వాయిదా కూడా వీరోచితమే!

కలవని చేతులు(photo by Oh Paris)‘నేను నిన్ను ఇప్పటికిప్పుడే ప్రేమిస్తున్నాను. మరి నువ్వో’
‘వాయిదా వేస్తున్నాను.’
……………….
‘నేనిక విసిగిపోయాను. నీకిప్పుడు గుడ్‌బై చెప్పేస్తున్నాను. మరి నువ్వో?’
‘వాయిదా వేస్తున్నాను’
………………….
‘నేను ఇంకొకర్ని చూసుకున్నాను. మరి నువ్వో?’
‘వాయిదా వేస్తున్నాను.’
ఆమె ప్రశ్నలకు అతడిచ్చిన సమాధానాలివి.
ఊహించే వుంటారు. ఆమె ఎవరయినా కావచ్చు. అతడు మాత్రం జడ్జి.
అందుకే మరి. ముందే చూసుకుని ప్రేమించాలి. లేకుంటే ఇలాంటి ఇబ్బందే.
*** *** ***
‘ఎస్సాఆర్‌నో’ తేల్చమని పీకమీద కూర్చున్న వారికిచ్చే గొప్ప సమాధానం ‘వాయిదా’ అది అవునుకెంత దూరమో, కాదుకి అంత దూరం.
వాయిదాతో గెలవని గండమంటూ వుండదు.
‘పట్టు చీర కొంటారా? లేదా?’ అని నిజంగా భార్యామణి పీక మీద కత్తిపెట్టిందనుకోండి. ఏమిటి మార్గం?
అవునూ- అన్నాచిల్లే, కాదూ- అన్నా చిల్లే.
అవునూ అంటే పర్సుకు చిల్లు. కాదూ అంటే గుండెకు చిల్లు.
‘ఒక్క నెల ఆగు..!’ అన్నాడనుకోండి భర్త. సమస్య పెద్ద పెద్ద తిట్లతో కాకుండా, చిన్న పెదవి విరుపుతో బయిట పడవచ్చు.
నిన్న మొన్నటి దాకా మహోధ్ధృతంగా జరిగిన తెలంగాణా ఉద్యమాన్నే తీసుకోండి.
ఒక్క వాయిదాతో ఎన్ని చక్కబడిపోయాయి.
నిజానికి తెలంగాణ మొత్తం మీద రూలు ప్రకారం సకల జనుల సమ్మె జరుగుతున్నట్లే. ఎవరూ విరమించ లేదు.
ఆర్టీసీ కార్మికులే తీసుకోండి.
ఒక కార్మిక నాయకుడు ముందు ప్రకటించాడు. ‘ఆర్టీసీ సమ్మెను వాయిదా వేస్తున్నాం. విరమించటం లేదు.’ వెంటనే ఇంకో వర్గం కార్మిక నాయకుడికి కోపం వచ్చింది. ‘ఆ డైలాగ్‌ నాది. నువ్వు చెబితే ఎలా?’ అని నాలుగు రోజుల తర్వాత, సమ్మెను తను కూడా ‘వాయిదా’ వేసేశాడు.
ఆ తర్వాత సింగ రేణి కార్మికులు నిశ్శబ్దంగా వాయిదా వేశారు.
ఉద్యోసంఘ నేతలయితే, అధికారులతో ‘సకల’ పంక్తి భోజనం …. సారీ, సహపంక్తి భోజనం చేసి, తర్వాత రాజకీయ నాయకులను తిట్టి పోసి, వీరోచితంగా వాయిదా వేశారు.
చూశారా గమ్మత్తు? ఎవరూ సమ్మెలో లేరు. కానీ ఎవరూ సమ్మె విరమించలేదు.
వాయిదా.. వాయిదా.. వాయిదా…!
అర్థ శతాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమాన్ని ఎవరూ విరమించలేదు. ఏ నేతా మడమ తిప్పలేదు. కేవలం వాయిదా వేశారు.
*** *** ***
ఇంతకీ జడ్జి గారి ప్రేమ వ్యవహారంతో వాయిదాతో ముగిసి పోయిందనుకున్నాం కదా..!
కానీ, నిజంగానే ఓ ముఫ్పయ్యేళ్ళ తర్వాత ‘హియరింగ్‌’కు వచ్చింది.
అదే స్త్రీ మూర్తి మళ్ళీ వచ్చింది.
‘మీరు ప్రేమ విషయంలో ఏం నిర్ణయించుకున్నారు?అడిగిందామె
‘ నిన్ను ప్రేమిస్తున్నాను.’అన్నారు జడ్జి
‘అయితే పెళ్ళి..?’
‘వాయిదా వేస్తున్నాను.’
‘అంత వరకూ నాకు ఓపిక లేదు కానీ, ఈ పెళ్ళి కార్డు తీసుకోండి.’ అందామె
‘ఎవరిదీ నీదే..? పెళ్ళికొడుకెవరో..?’
‘ఈ పెళ్ళి కార్డు నాది కాదు. నా మనవరాలిది. పెళ్ళి మాత్రం వాయిదా పడదు. వేళకు వచ్చి, నాలుగు అక్షింతలు వేసి వెళ్ళండి.’
*** *** ***
అర్థమయింది కదా!
ఉమ్మడి రాష్ట్రానికి ఎన్నో ప్రభుత్వాలు వచ్చేశాయి.
యాభయ్యేళ్ళగా తెలంగాణ ఉద్యమం ఇలా వాయిదా పడుతూనే వున్నాయి.
కానీ ఈ ఉద్యమం కోసం ఇచ్చిన ప్రాణాలే తిరిగి రావటం లేదు.
– సతీష్‌ చందర్‌
(ఆంధ్రభూమి దినపత్రికలో 30అక్టోబరు2011 నాడు ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *