బిత్తర కుమారులు

ధైర్యం గురించి పిరికివాళ్ళు లెక్చర్లు దంచినట్టుగా – ఎవ్వరూ దంచలేరు. ఉత్తర కుమారుడు మాట్లాడినట్లు అర్జునుడు మాట్లాడలేడు కదా!
ధైర్యం గురించి ఎవర్ని అడిగినా చాలా పెద్ద పెద్ద ఉదాహరణలిస్తుంటారు. గుండుకు బదులు గుండె చూపిన నాయకుడి గురించో, నవ్వుతూ ఉరికంబం ఎక్కిన వీరుడి గురించో మాట్లాడతారు.
అంతంత పెద్ద విషయాల గురించి ఎందుగ్గానీ, చిన్న చిన్న విషయాల్లో ధైర్యం ఉంటుందా…?
చిన్నప్పుడు ధైర్యం మీద ఎంతో ఆకర్షణ ఉంటుంది. ముఖ్యంగా, క్లాసులో మాస్టారు చితగ్గొట్టినప్పుడూ, డాక్టర్‌ నిర్దాక్షిణ్యంగా సూదితో పొడిచినప్పుడూ వాళ్ళ కాలర్‌ పట్టుకోవాలనిపిస్తుంది.
కానీ భయం.
వాళ్ళని ఎదిరించే ధైర్యం పెద్దయ్యాక వస్తుందన్న ఆశతో కళ్ళు తుడిచేసుకుంటాం.
క్లాసులో బాగా చదివేవాడికన్నా, బాగా అల్లరిచేసే వాడే సాటి విద్యార్థుల్ని ఆకట్టుకుంటాడు.
చదువుకు శ్రద్ధ చాలు. అల్లరికి మాత్రం తెగువ కావాలి.
పల్లెటూళ్ళో ఉండే పిల్లలకి దయ్యాలంటే భయముంటుంది. పట్టణాల్లో, నగరాల్లో ఆ అవసరం ఉండదులెండి! అక్కడ వాటి పాత్రను కూడా మనుషులే పోషిస్తారు.
పగటిపూట కూడా శ్మశానం వైపు వెళ్ళాలంటే దడ. (శ్మశానాల్లో అపార్ట్‌ మెంట్లు వేసే నగరాలకి ఆ గొడవ ఉండదులెండి.)
ఇక రాత్రి పూట ఆ ఆలోచన వస్తేనే నిద్ర పట్టదు.
నా మిత్రుడొకడు, చిన్నప్పుడు ఎప్పుడూ ఒకే ఒక దయ్యం కథ చెబుతుండేవాడు.
వెనకటికి ఒకడు తాను చాలా ధైర్యవంతుణ్ణని విర్రవీగే వాడట. వాడి మిత్రులందరికీ వాడి గప్పాలు వినీ వినీ విసుగు పుట్టింది. వాడి తిక్క వదల్చాలని వాళ్ళంతా నిర్ణయానికొచ్చి ధైర్యవంతుడితో ఒక పందెం కట్టారు.
”అమావాస్య రోజు, అర్ధరాత్రి 12 గంటలకు, శ్మశానంలో ఉన్న జమ్మి చెట్టుకు ఒక మేకు కొట్టి రావాలి”.
ధైర్యవంతుడు మనసులో జంకాడు కాని, మళ్ళీ ధైర్యం తెచ్చుకొని పందేనికి ఒప్పుకున్నాడు.
అర్ధరాత్రి పదకొండు గంటలకల్లా ఊళ్ళో ఆంజనేయస్వామి గుడి వద్ద అందరూ గుమిగూడారు.
ధైర్యవంతుడు తెల్లపంచే, తెల్లచొక్కా తొడుక్కొని వచ్చాడు. సరిగ్గా పదకొండున్నరకు బయల్దేరాడు.
అతడి మిత్రులందరూ గుడి దగ్గరే ఉండిపోయారు.
పన్నెండు దాటింది. ఒంటిగంట అయ్యింది. రెండయ్యింది. మూడయ్యింది ధైర్యవంతుడు తిరిగి రాలేదు.
ఏమయ్యాడో శ్మశానికి వెళ్ళి చూడాలనిపించింది. కానీ, ఎవరికీ ధైర్యం చాలలేదు.
నాలుగయ్యింది… అయిదయ్యింది… తెల్లవారింది.
వెలుగురాగానే మిత్రులందరూ శ్మశానం దగ్గర జమ్మిచెట్టు దగ్గరికి చేరుకున్నారు.
ధైర్యవంతుడు పడి ఉన్నాడు. పరీక్షించి చూస్తే చనిపోయి ఉన్నాడు.
మిత్రులందరూ జాలి పడ్డారు. బాధ పడ్డారు.
”వీణ్ణి నిజంగా దయ్యమే చంపేసిందంటవా..?”
వాళ్లలో ఒకడన్నాడు.
”అవును కాబోలు” అని అందరూ ఒప్పుకున్నారు.
ఒక్కడు మాత్రం-
”కాదు” అన్నాడు.
అందరూ ఉలిక్కి పడ్డారు.
వాడు అక్కడ అతి ముఖ్యమైన విషయాన్ని కనిపెట్టాడు.
”ధైర్యవంతుడు అన్న ప్రకారం జమ్మి చెట్టుకు మేకు కొట్టాడు. కాని వెనక్కి వస్తుంటే వాడి పంచెను లాగినట్టనిపించింది.
దయ్యమే అనుకుని గుండె ఆగి చచ్చాడు” అని చెప్పాడతను.
”ఏమిటీ! పెద్ద చూసినట్టు చెబుతున్నావు?” అని అందరూ అతడి మీద పడ్డారు.
అప్పుడతడు ఆధారం చూపించాడు.
జమ్మిచెట్టుకు మేకు కొట్టేటప్పుడు పంచె చెంగును కూడా కలిపి కొట్టేశాడు. అప్పటికీ పంచె మేకుకు పట్టేఉంది.
మేకు లాగితే, దెయ్యం లాగిందనుకున్నాడు కాబోలు.
ఈకథ మా చిన్నప్పుడు చెప్పుకున్నప్పుడల్లా – ఒకటే అనుకునేవాళ్ళం.
”ధైర్యవంతుణ్ణి చంపింది దెయ్యం కాదు – భయం!”.
భయం – ఎంతటి వాణ్ణయినా చంపుతుంది.
ఉద్యోగం ఊడుతుందన్న భయం.
పెళ్ళాం పక్కింటివాడితో లేచిపోతుందన్న భయం.
ప్రశంసలు రావన్న భయం.
సన్మానం జరగదన్న భయం.
అంతెందుకు…. నవ్వాలన్నా, ఏడ్వాలన్నా భయమే.
వెనకటికి ఒక గుమాస్తా, ఎప్పటిలాగే పై అధికారి భార్యతోపాటు ఒక పెళ్ళి విందులో కలిస్తే నమస్కారం చేశాడట.
అంతవరకూ భయం లేదు. నమస్కారం చేస్తూ, చేస్తూ నవ్వాడట.
ఆఫీసరు కూడా నవ్వాడట!
ఇక అక్కడినుంచి గుమాస్తాకి భయం పట్టుకుంది.
”ఆఫీసరు నిజంగా నవ్వాడా? అదోలా నవ్వాడా?”
ఈరెండు ప్రశ్నలు గంట గడిచేసరికి వంద పిల్లల్ని పెట్టాయి.
ఆఫీసరుగారి నవ్వు అదోలా అంటే…. ‘నాభార్యను చూసి నవ్వి, నాకు నమస్కారం చేస్తావా’ – అన్న అక్కసుతో కూడిన నవ్వా….? ఇలా అనుమానించాడు గుమాస్తా.
రాత్రంతా నిద్రలేదు.
ఉదయమే పై అధికారి ఆఫీసుకు రాగానే గుమాస్తా వెళ్లి కలిసి –
”సార్‌! నేను నిన్న నవ్వింది విూ భార్యను చూసి కాదు సార్‌…!” అని సంజాయిషీ ఇచ్చాడు భయంతో.
ఫలితం మామూలే. మూడురోజులు తిరక్కుండా గుమాస్తా బదిలీ అయ్యాడు.
చూశారా…
నిజంగా నవ్వటానికి కూడా ధైర్యం కావాలి
– సతీష్ చందర్
(తొలుత ‘జనసందేశ్‘ పత్రికలో ప్రచురితమయినది. తర్వాత ిలాంటి 72 కథలతో ‘చంద్రహాసం‘ పుస్తకం వెలువడింది. కావలసిన వారు ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు)

3 comments for “బిత్తర కుమారులు

  1. భయమంటే నాకు చాలా భయం ! అందుకే ఎప్పుడూ దగ్గరకి రానివ్వ లేదు . నిప్పు , నీరు , నింగి , నేల , మనుషులు , జంతువులు , ఆకలి , అప్పులు , ఏవీ నన్ను భయ పెట్ట లేక పోయాయి . కాక పొతే ఒక్కో అనుభవం ఒక్కో పాఠాన్ని నేర్పాయంతే . ఎలా ఉండాలో కొన్ని , ఎలా వుండ కూడదో కొన్ని …
    pl let me know your mail id / cell no.
    srinivasaraoachalla@gmail.com
    9247771219

  2. చదువుకు శ్రద్ధ చాలు., అల్లరికి మాత్రం తెగువ కావాలి.,నగరాల్లో దయ్యాల పాత్రను కూడా మనుషులే పోషిస్తారు.భయం – ఎంతటి వాణ్ణయినా చంపుతుంది.
    ఉద్యోగం ఊడుతుందన్న భయం.
    పెళ్ళాం పక్కింటివాడితో లేచిపోతుందన్న భయం.
    ప్రశంసలు రావన్న భయం.
    సన్మానం జరగదన్న భయం……………………..నిజంగా నవ్వటానికి కూడా ధైర్యం కావాలి!………..aa bagavantunni kaasta ధైర్యం prasadinchamani korukuntaanu…………………thank you satish chandra gaaru

  3. “కవులు వేలాది …జాలాది ఒక్కరే !”
    యిదొక్క వాక్యం చాలు జాలాది గారిపై మీకున్న గౌరవం ప్రేమ ఎంతటిదో తెలుసుకోవడానికి . వారి గురించి వారితో మీకున్న సాన్నిహిత్యం గురించి మీరు తెలియజేసిన విధానం చాలా బాగుంది . దళిత మేధావుల్లో ఒక ప్రశస్థమైన తారకను దళిత లోకం పోగొట్టుకున్నట్టైంది.వారి ఆత్మకు శాంతి కలుగాలని ఆశిస్తున్నాను !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *