లీకు మేకయింది!

seemandhraలీకు! ఒక్క లీకు! ఒకే ఒక్క లీకు!

మొత్తం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్నే మార్చేసింది.

సినిమా విడుదల తేదీ: 28 జనవరి 2013( లేదా అంతకు ముందు.)

సినిమా పేరు: తెలంగాణ తేలిపోతుంది!

ఈ ముహూర్తం ఎలా నిర్ణయంచారు- అని పెద్దగా బుర్రలు బద్ధలు కొట్టుకోనవసరంలేదు. ఇది సెక్యులర్‌ ముహూర్తమే. 26 జనవరి రిపబ్లిక్‌డే. ఆరోజు శనివారం. 27 ఆదివారం. 28న పనిదినం. బహుశా రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్‌ డే కానుక ఇవ్వ బోతున్నారు.

ఆ కానుక ఏమిటి?

‘చేతి’ గుప్పెట్లో ఏమున్నదో, ‘చెయ్యి’ గలవారికే తెలుస్తుంది.

‘లీకు’ చేస్తే వారే చేయాలి. వారే చేశారు.

‘సంకేతాలు’ వచ్చేశాయని కాంగ్రెస్‌ వారే హడావిడి చేస్తున్నారు.

ఈ సంకేతాలు ఒకరికి ఖేదాన్నీ, ఇంకొకరికి మోదాన్నీ మిగిల్చాయి.

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎగిరి గెంతేస్తే, సీమాంద్ర నేతలు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.

ఈ ‘సంకేతాల్లో’ మూడే మూడు అంశాలున్నాయి:

ఒకటి: రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్రలకు విభజిస్తారు.

రెండు: హైదరాబాద్‌ ను తాత్కాలికంగా (పదేళ్ళ పాటు) ఉమ్మడి రాజధానిగా వుంచుతారు.

మూడు: ఆ తర్వాత హైదరాబాద్‌ను కేంద్రపాలిత రాష్ట్రంగా మారుస్తారు.

అయితే రాష్ట్ర విభజనకు సంబంధించిన ఇలాంటి ‘సంకేతాల’ను లీకు చేయటం ఇది మొదలు కాదు. ఒక నెలపాటు ఢిల్లీలోవున్నప్పుడు కేసీఆర్‌ తనకు కూడా రాష్ట్ర విభజనకు సంబంధించిన సంకేతాలు వున్నాయని కూడా అన్నారు. అయితే అప్పుడు కొందరే నమ్మారు. కానీ ఇప్పుడు ఈ సంకేతాలకు ‘విశ్వసనీయత’ పెరిగింది. అందుకు కారణాలు రెండు. ఒకటి: ఈ సంకేతాలు ముందు కాంగ్రెస్‌ వారికే రావటం. రెండు: స్వల్పవ్యత్యాసాలతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకూ, సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలకు ఒకే రకం సంకేతాలు రావటం.

ఇదే పరిష్కారమయితే, సీమాంధ్ర నేతలు ఇంతగా గుండెలు బాదుకోనవసరం లేదు. అలాగే తెలంగాణ నేతలు కూడా మరీ అంతగా ఉత్సాహ పడనవసరంలేదు.

కానీ, ఎందుకనో వీరి ‘విషాదోత్సాహాల్లో’ సహజత్వం లోపిస్తోంది. బహుశా అదే రాజకీయం కావచ్చు.

సీమాధ్రనేతలు చేస్తున్నది ‘సమైక్యాంధ్ర ఉద్యమం’ అయినా వారు చూస్తున్నది ‘హైదరాబాద్‌’ వైపే. తాము ‘పెంచి పోషించిన’ (వారలా భావిస్తారు.) హైదరాబాద్‌ తెలంగాణలో కలిసిపోతుందేమోనన్నదే వారి బాధ. లేకుంటే ఇక్కడ ప్రత్యేక తెలంగాణ నినాదం పుట్టినప్పుడు. ఎప్పటిలాగే అక్కడ కూడా ‘ప్రత్యేక ఆంధ్ర’ నినాదం పుట్టి వుండేది. ఇప్పటి ‘పరిష్కారం’ ప్రకారం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిని చేస్తే వారు హైదరాబాద్‌కు దూరం కానవసరం లేదు. అయినప్పటికీ ఇప్పటి ‘లీకు’లును భూతద్దంలో చూసి, చూపించి ఒక్క సారిగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం( జనవరి 17) న మంత్రి శైలజానాథ్‌ ఏర్పాటు చేసిని సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల సదస్సు వారి విపరీత భయాందోళనకు నిదర్శనం.

వీరి భయాందోళనలు ఏ స్థాయిలో వున్నాయో, తెలంగాణకాంగ్రెస్‌ నేతల ఆనందోత్సహాలు కూడా అదే స్థాయిలో వున్నాయి. అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పటయినట్టు, తెలంగాణ సెక్రటేరియట్‌ సిధ్ధమయి పోయినట్లూ, అక్కడ ముఖ్యమంత్రికి ఒక పెద్ద కుర్చీ వేసేసినట్లూ, అందులో తాము కూర్చున్నట్లూ కొందరు కాంగ్రెస్‌ నేతలు కలలు కనేస్తున్నారు. ‘ఇన్నాళ్ళకు కదా నేను కూర్చునే రోజు వచ్చిందీ’ అని డి.శ్రీనివాసూ, ‘ఎలా వుంది బ్రదర్‌ మనకీ షేర్వాణీ’ అని జానారెడ్డీ- డ్రస్‌ రిహార్సల్స్‌ మొదలు పెట్టినట్లు భోగట్టా.

హైదరాబాద్‌ లేని తెలంగాణను ‘తలలేని మొండెం’లా భావించే ఈ నేతలే, హైదరాబాద్‌ను వేరు చేసి తెలంగాణ ఇస్తానంటే, మరీ ఎంత ఎగిరి గెంత వచ్చా? హైదరాబాద్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ అయ్యాక మరో నాలుగు జిల్లాలలో సమీప భాగాలను కలుపుకున్నాక మిగిలిన తెలంగాణ వల్ల తెలంగాణ ప్రజలకి ఒరిగేదేముంటుందని – వీరంత సభల్లో లెక్చర్లు దంచిన వారే. అయినా సరే. వేడుక జరిపేసుకుంటున్నారు. అదేమంటే, ‘చూస్తూ వుండండి. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ వస్తుంద’ంటూ ‘లీకు’ లో చిన్న సవరణను కూడా చేస్తున్నారు.

 

ఈ ‘లీకు’ కావాలని వదలిందేనా?

ఇలా చేయంటం వల్ల కాంగ్రెస్‌కు ఒరిగేదేమిటి?

ఇది తేలితే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతల విపరీత వైఖరులకు కారణం అర్థమవుతుంది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇప్పటికిప్పుడు వున్నది అధికారం మాత్రమే. జనాదరణ లేదు.

సీమాంధ్రలో వైయస్సార్‌ కాంగ్రెస్‌, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ తమ విజయబావుటాలను ఎప్పడో ఎగురవేశాయి. ఇటీవల కాలంలో జరిగిందేమిటంటే వైయస్సార్‌ కాంగ్రెస్‌, సీమాంధ్రతో పాటు, తెలంగాణలో కూడా మెల్లగా అడుగులు వేసుకుంటూ చొరబడుతోంది.

ఇప్పటికిప్పుడు ఈ రెండు ప్రాంతాలలో వున్న వాతావరణాన్ని ‘నగదు బదలీ పథకం’ వంటి తాయిలాల వల్ల సమూలంగా కాంగ్రెస్‌ మార్చుకోలేదు.

అందుచేత ఈ రెండు పార్టీలతో శత్రుత్వమెంత వుందో, అవసరమూ అంతే వుంది.

‘తెలంగాణ ఇస్తే విలీనానికి సిధ్ధం’ అని టీఆర్‌ఎస్‌ తరపున ఒక దశలో చెప్పానని కేసీఆర్‌ తానే చెప్పుకున్నారు. ఎలాగూ ఆ పార్టీ కాంగ్రెస్‌లో కలసిపోతుందని, ఆ పార్టీ నేతలు తమ తమ వ్యక్తిగత సంభాషణల్లో వెల్లడి చేస్తున్నారు.

2014 ఎన్నికల ముందే టీఆర్‌ఎస్‌ను తనలో విలీనం చేసుకునేలా ప్రయత్నిస్తూనే, ఎన్నికల అనంతరం వైయస్సార్‌ కాంగ్రెస్‌ తో పొత్తుకు ముందస్తు వ్యూహం వేస్తోంది.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ తెలంగాణలో కూడా చొచ్చుకుపోతే, తన (కాంగ్రెస్‌) ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రమాదం వుందన్నది, కాంగ్రెస్‌ను వెంటాడే భయం.

అందుకోసం ఎన్నికల ముందు వైయస్సార్‌ ప్రాభవాన్ని వీలైనంతగా కట్టడి చేసి, ప్రభుత్వాన్ని స్థాపించే సంఖ్య (మేజిక్‌ ఫిగర్‌) 148 వరకూ అసెంబ్లీ సీట్లు ఆ పార్టీకి రాకుండా చేయాలన్నది కాంగ్రెస్‌ వ్యూహ కావచ్చు.

అఖిల పక్ష సమావేశంలో ఎలాగూ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవిభజనకు అనుకూలమనీ చెప్పలేదు, వ్యతిరేకమనీ చెప్పలేదు కాబట్టి, ఇదే అదను అనుకుని ఇప్పుడు సీమాంధ్రలో ‘సమైక్యాంధ్ర ఉద్యమాన్ని’ రెచ్చగొట్టే ‘లీకుల్ని’ కాంగ్రెస్‌ వదలింది.

గతంలో ఇలాగే కాంగ్రెస్‌ ఇలాగే చేసింది. తెలంగాణను ప్రకటించి వెనక్కితీసుకోవటంతో, ఇటు తెలంగాణలోనూ, అటు కాంగ్రెస్‌లోనూ జ్వాలలు చెలరేగాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ తెలంగాణలో ప్రవేశించినప్పుడు నిరసనలు చవిచూశారు. అలాగే సీమాంద్రలో కూడా ‘ఓదార్పు యాత్ర’కు విరామాన్ని ప్రకటించారు.

మళ్ళీ అదే పాచికను కాంగ్రెస్‌ ఇప్పుడు వేస్తోంది. వైయస్సార్‌ కాంగ్రెస్‌ సీమాంధ్రలో ‘సమైక్యాంధ్ర ఉద్యమం’లో పాల్గొంటే, తెలంగాణను వదలు కోవలసి వస్తుంది. అలా కాదని దూరంగా వుంటే ఆ ఉద్యమంలో ‘కాంగ్రెస్‌ దే’ పై చేయి అవుతుంది. ఎందుకంటే, తెలుగుదేశం తెలంగాణ కు అనుకూల ప్రకటన చేసి ‘సమైక్యాంద్ర’ విషయంలో చల్ల బడిపోయింది.

 

ఈ ‘సంకేతమే’ అంతిమ నిర్ణయమా?

ఈ సంకేతం అంతిమ నిర్ణయం కాకపోవచ్చు. ఆ మాట కొస్తే ఈ నెల 28న చేసే ప్రకటన కూడా పరిష్కార దిశగా కాకుండా, చిచ్చుపెట్టే దిశగానే వుంటుంది.

ఎందుకంటే ఇంతవరకూ కేంద్రం మూడు పరిష్కారాలు ప్రకటించింది.

ఒకటి: తెలంగాణా ఏర్పాటు

రెండు: తెలంగాణ ఏర్పాటు ఉపసంహరణ

మూడు: శ్రీకృష్ణకమిషన్‌ ఏర్పాటు, నివేదిక విడుదల.

ఈ మూడు నిర్ణయాలూ ‘ఉద్వేగాల’ను పెంచటానికే ఉపయోగ పడ్డాయి. ఇప్పుడూ అదే దారిలో వుంటుంది.

ఒక వేళ లీకుల ప్రకారం ‘ఇదే నిర్ణయం’ ప్రకటించినా, మళ్ళీ ఈ నిర్ణయంలో మార్పు వుంటుంది.

కేంద్రం చేసే తొలి ప్రకటన రెండు ఉద్దేశ్యాలను నెరవేరుస్తుంది.

ఒకటి: కేసీఆర్‌ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనానికి దోహద పడే ప్రకటన.’తెలంగాణను సాధించాను.’ అని చెప్పుకుని పార్టీని కలపటానికి వీలుగా వుండాలి. ఇంకో ముక్కలో చెప్పాలంటే ‘తెలంగాణను ఇచ్చినట్టుండాలి’ ఇవ్వకూడదు. ఇప్పటి ‘లీకు’ ఈ ఆలోచనకే అద్దం పడుతోంది.

రెండు: వైయస్సార్‌ కాంగ్రెస్‌ ‘హవా’ను అడ్డుకోవాలి.

అయితే ఈ వంకతో పెద్దగా పెరిగిపోయిన ‘సమైక్యాంధ్ర ఉద్యమాన్ని’ చల్లార్చటానికి కొన్ని నెలలు గడిచాక, తాత్కాలికంగా ‘తెలంగాణ అభివృధ్ధి మండలి’ని ఏర్పాటు చేసి, తెలంగాణ ఏర్పాటును 2014 ఎన్నికల తర్వాతకు వాయిదా వేసినా ఆశ్చర్చ పోనవసరంలేదు.

అయితే కాంగ్రెస్‌ పన్నుతున్న ఈ పన్నాగాలన్నీ నెరవేరుతాయా? అంటే సందేహమే.

కానీ, అవసరం కాంగ్రెస్‌ చేత అంతటి పని చేయిస్తోంది. పార్టీ అధిష్ఠానానికి వున్న ప్రాధమ్యాలే రాష్ట్ర కాంగ్రెస్‌కు అవసరాలు గా మారాయి.

2014 ఎన్నికలలో ‘యువరాజు’ను రాజు(ప్రధాని)ని చేయటమే అధిష్ఠానం ప్రధాన సంకల్పం. అందుకని ఒక్క పార్లమెంటు సీటు అదనంగా వస్తుందంటే, వంద పొత్తులు పెట్టుకోవటానికి కూడా కాంగ్రెస్‌ వెనుకాడదు. ఈ ఆలోచన నుంచే రాష్ట్రంలో వున్న టీఆర్‌ఎస్‌, వైయస్సార్‌ కాంగ్రెస్‌ల వైపు చూస్తోంది. అవసరం కాంగ్రెస్‌ పార్టీదయినా, ఈ రెండు పార్టీలూ తమ దగ్గరకు ‘కాళ్ళ బేరానికి’ రావాలన్న అత్యాశ ఇంకా కాంగ్రెస్‌లో చావలేదు. అ రాష్ట్రప్రయోజనాలతో సంబంధంలేకుండా , తన స్వంత ప్రాధమ్యాలతో సమస్యకు పరిష్కారం వెతుకుతున్నదని స్పష్టమయి పోయిందే. ఏ ప్రాంతపు కాంగ్రెస్‌ నేతలయినా అధిష్ఠానం ఆడించే పావులని వేరే చెప్పనక్కరలేదు. వీరంగాలకీ, వీరావేశాలకీ- స్క్రీన్‌ ప్లే ఢిల్లీనుంచే వస్తుంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం లెక్కల ప్రకారం ఇప్పుడు రోడ్డెక్కాల్సింది ‘సీమాంధ్ర నేతలు’. ఇంకా చూస్తారే…! లైట్స్‌.. కెమెరా.. ఓవర్‌ యాక్షన్‌!!

-సతీష్‌ చందర్‌

(గ్రేట్  ఆంధ్ర వారపత్రిక 18 -25 జనవరి 2013 వ సంచికలో ప్రచురితం)

3 comments for “లీకు మేకయింది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *