భయ..భయ..భయహే!

ఆయుధమంటే చాలు అదిరిపడి చస్తారు ఎందుకో..?
ఉన్నట్టుండి యోగా(రామ్‌ దేవ్‌)బాబా తన అనుచరులకు ‘శస్త్రం’ ఇస్తానన్నారు. చిదంబరం నుంచి ఏకాంబరం వరకూ దేశంలో అందరూ ఉలిక్కి పడ్డారు.
గతంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తన అభిమానులకి లాఠీలు(కర్రలు) ఇచ్చి ప్రదర్శన చేయించారు. అవీ ఆయుధాలే కదా! అప్పుడూ ఇలాగే… అందరూ ‘బుర్రలు బద్దలు కొట్టు’కున్నారు.. లాఠీలతో కాదు… సందేహాలతో…!
‘ఇతను ఉగ్రవాదిలా రెచ్చిపోతున్నాడేమిటి..? కొంప దీసి ‘ఆల్‌ ఖైదా’ లాగా ‘లాల్‌ ఖైదా’ లాంటి సంస్థను గాని స్థాపించలేదు కదా- అని అనుమానించారు కదా!
అప్పుడు లాలూ గుట్టు విప్పారు.
‘పోదురూ.. మరీనూ..! నేను హింసా వాదినేమిటి? నేను అసలు సిసలు గాంధేయ వాదిని. గాంధీ మాటల్ని కాదు. ఆయన చేతల్ని అనుకరిస్తున్నాను. ఒక్క సారి ఆయన చేతిలో ఏముందో చూడండి?’ అంటూ నాలుగు రోడ్ల కూడలిలో వున్న గాంధీ విగ్రహాన్ని చూపించారు.
‘అవును కదా! ఆయన చేతిలోనూ ‘లాఠీ’ వుంది కదా!’ అని కొందరు విస్తుబోయారు.
‘అబ్బా! అదేం కుదరదు. ఆయన కది ఊత కర్ర! దానిని ఆయుధమంటే ఎలా?’ అని కొందరు అడ్డం తిరిగారు. ఏదయినా అంతే. దించితేనే ఊత కర్ర. ఎత్తితే ఆయుధమే.
విమానం కూడా అంతే. సవ్యంగా ప్రయాణిస్తే రవాణాసాధనం. ప్రపంచ వర్తక సౌధాన్ని ఢీకొంటే ఆయుధమే.
మనిషి మాత్రం ఆయుధం కాదా? తూలినంత వరకే మనిషి! పేలితే మానవ బాంబు!
ఎవరి ఆయుధం వారికి వుంటుంది. ఆ మాట కొస్తే ఎక్కువ మంది సాయుధులే. నిరాయుధులు ఎక్కడో కాని కనపడరు.
గాంధీగారి దేశంలో అయితే ఆయుధం లేకుండా, ఎవరూ ఆరు బయిటకు రాలేరు.
తెలతెల వారుతుండగా వాకింగ్‌ కొచ్చే వారిని చూడండి. చేతిలో విలాసవంతంగా ఊగే ఒక పొట్టి కర్ర వుంటుంది. ఎందుకంటారు? కుక్కా, పిల్లీ, ఎలుకా- ఏదయినా ఎదురు రావచ్చు. మన కున్న భయాన్ని బట్టే కదా- ఇది క్రూర జంతువూ, ఇతి సాదు జంతువూ- అని విభజించుకుంటాం. రాత్రి ‘రాబిస్‌’ గురించి టీవీలో చూసి పడుకుంటే, పొద్దున్నే కుక్కను మించిన క్రూర జంతువు కనిపించదు. ఒక్క భయస్తుడు మాత్రమే పిల్లి వొంటి మీద పులి చారల్ని పోల్చుకో గలడు.
భర్త అంటే భయపడి చచ్చే ‘ఉత్తమ ఇల్లాలి’నే తీసుకోండి. ఇంట్లో ఏదీ లోటులేకుండా చూసుకుంటుంది. వంటింట్లోకి అవసరమయ్యే కత్తులూ, చాకులూ, ఫోర్కులూ, అట్లకాడలూ, అప్పడాల కర్రలూ వీలయినంత పెద్దవే తీసుకుంటుంది.ఏమో! భర్తకు ‘వడ్డించే’ అవసరం పొద్దున్నా, మధ్యాహ్నం, సాయింత్రమే కాదు. అర్థరాత్రి కూడా ఏర్పడ వచ్చు. ఠీవిగా బయిటకు వెళ్ళిన శ్రీవారు ఊగుతూ ఇంటికి వస్తే..? భయం కాదూ!
ఏదయినా అంతే. భయం కొద్దీ ఆయుధం. ధైర్యం కొద్దీ ఆయుధం కాదు.
ధైర్యం పెరిగే కొద్దీ ఆయుధాలు అంతరిస్తుంటాయి.
పరుగెత్తే వారికన్నా, నడిచే వారికన్నా, కూర్చున్న వారికి భయమెక్కువ వుంటుంది.
ఉన్నత ఆసనాల మీదా, ఉన్నత వేదికల మీదా కూర్చున్న వారికి మరింత భయం.
ఇంకా చెప్పాలంటే, కూర్చున్న కుర్చీ సైజు పెరుగుతున్న కొద్దీ, భయం పెరుగుతుంటుంది.
ఎంత చెట్టుకు అంత గాలి లాగా… ఎంత కుర్చీకి అంత భయం.
ఎమ్మెల్యే కుర్చీ కన్నా, మంత్రి కుర్చీకి, మంత్రి కుర్చీ కన్నా, ముఖ్యమంత్రి కుర్చీకి, ముఖ్యమంత్రి కుర్చీ కన్నా ప్రధానమంత్రి కుర్చీకి, ప్రధానమంత్రి కుర్చీకన్నా, ఆయన్న కూర్చోబెట్టిన అధినేత లేదా అధినేత్రి కుర్చీకీ భయమెక్కువ.
అందుకే వీరికి కాపు కాసే గన్‌ మన్‌లూ, బ్లాక్‌ క్యాట్‌ కమెండోలూ మోసే ఆయుధాలు కుర్చీ, కుర్చీకీ పెరుగుతూనే వుంటాయి.
ఇలాంటి కుర్చీల్లో కూర్చున్న వారి భయం కళ్ళకి ఇతరుల ఆయుధాలు ఎక్కడున్నా కనిపించి పోతాయి.
వాళ్ళు వస్త్రాన్ని చూసి శస్త్రమనుకున్నారు.
అదీ కూడా ఏ వస్త్రమనుకున్నారు?
సర్వసంగ పరిత్యాగులు కట్టే కాషాయ వస్త్రం.( అఫ్‌కోర్స్‌! వెయ్యికోట్లకు పడగలెత్తి కూడా ఈ వస్త్రం కట్టవచ్చనుకోండి. అది వేరే విషయం.)
కాబట్టే, అవినీతికీ, నల్లధనానికీ వ్యతిరేకంగా కాషాయాంబరధారి యోగాబాబా చేపట్టిన నిరాహార దీక్ష శిబిరం మీద పెద్దకుర్చీల వాళ్ళ సాయుధదళాలు విరుచుకు పడ్డాయి.
అక్కడికీ యోగాబాబా, పెద్దల ‘కాషాయ ఫోబియా’ ను అర్థం చేసుకుని, కాస్సేపు కాషాయ వస్త్రాలను పక్కన పెట్టి, స్త్రీలు ధరించే ‘చుడీదార్‌’ ధరించారు. అయినా ఏలిన వారికి భయం తగ్గలేదు.నిర్దాక్షిణ్యంగా హింస చేశారు.
ఇప్పుడు భయపడటం బాబా వంతయ్యింది.
‘యోగాసనాల’ మీద కూర్చున్నంత వరకూ లేని భయం, ఉద్యమమనే ‘రాజకీయాసనం’ మీద కూర్చోగానే వచ్చేసింది.
అంతే.. ‘శస్త్రం’ ఉండాల్సిందే- అన్నారు
భయపడ్డ వాళ్ళే భయపెడతారు. భయపెట్టే వాళ్ళే ఆయుధాలు పడతారు.
పసిపిల్లలూ, పసిపిల్లల్లాంటి ప్రజలూ ఇలా భయపడరు. వారు మాత్రమే నిరాయుధులు!

-సతీష్‌ చందర్‌
10-6-11

Leave a Reply