ప్రేమకు నిర్వచనాలు

ఇదే జీవితాన్ని ఇంతకు ముందు ఎంత మంది జీవించలేదు. కొత్తగా జీవించటానికి ఏమి వుంటుంది? ఇదే సముద్రం. ఎన్ని సార్లు చూడలేదు? కొత్తగా చూడటానికి ఏముంటుంది? ఇలా అనుకునేది జీవితమే కాదు. కడలి వొడ్డున మన కాళ్ళనే ఒక్క రీతిగా తడుపుతాయా అలలు? వెండి పట్టీలు తొడిగినట్లు ఒక మారూ, పడి వేడుకున్నట్టు ఇంకో మరూ, కాళ్ళకింది ఇసుకను తొలచి పట్టు తప్పిస్తున్నట్టు మరో మారూ- అలలు తాకిన ప్రతీ సారీ ఒక కొత్త అనుభూతి. ఒక్కతే చెలి. కానీ ప్రతీ ఆలింగనమూ ఒక కొత్త అనుభవం. అన్నీ ఎప్పటికప్పుడు కొత్తగా నిర్వచించుకోవాల్సిందే.!

photo by More Good Foundation

శిశుపాలుడి
తప్పుల లెక్క
రాసిన నాయకుడికీ;

దారి తప్పిన
శిష్యుల
మురికి పాదాలు
కడిగిన గురువుకీ;

గుండెను తొలిచే
రాతి దొంగల్ని
మన్నించే
అగ్నిపర్వతానికీ

వుండేది-
అందరూ అనుకున్నట్టుగా
సహనం కాదు-
కేవలం ప్రేమ!
-సతీష్ చందర్
(ప్రజ దినపత్రికలో ప్రచురితం)

2 comments for “ప్రేమకు నిర్వచనాలు

  1. ప్రేమకు నిర్వచనాలు ఇంతకూ ముందెన్నడూ విననివి చెప్పారు మాస్టారు ,
    ధన్యవాదాలు
    కసి రాజు

Leave a Reply