‘ఫెరా’ సారథి!

పేరు : కె.పార్థ సారధి

దరఖాస్తు చేయు ఉద్యోగం: అంత ఆశ లేదు. ఉన్న ఉద్యోగం(రాష్ట్ర మాధ్యమిక విద్యా శాఖామంత్రి పదవి) ఊడకుండా వుంటే చాలు. (రెండేళ్ళ శిక్ష పడింది. నిజమే. రెండేళ్ళ పదవీ కాలం కూడా వుంది.)

ముద్దు పేర్లు : ‘ఫెరా’సారధి, పార్థ ‘ఫెరా’రథి. ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఫెరా) ఉల్లంఘించాననే శిక్ష వేశారు లెండి. (రాజీనామా చేయకుండా పదవినే అంటి పెట్టుకుని వుంటున్నానని కిట్టని వారు కొందరు -‘స్వార్థ’ సారధి అంటున్నారు లెండి. నా అనుచరులయితే ఇప్పటికీ నన్ను ‘నిస్వార్థ’ సారధి అంటారు)

విద్యార్హతలు : లక్షల మంది విద్యార్హతలు నిర్దేశించే విద్యాశాఖా మంత్రిని కదా!( విద్యార్థులు నన్ను చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది.)

హోదాలు : ఎన్నుకున్న ఎమ్మెల్యేనూ నేనే, ఎంపికయినా మంత్రినీ నేనే..వీటన్నిటికంటే ముందు కేసుల్లో ఇరుకున్న ముద్దాయినీ నేనే. ( అయితే ఇది ఎన్నికల సంఘానికి చెప్పుకో దగ్గ గొప్ప విషయమంటారా? అందుకు అఫిడవిట్లలో వుండదు.)

గుర్తింపు చిహ్నాలు : ఒకటి: సారీ. రాష్ట్ర కేబినెట్‌ కు నేనొక్కడినే గుర్తింపు తెచ్చానని చెప్పుకోలేను. నా కన్నా ముందు నా సహచరుడు ఆ పనిచేశారు(జైల్లో వున్నారు లెండి.)

రెండు: ‘కోట్ల’లో లెక్కించ దగ్గవాణ్ని కాను. ‘లక్షల్లో’ వాడినే. నేను చెల్లించలేదని చెబుతున్న అపరాథ రుసుము మూడు లక్షలే.

సిధ్ధాంతం : వ్యాపారం. వ్యాపారమే. రాజకీయం, రాజకీయమే. రెండూ కలిపేస్తే ‘క్విడ్‌ ప్రోకో’ అవుతుందనే, నేను చేస్తున్న చిన్న వ్యాపారంలో నా పలుకుబడి ఉపయోగించలేదు.

వృత్తి : ‘విదేశీ వ్యాపారం’ , ‘స్వదేశీ రాజకీయం’

హాబీలు :1. ‘శ్రీచైతన్యం’, ‘నారాయణీయం’- ఈ రెండు మంత్రాలు జపించటం తప్ప విద్యాశాఖా మంత్రిగా చేసేదీ మీ లేదు. మా పని మొత్తం ప్రయివేటు సంస్థలే చేసిపెడతాయి.

2. మూడు శంకు స్థాపనలూ, ఆరు ప్రారంభాలూ- ఇలా గడిస్తే చాలు రోజూ.

అనుభవం : దోచుకున్న వాణ్ణీ, దాచుకున్నవాణ్ణే కాదు, వాటికేమీ నోచుకోకుండా పోయినా సరే చట్టాన్ని పట్టించుకోకపోతే, అది మనల్ని పట్టి యిస్తుంది.

మిత్రులు : కోర్టు తీర్పునకు ముందు అందరూ మిత్రులే.

శత్రువులు : మా పార్టీలో మంత్రి పదవుల్ని ఆశిస్తున్నవారు.

మిత్రశత్రువులు : పైకి మద్దతు ఇస్తూ, నన్ను తొలగించాలని సిఎం చెవికొరికే వారు.

వేదాంతం : దొరకని వాళ్ళు దొరలే.

జీవిత ధ్యేయం : ‘ఫెరా’ను సవరించేలా బిల్లు తయారు చేయటం.

-సతీష్ చందర్ 

2-8-12

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *