‘రాణి’నీతి లేదా?

నీతి! ఈ మాటను ఇలా ఒంటరిగా చూసి చాలాకాలమయింది.

మరో మాట తోడులేకుండా, ఈ మాట మనలేని స్థితి వచ్చేసింది. అయితే ముందు ‘అవి’ తగిలించి ‘అవినీతి’ అనో, లేక ‘రాజ’ను అతికించి ‘రాజనీతి’ అనో మరిపెంగా పిలుచుకుంటాం. ఈ రెంటికీ వున్న మార్కెట్‌ అంతా ఇంతా కాదు. రాను, రాను రెంటికీ ఒకే ‘అర్థం’ స్థిరపడిపోయింది. అది కూడా ‘అర్థమే’ (అర్థమే)

‘రాజనీతి’ అనే మాట విన్నప్పుడెల్లా, ఇలాంటిదే మరో నీతి వుండాలని అనుమానం పీడిస్తుంది. అదే ‘రాణి’నీతి. వినటానికి విడ్డూరంగా వుంటుంది కానీ, ‘రాజు’కు నీతి వున్నప్పుడు ‘రాణి’కంటూ ఒక నీతి వుండాలా లేదా?

జూదంలో తన్ను తాను ఓడిపోయినప్పుడు,తన భార్యను ఓడి పోవచ్చు. ఇది ‘రాజ’నీతి. (పోనీ, ‘ధర్మరాజ’నీతి.)

‘తన్నోడిన వాడు, నన్నెలా ఓడగలడు?’ అని ఆయన భార్య ప్రశ్నిస్తుంది. ఇది ‘రాణి’నీతి.

నీతికి ‘లింగ’ భేదముందని, భారతమే తేల్చి అవతల పారేసింది.

కానీ, ‘రాణి’నీతి ఇప్పుడూ బిల్లు వరకే వచ్చి ఆగిపోతుంది. ‘రాజ’నీతే చట్టమవుతుంది. నాటి ‘కురుసభ’లోనైనా, నేటి ‘చట్ట సభ’లోనైనా ఇదే తంతు. అరవయ్యారు కారణాలతో ముఫ్పయి మూడు శాతం కోటా బిల్లు బిల్లుగానే మిగిలిపోతుంది. ‘రాణి’నీతి ఓడి పోతుంది.

అప్పుడు రాణిని ‘కొప్పుపట్టి ఈడ్చుకు రమ్మని’ ధుర్యోధనుడు శాసిస్తే, దుశ్సాసనుడు అమలు చేస్తాడు. నిండు సభలో వలువలు వలుస్తారు. ఉత్త ‘నీతి’ని వల్లించే పెద్దలు అచేతనులయి చూస్తారు.

భారతం, భారతమే. ‘కళ్ళుమూసుకుని’ పాలించే పాలకులున్న చోట, దేశంలోని అంగుళం, అంగుళమూ కురుసభగానే మారిపోతుంది. అందాకా గువహతి(అసోం)లో ఒక ‘ఆరు బయిట’ (అదేలెండి ‘బారు బయిట’) నాలుగు రోజుల క్రితం ఈ కురుసభను నిర్వహించారు.

పాచికలాట బారు లోపల జరిగిపోయింది. అదో బర్డ్‌డే పార్టీ. ఆడకూతురు ఇచ్చిందే. అందరూ వచ్చినట్టే ముగ్గురు మగధీరుల్ని వెంట పెట్టుకుని ఆ పార్టీకి వచ్చింది. అందరూ తిన్నంత తిన్నారు. తాగినంత తాగారో లేదో తెలియుదు. (తాటి చెట్టుకింద నిలబడి పాలు తాగేవాళ్ళున్నట్టే, బారులోకి వెళ్ళి కూల్‌ డ్రింక్‌ తాగే వాళ్ళు కూడా వుండవచ్చు.) పార్టీ ముగిసింది. బిల్లు కట్టాలి. ‘సారీ! గీకే కార్డు ఎటిఎంలో మర్చి పోయానంది పార్టీ ఇచ్చిన ఆడ కూతరు.’ అంతే బారులో న్యాయ విచారణ మొదలయింది.(బార్‌ ఎట్‌ లా- అంటే ఇదే కాబోలు) కేకలూ, బొబ్బలూ నడుమ పార్టీకి పిలిచిన ఆడకూతురుతో పాటు అందరూ ‘జంప్‌ జిలానీ’లయ్యారు. ఇక పార్టీకొచ్చిన అమ్యాయిని మెడ పట్టి( అదే లెండి ‘కొప్పు పట్టి’) బయిటకు నెట్టేశారు. ఆమె వెంట వచ్చిన ముగ్గురు మగధీరులూ, పాండవుల్లా తలవంచుకుని నిలబడ్డా బాగుండేది. వాళ్లూ ఫలాయనం చిత్తగించారు. ఈ లోగా రోడ్డు మీద దృశ్యాన్ని చూస్తున్న ఇరవయమంది దుశ్సాననులు ఆమె మీద పడ్డారు. వలువలూడ్చారు. అంతవరకూ మాత్రమే కాదు అలనాడు దుశ్శాసనుడు చేయగలిగింది? కానీ వీళ్లు దుశ్సాసనుడికే అపకీర్తి తెచ్చిపెట్టేలా ఆమెను లైంగికంగా వేధించారు.

ఉత్త ‘నీతి’ని వల్లించే రోడ్లమీద పెద్దలంతా నిర్లజ్జగా ఈ సన్నివేశాన్ని చూశారు. ఈ పైశాచికత్వం అర్థగంట సాగింది. ‘వరల్డ్‌ వైడ్‌ వెబ్‌’ చలువ వల్ల ఈ వస్త్రాపహరణ సన్నివేశాన్ని ‘ఇంటర్నెట్‌’ ద్వారా ఇంటింటా వీక్షించారు. ‘అన్నా! రక్షించు’ అని పాపం ఆ పిచ్చితల్లి ఎన్ని సార్లు అరచిందో..? కృష్ణుడు ఖాకీ యూనిఫాంలోనైనా రాకపోతాడో అని ఎదురు చూసింది. జరిగాల్సిందంతా జరిగిపోయాక, ఖాకీ కృష్ణులు వచ్చారు.

‘ఇంత ఆలస్యంగానా రావటం?’ అని పొరపాటున ఎవరో అన్నారు. ‘పోలీసులంటే ఎటిఎమ్‌ సెంటర్లో వుండే నోట్లు కావు. ఇలా గీకగానే కరెన్సీ నోట్లు వచ్చేయటానికి’ అని సమాధానమిచ్చారు. (తర్వాత నాలుక్కరచు కున్నారనుకోండి. అది వేరే విషయం.)

ఇప్పుడు రాజ్యమేలిందంతా ‘రాజ’నీతే! ‘రాణి’ నీతి కాదు. ఈ ‘దుశ్వాసన పర్వం’ మీద మాట్లాడాల్సి వచ్చిందనుకోండి. అప్పుడు కూడా ‘రాజ’నీతి వచనాలే పలుకుతారు.

హవ్వ! ఆడ పిల్లలు బారు కెళ్ళ వచ్చా? బారుకు వెళ్ళాక ఇలా జరగమంటే జరగదా?

కరక్టే కదా! ‘స్త్రీలకు ప్రవేశం లేదు’ అన్ని ఏ బారు ముందూ వుండదు కానీ, అవన్నీ ‘మగ బార్‌ అండ్‌ రెస్టారెంట్లే’. ఇరానీ చాయ్‌ దొరికే చాలా హొటళ్ళలో స్త్రీలు కనబడరు. అలాగని స్త్రీలకు నిషిధ్దం కాదు.

వెనకటికి ఏదో ఊళ్ళో ‘మార్కెట్లో ఆడ పిల్లల్ని వేధిస్తున్నారంటే’ , ‘అసలు వాళ్ళని ఒంటరిగా మార్కెట్‌కు ఎవరు వెళ్ళ మన్నారు. ఏదయినా మగపురుగును తోడుగా పెట్టుకుని వెళ్ళవచ్చు కదా!’ అని అనటమే కాకుండా, ఆ మేరకు రూలింగ్‌ కూడా ఇచ్చేశారట.

గతంలో  మన రాష్ట్రంలోనే ఓ ‘పెద్ద పోలీసు’- ‘ఈవ్‌ టీజింగ్‌ జరగమంటే జరగదా? వాళ్ళు వేసుకుంటున్న ఆ డ్రస్సులేమిటి?’ అని మండి పడ్డారు. అంటే ‘ఇదొక ఆడవి. ఇక్కడ పులులు యధేఛ్చగా తిరుగుతాయి. లేళ్ళే తప్పించుకుని వెళ్ళాలి’ అని ‘రాజ’నీతి తేల్చేస్తోంది. ఇంకా స్త్రీల ముఖాలకు ముసుగులు వేయాలనో, కాళ్ళకు బేడీలు వేయాలనో చూడటం మినహా, మగ మానవ మృగాల కోరలు తీయాలనే యోచన చేయనీయదీ ‘రాజ’నీతి.

రాబీస్‌ వ్యాధి సోకిందని రాస్తే, రోడ్ల మీదకు ‘కుక్కల వ్యాన్‌’ వచ్చినంత వేగంగానయినా, ‘ఈవ్‌ టీజింగ్‌’ జరుగుతందన్నప్పుడు ‘పోలీస్‌ వ్యాన్‌’ రావటం లేదు. మీడియా వాళ్ళ ఓబీ వ్యాన్లు కూడా అంతే. ‘నలుగురూ చొంగ కార్చుకుని చూసే దృశ్యమందంటే వచ్చినంత వేగంగా, సమస్య వుందంటే రావు.’

ఈ గడ్డ మీద ‘రాణి’ నీతే వుండి వుంటే, ఆ ఇరవయి మంది దుశ్సాసనుల మీద ఆరవయి మంది ఆడ పోలీసులు దూకి, ఎముకలు ఏరి వేస్తుంటే, ఆ దృశ్యాన్ని ‘లైవ్‌’ చూపిస్తుంటే, అప్పుడు చూసేవాళ్ళు అరచే వారేమో – ‘ మగ మానవ హక్కుల్ని రక్షించండి’ అని.

అందుకే ‘నీతి’ నీతిలా వుండే రోజు రావాలి.

-సతీష్‌ చందర్‌

(ఆంద్ర భూమి దినపత్రిక 15-7-12 వ తేదీ సంచిక లో ప్రచురితమయింది.)

 

 

2 comments for “‘రాణి’నీతి లేదా?

  1. Hai Sir Chaala Baga Prachurincharu Sir Nijangane Chaduvthu untte chaala Bhadesindi Sir,
    ] Edi Chaala Dharunam……….
    Ee Sangatanani Chusinatlaite Manaki Nijangane Swatantram Raledhu
    Anna Apoha…… Telipothundi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *