దరఖాస్తు చేయు ఉద్యోగం: క్రియాశీల రాష్ట్రపతి( కలామ్, ప్రతిభాపాటిళ్ళు ‘నామమాత్రపు’ రాష్ట్రపతుల్లాగానే వున్నారు.) రాష్ట్రపతి పదవి వచ్చింది కానీ, తర్వాత మెట్టు ఇదే.
ముద్దు పేర్లు : ‘దా’.. ‘దాదా’.. ‘రణ’బ్ ముఖర్జీ( రణం చేస్తాను కానీ, రాజీ పడి, ‘రబ్బర్ స్టాంపు’ గా మారి ‘ప్రణబ్బర్’ ముఖర్జీ అని పించుకోను.)
విద్యార్హతలు : మాస్టర్ ఇన్ ట్రబుల్ షూటింగ్( కాంగ్రెస్ గడ్డుకాలంలో వున్నప్పుడెల్లా గట్టెక్కించే వాడిని.. ఆ పార్టీ గడ్డుకాలంలో లేనిదెప్పుడు లెండి!)
హోదాలు : ‘ప్రప్రథమ’ పౌరుడు( ఉత్త ప్రథమ పౌరుడి పాత్రను నా ముందు కొందరు వెలగ బెట్టారు లెండి) ‘త్రివిథ దళాధిపతి’ ( ఈ పోస్టు నాకు కొత్తది కానీ, బాధ్యత పాతదే. దేశానికి సైనిక, నౌకా, వాయుదళాలున్నట్లే, కాంగ్రెస్‌లో కూడా మూడేసి గ్రూపులండేవి. వాటిని సమన్వయ పరచిని అనుభవం వుంది.)
గుర్తింపు చిహ్నాలు :ఒకటి: నేను చిన్నగా కనిపిస్తాను. కానీ ఆలోచనలు పెద్దవి. దేశమంటేనే కాదు, రాస్ట్రమన్నా ‘పెద్ద’గా ఊహించుకుంటాను. (ఈ కారణంగానే కొందరు నేను ‘చిన్న’ రాష్ట్రాలకు వ్యతిరేకమని ప్రచారం చేస్తారు.
రెండు: నేను రాష్ట్రపతి కాకముందే,పార్టీలకు అతీతుణ్ణి. లేక పోతే, యుపియే వెలుపల ఉన్న వారు (జెడియూ, శివసేనలు) నాకే ఎందుకు మద్దతు ఇస్తాయి.
సిధ్ధాంతం : అందనిది ఆశించటం, అందినది పుచ్చుకోవటం. (నేను ప్రధానిని కావాలని కోరుకున్నానని కొందరంటారు. కానీ అది అందుతుందా? రాష్ట్రపతి పదవినిచ్చారు. పుచ్చేసుకున్నాను.)
వృత్తి : ఎదురు చూడటం. ఎప్పటినుంచీ..? ఇందిరాగాంధీ హయాం నుంచీ. అప్పట్లో మంత్రిని. రాజీవ్ గాంధీ హయాంలోనూ మంత్రినే. కానీ రాజీవ్ మరణానంతరం నన్ను కాదని పీవీకి ప్రధాని పదవి నిచ్చారు. ఆ తర్వాత మన్‌మోహన్ అయ్యారు. ఆయన నే ఆర్థిక మంత్రిగా వుండగా ఆర్బీఐ గవర్నర్ గా చేసిన వాడు. కానీ ఇప్పుడూ ఆయన ప్రధానే. కానీ హోదాలో రాష్ట్రపతే ఎక్కువ. ఎదురు చూపునకు ఫలితం ఇలానే వుంటుంది.
హబీలు :1. రాష్ట్రపతి ఆయ్యాక రాజకీయ బాధ్యతలను పక్కన పెట్టి స్కూళ్ళల్లోకి వెళ్ళి పాఠాలు చెప్పటం, శంకుస్థాపలకూ, బహుమతీప్రదానాలకే పరిమతమయ్యి, ‘హోల్‌సేల్’గా మరణశిక్ష పడ్డవారికీ, మృతి చెందిన వారికీ క్షమా భిక్ష పెట్టటమూ- ఇలాంటి హాబీలేమీ లేవు.
2. ‘వీలుచిక్కినప్పుడెల్లా, బెంగాల్‌లో మా కుటుంబ సభ్యులతోనూ, గ్రామస్తులతోనూ కలవటం.( ఈ భక్తి ముదిరి మొత్తం బెంగాల్‌కే మేళ్ళు చేస్తానని భయపడాల్సిన పనిలేదు.)
అనుభవం : అపారం. కానీ ఎన్నికల బరిలోకి దిగి ‘అమీ తుమీ’ తేల్చుకునే ‘మాస్ పాలిటిక్స్’ కాదు. మనదంతా క్లాస్. అందుకే దిగువ సభ కన్నా, ఎగువ(పెద్దల) సభ ద్వారానే ఎక్కువ సార్లు.పదవుల్లోకి వచ్చాను.
మిత్రులు : ఒకప్పుడు యుపీయే వెలుపలే ఎక్కువ మంది మిత్రులుండేవారు. ఇప్పుడు ఇక పార్టీ వ్యక్తిని కాదు కాబట్టి అందరూ మిత్రులే.
శత్రువులు : ఆ ‘చిదంబర’ రహస్యాన్ని. నా నోటితో చెప్పించకండి.
మిత్రశత్రువులు : బెంగాల్‌లో కమ్యూనిస్టులు. వారే లేకుంటే మమతా లేరు. నేనూ లేను. వారిమీద విరక్తితోనే బెంగాల్ ప్రజలు మా వైపు చూశారు.
వేదాంతం : ఒక్కసారి రాష్ట్రపతి అయ్యాక, ఎన్నికయిన పార్టీకే కాదు, వచ్చిన కుటుంబానికి కూడా అతీతంగా ఉండాలి. నేను ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం నుంచి నా తనయుడు అభిజిత్ ముఖర్జీని నిలబెడతానంటున్నారు. నేను అనవసరంగా అడ్డుపడటం జోక్యం కలిగించుకోవటం కదా! అందుకే మిన్నకుంటాను.
జీవిత ధ్యేయం : రాష్ట్రపతిగా రిటైరయ్యాక, ఆర్ వెంకట్రామన్ రాసిన ‘మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ కన్నా సంచలనాత్మక మైన పుస్తకాన్ని వెలువరించటం.
-సతీష్ చందర్
27-7-12