‘ఫెలిన్‌’ కుమార్‌ రెడ్డి!

కేరికేచర్:బలరామ్

కేరికేచర్:బలరామ్

పేరు : కిరణ్‌ కుమార్‌ రెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: రెండు ఉద్యోగాలు. ఒకటి: ‘లాస్ట్‌ ఎంపరర్‌'(సమైక్యాంధ్ర ప్రదేశ్‌ కు చిట్ట చివరి ముఖ్యమంత్రిగా నేనే వుండాలి.) రెండు: ఫస్ట్‌ ఎంపరర్‌( సీమాంధ్రకు తొట్టతొలి ముఖ్యమంత్రి పోస్టుకు కూడా దరఖాస్తు చేస్తున్నాను.)

ముద్దు పేర్లు :కి.కు( ఇది నా పొట్టి పేరు. పూర్వం కాంగ్రెస్‌లో ‘క’ గుణింతం వుండేది. ‘కాకా’, ‘కికు’ ‘కేకే’లము కీలకమైన నేతలం. ‘కాకా’ (జి.వెంకటస్వామి) సంగతి ఎలాగున్నా, ఆయన కుటుంబసభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ‘కేకే’ కూడా టీఆర్‌ఎస్‌లోకే వెళ్ళిపోయారు. నాకా అవకాశమూలేదు. అవసరమూ లేదు. ఎందుకంటే హైదరాబాద్‌లో పెరిగిన సీమాంధ్రవాసిని. అలా కాంగ్రెస్‌ ‘క’ గుణింత కకా వికలమయిపోయింది. నా మీద కూడా తిరుగుబాటు ముద్ర వుంది.) ‘ఫె-లిన్‌’ కుమార్‌ రెడ్డి

విద్యార్హతలు : ‘మాస్టర్‌ ఆఫ్‌ డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌’ (విపత్తు నిర్వహణలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌). కానీ, ‘ఫె-లిన్‌’ లాంటి తుపానుల్ని అడ్డుకోలేక పోయాను. కానీ రాష్ట్ర విభజన తుపానును అడ్డుకుంటాను. అంతిమంగా తుపాను తీరం దాటాలి కానీ. నేను కాదు. ఎప్పటికీ నేను ‘తీరాంధ్ర'(సీమాంధ్ర)ను దాటను.

హోదాలు : వనబైటూ సీఎం.( ఇలా అని కొందరు అంటున్నారు. నేను వారి ముచ్చట ఎందుకు కాదనాలి. ఒకప్రాంతానికే నన్ను ముఖ్యమంత్రి నంటున్నారు. రాష్ట్రం ఇంకా కలిసే వుందని నేను భావిస్తున్నాను.)

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: లోన విధేయుడిని

రెండు: పైకి తిరుగుబాటు దారుణ్ణి

(పార్టీ అధిష్ఠానం విషయంలో నా పై ఇలాంటి ప్రచారం వుంది.)

సిధ్ధాంతం : ‘వెల్డింగ్‌ సిధ్ధాంతం’ . ఏలోహాన్నయినా ఎన్నిసార్లు విరిగినా అన్ని సార్లూ అతక వచ్చు. రాష్ట్రం నేడు విరిగిన లోహం. కలపటానికి చివరి వరకూ ఛాన్సు వుంది.

వృత్తి : శాంతి భధ్రతలను పరిరక్షించటం. ఉద్యమాలూ, ఆందోళనల వల్ల, తరచు రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. వాటిని అణచివేయటం అందరు ముఖ్యమంత్రులూ చేసిన పని. కానీ నేనలా చెయ్యను. నేనే ఉద్యమంలో వున్నాననుకోండి. ఏ నష్టమూ వుండదు. అందుకే సమైక్యాంధ్ర ఉద్యమానికి చేయూత నిస్తున్నాను.

హబీలు :1. శక్తికి మించి హామీలివ్వటం. ( నా పదవి ఎన్నాళ్ళుంటుందో తెలియదు. రాష్ట్ర విభజన నా పరిధిలోనిది కాదు. అయినా కానీ, విభజనను ఆపగలనని హామీ ఇచ్చాను. ఎన్జీవోలు నమ్మి సమ్మె విరమించారు. )

2. కొత్త వాహనాలు వాడటం( ఇంకా పాతరాష్ట్రంలోనే వున్నా, ఓ కొత్త కారుని తెప్పించుకున్నాను)

అనుభవం : ఏ పోస్టుకయినా అనుభవం అవసరం కానీ, ముఖ్యమంత్రికి అవసరం లేదు. నేను ముఖ్యమంత్రి కాక ముందు చిన్న మంత్రి పదవి కూడా చేయలేదు. అందువల్ల కేబినెట్‌ సమావేశాల్లో సహమంత్రుల మాటలకు విలువ నివ్వాల్సిన అవసరం వుండదు.

మిత్రులు : సీమాంధ్రలో వున్న వారంతా మిత్రులే. కేసీఆర్‌ పుణ్యం వల్ల హైదరాబాద్‌లో వున్న చిన్న వ్యాపారులు కూడా నాకు మిత్రులయ్యారు. ( నన్ను హైదరాబాద్‌లో టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకోమని ఆయన సూచించారు కదా!)

శత్రువులు :ఇప్పటికిప్పుడు ప్లేటు మార్చి సమైక్యాంధ్ర నినాదమిస్తున్న జగన్‌, చంద్రబాబులు. ( ఒక బిచ్చగాడికి మరో బిచ్చగాడు శత్రువు. సీమాంధ్రలో ‘వోట్లు’ బిచ్చమెత్తుకునేటప్పుడు మొదటి వరసలో నేనుంటానేమోనని వారి అనుమానం.)

మిత్రశత్రువులు : శత్రువులుగా కనిపించే మిత్రులూ, హితులూ వున్నారు. వారీ మా పార్టీ హైకమాండ్‌కు సన్నిహితులు.

వేదాంతం : కలిసివుంటే పోయేదేమీ లేదు, ఓ పదిహేడు ఎం.పీ సీట్లు తప్ప.

జీవిత ధ్యేయం : బ్రహ్మానంద రెడ్డి, చెన్నారెడ్డిల మార్గంలో నడవటమే. ఉద్యమాలు తిరుగుబాట్లు చేసినా, పార్టీలు పెట్టినా, అంతిమంగా తల్లిలాంటి కాంగ్రెస్‌ దగ్గరకు చేరిపోవటమే.

-సతీష్‌ చందర్‌

1 comment for “‘ఫెలిన్‌’ కుమార్‌ రెడ్డి!

Leave a Reply