‘మెగా’హీరో- గిగా జీరో!!

కేరికేచర్: బలరాం

కేరికేచర్: బలరాం

పేరు : చిరంజీవి

దరఖాస్తు చేయు ఉద్యోగం: వర్థమాన తెలుగు హీరో( ఎంత మెగా స్టార్‌నయినా మళ్ళీ సినిమా కేరీర్‌ను మొదలు పెడుతున్నాను కదా! మధ్యలో అయిదేళ్ళు ‘కమర్షియల్‌’ సారీ.. ‘పొలిటికల్‌’ బ్రేక్‌ ఇచ్చాను కదా)

ముద్దు పేర్లు : మెగా హీరో (సినిమాల్లో), గిగా జీరో (రాజకీయాల్లో) 2014 ఎన్నికల్లో నేను ప్రచార సారథ్యం వహించినా కాంగ్రెస్‌కు ఒక్క స్థానమూ దక్కలేదు.

విద్యార్హతలు : ఏం చదివితే ఏం? వోటర్ల మనసుల్ని చదవటం రాలేదే…! ప్రేక్షకుల మనసులయితే ఒక సినిమాకి కాకపోయినా మరొక సినిమాకయినా అర్థమవుతాయి. ఇక్కడ ఆ అవకాశమే లేదు.

హోదాలు : రాజ్యము పోవచ్చు. కానీ రాజ్యసభ వుంది కదా! కొన్నాళ్ళు ‘పెద్దరికం’ మిగులుతుందిలే.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: పవన్‌ కల్యాణ్‌ అన్నయ్యను. (నిన్న మొన్నటిటి వరకూ సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా పవన్‌నే చిరంజీవి తమ్ముడిగా చూసేవారు. అవి ముఠామేస్త్రి రోజులు, ప్రజారాజ్యం రోజులు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఇవి గబ్బర్‌సింగ్‌ రోజులు, ఇంకా గట్టిగా మాట్లాడితే ‘జనసేన’ రోజులు.

రెండు: రామ్‌ చరణ్‌ నాన్నను, అల్లు అర్జున్‌ మామయ్యను. ( ఈ గుర్తింపు అంతా నా 150వ చిత్రంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ వచ్చేటంత వరకే.)

సిధ్ధాంతం : నేను ఎవరి ‘చెయ్యి’ నయినా అందుకేవాలే (మనం ఇతరులకు ‘చెయ్యి’ ఇవ్వటం ఎలాగూ లేదనుకోండి. గానీ విజయంలోనే కాదు, ఓటమిలో కూడా వదలి పెట్టను. అందుకే కదా- సీమాంధ్రలో కాంగ్రెస్‌ ఓడి పోతుందని తెలిసి కూడా వదల్లేదు.

వృత్తి : నటనే. కానీ అందరికీ అన్ని నప్పవు. ‘పౌరాణికాల్లో’ అక్కినేని ఎలాగో, ‘రాజకీయాల్లో’ నేను అలాగే. అక్కడ మనల్ని మించిన మహానటులున్నారు. అంతలోనే పొగడగలరు; ఇది మన వల్ల అవుతుందా..?

హబీలు :1. అప్పుడప్పుడూ మేకప్‌ లేకుండా బయిటకు రావటం.

2. ఎప్పుడయినా స్ప్రిప్టు లేకుండా డైలాగులు చెప్పటం.

(ఈ రెండూరాజకీయాల్లోకి వచ్చాకనే అలవర్చుకున్నాను.)

అనుభవం : ముఖ్యమంత్రి పాత్ర వెయ్యటానికి ఒక సినిమా చాలు. అందుకోసం ఓ పార్టీ పెట్టి, ఊరూరా తిరిగి, గొంతు చించుకుని ప్రచారం చేసి, అన్ని స్థానాల్లో పోటీ చేసి, అతి కొద్ది స్థానాల్లో గెలిచి, మళ్ళీ కలపటానికి ఓ పెద్ద పార్టీని చూసుకుని… ఇదంతా అవసరమంటారా…!?

మిత్రులు : ఇప్పుడు అర్థమయి పోయింది. రాజకీయాల్లో అనుచరులు వున్నారు; సినిమాల్లో అనుయాయులు వున్నారు.కానీ అనుచరులే అసలు మిత్రులు.

శత్రువులు :ఏమో! ఏ పుట్టలో ఏ పాములున్నాయో…! ఏ క్యూలో ఏ శత్రువులున్నారో…! నేను 2014 సార్వత్రిక ఎన్నికలప్పుడు హైదరాబాద్‌లో వోటు వేద్దామని క్యూలో నిలబడ్డానా..? మధ్యలో అనుమానం వచ్చి అసలు మన పేరు లిస్టులో వుందా? లేదా అని లోపలికి వెళ్తుంటే, క్యూలో వున్న వ్యక్తి నన్ను ఆపేశాడు. పైపెచ్చు -నేనే కాదు, తాను కూడా ‘సెలిబ్రిటీ’ అంటాడు. ంనయం. ‘లెజెండ్‌’ అనలేదు. కొత్త వివాదాలు వచ్చి పడేవి.

మిత్రశత్రువులు : రాజకీయాల్లో మనల్ని పొగడే ప్రతి వాడు మిత్రశత్రువే. సినిమాలే నయం. మనల్ని పాడు చెయ్యాలని కేవలం శత్రువులే పొగడుతారు

వేదాంతం : తమ్ముడు తమ్ముడే… వోట్లాట, వోట్లాటే…!

జీవిత ధ్యేయం : నా 200 చిత్రంలో నటించటానికి ముందు, ప్రజారాజ్యంలాగే ఒక పార్టీని పెట్టాలని. అదికూడా ప్రాంతీయ స్థాయిలో కాకుండా, జాతీయ స్థాయిలో పెట్టాలని. అప్పుడు అవసరం అనుకుంటే ఏదయినా ప్రాంతీయ పార్టీ చూసుకుని అందులో విలీనం చేసివెయ్యొచ్చు.

-సర్‌

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 6-13 జూన్ 2014 సంచికలోప్రచురితం)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *