బొమ్మ పడిందా? లేదా?

ap assemblyటైటిల్స్‌ వేశారు. సినిమా పేరు కూడా తెర మీద పడింది. కానీ, చిన్న సందేహం. ‘బొమ్మ పడిందా? లేదా?’

విమానంలో తెలంగాణ బిల్లు వచ్చింది. టేబుల్‌ చేశారు. అడిగో, అడక్కుండానో ఓ తెలంగాణ మంత్రి మాట్లాడేశాడు. బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ( బీయేసీ) సమావేశం జరిగిపోయింది. కానీ, చిన్న సందేహం ‘చర్చ మొదలయిందా? లేదా?’

ఇది తేల్చుకునే లోపుగా శీతాకాలపు మొదటి విడత సమావేశాలు వాయిదా పడిపోయాయి. రాష్ట్ర విభజన తెర మీదకు వచ్చినప్పటి నుంచీ ఇలాగే నడుస్తోంది. తేలిపోయిన విషయలాను ఇంకా తేలనట్లూ, తేలని విషయాలను తేలిపోయినట్లూ ఇరు పక్షాల వారూ( మన్నించాలి. ఇప్పుడు పక్షాలూ,పార్టీలూ లేవు. ‘ఇరు ప్రాంతాల వారూ’) తమ శక్తి మేరకు నటిస్తున్నారు.

ఈ బిల్లు పై ఇప్పటికే తేలిపోయిన విషయాలున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాలేదు. సీమాంధ్ర సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానాలు ‘తల లెక్కింపు'(హెడ్‌కౌంట్‌) వరకూ రాకుండా సమావేశాలు వాయిదా పడిపోయాయి. మళ్ళీ ప్రత్యేక సమావేశాలు పెడితేనో, లేకుంటే బడ్జెట్‌ కోసం ‘వోట్‌ ఆన్‌ అకౌంట్‌’ సమావేశాలు పెడితేనో రావాలి. ఒక వేళ నిజంగానే ‘లోక్‌ పాల్‌ బిల్లు’ కు పట్టిని ఉడుము పట్టు పట్టి, తెలంగాణ బిల్లును ఆమోదం వరకూ తెచ్చినా, రాష్ట్ర విభజన ప్రక్రియ మొత్తం పూర్తి కావటానికి ఇంకో ఆరు నెలలు కావాలంటున్నారు. ఇది ఒక అవకాశం.

అది కాకుండా, ఏ 371-డి కారణంగానో ( దానికి నిజంగా రాజ్యాంగ సవరణ అవసరమని, ఏ కోర్టో మధ్యలో అడ్డుపడితే సంగతి) లేదా, ఇరు ప్రాంతాల వారికీ ఈ బిల్లుతో పేచీలున్నాయని(పార్లమెంటులో) మద్దతు ఇవ్వాల్సిన బీజేపీ, కాంగ్రెస్‌ చెవిలో ‘కమలం’ పెడితేనో బిల్లు పార్లమెంటు ప్రవేశం వరకూ వచ్చి ఆగిపోతుంది.

ఆ రెంటిలో ఏదో ఒకటి జరుగుతుంది. అందుచేత పార్లమెంటు కు నిర్వహించాల్సిన 2014 సార్వత్రిక ఎన్నికల వరకూ సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయి. ఇది తేలిపోయిన విషయం. ఇక అసెంబ్లీ ఎన్నిలంటారా? బిల్లు ఆమోదం పొందితే, (ఆరు నెలలు ఆలస్యంగా) వేరుగా రెండు రాష్ట్రాలకు జరుగుతాయి. మధ్యలో వీగిపోతే, పార్లమెంటు ఎన్నికలతో పాటే సమైక్య రాష్ట్రంలో జరుగుతాయి.

కాబట్టి సమైక్య రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల వరకూ, ఇప్పుడు ఎవరి వ్యూహాలు వారు వేసుకోవచ్చు. వేసుకుంటున్నారు కూడా. ‘తెలంగాణ ప్రాంతంలో’ ‘ఇచ్చామనో, ఇచ్చినంత పనిచేశామనో’ కాంగ్రెసూ, ‘తెచ్చామనో, తెచ్చినంత పనిచేశామనో’ టీఆర్‌ఎస్‌, ‘మద్దతు ఇచ్చామనో, ఇవ్వబోయామనో’ బీజేపీ- ఈ మూడు పార్టీలు ఇక్కడున్న (మజ్లిస్‌ స్థానం మినహా) ఎం.పీ సీట్ల కోసం పాకులాడతాయి.

ఇక సీమాంధ్ర ప్రాంతంలో- ఆదినుంచీ పార్లమెంటులో ‘సమైక్య ఆంధ్ర’ ప్లకార్డునే పట్టుకున్నానని జగన్మోహన్‌ రెడ్డీ, ఫెలిన్‌ తుపాను లాంటి విభజనను ‘ఆపాననో, ఆపినంత పనిచేశాననో’ కిరణ్‌ కుమార్‌ రెడ్డీ, రెండు ప్రాంతాలనూ ‘రెండు కళ్ళగానో, రెండు కొబ్బరి చిప్పలుగానో, ఇద్దరు పిల్లలుగానో’ భావించి ‘సమన్యాయం’ తో కొట్టానని చంద్రబాబూ ‘సమైక్యాంధ్ర కీర్తి’ని పంచుకోవటానికి పోటీ పడతారు. ఇది కూడా తేలిపోయిన విషయమే.

అయితే పార్లమెంటు ఎన్నికలు, దేశం కేంద్రంగా జరుగుతాయి. దేశంలో ఇప్పటికి వున్న ప్రత్యామ్నాయాలు రెండు: యూపీయే, ఎన్డీయే. మూడో ప్రత్యామ్నాయానికి ఇంకా ‘పురిటి నొప్పులు’ కూడాప్రారంభం కాలేదు. దాంతో, ప్రాంతీయ పార్టీలు( వైసీపీ, తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌లు) తాము ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నామో చెప్పాలి. లేదూ, తామే ‘జాతీయ స్థాయి నాయకులమనుకుంటే’ తాము ఏ కూటమిని ఏర్పాటు చేయబోతున్నామో చెప్పాలి.

తెలంగాణ ఏర్పాటులో ఎక్కడ కాంగ్రెస్‌ ఆగిపోయినా, టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో పొత్తుకానీ, విలీనం కానీ చేసుకుని ఎన్నికల్లో వెళ్ళదు. స్వతంత్రంగా వెళ్తుంది. అయినా సరే, తాను యూపీయే వైపో, లేక ఎన్డీయే వైపో తేల్చాలి. తెలుగుదేశం ఇప్పటికే ‘ఎన్డీయే వైపు’ చూస్తోంది. ‘వైయస్సార్‌ కాంగ్రెస్‌’ ఇంకా ఈ విషయంలో స్పష్టత ఇవ్వటం లేదు. ‘యూపీయే’ ను విమర్శిస్తే తప్ప వోటర్లు హర్షించరు. అలాగని ‘ఎన్డీయే ‘ వైపు చూస్తే తన వోటు బ్యాంకులోని ‘దళిత క్రైస్తవులూ, ముస్లింలూ’ హర్షించరు. అలాంటప్పుడు ఎలాంటి జాతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు కు తాను ఊతమిస్తున్నారో జగన్‌ చెప్పాలి. ఇక కిరణ్‌ పెట్టబోయే పార్టీ కూడా( పెడితే సంగతి?) తన జాతీయ ప్రత్యామ్నాయాన్ని ముందు తేల్చాలి.

రాహుల్‌ ను ప్రధానిని చెయ్యటమే కాంగ్రెస్‌ ప్రధాన ఎజెండా అయితే, అసెంబ్లీ సీట్ల కన్నా, పార్లమెంటు సీట్ల మీదే దృష్టి పెడుతుంది. అలాగే మోడీ ప్రధాన మంత్రి అభ్యర్థిత్వాన్ని ఆహ్వానించగల పార్టీల ( అవి తక్కువే వుంటాయి!) నుంచి ఎక్కువ పార్ల మెంటు సీట్లను బీజేపీ కోరుకొంటుంది.

అన్ని పార్టీలూ ఇచ్చేవి ప్రాంతీయ నినాదాలు. ఆశించేవి పార్లమెంటు సీట్లు. రెంటినీ ఎంత తెలివిగా ముడివేస్తారన్న దాని మీదనే ఆయా పార్టీల జయాప జయాలు ఆధారపడి వుంటాయి.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 21-26 డిశంబరు 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *