ఒక చారిత్రక సన్నివేశం. ఓ ఉద్విగ్న సందర్భం కూడా. సీమాంధ్ర ప్రజల సుధీర్ఘ స్వప్నానికి ఓ దృశ్యరూపం గా అమరావతిలో చట్ట సభలు కొలువు తీరాయి.
ఒక రాజధాని వెంట ఒక ప్రజాసమూహం దశాబ్దాలు తరబడి వెంటపడటం అరుదయిన పరిణామం. అది సీమాంధ్ర ప్రజలకే చెల్లింది. ఒక రాష్ట్రం కోసం వెంపర్లాడటం వేరు. ఒక రాజధానికోసం ఆరాటపడటం వేరు. రాష్ట్రమూ, రాజధానీ ఒకటి కావా? ఎవరిని అడిగినా ఒకటే- అని చెబుతారేమో కానీ, సీమాంధ్ర ప్రజలు మాత్రం చెప్పరు. వారికెప్పుడూ రెండూ ‘ప్యాకేజీ’గా రాలేదు. మద్రాసు రాష్ట్రంలోనూ (అంతకు ముందు ప్రెసిడెన్సీలోనూ) భాగంగా వున్న సీమాంధ్రులు తమకు వేరు రాష్ట్రమే కావాలని పోరు చేశారు. పొట్టి శ్రీరాములు ప్రాణాలే వదిలారు. కానీ కేవలం రాష్ట్రమే వచ్చింది. రాజధాని(మద్రాసు) అక్కడే వుండి పోయింది. తర్వాత కర్నూలు సొంతంగా ఒక రాజధానిని నిర్మించుకుందామనుకునే సరికి, ఆంధ్రరాష్ట్రాన్ని తెలంగాణలో కలిపేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని అయ్యింది. ‘ఉమ్మడి’ నుంచి ‘ప్రత్యేకానికీ’ మళ్లీ ‘ప్రత్యేకం నుంచి ఉమ్మడికీ’, తర్వాత ‘ఉమ్మడి’నుంచి ఇప్పుడు ‘ప్రత్యేకానికీ’- ఇలా శతాబ్దంలోపుగా ఇన్ని మార్పులకు లోనయిన సీమాంధ్రులకు మాత్రమే తెలుస్తుంది ‘రాజధాని’ని కోల్పోయిన వెలితి ఎలా వుంటుందో..! తమిళులతో కలిసి ఒక సారీ, విడిపోయి ఒక సారీ, తెలంగాణ వారితో కలిసి ఒక సారీ, విడిపోయి ఒక సారీ.. ఒక సమూహం ‘సామాజికార్థిక భౌగోళిక ఒడిదుడుకులు’ ఎదుర్కున్న వారికే తెలుస్తుంది. తాము విడిపోవాలనుకున్నప్పుడు విడగొట్టి వున్నా, తాము కలవాలనుకున్నప్పుడు కలిపి వున్నా.. పరిస్థితి వేరుగా వుంటుంది. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవటం మినహా, మిగిలిన ఏ ఒక్క మార్పూ వీరు కోరిక మేరకు గానీ, కోరుకున్నప్పుడు కానీ జరగలేదు.
రాజధాని కోల్పోతే ఏమవుతుంది? రాష్ట్రప్రజలందరూ రాజధానిలో నివసించరు కదా! రాజధానిలో వుండేది అసెంబ్లీ, సచివాలయం, హెకోర్టు- అంతకు మించి ఏమిటి? వీటితో సాధారణ పౌరులకు రోజువారీ పనులేముంటాయి? ఎక్కడికక్కడ జిల్లా, మండల యంత్రాంగాలుంటుండగా రాజధాని వల్ల వచ్చేదేముంటుంది? ఈ ప్రశ్నలు తలయెత్తుతుంటాయి. ఇది ఈ నాటి మాట. ఒక్క సారి స్వరాజ్యం వచ్చిన తర్వాత… అంటే యాభయ్యవ దశకం దగ్గరనుంచి తొంభయ్యవ దశకం వరకూ గణిస్తే, రాజధాని పాత్ర అర్థమవుతుంది. రాజధాని అంటే పరిశ్రమ;అప్పుడు రాజధాని అంటే ఉపాధి; రాజధాని అంటే విద్య; రాజధాని అంటే సంస్కృతి, రాజధాని అంటే గౌరవం. ఈ మాటలు ఇప్పుడు డొల్ల మాటల్లా వినపడవచ్చు. కానీ అప్పుడు మాత్రం అవే అర్థాలు. ఆంధ్రలో వున్న వ్యవసాయ మిగులును తీసుకువెళ్ళి మద్రాసు సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టారు. సర్కారీ కొలువులన్నీ మద్రాసులోనే చేశారు. అంతెందుకు కళాశాల విద్య దాటి చదవాలంటే, విశ్వవిద్యాలయాలకు మద్రాసు తరలిపోవాల్సిందే. ( ఈ నిరసనలోంచే కదా- ఆంధ్రా యూనివర్శిటీ ఆవిర్భవించిందీ..!) మద్రాసులో భాగంగా వున్నంత కాలం, ఆంధ్రుల సంస్కృతికి దేశంలో ప్రత్యేక గుర్తింపు లేదు. సీమాంధ్రుల్నెవరయినా ‘మదరాసీ’ల గానే పరిచయం చేసేవారు. రాజధానిని పోగొట్టుకోవటమంటే, వీటన్నింటినీ పోగొట్టుకోవటమే. వీటిలో ఏ ఒక్కటీ ఒక్క రోజులో వచ్చేవి కావు. ఏళ్ళ పాటు కూడ బెట్టుకోవాలి. ఒక ఆర్థిక వర్గం వల్లో, ఒక సామాజిక వర్గం వల్లో సాధ్యమయ్యేది కూడా కాదు. అలాగే అన్ని ప్రాంతాలనుంచి వచ్చిన ప్రతిభ, శ్రమ కూడగట్టితే ఒక్క రాజధానికి చేరుతుంది. వీటన్నిటినీ ఎక్కడివక్కడ వుంచే వెనక్కి వచ్చేయటమంటే, మళ్ళీ సున్నా నుంచి మొదలు పెట్టటమే.
పొట్టి శ్రీరాములు నేతృత్వంలో జరిగిన ఉద్యమం ఒక్కటే రాష్ట్రం కోసం జరిగింది. కానీ తర్వాత 1972 లో జరిగిన ‘ప్రత్యేక ఆంధ్రోద్యమం’ కానీ, 2010 తర్వాత జరిగి సమైక్యాంధ్రోద్యమం కానీ, పేరుకు మాత్రమే రాష్ట్రోద్యమాలు కానీ, సారంలో మాత్ర ‘రాజధాని ఉద్యమాలే’. రాజధానిగా వున్న హైదరాబాద్‌లో ‘ముల్కి నిబంధనలు'( స్థానికులూ, స్థానికేతరులు అన్న నిబంధనలు) చెల్ల్లుతాయని అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించగానే, సొంత రాష్ట్ర రాజధానిలో ‘ఆంధ్రులు స్థానికేతరులు’ అవుతారన్న భావన.. ఆంధ్రుల్లో ఆగ్రహం రప్పించింది. అలాంటి ‘రాజధాని’లో తామెందుకు వుండాలని సీమాంధ్రలో పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చారు. కారణం రాజధాని అంటే ఉపాధి; ప్రభుత్వ ఉపాధి. ప్రభుత్వరంగ ఉద్యోగాల వరకూ హైదరాబాద్‌లో ‘నాన్ లోకల్’ అనగానే విద్యార్థులకు తమ కాలి కింద నేల తరిగిపోయినంత పనయ్యింది.
తెలంగాణ ఏర్పాటుకు ముందు నడిచిన ‘సమైక్యాంధ్రోద్యమం’ లోని ఆత్మకూడా రాజధాని. కలిసి వుంటే, హైదరాబాద్‌కు తాము కూడా చెందివుంటామని సీమాంధ్ర ప్రజలు భావించారు. ఎందుకు కారణం. 1972 తర్వాత వచ్చిన భరోసాలూ, ‘ఫ్రీజోన్’ విధానాలూ, ఇతర కారణాల వల్ల, హైదరాబాద్ తెలంగాణ ప్రజలతో పాటు, తమకు కూడా సొంత రాజధాని అన్న హామీ సీమాంధ్రులకు దక్కినట్టయియంది. ఫలితంగా నే తామంతా ‘తెలుగు వారమనే’ భావన ఏర్పడింది. తెలంగాణ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి అంజయ్యను అప్పటి జాతీయ నేతలు చిన్నబుచ్చటాన్ని ‘తెలుగు వాడిని’ చిన్న బుచ్చినట్టే భావించారు. ఈ ‘తెలుగువాడి ఆత్మగౌరవం’ నుంచే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చెయ్యటం, చెన్నై నుంచి హైదరాబాద్‌కు సినీపరిశ్రమ రప్పించారు. తొంభయ్యవ దశకం తర్వాత ఐటీ రంగం కూడా హైదరాబాద్‌లో స్థిరపడింది. దీంతో కొద్ది పాటి చదువు వున్న వారు కూడా హైదరాబాద్‌లో స్థిరపడటం మొదలు పెట్టారు. అన్ని రాజకీయ పార్టీలూ ఒక పక్క రాష్ట్ర విభజనకు సూత్ర ప్రాయంగా అంగీకరిస్తూనే, సీమాంధ్రప్రజలకు రాష్ట్రం విడిపోదని (హైదరాబాద్ తమది కాకుండా పోదని) చిట్ట చివరి వరకూ చెబుతూ వుండటం వల్ల, రాష్ట్ర విభజన అటు తెలంగాణ ప్రజల కల ఫలించినట్లయినా, ఇటు సీమాంధ్ర ప్రజలు మాత్రం తమ నెత్తిమీద పిడుగు పడ్డట్టు భావించారు.
అందుకే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధానే సమస్తంగా మారింది. అక్కడ తొట్టతొలి సారిగా అసెంబ్లీ భవనాలు నిర్మించుకుని, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారంటే.. ఒక ప్రారంభంగా ప్రజలు చూస్తారు. తమ గడ్డ మీద తాము చట్టాలు చేసుకునే అవకాశం ఎన్నాళ్ళెకెన్నాళ్ళకు మళ్లీ వచ్చింది..! రాజకీయ పక్షాల మధ్య ఎన్ని విభేదాలున్నా, తొలినాటి సమావేశాలు హుందాగా జరగటం సీమాంధ్రులకు గర్వకారణం. కానీ రాజధాని అంటే ప్రజలు కేవలం కట్టడాలని మాత్రమే భావించరనీ, ఉపాధి, విద్య, పరిశ్రమ, సంస్కృతి, గౌరవం- ఇత్యాది అర్థాలను చూస్తారని గుర్తించి పాలక, విపక్షాలు వాటికోసం కృషి చెయ్యాలి; పోరాడాలి. అప్పుడే సీమాంధ్రుల ‘రాజధాని’ ఆకాంక్ష నె
రవేరుతుంది.
-సతీష్ చందర్