‘వరుడా!’ ఏమి నీ కోరిక?

all party meetఅవునూ, కాదూ- మధ్యకూడా అనేక సమాధానాలుంటాయి.

అనుమానం వుంటే, ఒక్క సారి ‘అఖిల పక్షం’ పెట్టి చూడవచ్చు.

రాజకీయం మొత్తం- ఈ రెండూ కాకుండా, రెంటికి మధ్యే ఇరుక్కుని వుంటుందని తేలిపోయింది.

తెలంగాణా కావాలా? అంటే, అవునూ అని చెప్పిందెవరూ?

ప్రశ్న అడిగిన పెద్దమనిషినే- ‘మా సంగతి సరే, మరి నువ్వేమంటావ్‌?’ అని పీక పట్టుకున్నారు.

‘అ…అ…అవుదు’ అని కాస్సేపూ, ‘కా… కా…కావును’ అని కాస్సేపూ అని అన్నారు.( అచ్చుతప్పు అనుకోకండి. ఇవో రకం సంధి. గుణసంధి గురించి వినే వుంటారు. ఇది ‘దుర్గుణ సంధి’ అన్నమాట. కేవల రాజకీయ వ్యాకరణంలోనే వుంటుంది. ‘అవును+కాదు=అవుదు’, ‘కాను+అవుదు=కా వుదు’.)

అడిగే వారు దూరటానికి పనికి వచ్చిన సందులు(సంధులు), చెప్పేవారికి పనికి రావా?

తెలంగాణ కావాలని తెగేసి చెప్పిన పార్టీ లు రెండే రెండు. అందులో ఒకటి తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ పేరు పెట్టుకున్న పార్టీ. సీమాంధ్ర వోటర్లతో ఎలాంటి పనిలేని పార్టీ. ఇంకొకటి పేరుకు జాతీయ పార్టీయే కానీ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి సంబంధించినంత వరకూ ఎందుకో (ఒక్కరూ, లేక ఇద్దరూ- అంటూ) కుటుంబ నియంత్రణ పాటిస్తూ వస్తోంది. ఈ సంఖ్య పెంచుకోవటానికి తెలంగాణ ప్రాంతం ఒక్కటి చాలు అని, సీమాంధ్ర మీద ఆశలు వదలుకుంది.

అందుచేత ‘తెలంగాణ కావాల’ని కుండేమిటి, టాంకర్లు బద్దలు కొట్టి చెప్పమన్నా చెప్పేస్తారు.

మిగిలినవాళ్ళే అవునూ, కాదూ మధ్య- అనేకానేక సమాధానాలు సృజనాత్మకంగా కనిపెట్టారు.

ఇక్కడ ప్రశ్నే అసలు ప్రశ్న కాదు. మనలో మనమాట. ముఖమాటం లేకుండా అడగాలంటే ‘హైదరాబాద్‌ కావాలా?’ అని. గొడవంటే హైదరాబాద్‌ గురించే కదా?

ఇక్కడే ‘పుట్టాం’ కాబట్టి, హైదరాబాద్‌ తమదేనని తెలంగాణ వాసులూ, ఇక్కడే (పెట్టుబడులు) ‘పెట్టాం’ కాబట్టి హైదరాబాద్‌ తమదేనని సీమాంధ్ర వాసులూ అనుకోబట్టే, జగడానికి పీట ముడి పడింది.

వెనకటికి ఓ పేద పండితుడి కూతుర్ని అరడజను మంది సైనికోద్యోగులు ప్రేమించారు.

అసలు కూతురికి పెళ్ళి చెయ్యగలనా- అని ఇన్నాళ్ళూ భయపడి చచ్చిన పేద పండితుడికి భయం ఆరింతలయింది.

వారిలో ఏ ఒక్కడి కిచ్చి పెళ్ళి చేసినా, మిగిలిన అయిదుగురు ‘పండితుడి తల నాక్కావాలీ, అంటే నాక్కావాలీ’ అని కొట్టుకుంటారు. ఎలా చూసినా తెగేది పండితుడి తలేనని తేలిపోయింది.

తల తీయించుకోవటమే తప్పదనుకుంటే, ఈ సైనికోద్యోగులతో ఎందుకు తీయించుకోవాలీ, నేరుగా మహారాజు గారితోనే తీయించుకుంటే బాగుంటుంది కదా, అదే పండితుడి తలలో మెరుపు లాంటి ఆలోచన పుట్టింది.

ఇంకేముంది? తర్వాత రాజుగారి కోర్టు సీను.

పండితుడూ, పండితుడి కూతురూ ఒక వైపూ, ఆరుగురు సైనికోద్యోగులూ మరో వైపు.

ఎంతో విద్వత్తూ, సంస్కృతీ వున్న పండితుణ్ణి వదిలేసి, రాజు సైతం పండితుడి కూతురి వైపే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఆమె సౌందర్య సంపద ఆలాంటిది!!

‘వామ్మో! ఆరుగురే అనుకుంటే ఏడవవాడు తోడయ్యాడా?’ అని పండితుడు వణికి పోయాడు.

రాజుగారు తేరుకుని, గొంతు సవరించుకుని సైనికోద్యోగుల వైపు కోపంతో కాదు, ఈర్ష్యతో కాగి పోతూ చూశాడు.

‘అర్థమయినది..! సమరములేని చోట సరసమే పుట్టును. సైనికులున్నది సరసమాడుటకు కాదు. మీరిలా బాధ్యతలను మరవ బట్టే, జనులకు భద్రతలేకుండా పోయినది. భీమ సేనులు కొడితే కాదు, ‘దోమ’ సేనులు కుట్టినా రోగులు చనిపోతున్నారు. పురుగు మందు తినకుండా రైతులు చనిపోతున్నారు. అయినా నేను ప్రేమకు వ్యతిరేకిని కాను. మీకు ప్రేమ పరీక్ష పెడుతున్నాను. కానీ, ( అని పండితుడి కూతురి వైపు వోర కంటి చూసి,) ఈ పరీక్షలో నేను కూడా పాల్గొంటున్నాను.’ అన్నారు.

‘ ఈ సౌందర్యవతి తో పాటు, పేద పండితుణ్ణి కూడా యావజ్జీవమూ పోషించగలగటానికి సిధ్దమేనా?’ మహారాజు అడిగాడు.

‘మహారాజా! ఎందులయినా మీ తర్వాతే మేము. స్వయంవరంలో మీరూ వున్నారు కాబట్టి మీరే సెలవివ్వండి.’

రాజు తన బిగించిన ఉచ్చులో తానే పడ్డాడు.

‘పండితుడి లేని సుందరే మేలు కానీ, పండితుడి నుంచి సుందరిని వేరు చేయగలమా?’ అన్నాడు రాజు.

అంతే ఇక చూసుకోండి ఆరుగురు సైనికోద్యోగులకూ సమాధానాలు అలవోకగా వచ్చాయి.

‘పండితుడి లేని సుందరి’ అని ఒకడూ, ‘పండిత పుత్రిక సుందరి’ , ‘పండితుణ్ణి వదలుకున్న సుందరి’, ‘పండితుడు వద్దనుకున్న సుందరి’ ‘పండితుణ్ణి ఎదరించిన సుందరి’ ఇలా అయిదుగురూ చెప్పాక, ఆరవ వాడికి ఎందుకో పరిష్కారం దిశగా ఆలోచించాలని పించింది.

‘రాజా! తమరు పండిత పోషకులు కాబట్టి, పండితుణ్ణి మీరే తీసుకుని, సుందరిని మాలో ఎవరో ఒకరికి ఇవ్వండి.’ అన్నాడు.

అంతే రాజుగారు కోపంతో చప్పట్లు కొట్టారు. దీపాలు ఆరిపోయాయి. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ చప్పట్లు కొట్టాయి. దీపాలు వెలిగాయి.

సుందరి మాయం. పండితుడే వున్నాడు.

‘మిగిలింది పండితుడే కాబట్టి. ఆయన్ని మనమందరమూ పోషిద్దాం’ అని రాజుగారు తీర్పు చెప్పారు.

ఈ సుందరే హైదరాబాద్‌! పండితుడెవరో కాదు. పేదరికంలో వుండిపోయిన గ్రామీణ తెలంగాణ!!

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి 30 డిశంబరు 2012 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *