బామ్మా? బొరుసా?
ఇలా పందెం కట్టటానికి రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా వీల్లేని పరిస్థితి వచ్చింది. అయితో బొమ్మో, బొరుసో కాకుండా, నాణానికి మూడో వైపు చూడాల్సి వస్తోంది. యూపీయే, ఎన్డీయేలు కాకుండా ఇంకో కొత్త కూటమి తన్నుకు వచ్చేటట్టుగా వుంది. ఈ అవకాశాన్ని డి.ఎం.కె నేత కరుణానిధి సుగమమం చేశారు. యూపీయే అదమరచి వుండగా, దాని కాళ్ళ కింద తివాచీని అమాంతం లాగేశారు. దాంతో యూపీయే సర్కారు మనుగడ వెలుపలి శక్తుల మీద ఆధారపడింది. ఆ శక్తులు యూపీయేకి విశ్వసనీయ మిత్రులూ కారు, శాశ్వత శత్రువులూ కారు. వారే బీఎస్సీ, ఎస్సీలు. ఈ రెండు పార్టీల నేతల( మాయావతి, ములాయం) మధ్యా పచ్చగడ్డే కాదు, ఏ గడ్డి వేసినా భగ్గుమంటుంది. ఇద్దరూ చిన్నవాళ్ళూ కారు. అలాగే ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారూ కారు. ఇద్దరిదీ ఒకే రాష్ట్రం. పేరుకు రాష్ట్రంకానీ, అది దేశంతో సమానం. అందుకే రాజనీతిజ్ఞులు ఆ రాష్ట్రాన్ని ‘మినీ భారతం’ అంటారు. అసలు పేరు ఉత్తర ప్రదేశ్. ఈ రాష్ట్రంలో పేరు మోసిన రెండు జాతీయ పార్టీలూ( కాంగ్రెస్, బీజేపీలు) సహాయ పాత్రలు వేస్తాయి కానీ, ప్రధాన భూమికల్ని పోషించలేవు. ఒక రకంగా బీఎస్పీ, ఎస్పీ లు పంట కోసుకుపోతే, వెనక వచ్చి పరిగె ఏరుకుంటాయి.
ఇప్పుడు ఈ స్థితి దేశంలో వచ్చింది. యూపీయే-2 సర్కారు మిగిలిన ఒక్క ఏడాది మన గలగాలంటే, ఈ ఇద్దరి మీదా ఆధారపడి వుంటుంది. ఎవరు పక్కకు తప్పుకున్నా, కేంద్రం కుప్ప కూలిపోతుంది. ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయి. అయితే ములాయం, మయావతిల మధ్య స్నేహం చిగురించదు కదా! ఎలా మరి? ముందస్తు ఎన్నికలంటే ఇద్దరికీ ఒకే స్థాయి భయం వుండాలి. కానీ అలా లేదు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నిన్న కాక మొన్న జరిగినట్లున్నాయి. యువత ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్‌ను చూసి వోట్లు వేసారన్న ప్రచారం విస్తృతంగా వుంది. దాంతో ములాయం జాతీయ రాజకీయాల మీద కన్నేసి ప్రధాని కలలు కంటూ వున్నారు. మాయావతి ఈ ఎన్నికలలో వోటమి పాలయ్యారు కాబట్టి, రాష్ట్రంలో ప్రజల మద్దతు వెంటనే ఎస్పీనుంచి, బీఎస్పీ వవైపు వస్తుందని వస్తుందని ఆశించలేరు. అందుచేత పార్లమెంటు ఎన్నికలు వెంటనే రావాలని కోరుకోరు. కాబట్టి అంతిమంగా ములాయం సింగ్ చేతుల్లోకే యూపీయే సర్కారు భవిష్యత్తు వెళ్ళిపోయింది. అందుకే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సైతం ములాయంకు కోపం రాకుండా చూసుకునే బాధ్యత చేపట్టాల్సి వచ్చింది. ఈ సారి ఏ కేంద్ర మంత్రి అయినా, ఏ నిర్ణయం తీసుకొంటే సోనియా గాంధీ ఏమనుకుంటారో అన్న భయం అవసరం లేదు. ఏ వ్యాఖ్య చేస్తే ములాయం సింగ్ కు కోపం వస్తుందో- అని వణికి చావాల్సి వుంటుంది. లేదంటే, ముందస్తు ఎన్నికలకు సిధ్ధం కావాల్సి వుంటుంది.
నిజానికి ఇలాంటి సన్నివేశం కోసమే ప్రధాన ప్రతిపక్షమైన బిజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎదురు చూడాలి. కానీ మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ముందస్తు ఎన్నికలకు ఎలా విముఖంగా వుందో( అందుకే అవిశ్వాస తీర్మానాన్ని బలపరచ లేదు.), అలా బీజేపీ కూడా వెనకాడుతూనే వుంది. ఒక గుజరాత్‌ను నమూనా గా చూపించి, దేశంలో అధికారంలోకి ఇప్పటికిప్పుడు రావచ్చనే భరోసా ఆ పార్టీకి వున్నట్టు లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిని ప్రధాని అభ్యర్థిగా చూపించటంల వల్ల లాభం ఎంత వుందో, నష్టం కూడా అంతే వుందని కూడా తేలిపోయింది. ఎన్డీయేకు వున్న భాగస్వామ్య పక్షాలే అంతంత మాత్రం. కారణం హిందూత్వ ఎజెండా. ఈ ఎజెండాను స్వీకరించాలంటే, ఆయా పార్టీలకున్న ఇతర వర్గాల( ఎస్సీ, మైనారిటీ తదితరుల) వోట్లు కోల్పోవాల్సి వుంటుంది. అందుకని చటుక్కున ఎవరో కానీ ముందు కారు. అలా వచ్చిన వారిలో అత్యంత విశ్వసనీయమైన భాగస్వామ్య పక్షం జనతాదళ్(యూ). నరేంద్ర మోడీ ఎలా ‘అజేయుడు’గా వరుసగా ముఖ్యమంత్రిగా వస్తున్నారో, అలాగే బీహార్‌లో జెడి(యూ) తరపున నితిష్ కుమార్ గెలుపొందుతూ వస్తున్నారు. అలాంటి నితిష్ గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రచారానికి ‘మోడీని మాత్రం పంప వద్దు’ అని బీజేపీకి నిస్సంకోచంగా చెప్పారు. అలాగే కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించి, తనపార్టీకీ, బీజేపీకీ ‘కాపురం చెడింద’ని చెప్పకనే చెప్పారు. ‘బీజేపీయేతర, కాంగ్రెస్ వ్యతిరేక కూటమి’ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని కుండ బద్దలు కొట్టి చెప్పేశారు. ఈ స్థితిలో ‘సామాజిక న్యాయం, సెక్యులరిజం’ ప్రాతిపదిక మీద, మూడో ఫ్రంట్ ను ఏర్పాటు చెయ్యటానికి ఎవ్వరు ముందుకొచ్చినా, ములాయం ఆహ్వాసం పలికే అవకాశం వుంది. చూడబోతే నెలల క్రితం బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ చెప్పిన జోస్యమే నిజమయ్యేటట్టు వుంది. ఇటు యూపీయే, అటు ఎన్డీయే కాక, కొత్త కూటమి ముందుకు వచ్చే అవకాశముందన్నారు. మొత్తానికి ముందస్తు ఎన్నికలంటూ వస్తే, వాటికి ముహూర్తం పెట్టేది ములాయమే.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంద్ర వార పత్రికలో 23-29 మార్చి2013 వ సంచికలోప్రచురితం)