‘మెగా’శాంతి!

కేరికేచర్:బలరాం

పేరు : విజయ శాంతి

దరఖాస్తు చేయు ఉద్యోగం: రాములమ్మ-2 ( ఏం ‘బాహుబలి-2 సినిమా వస్తే చూడలేదా? తెలుగు తెర మీద వున్న ఏకైక ‘లేడీ హీరో’ని ‘సీక్వెల్‌’ రాజకీయాల్లో ఇస్తున్నా. చూడలేరా..?)

వయసు : ‘ఫైట్స్‌’ చేసే వయసే. వృధ్ద హీరోలు ఎడమ చేత్తో లారీలనూ, ట్రాక్టర్లను ఎత్తేసినప్పుడు ఈ సందేహం రాదు. స్త్రీల దగ్గరకు వచ్చేసరికి ఈ సమస్య వస్తుందా..? రాజకీయాల్లో ‘ఫైట్స్‌’కి వయసుతో పనిలేదు. అనుమానం వున్నవాళ్ళకి బ్రిటన్‌ తీసుకు వెళ్ళి ‘ఎలిజబెత్‌ రాణి’ దర్శనం ఇప్పించాలి. అప్పుడామెను ‘మీ వయసెంత?’ అని అడుగుతారో, లేదో చూద్దాం.

ముద్దు పేర్లు :‘తల్లి తెలంగాణ’ ( ఇది ఒకప్పటి నా పార్టీ పేరు). ఆ తర్వాత ‘తెలంగాణ తల్లి’ అందరికీ గుర్తొచ్చింది. ‘మెగా’ నాయిక (రాజకీయాల్లో మెగా స్టార్‌కూ పోలికలున్నాయి. ఆయన పార్టీ పెట్టారు. తర్వాత ఇంకో పార్టీలో కలిపారు. నేనూ అంతే కదా! ఇప్పుడూ ఇద్దరమూ ఒకే కాంగ్రెస్‌లో వున్నామనుకోండి. అది వేరే విషయం.

విద్యార్హతలు : ఈ ప్రశ్న పవన్‌ కల్యాణ్‌కి వేస్తారా? చదువుల్లో ఇద్దరమూ ఒకటే. యూనివర్శిటీల వరకూ పోలేదు. కానీ రాజకీయాల్లో మాత్రం బాలుడు. ఎందుకంటే నేను పొలిటకల్‌ ఎంట్రీ ఇచ్చే 20 ఏళ్ళయ్యింది. అందుకే చెబుతున్నాను: ఆంధ్రలో ఇంకాస్త చదువుకుని అప్పుడు తెలంగాణకు రమ్మని. నేనలాగే చెన్నయి నుంచి వచ్చాను

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్‌ పక్క సీటు నాదే. తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ లో ఒక్కటే పెద్ద కుర్చీ వుంచారు. అది ఆయనదే.

రెండు: మీరు పొరపాటున ‘విజయశాంతీ!’ అని పిలిచారనుకోండి. నేను పలకను. ‘రాములమ్మా’ అన్నారనుకోండి. తుపాకి పట్టుకుని మీ చెంతనుంటాను. అదీ మన ఫేమ్‌.

సిధ్ధాంతం : ‘గాలి వాదాలు’ (నాకు తెలుగు పెద్దగా రాదు కానీ, ‘పవన’ం అంటే ‘గాలి’ అని చెప్పారెవరో..!?) నాకు తెలియవు. ఏ పార్టీలో వుంటే ఆ వాదమే నాది. ఇది కూడా ‘గాలి వాటు వాదమేమో’ మరి!

వృత్తి : పోరాటమే.. ఇంటా-బయిటా. ( అంటే పార్టీలోనూ.. వెలుపలా.. అని)

హాబీలు :1. ఒక ఏడాది క్రియాశీలంగా వుండటం, మూడేళ్ళు అజ్ఞాతం లో వుండటం. (పవన్‌ సినిమాల్లో అజ్ఞాత వాసి అయితే, నేను రాజకీయాల్లో అజ్ఞాత వాసిని. రాజకీయాల్లో ఫ్లాప్‌లు వుండవు లెండి.

2. ‘త్రిశూలాలిచ్చి శాంతిని పరిరక్షించటం.'( భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలకి అజ్మీర్‌లో త్రిశూల్‌ దీక్ష చేపట్టి అరెస్టయ్యాను లెండి.

అనుభవం : పార్టీల రంగుల వేరు కానీ, ‘పురుష నేతల’ రంగంతా ఒక్కటే.

మిత్రులు : ‘చెయ్యి’ చాచిన వారే ‘చెయ్యి’ ఇచ్చారు. అలాగని ‘చేతి’ ని వదల్లేం కదా!

శత్రువులు : ‘యాచకుడికి యాచకుడే శత్రువు’. ‘తారకు తారే శత్రువు’. అందుకనే ముల్లును ముల్లుతోనే తీసినట్లు ‘తార’ను ‘తార’తోనే తియ్యాలనుకుంటోంది మా పార్టీ. (ఆరకంగా పవన్‌ తెలంగాణ కొచ్చి నాకు మేలు చేశాడు.)

మిత్రశత్రువులు : మహిళ నేతకు ప్రతీ పురుష నేతా మిత్ర శత్రువే. గ్రేడింగుల్లోనే తేడా.

వేదాంతం : ప్రచారం చేస్తే పోయేదేమీ లేదు.. గొంతు తప్ప. అందుకనే పోటీకి బదులు ప్రచారానికి ఒప్పుకున్నా.

జీవిత ధ్యేయం : తెలంగాణకు తొలి మహిళా ముఖ్యమంత్రినయి, ఒక పురుషుడు లేకుండా మంత్రి వర్గాన్ని ఏర్పాటు చెయ్యాలని. ( ఇందుకు కేసీఆరే నాకు స్ఫూర్తి.)

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర దినపత్రికలో ప్రచురితం)

1 comment for “‘మెగా’శాంతి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *