టాపు(లేని) స్టోరీ:
పార్టీ అన్నాక ఓ అధినేత వుంటాడు. ఆ అధినేతకు ఓ కుటుంబం వుంటుంది. ఆ కుటుంబంలో సభ్యులుంటారు. సభ్యులనందరినీ అధినేత ఒకేలా చూడొచ్చు. కానీ ఏదో ఒక సభ్యుడికి తనను తక్కువ చూస్తున్నారన్న భావన కలగ వచ్చు. ఆ భావన పెరిగి పెద్దదయితే కలహానికి దారి తీయ వచ్చు. ఇంకా పెద్దదయితే ఆ సభ్యుడు ‘అసభ్యుడ’ వుతాడు. వేరే పార్టీ కూడా పెడతాడు.
అయినా పార్టీ మొత్తం ఒక కుటుంబం చేతిలో వుండటం ఏమిటి? ఇది రాచరికమా? ప్రజాస్వామ్యమా? ఇలాంటి సందేహాలు- తెలివి మీరిన కొద్ది మందికి వస్తాయి కానీ, పార్టీలోని కార్యకర్తలకి, ఆ కుటుంబ ఆరాధకులకూ చాలా సహజమనిపిస్తుంది. రాచరికం పోయినా, మనకి కుహనా ‘రాజకుటుంబాల’ వారసత్వం పోలేదు. మన దేశంలో ‘కుటుంబం’ అంటేనే ‘కులాని’కి వామన రూపం.
మన రాష్ట్రంలోనూ పార్టీ కో ‘రాజ కుటుంబం’ వుంది. తెలుగుదేశం పార్టీకి ‘నందమూరి కుటుంబం’, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ‘వైయస్సార్ కుటుంబం’, టీఆర్‌ఎస్ పార్టీకి ‘కేసీఆర్ కుటుంబం’ వున్నాయి. ఈ కుటుంబాల లేకుండా ఆయా పార్టీల ఉనికిని చూడటం కష్టం.
రాష్ట్రాలకే పరిమితమయిన పార్టీలలో ఈ ‘కుటుంబాలు’ మరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. తమిళ నాడులోని ‘డిఎంకె’ కు ‘కరుణానిధి కుటుంబం’, మహరాష్ట్రలో ‘శివసేన’కు థాకరే కుటుంబ, ‘నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ‘శరద్ పవార్’ కుటుంబం, ఉత్తర ప్రదేశ్‌లోని ‘సమాజ్ వాదీ పార్టీ’కి ‘ములాయం కుటుంబం’, జమ్ము-కాశ్మీర్‌లోని ‘నేషనల్ కాన్ఫరెన్స్’కు అబ్దుల్లాల కుటుంబం- ఇలా కుటుంబాలు, కుటుంబాలుగా ఉదహరించుకుంటూ పోవచ్చు.
ఆ మాట కొస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వున్నది ప్రముఖమైన ‘రాజకుటుంబం’. అదే ‘నెహ్రూ కుటుంబం’. కొన్ని కొన్ని మినహాయింపులతో, బీజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ ‘రాజకుటుంబ’ వ్యవస్థకు కనీసం కొన్ని రాష్ట్రాలలో అయినా దూరంగా వుండగలిగాయి.
అయితే ఈ ‘రాజకుటుంబ’ పెద్దలు వీలయినంత వరకూ, ఆ కుటుంబాలను ‘ఉమ్మడి కుటుంబాల’లాగా నడపాలని చూస్తారు. కానీ కుటుంబం అన్నాక కలహాలు తప్పవు. సాదాసీదా కుటుంబాల్లో కలహాలు సాధారణంగా ఆస్తుల కోసం వస్తాయి. ఆస్తి కన్నా గొప్పది అధికారం. ఇదే అన్ని ‘రాజకుటుంబాల’లో చిచ్చు రేపుతుంటుంది.
డిఎంకెలో రుణానిధి కొడుకులు అళగరి- స్టాలిన్ల వివాదమయినా, శివసేనలో ఉధ్దవ్ థాకరే- రాజథాకరేల వివాదమయినా, తెలుగుదేశం లో బాబాయ్- అబ్బాయ్‌ల వివాదమయినా- అధికారం కోసమే. అది ఇప్పటికప్పుడు వచ్చే అధికారం కావచ్చు. ఎప్పటికయినా వచ్చే అధికారం కావచ్చు. ఈ మధ్య కేసీఆర్ కుటుంబం పై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. వాటిని ఎవరూ కాదు ‘రాజ కుటుంబాని’కి బంధువే. పేరు రఘునందన్ రావు. ఆయన మీద పార్టీ క్రమశిక్షణా చర్యతీసుకోవటంతో, కేసీఆర్ కుటుంబం మీద ఆయన ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు. అందులో ‘అవినీతి ఆరోపణలే’ కీలకమయినా, కేసీఆర్ కుటుంబ సభ్యుల కలహాల మీద ఓ ఆరోపణ విసిరారు. కేసీఆర్ కొడుకయిన కె. తారకరామారావుకీ, మేనల్లుడయిన హరీష్ రావుకీ మధ్య అంతరాలున్నవన్నది ఆ ఆరోపణ సారం. ఎన్నికలలో తారకరామరావును ఓటమి పాలు చేయాలని హరీష్ విఫలయత్నం చేశారన్న రఘునందన్ ‘పరిశోధన’. ఈ ఆరోపణల్లో నిజా నిజాలు కేసీఆర్ కెరుక. తానొక విభీషణుడు అవునో కాదో, తెలియదు కానీ, రఘునందన్ మాత్రం టీఆర్‌ఎస్ ( అంటే కేసీఆరే కదా!) ‘ఇంటి గుట్టు’ను బయిట పెట్టాలని కంకణం కట్టుకున్నారు. అయితే తమ మధ్య అలాంటి విభేదాలు లేవని తారకరామారావు- హరీష్‌లు ఎవరి ఖండనలు వారు ఇచ్చారు. ఇవ్వాలి కూడా. ఎందుకంటే అన్నింటి కన్నా పార్టీ ముఖ్యం. అంత కన్నా కుటుంబం ముఖ్యం. అంతకన్నా కేసీఆర్ ముఖ్యం. అలా లేక పోతే,పచ్చని ప్రజాస్వామ్యంలో, నిలువెత్తు ‘రాజకుటుంబాలు’ ఎలా వర్థిల్లతాయి చెప్పండి!!
న్యూస్ బ్రేకులు
‘హాలు ఖాళీ!
మొత్తం కళంకిత మంత్రులంతా తప్పుకోవాల్సిందే.
-నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత
అమ్మా! ఆశ!! రాష్ట్ర కేబినెట్ ని ఖాళీ చేసేద్దామనే…!?
అధికారంలో వున్నా, లేకున్నా ప్రజాసేవ చేయాలి
-నారా లోకేశ్, తెలుగుదేశం పార్టీ యువనేత
అలా అని గట్టిగా అనండి. మళ్ళీ ప్రతిపక్షంలోనే వుండమని జనం దీవించేయగలరు!!
ట్విట్టోరియల్
‘అవినీతి’ క్రీడావతారం!
‘అవినీతి’ కి పర్యాయ పదాలుగా కొత్త పలుకుబడులు వస్తుంటాయి. ఒక పాత సినిమాలో అల్లురామలింగయ్య అనుకుంటాను- లంచాన్ని ‘ఆమ్యామ్యా’ అని పిలిచాడు. మీడియాలో కూడా ఒకప్పుడు ‘కుంభకోణం’ అన్నారు. తర్వాత ‘స్కాము’లన్నారు. ‘మామూళ్ళు’ అన్నారు. ఈ మధ్యనే ‘క్విడ్ ప్రోకో’ అంటున్నారు. అన్నిరంగాల్లోనూ అవినీతికి ఒకే పేరు వుంటే బాగుండదని క్రీడారంగంలో వేరు వేరు పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. రెండు దశాబ్దాల క్రితం ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అన్నారు. ఇప్పుడు ‘స్పాట్ ఫిక్సింగ్’ అన్నారు. ఇలా పేర్లు మారటం అత్యంత సహజం. ముదిరిపోయాక కూడా తొండను తొండ- అంటే ఎంత అసహ్యంగా వుంటుంది. ముచ్చటగా ‘ఊసర వెల్లి’ అని పిలుచుకోవాల్సిందే. క్రికెట్ ‘ఐపిఎల్’ అవతారమెత్తాక ‘కార్పోరేట్’ పరమయ్యింది. సర్కారు సొమ్ముకు నష్టం కలిగించే అవినీతి కి పాల్పడితే వ్యవస్థ ఊరుకోవచ్చు. కానీ కార్టోరేట్ లాభాలకు చిల్లు పెడితే ఊరుకోదు. మహోద్యమం సృష్టిస్తుంది!!
‘ట్వీట్ ఫర్ టాట్
‘ఫోర్‌ట్వంటీ’ల మ్యాచ్
పలు ట్వీట్స్: ట్వంటీ, ట్వంటీ మ్యాచ్‌ల యుగంలో ఈ ‘స్పాట్ ఫిక్సింగ్’ లేమిటి?
కౌంటర్ ట్వీట్: మ్యాచ్ వరకూ ‘ట్వంటీ- ట్వంటీ’లుండవచ్చు. ఆటగాళ్ళలోనే ‘ఫోర్‌ట్వంటీ’లు లేకుండా చూసుకోవాలి.
ఈ- తవిక
కళంకితులు
రాష్ట్రంలో
ఎటు చూసినా
ఎండలే.
ఈ మబ్బులన్నీ ఏమయ్యాయి?
మంత్రుల
ముఖాల మీద
కమ్మాయి!
బ్లాగ్ (బ్లాక్) స్పాట్:
‘యుపీయే ఎజెండాలో తెలంగాణ లేదని చాకో అన్నాడట’
‘ఆయన చాకో, బాకో తెలియదుకానీ, సొంత వేలునే కోసుకుంటున్నాడు’
కొట్టేశాన్( కొటేషన్):
అతని బుగ్గలలా వాచిపోయాయి ఎందుకని? ఇలా అడిగితే అతడేం చెప్పాడో తెలుసా? ‘నేను గాంధీ వారసుణ్ణి’.(ఎప్పుడూ ‘మరో చెంప’ చూపిస్తూనే వచ్చాడు.)
-సతీష్ చందర్
(సూర్య దినపత్రిక 21 మే 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)