‘మోడ్వా’నీ

Caricature:Sekhar

Caricature:Sekhar

పేరు :లాల్‌ కృష్ణ అద్వానీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: లేదు. పోస్టు భర్తీ చేయబడినది. నా కన్నా చిన్నవాడయిన నరేంద్రమోడీతో ఆ ఖాళీని(బీజేపీ 2014 ఎన్నికల ప్రధాని అభ్యర్థిని) పూరించారు. ఇప్పుడు అద్వానీ అన్నది పేరు కాదు, చరిత్రలో పోస్టుగా కూడా మిగులుతుంది. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్న ఆనందంతో ‘కృష్ణా! రామా!’ అంటూ గడిపేస్తున్నాను.

ముద్దు పేర్లు :‘మోడ్వా’నీ ( మోడీ యే ప్రధాని గా బాగుంటాడని ఒప్పేసుకున్నానులెండి.)’రథ్వా’నీ( రథయాత్రల్లో మన రికార్డు ఎవరికీలేదు లెండి. నేను రథమెక్కేవరకూ రథమంటే ఆరు చక్రాలూ, పన్నెండు గుర్రాలూ అని భావించేవారు. నేను యాత్రలు మొదలు పెట్టాక రథమంటే నిర్వచనం మారిపోయింది. నాలుగు చక్రాల ఎసీ వ్యానూ, ఒక ఇంజనూ, పైకి మాత్రం పాతకాలం రథంలా వుంటుంది.) ‘యుధ్వా’నీ (‘కరసేవకు’లకు సేనాధిపతిని నేనే. కానీ బాబ్రీ విధ్వంసం నాకు సంబంధం లేదు.) ఇప్పుడు మాత్రం అందరూ నన్ను ‘వృధ్వా’నీ అని పిలుస్తున్నారు. ( ఇంకో తెల్ల జుత్తు యువకుడు, నరేంద్రమోడీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చాక నేను వృధ్ధుణ్ణయిపోయాను.)

విద్యార్హతలు : మాస్టర్‌ ఆఫ్‌ మిస్‌ఫార్ట్యూన్స్‌. (అవును. అదృష్టం వరించేలోగా, దురదృష్టం- ‘నిను వదలని నీడను నేనే’ అంటూ వచ్చేస్తుంది. జనసంఘ్‌కు తిరుగులేని నేతగా ఎదిగే సమయం వచ్చేసరికి, దానిని రద్దు చేసి జనతా పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత బీజేపీని ‘హిందూత్వ’తో పెంచి, అధికారంలోకి తెచ్చేసరి, ఆ ‘హిందూత్వే’ మిత్రులకు అడ్డొచ్చింది. అప్పుడు ‘సెక్యులర్‌’ గా కనిపించే వాజ్‌ పేయీని ఎంచుకున్నారు. తీరా నన్ను ‘ప్రధాని మంత్రి అభ్యర్థి(2009)గా ప్రకటించేసరికి, బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. ఎప్పుడు బీజేపీకి మళ్లీ మంచి రోజులొచ్చాయి. కానీ
మోడీ వచ్చేశారు.

హోదాలు : ఒకే ఒక్క హోదా. బీజేపీలో ఎంత పెద్దనేతయినా కాళ్ళ మీద పడితే దీవించే హోదా! ( ఆమధ్య మోడీపాదాభివందనం చేస్తే, నేను ఆశీస్సు ఇవ్వలేదు. కానీ తర్వాత ఇవ్వక తప్పక లేదు. కనీసం పెద్దరికమయినా నిలుపుకోవాలి కదా!)

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: కట్టని రామమందిరం

రెండు: కూర్చోని ప్రధాని సింహాసనం.

సిధ్ధాంతం : అదే అర్థం కావటం లేదు. నేను ఎవరి పక్కన నిలబడ్డా ‘హిందూత్వ’ వాదిలాగా కనపడతాను. కానీ అదేమిటో మోడీ పక్కన వున్నప్పుడు మాత్రం ‘సెక్యులరిస్టు’ లా కనిపిస్తాను. ( ఒక గీతను చిన్నబుచ్చాలంటే, దాని పక్కన మరో పెద్ద గీతను గీయాలి. అదే మా పార్టీ చేసింది.)

వృత్తి : ‘జన్మభూమి’ పరిరక్షణ.( నా జన్మభూమి కాదండోయ్‌.’రామజన్మభూమి’. నా జన్మభూమి (కరాచీ) పాకిస్తాన్‌ లో వుండిపోయింది. కడకు నేను చదివిన స్కూలూ, కాలేజీ కూడా పాకిస్తాన్‌ లోనే వుండిపోయాయి. నేను ఎంత ‘హిందూత్వ’ వాదినయినా, పాకిస్తాన్‌ వెళ్ళితే మనసు ఉప్పొంగి
పోతోంది. ఒక సారి ఇలాగే అక్కడ పాకిస్తాన్‌ పితామహుడు మహ్మద్‌ ఆలీ జిన్నా సమాధి ముందు నిలుచున్నాను. ఆనందం తన్నుకొచ్చింది. అంతే ‘ఆలీని సెక్యులర్‌ వాది’ గా కీర్తించాను. ఆ తర్వాత బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చెయ్యాల్సి వచ్చిందనుకోండి. అది వేరే విషయం.

హబీలు :1. లేఖా రచన. ( రాజీనామా లేఖలూ, అసమ్మతి లేఖలూతరచు రాస్తుంటాను. ఈ మధ్య నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కూడా మా పార్టీ నాయకత్వానికి ఓ లేఖ రాశాను.)

2. యాత్రలు చెయ్యటం.( అవేలెండి.రథయాత్రలు.)

అనుభవం : అదే కొంప ముంచింది. మాంచి వయసులో వున్నప్పుడు అనుభవం లేదన్నారు.అనుభవం ఎక్కువ అయ్యాక వయసు లేదంటున్నారు. అందుకే ఇష్ట పదవి ఒక్క మెట్టులోనే జారిపోతోంది. ( కడకు మాజీ ఉపప్రధానిగానే మిగిలిపోయాను.)

మిత్రులు : తరాలు మారిపోయాయి. మిత్రులెక్కడవుంటారు. ఉంటే మనుమలుంటారు. లేదామోడీ లాంటి శిష్యులుంటారు. కానీ వారి ‘గురు దక్షిణ’ ఇవ్వటం మాని, ‘శిష్య దక్షిణ’ అడుగుతున్నారు. తప్పుతుందా? ఇచ్చేశాను. ప్రధాని పదవికి పోటీ పడకుండా, దక్షిణగా ఇచ్చేశాను.

శత్రువులు : పగ తీర్చుకునే వయసు కానప్పుడు, శత్రువులను సైతం అనుయాయులుగామార్చుకోవటం మంచిది.

మిత్రశత్రువులు : ఎప్పుడూ మా పార్టీలో నా వెన్నంటే వున్నారు. ఉంటారు కూడా.

వేదాంతం : ‘నువ్వు ఎక్కవలసిన సీటు, ఒక జీవిత కాలం లేటు’.

జీవిత ధ్యేయం : ఒక అబధ్ధం చెబుతున్నాను. ఏమీ అనుకోకండి. ప్రధానిగా నరేంద్రమోడీ ఎర్రకోటబురుజుల మీద నుంచి ప్రసంగిస్తుండగా, కింద కూర్చుని చప్పట్లు కొట్టటం!!

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 18-24 అక్టోబరు 2013 వ సంచికలో ప్రచురితం)

2 comments for “‘మోడ్వా’నీ

Leave a Reply