‘రథ్వా’నీ – ‘యుధ్ధ్వా’నీ- ‘వృధ్ధ్వా’నీ!!

కేరికేచర్: బలరాం

కేరికేచర్: బలరాం

పేరు : లాల్‌ కృష్ణ అద్వానీ

ముద్దు పేరు : ”రథ్వా’నీ(మందిర నిర్మాణం కోసం రథ యాత్ర చేసినప్పుడు),
‘యుధ్వా’నీ( కార్గిల్‌ వద్ద పాకిస్థాన్‌తో యుధ్ధం చేసినప్పుడు) ‘వృధ్ధ్వా’నీ( ఎనభయ్యదేళ్ళ
వయస్సులో నేను ప్రధాని పదవి అర్హుణ్ణి కానని, నరేంద్ర మోడీని ముందుకు తెస్తున్నప్పుడు).
అయినా కానీ ఎప్పటికయినా నేను ‘ప్రధ్వా’నీనే( ప్రధాని కావాలన్న కోరికను నానుంచి ఎవరూ
దూరం చేయలేరు.)

విద్యార్హతలు : బి.హెచ్‌.( బ్యాచిలర్‌ ఆఫ్‌ హిందూత్వ). కానీ మోడీ నాకన్నా
‘రెండాకులు’ (పోనీ, రెండు ‘పువ్వులు’. మా పార్టీ గుర్తు ‘కమలం’ కదా!) ఎక్కువ చదివాడని
అంటున్నారు. ఆ లెక్కన ఆయన ఎం.హెచ్‌( మాస్టర్‌ ఆఫ్‌ హిందూత్వ) చదివి వుండాలి. అందుకే
‘అద్వానీ ముదిరితే మోడీ అవుతారు’ అంటారు.( తొండ ముదిరితే ఊసరవెల్లి- అన్న సామెత
గుర్తుకు తెచ్చుకోవాల్సిన పని లేదు లెండి.)

హోదాలు :అక్కడే కదా- పేచీ..! ‘నేత’ హోదాను కోరుకుంటుంటే నాకు ‘తాత’
హోదా ఇచ్చి మూలన కూర్చోబెట్టమంటున్నారు.

గుర్తింపు చిహ్నాలు : ఒకటి: ఈ తరానికి గుర్తుండక పోవచ్చుకానీ, ఆర్కే. లక్ష్మణ్‌ గీసే
కార్టూన్లలో ‘కామన్‌ మ్యాన్‌’ను పోలి వుంటానని, ఒక్క మా పార్టీ వాళ్ళ తప్ప, అందరూ అంటూ
వుండే వారు. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెచ్చిన నేను ‘అన్‌ కామన్‌ మాన్‌'(
అసాధారణ వ్యక్తి)నే కదా! కానీ ఇప్పుడు వాళ్ళు కూడా నన్ను ‘కామన్‌ మ్యాన్‌’ లాగే చూసి పక్కన
పెడుతున్నారు.

రెండు: నేనెప్పుడూ ‘రాజీనామా’లతోనే వార్తల కెక్కుతుంటాను. 2005లో పాకిస్తాన్‌ వెళ్ళినప్పుడు
జిన్నాను పొగిడానని నా చేత పార్టీ అధ్యక్షపదవి ‘బలవంతాన’ ‘రాజీనామా’ చేయించారు. ఇప్పుడు
నా అంతట, పార్టీలోని అన్ని పదవులకూ రాజీనామా చేస్తే, ఉపసంహరించుకోవటానికి ‘బలవంతాన’
ఒప్పించారు. ఎవరూ బలవంత పెట్టిందీ- అంటే ఏమి చెబుతాం? కాంగ్రెస్‌కు ‘అధిష్టానం’ వునట్టే,
మాకూ ఓ ‘అదృశ్వ’ శక్తి వుంటుంది.(ఆరె.ఎస్‌.ఎస్‌- అని మీరు అనుకుంటే, నేనేమీ చెప్పాలేను.)

అనుభవం : ఇన్ని దశాబ్దాల నా రాజకీయానుభవంలో నాకు నా ముఖమే
నాకు అచ్చిరాదని తేలిపోయింది. అయోధ్య ఉద్యమాన్ని తెచ్చి, పార్టీతో ‘సంకీర్ణ ప్రభుత్వాన్ని’
ఏర్పాటు చేస్తున్నప్పుడు అందుకు నా ‘ముఖం’ పనికిరాదన్నారు. అప్పుడు ‘సెక్యులర్‌ ముఖం’
అవసరమయ్యింది లెండి. అందుకు వాజేపేయీజీ ముఖం సరిపోయింది. ఇప్పుడు మళ్ళా ప్రధాని
అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నప్పుడు నాకు ‘హిందూత్వ ముఖం’ లేదంటున్నారు. అది కేవలం
మోడీకి మాత్రమే వుందిట. నాది ఇప్పుడు ‘సెక్యులర్‌ ముఖం’ లా మారిపోయిందని దూరం
పెడుతున్నారు.

వేదాంతం : అలిగేది ఎవరూ? అడిగేది ఎవరూ? అలిగినంత మాత్రాన కోపం
తీరుతుందా? అడిగినంత మాత్రాన కోరింది దక్కుతుందా? అంతా ‘భగవత్‌’ సంకల్పమే!!( ఆరెస్సెస్‌
అధినేత మోహన్‌ భగవత్‌ జీ పేరు మీకు గుర్తు కొస్తే ఆ నేరం నాది కాదు.)

వృత్తి : ‘కృష్ణా! రామా!’ అనుకునే వృత్తిని నేను
చేపట్టాలన్నది మోడీ ‘అనుయాయుల’ సంకల్పం.

హాబీలు :1. యుధ్ధం చేస్తున్నప్పుడు కృష్ణుడిలా రథం నడపటం, సరిగ్గా
రాజ్యం వచ్చేసరికి భీష్ముడిలా అంపశయ్య ఎక్కటం.

2. పిట్ట కథలు చెప్పటం. ఈ మధ్య ‘నా బ్లాగ్‌’ లో ఓ పిట్ట కథ చెప్పాను. చదవలేదా? యూదులను
ఊచకోత కోసిన నరహంతకుడు హిట్లర్‌ తాను నరకానికి వెళ్తానన్న భయంతో, తన గురించి పోప్‌కు
శిఫారసు చేయమని మరో నియంత ముస్సోలిని ని కోరతాడు. ( మన దేశంలోని ఏదైనా రాష్ట్రంలో
ఇలా వేరే మత విశ్వాసం కలవారిని ఊచ కోత కోసిన నియంత ఎవరయినా వుండి వుంటే, ఈ పిట్ట
కథ వారిని ఉద్దేశించి కాదని, నా మనవి.)

నచ్చని విషయం :”బాబ్రీ విధ్వంసం’ గొప్పదా? ‘గుజరాత్‌ అల్లర్లు’ గొప్పవా? దేశంలో
మరీ నిష్పాక్షికంగా వుండే న్యాయ నిర్ణేతలు కరువయ్యారు.

మిత్రులు : ఆరెస్సెస్‌లో ‘భగవత్‌’ సమానులుంటారు, బీజేపీలో
వారసులుంటారు, ఒక్క ఎన్డీయేలోనే మిత్రులుంటారు. (ఉదాహరణకి జెడి-యూ వారు)

శత్రువులు :నేను శత్రుత్వం పెట్టుకోదగ్గ వయసున్నవారు పార్టీలో ఎవరూ లేరు.
కాకుంటే నేను ‘ఈర్ష్య’ పడగలిగే వారు వుంటే వుండవచ్చు.

జపించే మంత్రం : అయోధ్య ఉద్యమం అప్పుడు ‘జైశ్రీరామ్‌’ అన్నాను. రాజీనామా చేసినప్పుడు
‘రామ్‌ రామ్‌’ అన్నాను. ఇప్పుడు ‘అయ్యో! రామా!’ అంటున్నాను. నాకంతా ‘రామ’ మయమే.

విలాసం : ఈ మధ్య నా ఇంటి అడ్రసు ఎవరికీ చెప్పటం లేదు. మరీ
ముఖ్యంగా మా పార్టీ వారికి చెప్పటంలేదు. లేకుంటే నా ఇంటి దగ్గరకు వచ్చి ‘మోడీ’ అనుకూల
నినాదాలు ఇచ్చి వెళ్తున్నారు.

గురువు : అయ్యో! రాత! నేనే గురువుని. నా నుదుటి మీద
‘పంగనామాలు’ కనిపించటం లేదా?

జీవిత ధ్యేయం : ఒక్క రోజయినా వార్తల్లో ‘ప్రదాని అద్వానీ’ అని నా పేరును
చదివించుకోవాలని.
-సతీష్ చందర్ 

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 14-20 జూన్ 2013 సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *