బేడీలకే కాదు, బెయిలుకూ బంగారమే!

janardhan_reddy_20110919బేడీలకే కాదు, బెయిలుకూ బంగారమే!

బంగారం బంగారమే. కొనుక్కొచ్చినా, కొట్టుకొచ్చినా.

బంగారాన్ని కొరుక్కుని తినలేం. కానీ, అది వుంటే దేన్నయినా కొనగలం.

అందుకే, బంగారం కోసం జరిగినన్ని నేరాలు, మరి దేని కోసమూ జరగవు.
‘మెరిసెడిది యెల్ల మేలిమి కాదు’ అన్న జ్ఞానం కొనుక్కొచ్చే వాడికి ఉండొచ్చు. ఉండక పోవచ్చు.
కానీ కొట్టుకొచ్చే వాడికి మాత్రం వుండి తీరాలి.

మెడలో గొలుసులు కొట్టేసేవాడికి ఈ జ్ఞానమే లేక పోతే, ఎంత శ్రమ
వృధాఅవుతుంది? అలాగే వాణ్ణి పట్టుకొచ్చిన పోలీసుకు వుండాలి. లేకుంటే, ఆ ‘చైన్‌ స్నాచర్ని’
వారం రోజులు పాటు అప్పనంగా మేపి, తులం బంగారం కూడా జేబులో వేసుకోకుండా, ఉత్త పుణ్యాన
కోర్టులో హాజరు పరచాల్సి వుంటుంది.

నిజం చెప్పొద్దూ, బంగారాన్ని కోరుకునేది ఆడవాళ్లు కానీ, దాన్ని వాడుకునేది
మాత్రం మగవాళ్ళే. అంతవరకూ నడిచే నగలు షాపులాగా స్రీ కనిపించినా, పురుషుడికి అవసరం
వచ్చినప్పుడు తాకట్టుకో, అమ్మకానికో బంగారాన్ని బయిటకు పంపేస్తాడు. ఒక్క ముక్కలో
చెప్పాలంటే, అది స్త్రీకి అలంకరణ, పురుషుడికి ఆస్తి.

అయినప్పటికీ బంగారం కోసం పడి చస్తున్నట్టు స్త్రీలే కనిపిస్తుంటారు. వయసుతో
పనిలేకుండా ఈ కోరిక వుంటుంది. ఒక్కొక్క సారి వయసుతో పెరుగుతున్నా పెరగవచ్చు.

‘ఈ నెక్లెసూ, వడ్డాణమూ పెట్టుకుంటే అందగా వున్నావ్‌. తెలుసా!’ అని ఇంటాయన
చిన్న ప్రశంస ఇస్తే పొంగి పోతారు, కానీ, ‘ఈ నగలు లేక పోతే అందంగా వుండనన్న మాట!’ అని
చిన్న ఎదురు ప్రశ్న కూడా వేయరు.

స్రీలలో ఈ కోరికను చూసే, వంచకులు కూడా బంగారాన్ని ఎరగా వేస్తుంటారు.ఏం?
మారీచుడు సీతమ్మ ముందుకు వచ్చేటప్పుడు కంచు జింకగానో, వెండి జింక గానో రావచ్చు కదా?
మాయ జింక గానే ఎందుకు వస్తాడు?

వెండి జింకయితే ఆవిడ, దానిని పట్టి తెమ్మనే పనిచెప్పేదీ కాదు. తాను అపహరణకు గురయ్యేదీ
కాదు.

అయితే పురుషులు మాత్రం బంగారాన్ని కేవలం ఆస్తిగానే తప్ప, అభరణంగా
వాడరా? ఎందుకూ వాడరూ? కొందరి మెడల్లో ‘పగ్గాలు’ లాంటి బంగారు హారాలు వేలాడతాయి.
వారికెలా వుంటుందో తెలియదు కానీ, ఒక్కొక్క సారి చూసేవాళ్ళకు మెడలు నొప్పి పుడతాయి.
చేతులకూ కడియాలూ, బ్రేస్‌లెట్లూ అంతే. సాక్షాత్తూ లక్ష్మీదేవి దిగివచ్చి వాళ్ళ చేతులకు ‘బంగారు
బేడీలు’ వేసి బంధించిందా- అన్నట్లు వుంటుంది. ఇవి కేవలం అలంకరణకు మాత్రమే కాదు. తమకు
కొన్ని వ్యాపారాలు చేయగల తాహతు (లేదా పరపతి) వుందని చూసేవాళ్ళకి అనిపించాలి. అందుకే
కొత్తగా రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్స్‌, చిట్‌ ఫండ్స్‌ వంటి వ్యాపారాల్లోకి దిగిన వారు మెడల్లో ఈ బంగారు
భారాన్ని మోస్తుంటారు. అంతే కాదు, కనిపిస్తుందో, లేదో చూపరుల కోసం ‘గుండీలు’ తీసిన
బంటుల్లా మారిపోతారు. ( చొక్కా పై గుండీలు, పెట్టకుండా వదిలేస్తారు.) ఏం చేస్తారు? వారికది
వ్యాపారావసరం.

అక్రమ గనుల త్రవ్వకాల్లో నిందితుడు గాలి జనార్థన రెడ్డి – బంగారాన్ని కేవలం
ఆభరణంలాగానో, ఆస్తి లాగానో మాత్రమే కాకుండా-ఫర్నిచర్లో ఫర్నిచర్‌ లాగా కూడా వాడుకున్నారు.

శ్రీవారికి 45 కోట్ల రూపాయిల విలువవైన కిరీటాన్ని కానుక గా ఇచ్చినప్పుడు
‘హోదా’కు చిహ్నంగా వాడుకున్నారు.

కూర్చునే కుర్చీలకు తాపటాల్ని పెట్టినప్పుడు, తానెంత సంపన్నుణ్ణయ్యానో తనను
తాను నమ్మించుకోవటానికి పెట్టుకున్నారు. (టాయిలెట్ల నిర్మాణానికి కూడా బంగారాన్ని వాడారనే
వార్తలు వచ్చాయి.) బహుశా, ఒక కానిస్టేబుల్‌ కొడుకుగా అనతి కాలం లో వేల కోట్లకు
పడగలెత్తాడంటే- నమ్మటం ఇతరులకే కాదు, తనకీ కష్టమే. ( బహుశా, ఆ స్వర్ణ సింహాసనాన్ని
అధిష్ఠించి, తన్ను తాను గిచ్చుకుని కూడా చూసుకున్నారేమో- ఇది కల కాదు కదా- అని
తేల్చుకోవటానికి). ఆత్మవిశ్వాసానికి సంకేతంగా కూడా ఈ లోహాన్ని ఈయన వాడుకున్నట్టున్నారు.

బెయిలు కోసం (కేవలం పూచీకత్తు కోసం కాదు లెండి.) ఏకంగా బంగారం అమ్మి
పదకొండు కోట్ల రూపాయిలు ఆయన అనుచరులు సృష్టించినట్లుగా ఈ మధ్య దర్యాప్తులో తేలింది.

పాపం! అంత డబ్బు ఆయన దగ్గర లేదా? ఎందుకు బంగారాన్నే అమ్మాల్సి
వచ్చింది? ఇలాంటి ప్రశ్నలన్నీ ఎవరికి వారు వేసేస్తున్నారు.

వీరంతా, ఈ మధ్యకాలంలో ఆయన ఎదిగిన ఎదుగుదలను విస్మరిస్తున్నారు.

దేవుడికి బంగారం ఇచ్చే దశనుంచి, తన బంగారంలో దేవుణ్ణి చూసుకునే దశకు
ఎదిగారు.

నిజం! ఆయనకూడా బంగారం లాంటి మనిషే. బంగారానికి వజ్రమే కాదు, ఏ
రాయయినా పొదగ వచ్చు.

పచ్చల్నీ ఇముడ్చుకుంటుంది, కెంపుల్నీ కలుపుకుంటుంది- తనలో.

అటు చూస్తే కర్ణాటకలో ‘కాషాయ’ రంగు పార్టీ, ఇటు చూస్తే ఆంద్రప్రదేశ్‌లో
‘మువ్వన్నె’ ల పార్టీ,

రెంటినీ తనలో కలుపుకోగలిగారు గాలి.

రెండు పార్టీలకు చెవులకు పెట్టుకోవటానికి బంగారు కమ్మెలు కాదు కానీ, చెవుల్లో
పెట్టుకోవటానికి బంగారు పువ్వులు చేయించారు.

బంగారాన్ని ధరించటమూ, వాడుకోవటమే కాదు తెలుసు. కానీ బంగారం లాంటి
గాలికి బంగారాన్ని తయారు చేయగల శాస్త్రం (ఆల్కెమీ) కూడా తెలిసిపోయిది. అదే, నలుపును
తెలుపు చేయటం. ఆపార్థం చేసుకోకండి. దీనర్థం నల్ల ధనాన్ని, తెలుపు చేయటం కాదు.

బంగారం తీసినప్పుడు ‘నల్ల’ గా వుంటుంది. నమ్మరా?

దానిని అమ్మినప్పుడే ‘పసుపు పచ్చ’గా మారుతుంది.

బొగ్గే బంగారం. జాతికి ఆస్తిగా వుండాల్సిన ఈ ఖనిజం, ఇలా కొద్ది మందికి ఆస్తిగా,
ఆభరణం మారిపోతూ వుంటే మనం చూస్తూ వున్నాం. దొరకనప్పుడు చప్పట్లు కొడుతున్నాం.
దొరికినప్పుడు శాపనార్థాలు పెడుతున్నాం.

-సతీష్ చందర్

(ఆంధ్రభూమి దినపత్రిక 1డిశంబరు 2012 వ సంచికలో వెలువడింది.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *