పైన తీపి, లోన కారం! ఇదే గోదావరి వెటకారం!!

పిచ్చివాళ్ళకీ, మేధావులకీ నెలవు మావూరు. ఇద్దరూ వేర్వేరా? కాదేమో కూడా. జ్ఞానం ‘హైపిచ్చి’లో వుంటే మేధావే కదా! నర్సాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) మా వూరు. అన్నీ అక్కడ కొచ్చి ఆగిపోతుంటాయి. రైళ్ళాగిపోతాయి. బస్సులాగిపోతాయి. కడకు గోదావరి కూడా మా కాలేజి చుట్టూ ఒక రౌండు కొట్టి కొంచెం దూరం వెళ్ళి ఆగిపోతుంది( సముద్రంలో కలిసిపోతుంది.) నాగరికత కూడా మా వూరొచ్చి ఆగిపోతుంది.
రైళ్లు ఆగిపోయిన చోట పిచ్చి వాళ్ళూ, నాగరికత పరాకాష్టకు చేరిన చోట మేధావులూ వుండటం విశేషం కాదు.
గమ్యం తెలియని ప్రయాణికులు కూడా రైళ్ళెక్కుతుంటారు. వాళ్ళని మా వూళ్ళో బలవంతాన దించేస్తుంటారు. వాళ్ళే పిచ్చివాళ్ళగా ప్రత్యక్షమవుతుంటారు. ఏ వాదాన్ని పట్టుకున్నా మా వూళ్ళో మేధావులు దాని అంతు చూసేస్తుంటారు.
ఇలాంటి గొప్ప వూళ్ళో పుట్టినందుకు ముచ్చటగా వుంటుంది. ఈ ముచ్చట గురించి నా సహ పాత్రికేయులకూ, రచయితలకూ చెప్పుకుంటే బావుంటుంది. చెప్పాలనే అనుకుంటాను. కానీ చెప్పే ముందు ఒక ప్రశ్న వేస్తాను: ‘మీకు డానీ తెలుసా? అయితే నేను మా వూరి గురించి రెండు మూడుగంటల సేపు చెప్పే వుంటాడు. ఇంక నేను మా వూరి గురించి కొత్తగా చెప్పేదేమీ వుండదు’ అని అంటుంటాను.
మా వూళ్ళో డచ్చి వాళ్ళ బిల్డింగులూ, సమాధులూ వుంటాయనీ,
మా వూళ్ళో ఓడల రేవు వుండేదనీ,
మా వూళ్ళో లేసు పరిశ్రమ పుట్టిందనీ,
మా వూళ్ళో రకరకాల చేపలుంటాయానీ…. అబ్బో, చాలా గొప్పలున్నాయి లెండి.
అందరికీ రామ భక్తి వుంటే, మా వూళ్ళో పుట్టిన డానీ (ఉషా ఎస్‌.డానీ)కి రామ ‘భుక్తి’ మెండు.
అక్కడ రామలు అని ఒక రకం చేపలు వుంటాయి. వాటి రుచే వేరు. అన్ని సీజన్లలోనూ వుండవు. ఇలాంటి డానీ ఒక ‘రాజు గారి కొమ్ము’ అని ఒక పుస్తకం వేసి, దాని మీద సభ చేసి నన్ను మాట్లాడమని పిలిచారు. అది వ్యంగ్య రచనల సంకలనం లెండి.
అసలే గోదావరి, ఆపై నర్సాపురం. మాతృభాష వ్యంగ్యం కాకుండా వుంటుందా?
అయితే అక్కడకూడా ఈ వెటకారాలు రెండు రకాలుగా వుంటాయి. స్థితి మంతుల వెటకారం, గతిలేనివారి వెటకారం.
ప్లాట్‌ ఫాంలో రైలు బయిలుదేరుతుంది. ఇద్దరు స్థితి మంతులు ‘ముందు మీరెక్కండి.’ ‘అబ్బే లేదు. మీరే ముందండి బాబూ’ అనుకునే లోగా రైలు వెళ్ళిపోతుంది.
‘పోయింది రైలే.. ఇవ్వాళ్ళ పోతే, రేపొస్తుంది. మన మర్యాదలు మన మిగుల్చుకున్నాం’ అంటూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇది స్థితి మంతుల వెటకారం.
సైకిలు వెనుక బుట్టలో కూరగాయలు పెట్టుకుని, వీధివీధి తిరిగీ అమ్ముకుంటే కానీ పూట గడవని ఓ అర్భకుడు ఓ యింటి దగ్గర ఆగాడు. ఒకావిడ బుట్టలో వున్న కాకరకాయలను తడుముతూ, ‘మరీ చేదుగా వుంటాయా?’ అని అడుగుతుంది. దానికి అతగాడు- ఉండవూ’ అని చెప్పొచ్చు కదా! అలా చెప్పకుండా, ‘చెరకు గెడలు కావు కాదండీ..!’ అంటాడు. ఇదీ గోదావరి వెటకారమే. గతిలేని వారి వెటకారం.
ఆధిపత్యం మీద నిస్సహాయుడి చేసే ఆగ్రహ ప్రకటన ఇది.
దీనినే రచనలో పెడితే వ్యంగ్యం అయ్యింది.
అలా డానీ మూడు దశాబ్దాలుగా రాసిన వ్యంగ్యరచనలను ‘రాజు గారి కొమ్ము’ అనే పుస్తకంగా ప్రచురించారు.
ఈ మూడు దశాబ్దాల్లోనూ మూడంచెల వ్యంగ్యం వుంది:
మొదటి దశలో, ‘ప్రహ్లాదుడు'(డాక్యుమెంటరీ కథ), రెండవ దశలో ‘గొయ్యి'(వీధి నాటకం) రాశారు.
ఇందులో నవ్వు ఎంత వుందో, నవ్వేసిన తర్వాత మనం పొందే వేదన రెండింతలు వుంటుంది.
ఇవి చదివినప్పుడు చైనా దేశపు వ్యంగ్య రచయిత లూషన్‌ గుర్తుకొచ్చాడు. దరిద్రాన్ని ఆకలితో మాత్రమే కాకుండా, అనారోగ్యంతో కొలుస్తాడు.
‘ప్రహ్లాదుడు’ కథలో పొట్ట చెక్కలయ్యే నవ్వుల వెనుక కడుపు దహించుకుపోయే ఆకలి వుంది.ఎమర్జెన్సీ తర్వాత, ముందు ఓడి, తర్వాత గెలిచిన ఇందిరమ్మ పాలన నడుస్తున్న నేపథ్యంలో జరిగిన కథ. ఢిల్లీలో జరిగే కిసాన్‌ సభకు దొరికిన వాళ్ళను దొరికినట్లు కాంగ్రెస్‌ నేతలు రైలెక్కిస్తారు. కానీ వారి కన్నా ముందు ఆకలి రైలెక్కేస్తుంది. రైల్లో తిండీ తిప్పలుండవు. అర్థరాత్రి పూట ఎక్కడో అనుకోకుండా రైలాగిపోతే, చీకట్లో దిగి పక్కన పొలాల్లో ఏ ఆకు కనపడితే ఆ ఆకు తింటూ, మొక్కల్ని బలంగా పీకితే కాయలు కింద దొరుకుతాయి. అవే వేరుశనక్కాయలు. చూశావా రైతు ‘సంపదను భూమిలో దాచేసుకున్నాడు!’ అని తిట్టుకుంటారు. కడకు ఆకలి భరించ లేక వెనక్కి వచ్చేద్దామనుకున్నప్పుడు, నిర్వాహకులొచ్చి బుజ్జగిస్తారు. దార్లో ఆగ్రాలో అందమయిన తాజ్‌మహల్‌ చూపిస్తామంటారు. ‘ఆకలిరా మొర్రో అంటే, అందమైన సమాధి చూపిస్తానంటాడు. వీడెవడండీ!’ అని విసుక్కుంటాడు… ఇలా సాగుతుంటుంది.
‘గొయ్యి’ నాటకం కూడా ఇంచుమించు ఇలాగే సాగుతుంది.
ఇవి ఎనభయ్యవ దశకంలో రాసిన కథలు

రెండవ దశ వచ్చేసరికి తాను ఒక రిపోర్టర్‌గా తన కళ్ళతో చూసిన నేతల్ని చిత్రించాడు. అందులో ఎక్కువ ఆకట్టుకున్న నాయకులు రోశయ్య, నాగం జనార్థన రెడ్డి. రోశయ్య మాటల్లో హాస్యం వుంటే, నాగం చేష్టల్లో హాస్యం వుంటుంది.
ఒక రోజెప్పుడో అసెంబ్లీలో ‘చేయి తీసేస్తా’నని అంటారు రోశయ్య. ఈ ఘటనను చక్కగా చిత్రించారు డానీ.
అయితే ఇది చదువుతుంటే, ఆ తర్వాత జరిగిన సన్నివేశం గుర్తుకొచ్చింది. లాబీల్లో రోశయ్య కనపడగానే, నాగం చేతులు వెనక్కి కట్టుకుని వెళ్ళి గౌరవంగా నిలబడ్డాడు. ‘అదేమిటయ్యా?’ అని రోశయ్య అనగానే ‘మీరు చేతులు తీసేస్తానన్నారు కదా?’ అని ఆయన సెలవిచ్చారు.

మూడవ దశలో కొంత దగ్గర పరిశీలన, కొంత విశ్లేషణ జోడించి డానీ రాశారు. ఇందుకు ఉదాహరణే ముషార్రఫ్‌ మీద చేసిన రచన. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్లు, ముషార్రఫ్‌ మిలటరీ యూనిఫాంతో పుట్టినట్లుగా వుంటాడు. సైన్యాధిపతి పదవి కాకుండా, దేశాధ్యక్షుడిగానో, ప్రధానిగానో వుండటానికి సిధ్దపడతాడు కానీ, యూనిఫాం మాత్రం వుండాల్సిందేనని అమెరికా ప్రతినిథికి తేల్చి చెప్పేస్తాడు. ‘నీ యుధ్ద ప్రీతిని అర్థం చేసుకోగలను. యుధ్ధమంటే నీ కన్నా బుష్‌ కు ఎక్కువ ఇష్టం. కానీ ఆయన యూనిఫాం వేసుకుంటున్నాడా?’ అని ఆ ప్రతినిథి ఒప్పించేస్తాడు.

డానీ పుస్తకం మీద ఈ విషయాలు మాట్లాడుతూ రెండు పరిశీలనలు చేశానుఫ
ఒకటి: పాత్రికేయుల్లో డెస్క్‌లో వున్న వారికంటే, రిపోర్టింగ్‌ అనుభవం వున్నవారు రాజకీయాల పట్ల ప్రత్యక్ష పరిచయం వుండటం వల్ల, వారు వ్యంగ్యం రాయగలిగితే బాగా పండుతుంది.
రెండు: అసలు రాజకీయ నేతల్ని, వారిలాగా చూపించినా బోలెడతంత హాస్యం వుంటుంది. ఒకప్పుడు ఇందిరాగాంధీని ఓడించిన రాజ్‌ నారాయణ్‌, తర్వాత జైలుకు కూడా వెళ్ళొచ్చిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు సహజంగానే హాస్యానికి ప్రతీకలు.
అధ్యయనం, ఆత్మగౌరవం మెండుగా వున్న డానీకి, తనకంటూ ఒక జీవన శైలి వుంది.
ఆకలిని కడుపులోనే నొక్కేసి, టక్‌(ఇన్‌షర్ట్‌) చేసి హుందాగా బయిటకు వచ్చిన జీవితం ఆయనకుంది. నరకంలోనే హాస్యం వుంటుంది. దు:ఖంలోనుంచే వ్యంగ్యం పుడుతుంది. డానీ వ్యంగ్యం కూడా అలాంటిదే.
– సతీష్‌ చందర్‌
(11 డిసెంబరు 2011 నాడు సోమాజిగూడలో జరిగిన ఈ సభలో వరవరరావు, దేవీప్రియ, కె.శ్రీనివాస్‌, ఖాదర్‌ మొహియుద్దీన్‌, యాకూబ్‌, రామ్మోహన్‌లతో పాటు, రచయిత డానీ కూడా పాల్గొన్నారు.)

1 comment for “పైన తీపి, లోన కారం! ఇదే గోదావరి వెటకారం!!

  1. Yes i found who is dany…..???
    అధ్యయనం, ఆత్మగౌరవం మెండుగా వున్న డానీకి, తనకంటూ ఒక జీవన శైలి వుంది.
    ఆకలిని కడుపులోనే నొక్కేసి, టక్‌(ఇన్‌షర్ట్‌) చేసి హుందాగా బయిటకు వచ్చిన జీవితం ఆయనకుంది. నరకంలోనే హాస్యం వుంటుంది. దు:ఖంలోనుంచే వ్యంగ్యం పుడుతుంది. డానీ వ్యంగ్యం కూడా అలాంటిదే.
    – సతీష్‌ చందర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *