వణకే ‘గాడ్సే’లూ… తొణకని ‘లంకేష్‌’ లూ…!

తలకాయ ఉపయోగించని వాడికి తలలంటే భయం. ఆలోచించే తలలంటే మరింత భయం. అసలు తలలే లేని మనుషులుంటే బాగుండుననుకుంటాడు. భయస్తుడి తొట్టతొలి ఆయుధమే హింస. ఆది కాస్తా వాడేస్తే నిద్రపడుతుందనుకుంటాడు. ఆ తర్వాత మరెప్పటికీ నిద్రపోలేడు. దేశంలో భయస్తులు జాగారం చేస్తున్నారు. వారి భయాలు పలురకాలుగా వున్నాయి: ఆడపిల్లలు అర్థరాత్రి రోడ్ల మీద తిరిగేస్తారేమోనని భయం; మిట్టమధ్యాహ్నం ఊరివెలుపల మనుషులెవరో మతం మార్చేసుకుంటారని భయం; సాయింత్రపు పూట ఎవరి కంచంలోకి ఏ మాంసపు ముక్క వచ్చి పడుతుందో భయం( అది గోమాంసం కాంకుండా వుంటే అదే పదివేలు..కాబోలు!). ఉండి ఉండి ఎవరయినా పౌరోహిత్యంలో శూద్రులకూ, అతి శూద్రులకూ కూడా రిజర్వేషన్లు అడుగుతారేమోనని భయం; మైనారిటీ మతవిశ్వాసం కలిగిన వారు పిల్లల మీద పిల్లల్ని కనేసి మెజారిటీ అయిపోతారేమోనని భయం; ఇంకెవరన్నా వచ్చి రాత్రికి రాత్రే కులవ్యవస్థను కూల్చి పారేస్తారేమోనని భయం; భట్టీయం పట్టటం, వల్లించిన మాటనే వల్లించటం, తెలివి కాకుండా పోతుందేమోనని భయం; నవమాసాలు మోయకుండా సరోగసీ ద్వారా ఏ తల్లయినా బిడ్డను కనేస్తుందేమోనని భయం…!

ఇన్ని భయాలున్నవాళ్ళకి నిద్ర ఎలా పడుతుంది చెప్పండి. నిద్రలేకుండా రోడ్లమీద పరుగులు తీస్తున్నారు. ట్రక్కుల్లో పశువుల వెళ్ళటాన్ని చూస్తే చాలు వెంబడిస్తున్నారు. నల్లగా కనిపిస్తే సగంలో ఆగిపోతున్నారు. తెల్లగా కనిపిస్తే, వెంట వెంట పడుతున్నారు. దగ్గరగా వెళ్ళాక ‘ఆవులు కావు; ఎద్దులే’ అని తెలిశాక ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ భయస్తులు తమ భయం కొద్దీ సాటిభయస్తుల సంఖ్య పెంచుకోవాలనుకుంటున్నారు. ఒక తలను తీస్తే ఇక తలపులు ఆగిపోతాయనుకుంటున్నారు. కానీ తలపులు చెలరేగిపోతాయని తెలీదు. తలపులున్న తల తేనె తుట్టతో సమానం. ఒక్కొక్క తుట్టనీ కదుపుతున్నారు. నరేంద్ర దభోల్కర్‌(2013)ని చంపారు; గోవింద్‌ పన్సారే(2015)ని హతమార్చారు; ఎం.ఎం. కల్బుర్గీ(2015) ఊపిరి తీశారు. ఇప్పుడు(5 సెప్టెంబరు 2017) గౌరీ లంకేష్‌ అనే మహిళా జర్నలిస్టును నిలువునా కాల్చేశారు. బుర్ర పనిచెయ్యక పోతే అంతే.. భూమి గుండంగా వుందన్న వాడిని సైతం బల్లపరుపుగా చంపాలనిపిస్తుంది. కారణం భయం. భయపడ్డ వాడే, భయపెట్టినట్టు కలగంటాడు.

ఇలాంటి భయస్తుల కూటమే ఒక భయస్తుడికి ఈ పని అప్పగించినట్లుంది. అతడు అతి దగ్గర నుంచి గౌరీ లంకేష్‌ పత్రిక సంపాదకురాలు గౌరీలంకేష్‌ మీద బులెట్ల వర్షం కురిపించాడు. ఈ హత్యకు వచ్చిన స్పందన చూసి ఆ కూటమి వణకి చచ్చివుండాలి. ఎవరీ గౌరీ లంకేష్‌? ఇప్పుడు ఈ ఆరా ప్రపంచం మొత్తానికి వచ్చింది. ఆమెలా ఆలోచించే వాళ్ళు ఒక్క బెంగళూరు నగరంలోనో, లేక కర్ణాటక రాష్ట్రంలోనో, లేక భారత దేశంలోనో కాక, ప్రపంచ వ్యాపితంగా వున్నారని వారికి తెలిసింది. లంకేష్‌ తండ్రికి తగ్గ తనయ. తండ్రి లంకేష్‌ తన ‘లంకేష్‌’ పత్రిక ద్వారా ఎనభయి, తొంభయి దశకాల్లో ఛాందసుల ఎముకల్లో భయాన్ని రెట్టింపు చేశారు. వెనుకబడిన ‘లింగాయత్‌’ సామాజిక వర్గం నుంచి వచ్చి కొత్త ఆలోచనలకు దారులు వేశారు. కవి,రచయితా, నాటకరచయిత, చిత్ర దర్శకుడిగా చెరగని ముద్ర వేశారు. ఆయన మరణానంతరం, అంతవరకూ ఇంగ్లీషు పత్రికల్లో పనిచేసిన గౌరీ లంకేష్‌, తన తండ్రి స్థానంలో సంపాదకత్వ బాధ్యతల్ని చేపట్టారు. అయితే తన సోదరుడు ఇంద్రిజిత్‌తో వచ్చిన భేదాభిప్రాయలతో తాను విడివడి ‘గౌరీ లంకేష్‌ పత్రిక’ పెట్టుకున్నారు. అయితే ఆమె తాను కేవలం పత్రికల్లో రాసి సంతృప్తి పడలేదు. కార్య రంగంలోకి దూకారు. మతఛాందస శక్తులపై విరుచుకు పడ్డారు. దళితుల సమస్యలపై ఆందోళనకు పాల్పడారు.

హేతువాద ధృక్పథం ఆమెకు తండ్రినుంచే అలవడింది. ప్రపంచ ప్రసిధ్ధి పొందిన శ్రీలంక హేతువాది డాక్టర్‌. అబ్రహాం కోవూర్‌ తన తండ్రికి అతి సన్నిహితుడు. (శూన్యంలోంచి విభూదినీ, బంగారు ఆభరణాలనూ బాబాలను ఎండగట్టారు. అది మంత్ర శక్తి ఏమీ కాదనీ, కేవలం మ్యాజిక్‌ అనీ, తానుకూడా అలా చేసి చూపించే వారు.) అంతేకాదు తన తండ్రి బెంగళూరు యూనివర్శిటీలో ఇంగ్లీషు సాహిత్యాన్ని భోదించేవారు. ఆ కారణంగా ఆమెకు సాహిత్యాభిరుచి అలవడింది. పూర్తి స్వతంత్ర అభిప్రాయాలు కలిగిన మహిళగా గౌరీ లంకేష్‌ అందరికీ తెలుసు. అభిప్రాయం నచ్చక పోతే, విభేదిస్తారే తప్ప, వారి పట్ల విద్వేషం పెంచుకోరు. అంతెందుకు? తన భర్త చిదానంద్‌ రాజ్‌ఘట్టాతో అయిదేళ్ళు కాపురం చేసి, ఆయనతో అభిప్రాయాలు భేదాలు వచ్చి విడిపోయి కూడా, స్వఛ్చమైన స్నేహితురాలిగా వుండిపోయారు. గౌరీ లంకేష్‌ మరణానంతరం అయిన ‘ఫేస్‌బుక్‌’ లోచేసిన నివాళే( గౌరీ లంకేష్‌: నా మాజీ, నా బెస్ట్‌ ఫ్రెండ్‌) అందుకు నిదర్శనం. ఇష్ట పూర్వకంగా విడిపోయి, కోర్టునుంచి బయిటకు వచ్చి అదే భర్తతో రెస్టారెంట్‌లో హాయిగా భోజనం చెయ్యగల ధైర్యం ఆమెది. అంతే కాదు. ఒక స్నేహితురాలిగా రాజ్‌ ఘట్టాతో మరణించటానికి ముందు వరకూ తన తలపులను పంచుకుంటూనే వున్నారు.

హింస ఏ రూపంలో వున్నా ఆమె ద్వేషిస్తుంది. నక్సలైట్లను పోలీసులు కాల్చిచంపటాన్ని ఎలా తప్పుపడుతుందో, అలాగే నక్సలైట్లు ప్రతిహింసకు పాల్పడినా నొచ్చుకుంటారు. అందుకే నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలపాలనుకున్నప్పుడు కర్ణాటక రాష్ట్రప్రభుత్వానికి సహకరిచారు. కానీ ఛాందసం మీద శాంతియుత పోరాటం చేసేవారిని మాత్రం అక్కున చేర్చుకుంటుంది. అందుకనే ఢిల్లీ జవహర్‌ లాల్‌ యూనివర్శిటీలో ‘మత ఛాందసులను ఎదిరించాడని’ కణ్హేయ కుమార్‌ని తన దత్త పుత్రుడిగా ప్రకటించుకున్నారు.

ఆమెను చంపిన హంతకుడెవరో? ఎలా పట్టుకుంటారో? ఈ ప్రశ్నలు అవసరమే. కానీ, గతంలో దభోల్కర్‌, కల్బుర్గి, పన్సారీ ల హంతకులెవరో ఇప్పటికీ స్పష్టంగా తేల్చలేక పోయారు. ఆమె భావజాలానికి ఎవరు శత్రువులు ఎవరో తెలుస్తూనే వుంది. నాడు గాంధీని చంపిన గాడ్సేకూ తమకు సంబంధంలేదన్న శక్తులే, ఒక వేళ దొరికినా కూడా, గౌరీ హంతకులకూ తమకూ సంబంధంలేదని నేడూ ప్రకటించగలవు.

-సతీష్‌ చందర్‌

7సెప్టెంబరు 2017

(గ్రేట్‌ ఆంధ్రలో ప్రచురితం)

6 comments for “వణకే ‘గాడ్సే’లూ… తొణకని ‘లంకేష్‌’ లూ…!

  1. ‘భయస్తుడి తొట్టతొలి ఆయుధమే హింస’…బాగుంది సార్‌!

  2. భయపడ్డ వాడే భయ పెట్టినట్లు కలగంటాడు..
    యధార్థం సర్…మనిషి మానసిక రుగ్మతే హింస.ధైర్యం గా నిలబడి ఎదుర్కోలేని వాడే హింస కు పాల్పడతాడు. తన వాదన పై నమ్మకం సన్నగిల్లిన నాడే మనసు హింస వైపు ప్రేరేపించగలుగుతుంది. ఓటమికి హింస తొలి మెట్టు.
    ఈ విషయాన్ని అద్భుతంగా వివరించారు సర్.
    ఈ ప్రక్రియ లో సమకాలీన రచయితలు కవులు విమర్శకుల్లో మరెవరూ మీకు సాటి రారు

  3. పెఱుమళ్లు మురుగన్-కంచె ఐల్లయ్య ఈద్దార్ కూడా ఒకే రకమైన దాడికి గురవుతున్నారు

  4. తలను తీస్తే తలపులు ఆగిపోవు..చెలరేగిపోతాయి..excellent sir

    • సత్యాన్ని సత్యంగా బాబాసాహెబ్ వారసునిగా చెప్పారు Jaibheem sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *