మిరపా..! మిరపా..! ఎందుకు ‘మండా’వ్‌?

మండే మిరప తెగ పండింది. పండగే అనుకున్నాడు రైతు. కొనే వాడొచ్చాక కానీ,తెలియ లేదు.. మిరప అంటే పంట కాదు… మంట.. అని. అమ్మాలని వస్తే, తెగనమ్మాల్సి వచ్చింది. క్వింటల్‌కు కనీసం రు.12,000 వస్తాయనుకున్నాడు. మరీ మూడు వేలకు అమ్మమంటే, కడుపు మండి పోయింది. వంటల్లో మండాల్సిన పంట, నిప్పుల్లో మండింది. ఇది ఖమ్మం ఘటన. తెలంగాణ సర్కారుకు కోపం వచ్చింది. రైతు అన్నవాడు తన చేతుల్తో పెంచిన పంటకు తనే ఎందుకు తగలబెట్టుకుంటాడూ… అని లాజిక్కు తీసింది. మార్కెట్టు యార్డులో ఈ ‘పని’ చేసిన వాళ్ళను.. చూస్తే వాళ్ళు రైతుల్లా లేరని అనుమాన పడింది… ఇంకాస్త ముందు కెళ్ళి ప్రతిపక్షాలే ఈ పనులు చేశారని ఆరోపించింది. అరెస్టులు చేసింది. కేసులు పెట్టింది.

ఈ వార్త మనకు కొత్త

నిజమే రైతే తన పంటను ధ్వంసం చేసుకున్నాడంటే నమ్మబుధ్ధి కాదు. తనను తాను ధ్వంసం చేసుకుంటే మాత్రం సర్కారు చచ్చినట్టు నమ్ముతుంది. ఒక్క సర్కారేమి ఖర్మ.. సమాజమూ నమ్మేస్తుంది. పొరపాటున ఏ పోటీ పరీక్షలోనో ‘రైతు ప్రధాన వృత్తి ఏమిటి?’ అనే ప్రశ్న వస్తే, ‘వ్యవసాయం చెయ్యటం’ అని అభ్యర్థులు రాస్తారనుకుంటున్నారా… ! కాదు. కాదు. ‘ఆత్మహత్య చేసుకోవటం’ అని రాసేస్తారు. గత పాతికేళ్ళుగా అంత సర్వసాధారణమయి పోయాయి ఆత్మహత్యలు. రైతు ఆత్మహత్య అసలు ముఖ్యవార్త కానే కాదు. టీవీల్లో అయితే ‘ఇలా చూసేలోగా అలా వెళ్ళిపోయే స్క్రోలింగ్‌ వార్త’కు దిగజారి పోయింది. పత్రికల్లో అయితే ‘ఇది అన్ని జిల్లాల్లోనూ జరిగేదే’ అన్న తరహాలో, రాష్ట్రమంతటా వచ్చే ‘తల్లి పత్రిక'(మెయిన్‌ ఎడిషన్‌)లో కాకుండా, ఏ జిల్లాకు ఆ జిల్లాగా వచ్చే ‘పిల్ల పత్రిక'(టాబ్లాయిడ్‌)లో వస్తుంది. (తెలంగాణ రైతు చనిపోతే, ఒక్క జిల్లాలో తప్ప మిగిలిన 30 జిల్లాల్లోనూ తెలియదు.) ప్రచురించే వారికి ఇంకా చికాకు వస్తే వచ్చిన ఒక్క జిల్లాలోనూ, జిల్లా మొత్తం కాకుండా ఒక ‘జోన్‌’లో వుండిపోవచ్చు.

మిగిలిన రైతులాగా తన్ను తాను ఆహుతి చేసుకోకుండా, మిర్చి రైతును పంటను ఆహుతి చేసుకోవటం ఆశ్చర్యమయి పోయింది; ప్రపంచంలో ఎనిమిదో వింతయి పోయింది; బుల్లి తెర భగభగ లాగిపోయింది. (రైతు తనంత తాను నిప్పు పెట్టాడా? ప్రతిపక్షాలు అగ్గి పెట్టెలు సాయం చేస్తే నిప్పు పెట్టాడా? లేదా రైతుకు డూపొచ్చి నిప్పు పెట్టాడా?… అన్నవి కూడా మాధ్యమాలకు.. ప్రత్యేకించి స్థానిక మాధ్యమాలకు వార్తలయి పోయాయి.)

అనుమానం ‘మండి’ పోనూ…

రైతు పంట ‘మండించాడో’ లేదో తెలీదు కానీ, ‘పండించాడన్న’ది వాస్తవం కదా! యార్డుకు తెచ్చాడన్నదీ వాస్తవం. పండగకోరోజు, ప్లీనరీకో రోజు, బహిరంగ సభకో రోజు.. పేరు మీద ఖమ్మం మార్కెట్‌ యార్డులో వారంలో రెండు మూడు రోజులే యార్డు తెరిచారన్నదీ వాస్తవం. కంపెనీలవారూ, వారి మధ్య వర్తులూ.. రేటును రు.3 వేలు, రు.2 వేలు వరకూ దించేశారన్నదీ వాస్తవం. ‘మండించిన’ రైతు మీద సర్కారు కు అనుమానం వుంటే వుండవచ్చు; ‘పండించిన’ రైతు మీద వుండకూడదు కదా! వారిని ఎలా ఆదుకోవాలన్నది చూడాలి కదా!

రైతులు తమ పంటను తమ చేతుల్తో తామే ధ్వంసం చేసుకోవటం దేశంలో ఇది కొత్త కాదు. కొన్ని సార్లు నిరసనతో చేస్తే, ఇంకొన్ని సార్లు గత్యంతరం లేక చేశారు. ఒక సారి ఇలాగే టొమాటో రైతులు విరగపండించేస్తే, మార్కెట్టు దారుణంగా పడిపోయింది. యార్డులకు తీసుకువెళ్ళే స్థితి కూడా లేదు. పండిన భూముల్లోనే వుండి పోయింది. ‘మార్కెటు యార్డుకు కాకుండా, చెత్త వేసే డంపింగ్‌ యార్డుకు కూడా పంటను పంపలేని పరిస్థితి వుందంటూ’ రైతులు సర్కారుకు విన్నవించుకున్నారు. పంటను పారబోసుకునే ఖర్చుకూడా లేదు కాబట్టి, ఆ మేరకన్నా సాయం చేయమని వేడుకున్నారు.

అనగనగా ఒక టొమాటో..

ప్రపంచీకరణతో రైతే మార్కెట్టు ను శాసిస్తాడని పాతికేళ్ళ క్రితం పాలకులు ఆశచూపారు. కానీ ఎప్పుడూ అందుకు భిన్నంగానే జరిగింది. మార్కెట్టు నాడి ఎప్పుడూ రైతుకు దొరకటం లేదు. గత ఏడాది పాలకులతో పాటు అందరూ మిర్చి వెయ్యమని రైతును రెచ్చగొట్టేశారు. పత్తి వేసేవారు కూడా మిర్చికి మారారు. ఇలా రెచ్చగొట్టటానికి కారణం లేక పోలేదు. గత ఏడాదే మన దేశం నుంచి చైనాకు 15 శాతం అధికంగా మిర్చి ఎగుమతి అయ్యింది. క్వింటల్‌కు రు. 15 వేలు వచ్చాయి. ఈ ఏడాది ఎక్కువ గా వుంటుందని ఆశించారు. కానీ చైనాలో కూడా వర్షపాతం ఏ ఈ ఏడాది ఎక్కువ వుండటం వల్ల, అక్కడ పండిన మిర్చే వారికి ఎక్కువ య్యింది. దాంతో అనుకున్న డిమాండ్‌ లేదు.

దేశం మొత్తం మీదనే మూడు ( ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక) రాష్ట్రాలు మిర్చి పంటను అధికంగా పండిస్తాయి. గత ఏడాది కన్నా మన రెండు తెలుగు రాష్ట్రాలు 30 నుంచి 40 శాతం ఎక్కువగా పండించేశాయి. దీంతో ధరలు ఏకంగా 60 శాతం పడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ నాలుగు లక్షల రైతులు దెబ్బ తిన్నారు.

వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత మొత్తం కేంద్రానిదే కాదు; రాష్ట్ర ప్రభుత్వాలది కూడా. ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం కంటి తుడుపుగా అమ్మిన పంటకు క్వింటల్‌కు రు.1500 లు ఇస్తానని ప్రకటించింది. అదికూడా 20 క్వింటళ్ల వరకే. తెలంగాణ సర్కారు అది కూడా చెయ్యలేదు. కేంద్రం మాత్రం దిగివచ్చి క్వింటల్‌ కు రు.6,200లు ప్రకటించింది. సమస్య ముగిసినట్టు కాదు.

ఆ ఒక్కటీ చేస్తే చాలు..

ఒక సారి ఉల్లిగడ్డలు, ఇంకొక సారి ఆలుగడ్డలు- ఏదో ఒక పంట రైతును ఇలా దెబ్బ తీస్తూనే వుంది. పంట మారిస్తే, ఒక సారి కొంత మెరుగ్గా వున్నా, రెండో ఏడే రైతు చతికిల పడుతున్నాడు. ఇంకో పంటకు మళ్ళుతున్నాడు. అదీ అంతే. ఇప్పుడు మిర్చి రైతులు.. పత్తి, పసుపు పంటల వైపు చూస్తున్నారు. వాటికీ హామీలేదు. ఈ స్థితిలో ప్రభుత్వాలు రైతుకు చేయ్యగల గొప్ప మేలు ఒక్కటే ఒక్కటి: అబధ్ధాలు చెప్పకుండా వుండటం.

-సతీష్ చందర్

4మే,2017

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *