మన రాజకీయం మూడు ముక్కల్లో!

power stirఆవేశాలు, అవసరాలు, అధికారాలు. ఈ మూడే రాష్ట్రరాజకీయాల భవిష్యత్తును నిగ్గుతేల్చనున్నాయి.

ఆవేశాలు మనుషుల్ని ఊగిపోయేటట్టు చేస్తాయి. ఒకపైపు ఒరిగిపోయేటట్టు కూడా చూస్తాయి. కానీ ఒక ఆవేశాన్ని ఏళ్ళ తరబడి నిలబెట్టటం కష్టం.

సానుభూతి ఒక ఆవేశం. హఠాత్తుగా ఒక జనాకర్షక నేత అదృశ్యమయితే కలిగే దు:ఖం ఆపారం. ఈ దు:ఖాన్ని జనం మోయలేరు. అందులోనుంచి ఉపశమనం పొందటానికి ఆ స్థానంలో ఎవరయినా వస్తే బాగుండునని చూస్తారు. మనది ఇంకా పేరుకే ప్రజాస్వామ్యం. తీరులో రాచరికమే. ప్రజలు తామెన్నుకున్న నేత నయినా తమ సేవకుడిగా చూడరు. ప్రభువుగానే చూస్తారు. రాజు పోతే ఆ స్థానంలో కొడుకునో, కూతుర్నో, భార్యనో చూడగలరు కానీ మరొకర్ని చూడలేరు. ఇప్పుడు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కానీ, ఆ పార్టీలో వైయస్‌ తనయుడు వైయస్‌. జగన్మోహన రెడ్డికి గానీ ఇలాంటి ‘పారంపర్యమే’ సంక్రమించింది. అయితే ఈ సానుభూతి ఎన్నేళ్ళుంటుంది? ఎన్నికలు వచ్చే వరకూ వుంటుందా? ఒక్కసారి ఆ కుటుంబ సభ్యులు అధికారంలోకి వచ్చే వరకూ వుంటుందా? అన్నది పలు అంశాల మీద ఆధారపడి వుంటుంది. అయితే అనుకోకుండా జగన్‌ మీద కేసులు నమోదు కావటమూ, ఫలితంగా జైల్లో వుండాల్సి రావటమూ- నిజానిజాలు ఏమయినా- సానుభూతికి అదనపు ఆయుష్షు పోస్తున్నాయి.

సెంటిమెంటూ ఒక ఆవేశమే. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి. తెలంగాణ వస్తే పంటలు పండేస్తాయి. తెలంగాణ వస్తే పరిశ్రమలు వచ్చేస్తాయి. ఇలా పలు సమస్యలకి పరిష్కారంగా ఒకే అంశాన్ని చూపితే అదే సెంటిమెంటుగా మారుతుంది. ఇవాళ తెలంగా ప్రాంతంలో ప్రజలకు ఈ సెంటిమెంటు బలంగా వుంది. అయితే సెంటిమెంటు ఇంతే తీవ్రంగా ఏళ్ళ తరబడి వుంటుందా? గతంలో కూడా ఈ సెంటిమెంటు వచ్చి,కొన్నేళ్ళ పాటు ఉధృతంగా వుండి, తర్వాత మందగిస్తూ వచ్చేది. కానీ అంతర్భూతంగా మంద్ర స్థాయిలో కొనసాగుతూనే వుంది. అది వేరే విషయం. అయితే ఈ సెంటిమెంటుకు రెండు పార్శ్యాలు. ఒకటి: తెలంగాణ రావాల్సిందే అన్న కాంక్ష రెండు: ఈ తెలంగాణ తెచ్చేదెవరు. మొదటి పార్శ్యంలో ఇప్పుడు పేచీలు లేవు. కానీ రెండో అంశంలోనే వివాదాలు. ఒకప్పుడు టీఆర్‌ఎస్‌ ఒక్కటే తెస్తుందనుకునేవారు తగ్గిపోతున్నారు. వెంటనే వస్తుందో, లేదో- తర్వాత విషయం. వచ్చేవరకూ పోరాడేవాళ్ళు ముఖ్యం. దీంతో పార్లమెంటరీ రాజకీయాల్లో పెద్దగా ఉనికి లేని ఉద్యమసంస్థలవైపూ, తాత్కాలికంగా ఏర్పడ్డ సంఘాల వైపూ ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

కాబట్టి, సానుభూతి, సెంటిమెంటూ- ఈ రెండే అంతిమంగా 2014 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ( ఈ లోగా ఎన్నికలు రాకుంటే) వోటర్లను ప్రభావితం చేస్తాయి- అన్నది చెప్పలేం. కానీ ఈ రెండూ అంశాల ప్రభావం ఎంతో కొంత తప్పని సరిగా వుంటుంది.

ఇవి కాకుండా ప్రజల అవసరాలు కూడా రాజకీయ సరళిని మారుస్తుంటాయి. గత కొన్ని నెలలుగా ప్రజల నిత్యావసరాలను తీర్చటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. మనం ఉపయోగించే వస్తువులో దేనికి ధర వున్నా అది పెరిగి కూర్చుంది. ఉప్పూ, పప్పూ దగ్గరనుంచి కరెంటు, పెట్రోలూ, స్టాంపు చార్జీలు- ఒక్కటేమిటి అన్నీను. మధ్య తరగతి పౌరుడి చొక్కా జేబుకు చిల్లు పెడితే, ఆ వెనుక వున్న గుండెకు రంధ్రం పడ్డట్టుగా భావిస్తాడు. ఫలితంగా పట్టణాలలో, నగరాలలో వుండే చదువుకున్న మధ్యతరగతి వర్గం- ఈ విషయంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా – కోపం తెచ్చుకున్నారు. ఈ కోపం అధికారంలో వున్న కాంగ్రెస్‌ మీదే తప్పని సరిగా వుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అవసరాలను కూడా అవేశాలు మింగేస్తాయి. కానీ నగరవాసులకు అవసరాలే ప్రధానం. వీరి వోట్లను ఎవరు తమ వైపు తిప్పుకోగలరూ- అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే వుంది. చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిదేళ్ళు అధికారంలో వున్నప్పుడు- ఆ ప్రభుత్వం మీద కూడా చార్చీలు పెంచారన్న వ్యతిరేకత వచ్చింది. అయితే ఆ వ్యతిరేకత గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చింది. కానీ ఇప్పుడు వస్తున్న వ్యతిరేకత మధ్యతరగతి నుంచి వస్తోంది. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కానీ, టీఆర్‌ఎస్‌ కానీ- తమను నడిపిస్తున్న ‘సానుభూతి, సెంటిమెంట్ల’కు తోడు ఈ నిత్యావసరాల మీద తీవ్రంగా దృష్టి మళ్ళిస్తే వారి వైపు వెళ్ళవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక వోటును మళ్ళించుకోవటానికి వీరికే ఎక్కువ అవకాశం వుంది. ‘ప్రభంజనం’ వున్న వారిపై ప్రభుత్వం పట్ల అసంతృప్తి వున్న వారు చూసే అవకాశం వుంది. వీరి తర్వాతనే ఈ అవకాశం తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అయితే ఎన్నికలు వచ్చేసరికి గాలులు మారవచ్చు. వోడలు బళ్ళవ్వవచ్చు. బళ్ళు వోడలు కావచ్చు.

అధికారాలున్న వారు వరాలు ఇవ్వగలరు. పథకాలపేరు మీద అధికారికంగా ప్రజలకు ‘నగదు బదలీ’లూ చెయ్యగలరు. ‘పనికి(లేని పనిని కల్పించి కూడా) ఆహారాన్ని’ సరఫరా చేయగలరు. ‘ఉపాధి’కి హామీగా పైసలు పంచగలరు. అయితే ‘వోట్లకు నోట్లు’ అనే దురాచారాన్ని అన్ని ముఖ్యమైన పార్టీలూ పాటిస్తాయనుకోండి. కానీ జనాకర్షక పథకాలు ద్వారా ప్రజల మనసుల్నీ, అంతిమంగా వోట్లనూ దోచుకునే సదవకాశాన్ని అధికారంలో వున్న ఏ పార్టీఅయినా వదలు కోదు. చూడబోతే కాంగ్రెస్‌ పార్టీ ఈ సారి ‘సంక్షేమ పథకాల్ని’ మాత్రమే నమ్ముకునే వీలున్నది. ప్రజల అవసరాల తీవ్రతలో ఈ మాత్రం ‘ఉపశమనం’ కూడా గొప్పగా కనిపించినా ఆశ్చర్య పోనవసరంలేదు.

ఎలా చూసినా-ఆవేశాలు, అవసరాలు, అధికారాలు- ఈ మూడూ ఆడే అటే రేపటి ఎన్నికల రాజకీయం కానున్నది.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 6-13 ఏప్రిల్ 2013 వ తేదీ సంచిక

1 comment for “మన రాజకీయం మూడు ముక్కల్లో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *