రెండు రెళ్ళు ఒకటి.

                                                                                            అక్షరాలంటేనే కాదు, అంకెలన్నా పడి చచ్చే వాళ్ళుంటారు.

Photo By: Tim Green

అక్షరాల్లో ఏదో అక్షరం మీద వ్యామోహం పెంచుకోవటం సాధ్యపడదు. ‘అ’ మొదలు ‘బండి-ర’ వరకూ యాభయ్యారు అక్షరాలను ప్రేమిస్తారు.

కానీ అంకెలతో అలా కాదే.. ఏదో ఒక అంకెతో లింకు పెట్టుకోవాలి.

కొందరయితే ఆ అంకె అంకె కాదు. ‘లంకె’ అవుతుంది. కావాలంటే ఆర్టీయే అధికారుల్ని అడగండి. కార్లూ, బైకులూ రిజిస్టర్‌ చేసుకునేటప్పుడు, అంకెల మీద ఎంత తగలేస్తారో చెప్పలేరు. నాలుగు తొమ్మిదిలో, నాలుగు ఒకట్లో, నాలుగు రెళ్ళో- ఈ అంకెలున్న కార్లు మన పక్కనించి దూసుకుపోతుంటే అనిపిస్తుంది-ఇతడు కారు మీద కన్నా అంకెల మీద ఎక్కువ తగలేసినట్టున్నాడు-అని.

వెనకటికి ఓ ‘చోటా పాలిటిష్యన్‌’ వుండే వాడు.( మన రాజకీయ నాయకుల మీద ముచ్చటేసి, ఓ హిందీ మాటా, ఓ ఇంగ్లీషు మాటా కలిపి ‘హింగ్లీష్‌’ లో అలా పిలవాలనిపించింది.)

ఆయనకు మీసం మీద మీసం వుండేది. గీత పైన గీత గీస్తే (డబుల్‌ రూల్డ్‌) ఎలా వుంటుంది? అలా వుండేది. అలా కట్‌ చేసేవాడు. అంటే అందరికీ ఒక మీసం వుంటే, తనకు ‘రెండు’ మీసాలున్నాయని చెప్పుకోవటానికి. విషయం బోధపడే వుంటుంది. ఆయనకి ‘రెండు’ అంటే ప్రాణం.

‘రెండు’ తనకి కలసి వస్తుంది అనుకుంటాడు.

షాపుకు వెళ్ళి ఏం కొనాలన్నా రెండు కొనాల్సిందే. ఒకే రంగు చొక్కాలను రెండు కొంటాడు. కడకు చెప్పులు కొన్నా, రెండు జతలు కొంటాడు. ఒకటి కొంటే, అది గ్యారంటీగా పోతుందని ఆయనకి విశ్వాసం.

కడకు పార్టీలో కూడా ‘ఇస్తే జోడు పదవులు ఇవ్వండి. లేకుంటే మానేయ్యండి’ అని చెప్పేసేవాడు.

ఆయన పది వరకూ చదివాడు. కానీ పరీక్షలు రాయటం మానేశాడు. ఎందుకంటే హాల్‌ టికెట్‌ నెంబర్లో ‘రెండు’ లేదు. సరికదా, అన్ని అంకెల్ని కూడినా కూడా ‘రెండు’ రాలేదు. దాంతో పరీక్ష రాసినా తన్నటం గ్యారంటీ, అని తీర్మానించేసుకుని పరీక్షలు రాయటం మానేశాడు.

అయితే ఈ’చోటా పాలిటిష్యన్‌’కి జీవితంలో ఇంతకు మించిన విషమ పరీక్ష వచ్చింది. అదే పెళ్ళి. ‘రెండిళ్ళు’ పెట్టటం తప్పనిసరి అయిపోయింది. పురోహితుడు ఎంత చెప్పినా వినకుండా, ఇద్దరి పెళ్ళి కూతుళ్ళ మెడల్లోనూ మూడు ముళ్ళు కాకుండా ‘రెండేసి’ ముడులే వేశాడు.

అన్నీ సజావుగా జరిగిపోతే, హైదరాబాద్‌ వాసులంతా, కష్టపడి ‘రెండు’ ను ఇష్టసంఖ్యగా చేసుకోవాల్సి వుంటుంది.

అవును. వీరికీ ఇక మీదట రెండు ‘హౌస్‌’ లు వుంటాయి. అపార్థం చేసుకోకండి. ‘అసెంబ్లీ’ని కూడా ‘హౌస్‌’ అంటారు. తెలంగాణ కో అసెంబ్లీ, అవశేష ఆంధ్రప్రదేశ్‌ కో ఆసెంబ్లీ వుంటుంది.

‘కోర్ట్‌’ షిప్‌ లోనూ రెండు పండుతుంది. రెండేసి న్యాయస్థానాలు వుంటాయి. ఇక సచివాలయాలు సరేసరి.

అయితే ఈ ముచ్చట పదేళ్ళ వరకే.

ఈ ‘రెండు’ అన్నది సాధారణ పౌరులకు అసౌకర్యంగా వుండవచ్చు కానీ ‘బడా పాలిటిష్యన్ల’కి ( మళ్ళా ‘హింగ్లీష్‌’ తప్పలేదు.) సౌకర్యమే.

ముందు చెప్పుకున్న ‘చోటా పాలిటిష్యన్‌’కి అన్నీ ‘రెండేసి’ వుండేవి. కానీ ముఖం మాత్రం ఒక్కటే వుండేది. కానీ ‘బడా పాలిటిష్యన్‌’ లు అలా కాదు. వారికి అన్నీ ఒక్కొక్కటే వున్నా ముఖాలు మాత్రం రెండు వుంటాయి.

కాబట్టి వారు, రెండు సర్కారుల్లోనూ చెలామణీ అవుతారు. ఒక చోట సొంత పేరుతోనూ, మరో చోట ‘బినామీ’ పేరుతోనూ. రెండు సర్కారులూ రెండు ప్రాంతాల అభివృద్ధికీ, పునర్నిర్మాణానికీ ప్రాజెక్టులూ, కాంట్రాక్టులూ కోట్ల మొత్తంలో విడుదల చేస్తాయి.

రెండు ముఖాలున్నప్పుడు, రెండు నోళ్ళుంటాయని వేరే చెప్పనవసరం లేదు.

అన్ని కాంట్రాక్టులూ, ఇంతకు ముందు రాష్ట్రం ఒకటిగా వున్నప్పుడు ఎవరు తీసుకునే వారో, వారే తీసుకుంటారు.

ఇక రాజకీయ నాయకులకు ‘రెండు’ అనే పదం ఉపాధి విషయంలోనూ బాగా పనికి వస్తుంది. రాజకీయ పదవులు పెరుగుతాయి. ఇద్దరు ముఖ్యమంత్రులూ, రెండేసి కేబినెట్లూ, ఇక కార్పోరేషన్ల చైర్మన్ల లాంటి కార్పోరేట్‌ పదవులూ ఎన్ని పెరుగుతాయి. సూక్ష్మంగా చెప్పాలంటే ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని’ రాజకీయ నిరుద్యోగులకు వర్తింప చేస్తే ఎలా వుంటుందో, అలా వుంటుంది.

అయితే సాధారణ పౌరులకు కూడా ఈ ‘రెండు’ వల్ల ఉపాధి అవకాశాలు పెరుగతాయి కానీ, రాజకీయ ఉపాధి పెరిగనట్లు పెరగక పోవచ్చు.

కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు తీసుకున్నది బీదా బిక్కీ విద్యార్థులూ, నిరుద్యోగులే. అసలు సిసలైన ఈ నిరుద్యోగులకు ఉపాధి నివ్వకుండా, తమ రాజకీయ ఉపాధినే పరమావధిగా చూసుకుంటే, అదే విద్యార్థులు మళ్ళీ ‘రెండు’ ను ప్రేమించాల్సి వుంటుంది.

అంటే ‘రెండో’ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వుంటుంది.

‘త్యాగాలు మావి. ఉద్యోగాలు మీవా?’ అని రెండో ఉద్యమ నినాదాన్ని ఇవ్వాల్సి వుంటుంది.

చూశారా? ముల్లు ను ముల్లుతో తీసినట్లు, ‘రెండు’ ను ‘రెండు’తోనే భాగించాల్సి వుంటుంది.

పౌరులు ఎక్కడయినా ఒక్కరే నిరూపించాల్సి వుంటుంది.

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 7 డిశంబరు 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *