ముసుగు

పొద్దుకు మంచు మసుగు. పాలకు వెన్నముసుగు. సొంపుకు సిగ్గు ముసుగు. కన్నీటికి కవిత ముసుగు. మమతకూ మమతకూ మధ్యకూడా చిన్న తెరయినా  వుండాలి. కానీ వాణిజ్యానికి తెరలుండవు. బంధువు ఇంటికి వచ్చీ రాగానే, ‘మరి వెళ్ళేదెప్పడూ?‘ అని అడిగేది వాణిజ్యమే.  కాఫీ డేలో కాఫీ చల్లారే లోగా ‘ప్రేమించేస్కుంటే ఓపనయి పోద్దేమో ’అని ఇద్దరూ బిజినెస్ లైక్ గా లేచిపోతారు. సన్నటి తెరల్ని ఎవరో చించుకుంటూ వెళ్ళిపోతుంటే, మిగిలేది పచ్చితనమే.

మనిషికి ముసుగే

ముఖం.

 

లోన ఏడుపొస్తే

పైన నవ్వు ముసుగు.

ఈర్ష్య కాగిపోతున్నప్పుడు

ప్రేమ ముసుగు.
సూర్యుడికి ముసుగు

చంద్రుడు.

చూసి వెన్నెలని మురిసి పోతాం
నేరుగా చూస్తే మసయిపోమూ..?

ఈ ముఖమే లేక పోతే

మనిషి సాటి మనిషిని

చూసీ చూడగానే చస్తాడు-
ఎందుకంటే..

వెర్రి నవ్వు లాంటిది కాదు,

పుర్రె నవ్వు!!

సతీష్ చందర్

1 comment for “ముసుగు

Leave a Reply