తెలివి తేటలుండాలే కానీ, భోగాన్ని కూడా త్యాగం ఖాతాలో వేసెయ్యొచ్చు. ప్రేమాట అడే అబ్బాయిలూ, అమ్మాయిలూ ఇలాంటి త్యాగాలు తెగ చేస్తున్నారు లెండి.
‘హనీ, నీకు వేరే సంబంధం చూశారట కదా!’ అంటాడు కుర్రాడు.
‘అవున్రా! రెండు కోట్లు కట్నం ఇచ్చి మరీ కొంటున్నారు పెళ్ళికొడుకుని’ అంటుంది కుర్రది.
ఎక్కడో ప్రాణం చివుక్కుమంది కుర్రాడికి. రెండు కోట్లు రాంగ్‌రూట్లో పోతున్నాయంటే ఎంత బాధ. ఇంకా వాడు తేరుకునే కుర్రది ఇంకో బాంబు వేసింది.
‘అక్కడికీ నేను మా నాన్నతో ప్రేమ విషయం చెప్పేశాను..!’ అని ఊపిరి గట్టిగా పీల్చి, ఒక నిమిషం మౌనాన్ని పాటించింది- సంతాప సూచకంగా కాదు; సంతోష సూచకంగా.
నిమిషంలోనే ఇరవయినాలుగ్గంటల నరకాన్ని చూపిద్దామన్నది ఆమె వ్యూహం కాబోలు. అయినా కుర్రాడు ఊరుకుంటాడా? మధ్యలో అగిగెయ్యడూ! అడిగేశాడు: ‘ఏమన్నాడు మీ నాన్న?’
‘దానిదేముంది? అతన్నే చేసుకో. ఆ రెండుకోట్లేవో అతనికే ఇచ్చేద్దాం- అన్నార్రా!’
ఇలా కుర్రది అనగానే, ఏడుపును పోలిన నవ్వొకటి నవ్వి, ‘మరి నువ్వేమన్నావ్?’ అన్నాడు కుర్రాడు.
‘ఏమంటానూ? నేను ప్రేమించిన వాడు ఆదర్శానికి ప్రాణమిస్తాడు నాన్నా. అవసరమయితే నన్నన్నా వదలుకుంటాడు కానీ ఆదర్శాన్ని వదలుకోడు. కట్నం తీసుకోకూడదన్నది అతడి ఆదర్శం- అని చెప్పాన్రా. నీకు తెలుసా. ఇలా చెబుతున్నప్పుడు నేనెంత గర్వపడ్డానో తెలుసా?’ కుర్రది విర్రవీగిపోయింది.
కుర్రాడికి ఇప్పుడొచ్చింది నిజంగా ఏడుపే. అయినా అదిమి పెట్టుకుని- ‘పెళ్ళికొడుకు ఎలా వుంటాడు?’ అన్నాడు.
‘మరి నీ అంత హేండ్‌సమ్ కాదుకానీ, దాదాపు హృతిక్ రోషన్ లాగా వుంటాడ్రా.’
‘ఉద్యోగం ఏమిటో..?’
‘అదీ బ్యాడే. నీకున్నంత సుఖమైన ఐటి కంపెనీ ఉద్యోగం కాదు. పైలట్.’ ఇలా చెప్పగానే, వాళ్ళుకాఫీ తాగుతున్న రెస్టారెంట్ వాష్‌రూమ్‌లోకి దూకి ‘బేర్’ మని తనివి తీరా ఏడ్చేశాడు కుర్రాడు.
III III III
‘ఏం చేస్తాం చెప్పు. ప్రేమ త్యాగాన్నే కోరుతుంది. నా ఆశయం కోసం, నీప్రేమను త్యాగం చేశావ్. జోహార్!’ అన్నాడు వాష్‌రూమ్‌లో నుంచి ముఖం శుభ్రంగా కడుక్కుని వచ్చిన కుర్రాడు.
‘జోహార్లు చెప్పకు. నేనింకా బతికే వున్నాన్రా.’ అని కుర్రది కుర్రాణ్ణి వారించింది.
‘జోహార్లు నీకు కాదు. నా మరదలికి చెప్పాల్సి వచ్చేది.’ అంటూ చిన్నగా బెలూన్‌కి చిల్లుపెట్టాడు.
‘నీకు మరదలుందా? ఇవేళే పుట్టిందేమిట్రా?’ కుర్రదాని చికాకు వెటకారమయింది.
‘అదే అది పుట్టి ఇరవయ్యేళ్ళయింది. కానీ నన్ను పెళ్ళాడాలనే బుధ్ధి ఇవాళే పుట్టింది.’ అన్నాడు. బెలూన్లో గాలి కొంచెం బయిటకొచ్చింది.
‘మరి నువ్వేమన్నావ్రా?’
‘ఏమంటానూ- మన ప్రేమ కథ చెప్పాను.’నీకు కాలంటే నా ప్రాణమిస్తాను. ప్రేమ నివ్వలేను’ అనేశాను. ఇలా అన్నప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి హనీ!’ అని నిమిషం ఆగాడు.
ఆ నిమిషంలో ఆమె నలభయి ఎనిమిది గంటల నరకాన్ని చూసింది.
‘మరి నీ మరదలు ఏమంది?’
‘నువ్వెందుకా ప్రాణం తీసుకోవటం. నేనే తీసుకుంటాను అని చెప్పి గుప్పెడు నిద్ర బిళ్ళలు తీసి మింగబోయింది.’
అని చెప్పాడోల లేదో.. ‘మరి నువ్వేం చేశావ్ రా?’
‘ఏం చేస్తాను? నా ప్రేయసి స్త్రీ వాది. తన కారణం గా ఏ స్త్రీ నష్టపోకూడదనుకుంటందని చెప్పాను.’ అన్నాడు కుర్రాడు. బెలూన్లో సగం పైన గాలి పోయింది.
‘ఆ తర్వాత ?’
‘ఏమంది నా మామ వచ్చాడు. ‘బాబూ! నీకు వరకట్నమంటే అసహ్యమని నాకు తెలుసు. నీ ఆశయం నాకు నచ్చింది. నేనిచ్చే ఈ డబ్బును స్వీకరించి వరకట్న వ్యతిరేకోద్యమానికి ఖర్చు పెట్టు- అని నా చేతిలో నాలుగు కోట్లు పెట్టి, వెంటనే తన కూతురి మెడలో తాళి కట్టించాడు.’ అని చెప్పాడు కుర్రాడు. బెలూన్లో గాలి మొత్తం పోయింది.
చూశారా? కుర్రదానిదీ త్యాగమే. కుర్రాడిదీ త్యాగమే.
III III III
కాంగ్రెస్ అంటే తృణమూల్ కాంగ్రెస్‌కీ, తృణమూల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్‌కీ పడి చచ్చేటంత ప్రేమ.
సమాజ్ వాదీ పార్టీకీ, కాంగ్రెస్‌కీ మధ్య కూడా ఇలాగే చచ్చి పడేటంత ప్రేమ వుంది.
తృణమూల్ మమతకు ప్రాంతీయత పిచ్చి. సమాజ్ వాదీ ములాయం కు మైనారిటీ పిచ్చి. వాళ్ళు తమతమ రాష్ట్రాలలో ఈ పిచ్చితోనే గెలిచారు.
రాష్ట్రపతి ఎన్నికలకు వీరిద్దరి మద్దతూ కాంగ్రెస్ సోనియాకు కావాలి. మమత కోసం బెంగాలీ బాబు ప్రణబ్ ముఖర్జీ పేరునూ, ములాయం కోసం హమిద్ ఆన్సారీ పేరునూ ప్రతిపాదించి మమత చేత కాఫీ తాగించి పంపించారు సోనియా. ఎంతటి త్యాగం?
కానీ మమత బయిటకొచ్చి ములాయం అన్నయ్యతో భేటీ అయ్యి సోనియా పట్ల తమ కున్న ప్రేమకు బదులు తీర్చుకోవాలనుకున్నారు.
సోనియాకు నమ్మిన బంటు అయిన ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించారు. అయినా కూడా సోనియా బెంగాలీలకు మేలు చేసేయలంటే సోమనాధ్ చటర్జీనీ, మైనారిటీలను బుజ్జగించేయలంటే అబ్దుల్ కలామ్‌ను పరిణగించేయ వచ్చు అని సోనియాకు ‘కేకు’ తినిపిస్తూ తమ ఇద్దరూ తమ త్యాగనిరతిని చాటుకున్నారు.
చాలా స్వార్థాలు, ఇలా త్యాగాలుగానే చెలామణీ అయిపోతాయి.
(14 జూన్2012 నాడు గ్రేట్ ఆంధ్ర వార పత్రిక కోసం రాసినది. అందుకనే తర్వాత పరిణామాలు ఈ రచనలో ప్రస్తావనకు రాలేదు)
-సతీష్ చందర్
‘