోలీస్ స్టేషన్లనో తేనీటితో సేదతీరాక, అరెస్టు చూపించి, నాయకుల్ని వదిలేస్తే, వారు తమ తమ ఏసీ నివాసాలకు వెళ్ళి, తాము అరెస్టయిన సన్నివేశాలను నులారా చూస్తూ లంచ్ చేసి, ఆ పైన విశ్రాంతి తీసుకుంటారు. కానీ అసలు ఉద్యమకారుల్ని మరుసటి రోజు రిమాండ్‌కు జైలుకు పంపుతారు. వారినీ ప్రభుత్వమూ మరచి పోతుంది, వారి పార్టీల నాయకులూ మరచిపోతారు. అంటే ఒకరకంగా ఏ పార్టీ ఆందోళన కార్యక్రమానికి పిలుపు నిచ్చినా, దానిని జయప్రదం చేసే బాధ్యతను ప్రభుత్వమే భుజాన వేసుకుంటుంది.!
న్యూస్ బ్రేకులు
‘గండ్ర ‘గొడ్డలి వేటు!
తప్పని సరి పరిస్థితులలోనే బీజేపీ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశాం.
-గండ్ర వెంకట రమణా రెడ్డి, చీఫ్ విప్.
సస్పెండ్ చేసిన ప్రతీ సారీ, ఈ రొటీన్ ప్రకటన తప్ప, వేరే ప్రకటన ఎప్పుడయినా ఇస్తారా!!
రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది.
-అజయ్ మాకెన్, కేంద్ర మంత్రి
అవును. ఒకడుగు ముందుకు. రెండడుగులే వెనక్కి.
ట్విట్టోరియల్
‘కాషాయ’ సెక్యులరిజం!
మోడీ, అద్వానీ, నితిష్- ఈ ముగ్గురిలో మతవాదులెవరు? లౌకికవాదులు(సెక్యులరిస్టులు) ఎవరు? ఈ ప్రశ్న ఏ పోటీ పరీక్షలోనో వచ్చిందనుకోండి. బహుశా అభ్యర్థులు జుట్టు పీక్కుంటారు. చటుక్కున మోడీని మతవాది- అని అనేసారనుకోండి. బహుళ జాతి సంస్థల కంపెనీల్లోఉద్యోగాలు చేస్తూ, సోషల్ మీడియా నెట్ వర్క్‌లలో ‘దేశభక్తి’ని ప్రకటించే ఉత్సాహవంతులు కొందరుంటారు. వీరు మాత్రం ససేమి- ఒప్పుకోరు. మెజారిటీ మతస్తుల పక్షాన వచ్చిన మోడీకి చచ్చినట్లు మైనారిటీలు కూడా విధేయంగా వున్నారనీ- ఇంతకు మించి సెక్యులరిస్టు ఎవరుంటారంటారు. మరి అద్వానీ? మోడీ పక్కన నిలబెట్టినంత మాత్రాన ఆయన సెక్యులరిస్టు అయి పోతారా? బాబ్రీ విధ్వంసానికి కారకమైన ఉద్యమాన్ని లేవనెత్తింది ఆయన కాదూ? అంటారు. మరి నితిష్? పదిహేడేళ్లు ‘కాషాయ’ పార్టీతో కాపురం చేశాక ఇప్పుడు తెగతెంపులు చేసుకునికొత్తగా సెక్యులరిస్టునంటే ఊరుకుంటారా? ఎలా చూసినా, గుజరాత్ ‘మారణహోమం’ సాక్షిగా మోడీయే సెక్యులరిస్టని ప్రకటించమని ‘దేశభక్తులు’ కోరతారు.
‘ట్వీట్ ఫర్ టాట్
ఇక్కడ మీ ప్రేమలు చూడబడును!
పలు ట్వీట్స్: ‘ఐ లవ్యూ’ అంటూ ఈ మెయిల్స్ ఇవ్వటం మానేశారట తెలుసా?
కౌంటర్ ట్వీట్: అవును. మీరు ఏ ‘భామ’ కిచ్చారో ఆ ‘భామ’ చదవకుండా ‘ఒబామా’ చదివేస్తారట. ఎన్.ఎస్.ఎ ద్వారా అందరి ప్రేమికుల సంభాషణలూ వినే సౌకర్యం కూడా ఆయనకు ఉందిట!!
ఈ- తవిక
వోటు-వేటు
జైళ్ళన్నీ
నిండిపోతే
ఎలాగన్న దిగుళ్ళు
ఎందుకు దండగ!
మిగిలిన ఖైదీలను
వెయ్యటానికి
టాయిలెట్లే లేని
సంక్షేమ హాస్టళ్ళు ఉండగ!!
బ్లాగ్ (బ్లాక్) స్పాట్:
‘అక్కడెక్కడో బాతుని అరెస్టు చేశారట పోలీసులు’
‘బంగారు బాతు అనుకున్నారేమో! గనులున్నాయా- అని ప్రశ్నించేవుంటారు’
కొట్టేశాన్( కొటేషన్):
చావటానికి ఎందుకురా తొందర, చావులాంటి బతుకే ముందర వుండగ!!
-సతీష్ చందర్
(సూర్య దినపత్రిక 17జూన్2013 వ తేదీ సంచికలో ప్రచురితం)