అప్పట్లో సామాన్యుడికి కూడా జైళ్ళు అందుబాటులో వుండేవి. ఇప్పట్లాగా జైలుగా వెళ్ళాలంటే విధిగా విఐపి అయి వుండాలనే ఆచారం వుండేది కాదు. జాతీయోద్యమ కాలంలో అతి చిన్నచిన్న సాహసాల్ని కూడా తెల్లవాడు గుర్తించేవాడు. వాడి జెండా పీకి మువ్వన్నె పతాకాన్ని పాతటం, సముద్రపు వొడ్డున వెళ్తూ, వెళ్తూ కాసిన్ని ఉప్పు కణికెలు(నిప్పు కణికెలు కాదు) చేత్తో పట్టుకోవటం, పాత దుస్తులు( మనం కట్టుకునే మిల్లు దుస్తులే) తీసి రోడ్డు మీద తగలేయటం- ఇలాంటివి చేస్తే చాలు, బ్రిటిష్ వారు గుర్తించేసి, విశాలమైన జైళ్ళకూ, ఒక్కొక్కసారి అండమాన్‌లాంటి త్రీ స్టార్ జైళ్ళకూ ఉదారంగా పంపించేసేవారు. అలా ఒక్కసారి వెళ్ళొస్తే చాలు-ఎంతటి చిన్నవారయినా పెద్దవారయి- పోయేవారు.
ఇప్పటి జైళ్ళకు స్టార్‌లు పెరిగిపోయాయి.
దాదాపు అన్నీ ఫైవ్ స్టార్ జైళ్ళే. అన్నీ దొరుకుతాయి. కొన్ని పరిశ్రమల వల్ల మన విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుందని విన్నాం. కానీ మనదేశంలోని కొన్ని జైళ్ళ వల్ల, ఏకంగా విదేశీ ‘మాదక’ ద్రవ్యం పెరిగిపోతుంది. కొన్ని మత్తు పదార్ధాలకు జైళ్ళ బయిట నిషేధం కానీ, జైళ్ళలో ఎందుకు వుంటుంది? అత్యంత అధునాతనమయిన మొబయిల్ ఫోన్లకు అసలు సిసలయిన బ్రాండ్ అంబాసడర్లు జైళ్ళలోనే వుంటారు. ఫోన్లేం ఖర్మ! టూజీలూ,త్రీజీల నెట్‌వర్కులు జైళ్ళ ప్రాంగణాలలోనే అత్యధ్భుతంగా పనిచేస్తాయి. ఆ మాటకొస్తే, టూజీలూ, త్రీజీలను మించినది ‘మాజీ’ నెట్‌వర్క్. మాజీ శాసన సభ్యులూ, మంత్రివర్యులూ, ఐయ్యేఎస్‌లూ, ఐపీఎస్‌లూ, మాజీ పాత్రికేయూలూ, మాజీ న్యాయవాదులూ వీరందరితో వుండే నెట్‌వర్క్ సామాన్యమైనది కాదు.
అంటే ప్రజాస్వామ్యవ్యవస్థ మాత్రమే కాదు, దేశంలో వున్న జైళ్ళ వ్యవస్థే ( శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ, పత్రికా శాఖలు అనే) నాలుగు స్థంభాల మీదకు వచ్చేసింది. నాలుగున్నాయి కాబట్టి జైళ్ళలో వున్నదానిని ‘ఫోర్‌జీ'(జి- అంటే జనరేషన్ మాత్రమే కాదు, గ్రూపు కూడా కావచ్చు.) అని కూడా పిలుచుకోవచ్చు. అందు వల్ల జైళ్ళకు నేడు పెరిగిన పరపతి అంతా ఇంతా కాదు.
కాబట్టే ప్రవేశం కూడా కష్టమయిపోయింది. ఉదాహరణకి చంచల్ గూడా జైలు లాంటి ఫైవ్ స్టార్ జైలులో సీటు కావాలంటే మాటలా? ఎన్ని ఫీట్లు చెయ్యాలి. జాతీయోద్యమ కాలంలోలాగ సత్యాగ్రహాలూ, పన్నుఎగవేతలూ చేస్తే సరిపోదు. ఇప్పుడు జైలుకు వెళ్ళాలంటే, కొండల్ని పిండి చెయ్యాలి. గనులను తొలిచెయ్యాలి. భూమిని చాపలా చుట్టి అమ్మెయ్యాలి. జీవోల్లో పెద్ద పెద్ద క్లాజుల్ని తొలగించి సంతకాలు చెయ్యాలి. ఎదుటివాడికి కళ్ళకు కంతలు కట్టి ‘కఠిన’ మైన నిర్ణయాలు తీసుకోవాలి. విఠలాచార్య సినిమాల్లో మనుషుల్ని జంతువులుగానూ, జంతువుల్ని మనుషులుగానూ మాంత్రికులు మార్చేసినట్లు, ‘నలుపు’ని ‘తెలుపు’ చెయ్యాలి (డబ్బునే లెండి). ‘ఓం క్రీం. ఫట్ ఫట్’ అంటే, లేని ‘కంపెనీలు’ పుట్టుకు రావాలి. ఉన్న కంపెనీలు మాత పడాలి’. కఠోర దీక్షతో ఇన్ని విద్యలు, అభ్యసించి ప్రదర్శిస్తేనే కానీ జైళ్ళలో అడుగు పెట్టలేరు. సారం ఒక్కటే: కేవలం పెద్దవాళ్ళయిపోయినంత మాత్రాన సరిపోదు. పెద్ద పనులు కూడా చెయ్యగలగాలి. అప్పుడే స్టార్ జైల్లో సీటు రిజర్వ్ అవుతుంది.
అయితే కూటికి గతిలేని వాడికి కూడా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో కోటి రూపాయిలు తగిలినట్లు అప్పుడప్పుడూ, చైన్ స్నాచర్(గొలుసులు లాగే దొంగ)కి కూడా స్టార్ జైలు ప్రవేశం లబిస్తుంది. అప్పుడు వాడు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. చెత్తఏరుకుని జీవించే కుర్రాడు(రాగ్ పికర్) ఐమాక్స్ ధియేటర్‌కొచ్చినప్పుడు పొందే అనందం కూడా, ఆ చిల్లర దొంగ జైలు ఆవరణలో పొందే సంతోషం దిగదుడుపే. ఆభరణాల షాపులో నెక్లెస్ కొట్టేసిన ఆడ దొంగ కూడా తనని చూడటానికి వచ్చిన బంధువుల ముందు ఇలాంటి మురిపెమే ప్రదర్శిస్తుంది: ‘(మాజీ) కలకటేరమ్మదీ, నాదీ ఒకటే గది. తెలుసా?’ అంటూ పులకించి పోతుంది.
ఇంత కన్నా ‘సోషలిజం’ ఎక్కడ వుంటుంది. బహుశా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, మన రాజ్యాంగ నిర్మాతలు కూడా కలలు కని వుండరు. ‘మా దేశంలో మంత్రీ, కార్మికుడూ ఒకే బస్సులో పక్క పక్కనే కూర్చుని ప్రయాణిస్తారు’ అని కొన్ని ప్రజాస్వామ్య దేశాల వారు తమ నిరాడంబరత గురించి విర్రవీగిపోతుంటారు. ఆ లెక్కన మనమెంత విర్రవీగాలి? ఐయ్యేఎస్ అధికారీ, హైవే దొంగా, జైల్లో ఒక బారక్ పంచుకుంటారు, ఒకే బాత్‌రూమ్ వాడుతుంటారు. ఇది నిరాడంబరత కాదా! అది చూసి పొంగి పోకుండా, రాష్ట్రంలో ఐయ్యేస్‌లు బాధపడిపోతున్నారు. ఒకప్పుడు ‘నేరం నాది కాదు.. ఆకలిది’ అనే సినిమా వచ్చింది. ‘సంతకం నాది కాదు.. పెత్తనానిది’ అనే సిధ్థాంతాన్ని వారిలో కొందరు తీస్తున్నారు. అధికారులు మన్నిస్తే , వారు చేసేది సంతకమే కానీ వేలి ముద్రకాదు- నొక్కమన్న చోట, నొక్కాల్సినంత నొక్కెయ్యటానికి!
ఇదంతా చదివేశాక కుర్రవాళ్ళకెవరికయినా ‘నేను సైతం జైలుకు వెళ్ళాలి’ అనే ముచ్చట కలగవచ్చు. అందుకు ఏం చదవాలి? ఐయ్యేఎస్, ఐపిఎస్‌లు తప్పని సరా? ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలా? ఏ రంగం ఎంచుకున్నా, దూరదృష్టి వుండాలే కానీ, ‘జైలుకు వెళ్ళటం’ మరీ అంత ఆసాధ్యమయినది కాదు. జైలుకు వెళ్ళినా, వెళ్ళాల్సివచ్చినా, వెళ్ళటానికి సిధ్ధమయినా, జనాదరణ విస్తారంగా వుంటుంది. ‘తిని జీర్ణం చేసుకోవటాన్ని’ ఆరోగ్యం భావించి, తినే వాళ్ళను అరాధించే జనం మనకి కోకొల్లలు. అందుకే ‘ప్రజాస్వామ్యం’ నేడు జైలులోవుంది.
-సతీష్ చందర్