‘నానో’ అన్నాలేదు, ‘అమ్మో’ అన్నాలేదు.
మమత చేతికి బెంగాలు సరకారు వచ్చింది కానీ, గుజరాత్ పోయిన ‘కారు’ మాత్రం రాదు.
‘టాటా’ అన్నా లాభం లేదు. ‘బైబై’ అన్నా లాభం లేదు.
సింగూరు నుంచి టాటా పూర్తిగా బయిటక పోడు.
‘అన్నా’ అన్నా కుదరదు. ‘తండ్రీ’ అన్నా కుదరదు.
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మధ్యలో ముంచేసిన ములాయం సింగ్ ఉలకరు, పలరు.
నేడు సీత కష్టాలు సీతకున్నట్లు, మమత కష్టాలు మమత కొచ్చేసాయి. సంకీర్ణ రాజకీయాల్లో ‘అలకల’కు డిమాండ్ ఎక్కువే. అలకే ‘అందలమ’నుకున్నారు మమత. పూర్వం ఎన్డీయేలో వున్నప్పుడూ ఇదే వరస. ఇప్పుడు యూపీయేలో వున్నప్పుడూ అదే తంతు. కానీ అన్ని వేళలా ఈ తంతు పారదు.
‘నీకూ ప్రజాదరణ వుంది. నాకూ ప్రజాదరణ వుంది. ఇద్దరమూ కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాకుండా చేస్తే..? మధ్యంతరం తెచ్చేస్తే…? మనమే కేంద్ర సర్కారులో కీలకమయిపోతాం’
ఈ మాట ములాయంతో మమత చెప్పారో, మమతతో ములాయం చెప్పారో కానీ చెప్పేసుకున్నారు. వ్యూహానికి ఒప్పేసుకకున్నారు. కానీ ములాయం ములాయమే. ఒప్పందం నుంచి తప్పేసుకున్నారు. యుపియే అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వటానికి ‘చేతి’లో చెయ్యేసుకున్నారు. మమతే ఏకాకి అయిపోయారు. ఎలాంటి మమత? ఇస్తే ‘రైలు’ ఇవ్వండి లేకుంటే ఇంకేమీ తీసుకోను- అని కేబినెట్ పదవుల్లో మొండికేసిన మమత, తాను ముఖ్యమంత్రి అయ్యాక తనకు నచ్చిన ‘రైలు’ మంత్రినే నియమించుకున్న మమత, ఎగిసే పెట్రోధరను ఏదో మేరకు దింపించిన మమత- పాపం ఒంటరి.ఆమెను యుపియేతో ‘ఉంటే వుండొచ్చు. వెళ్ళతానంటే అడ్డు చెప్పం’ అని ఒక కాంగ్రెస్ సీనియర్ నేత అనే పరిస్థితి తెచ్చేసుకున్నారు. పాపం, ఈ స్థితిలోనే ‘టాటా’ను సాగనంపి రైతుల భూమిని రైతుల కివ్వాలని తలపట్టిన ‘సింగూరు’ చట్టానికి హైకోర్టులో చుక్కెదురయింది. కమ్యూనిస్టులను కూల్చి బెంగాల్ సర్కారును దక్కించుకున్న ఆనందాన్ని ఆమె పాపం ఏడాది గడిచినా పొందలేక పోతున్నారు.
ఇది బెంగాలీ రాజకీయ చిత్రం. దీనిని తెలుగులో ‘రీమేక్’ చేస్తే ‘మెగా’ రాజకీయ చిత్రమవుతుంది. జనం కాక పోయినా మీడియా జనం ఎగబడి చూస్తారు.
అనగనగా ‘చిరు’పతి. క్షమించాలి అక్కడే చిరు పరపతి పోయింది కాబట్టి, అలా పిలవాల్సి వస్తోంది. ‘చిరు’పతి పోతేనేం? ‘పుర’ పతి దక్కింది కదా- అంటున్నారు ‘మెగా’ స్టార్ చిరంజీవి. ఇలా అనటంలో ఒక పాయింటు ఉంది. ఇప్పుడు ఆయన రెండు ‘పురా’లకు అధిపతి. ఒకటి: రామచంద్రా’పురం’. మరొకటి: నర్సాపురం. దాంతో ‘పుర’ంజీవి గా మారిన ఈ ‘చిర’ంజీవి ఇప్పుడు మమతనే ఆదర్శంగా తీసుకున్నారు.
కానీ మమత తన పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ను కాంగ్రెస్‌లో కలప లేదు. చిరంజీవి అలా కాదు. కాంగ్రెస్‌లో ఎగబడి, కాంగ్రెస్ నేతల వెంటబడి మరీ తన పార్టీ ‘ప్రజారాజ్యాన్ని’ విలీనం చేశారు.
అయినా సరే, ఆయన తన పార్టీ తన పార్టీలాగే వుందనుకుంటారు. తనది సంకీర్ణంలో బాగస్వామ్య పక్షమనుకుంటారు. అందుకే ‘మరి మాకేమిటి?’ అంటుంటారు.
ఆ మధ్య కిరణ్‌కుమార్ సర్కారు మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, (కొన్ని సాంకేతిక కారణాల వల్ల విలీన ప్రక్రియ అప్పటికి సంపూర్ణం కాలేదు.) ‘మమ్మల్ని గడ్డిపోచల కన్నా హీనం గా చూస్తున్నారు’ అని తమ అనుచరులంటున్నారన్నారు. ఇలా వీలయినప్పుడల్లా ‘అలకా’స్త్రాన్ని వాడుతున్నారు. ఫలితంగా తన తరఫున ఇద్దరికి మంత్రి పదవులు, కొన్ని నామినేటెడ్ పోస్టులూ పొందారు.. ఇప్పుడు ఏకంగా తానే శాసనసభ్యుడు కాస్తా రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వటమే తరువాయి. ఇప్పుడు మళ్ళీ కినుక.
పోయిన ‘చిరు’ పతి నాది కాదు, గెలిచిన ‘పుర’ పతి నాది- అని.
అంటే కాంగ్రెస్‌కు దక్కిన రెండు సీట్లూ, తన పీఆర్పీ నుంచి వచ్చిన వారివని సారాంశం.
తాను స్వయంగా ఖాళీ చేసిన సీటును గెలిపించుకోలేని నేత ఇలా మారాం చేస్తే ఏమవుతుంది.
రేపు మమతను అన్నట్లే- ‘ఉంటే వుండొచ్చు. వెళ్తానంటే వెళ్ళొచ్చు.’ అని అంటే ఏమవుతుంది.
ఎటు వెళ్తారు? వెంట ఎవరొస్తారు?
రాష్ట్రంలో సర్కారుకు వెంటనే వచ్చే ముప్పేమీ లేదు. కారణం ఇక్కడ కాంగ్రెస్ మనుగడకు కారణం -నమ్మకమయిన మిత్రులు కాదు, నమ్మకమయిన శత్రువులు.
ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఇప్పట్లో మధ్యంతర ఎన్నికలు అవసరం లేదు. కాబట్టి కాంగ్రెస్ సర్కారు కాళ్ళ కింద తివాచీ లాగలేదు. చిరంజీవికి లాగేటంత శక్తి లేదు.
చిత్రమేమిటంటే, ఇక్కడే కాదు, కేంద్రంలో కూడా శత్రువే శ్రీరామ రక్ష అవుతోంది.
యుపీయే రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని గెలిపించుకోవటంలో నమ్మకమయిన శత్రువుల తోడ్పాటే నేడు కీలకమయింది. బీఎస్సీ అధినాయకురాలు మాయావతీ, శివసేన అధినేత బాల్ థాకరేలు ఎవరు? నమ్మకమయిన శత్రువులు కారా?
అందుచేత బెంగాలీ ‘మమత’ చిత్రానికి ఎలాంటి ముగింపు ఇవ్వవచ్చో, తెలుగు ‘మెగా’ చిత్రానికీ అదే ముగింపు ఇవ్వవచ్చు.
మళ్లీ ఇంత కొత్త రాజకీయాల్లోనూ పాత నీతే – బలహీనుడయిన మిత్రుడి కన్నా, నమ్మకస్తుడయిన శత్రువు మేలు.
– సతీష్ చందర్