‘వెనకబడ’తారు!’అంటు’కుంటారు!!


టాపు(లేని)స్టోరీ:

ఏ పార్టీకయినా హఠాత్తుగా ‘అంటరానివారు’ గుర్తొచ్చారంటే, ఆ పార్టీని వోటర్లు ‘వెలి’ వేశారని అర్థం చేసుకోవాలి. అలాగే ‘వెనుబడిన వారు’ గుర్తొచ్చారంటే ఆ పార్టీ వోట్లవేటలో ‘వెనుకబడిందీ’ అని అర్థం. ఆ లెక్కన చూసుకుంటే, పార్టీలన్నీ అయితే ‘అంటరాని’వో లేక, ‘వెనుకబడినవో’ అయినట్లే.

వెనకటికి గుడిపాటి వెంకటాచలం అనే రచయితను విరాళాలు అడగటానికి ‘హైసొసైటీ’ మహిళలు కారుల్లో వెళ్ళారు. ‘అంటరాని తన నిర్మూలన కోసం ఒక డ్యాన్సు ప్రాగ్రాం చేస్తున్నాం. మీరు టికెట్టు కొనాలి. దీని మీద వచ్చిన డబ్బుని అంటరాని వారికి చదువు చెప్పటానికి ఉపయోగిస్తాం’ అన్నారట.

అందుకు చలం- ‘అదేమిటి? మీరు కూడా అంటరాని వారే కదా! బస్సుల్లోనూ, రెళ్ళల్లోనూ మిమ్మల్నెవరూ అంట(తాక) కూడదు.’ అని పంపించేశారు.

‘దళిత క్రైస్తవులను ఎస్సీల గుర్తించాలని’ ఒక పార్టీ అంటే, ‘దళితుల వర్గీకరణ చేయాల్సిందే’నని మరో పార్టీ అంటుంది. ఇవి కూడా ప్రత్యేక తెలంగాణ లా ఎప్పటినుంచో తెగకుండా వుండిపోయిన సమస్యలే. ‘తెగే’ సమస్యల వల్ల రాజకీయంగా వొరిగేది వుండదు. చటుక్కున అధికారంలో వున్న పక్షం ఒప్పేసుకుంటే..?! అందుకనే తెలివయిన నేతలెప్పుడూ ‘తెగని’ సమస్యల్నే పట్టుకుంటారు. అవి సాగుతూ వుంటాయి. ఆందోళనలూ సాగుతూ వుంటాయి. ఇలా వోటర్లు పార్టీలను వెలివేసినప్పుడెల్లా, ఆపార్టీలకు ఊరి వెలుపలే వుండిపోయిన అభాగ్యులు గుర్తుకొస్తున్నారు.

ఒకప్పుడు సి.ఎస్‌.రావు అనే సినీ దర్శకుడు రాష్ట్రంలో బాగా ‘వెనుక బడినవారు’ గా సినిమా హీరోలను గుర్తించారు. (పాపం! అప్పటికి చిరంజీవి ‘వెనుకబడిన’ వారి కోసం పార్టీ పెట్టి, కాంగ్రెస్‌ లో కలిపేస్తారని ఆయనకు తెలియదు.) ‘వారి ముఖం వారిది కాదు. రంగు పులుముతారు. వారి మాట వారిది కాదు. డైలాగ్‌ రైటర్‌ రాస్తాడు. వారి మాట వారది కాదు. గీత రచయిత రాస్తాడు. వారి ఫైట్‌ వారిది కాదు. డూప్‌ చేస్తాడు. వారి స్టెప్పు వారిది కాదు. కొరియోగ్రాఫర్‌ చేస్తాడు. ఇంత కన్నా వెనుకబడ్డ వారు ఎవరయినా వుంటరా?’ అని వాదనను సమర్థించుకున్నారు.

‘రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో వంద మంది బీసీలకు టిక్కెట్లు ఇస్తామని’ తెలుగు దేశం పార్టీ ప్రకటిస్తే, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక నేత ‘అలాగయితే మేమూ రెండువందలు ఇస్తాం’ అని వెంటనే నాలుక్కరచుకున్నారు. ఆయనకు ఆ అంకె ఎలా వినపడిందో..!? టిక్కెట్టనుకున్నారో లేక వోటు కిచ్చే రేటనుకున్నారో..?

ఈ లోపుగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ కూడా తన వంతు ‘బీసీ’ భక్తిని ప్రకటించాలనుకున్నారు. వంద టిక్కెట్లు కాదు, ఎస్సీలకూ, ఎస్టీలకూ రిజర్వు చేసినట్లు బీసీలకూ కొన్ని( వంద) సీట్లు రిజర్వు చేయించేద్దామన్నారు- రాజ్యాంగం మొత్తం వారి చేతిలో వున్నట్టు.

బీసీలకు టిక్కెట్లిస్తారా? లేక సీట్లిస్తారా? వందిస్తారా? రెండు వందలిస్తారా?

ఇలా జనం చర్చించేసుకుని లొట్టలేసేసుకుంటారని వీరి ఆశ.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లు ఎక్కడికక్కడ వోటు బ్యాంకులుగా మారి ఎక్కడికక్కడ రాజకీయాలను గత రెండు దశాబ్దాలుగా తల క్రిందులు చేస్తూ వస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో అన్ని పార్టీలూ ఈ రాజకీయాలకు మోకాలడ్డు వేశాయి. అందుకే ములాయం సింగ్‌ యాదవ్‌లూ, కాన్షీరాంలూ, లాలూ ప్రసాద్‌ యాదవ్‌లూ ఇక్కడ పుట్ట లేదు.

ఇచ్చే వాళ్ళదే రాజకీయం. పుచ్చుకునే వాళ్ళది కాదు.

నిజానికి, ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ’ల కలయకతో కనుక రాజకీయాలో వస్తే, వారు ఇతర అగ్రవర్ణాల వారికి ఏ మేరకు కనికరించి ఎన్ని టికెట్లు ఇవ్వాలో ఆలోచించేవారు. లేదా ఎన్ని సీట్లు రిజర్వు చేయాలో యోచించే వారు.

ఆ రోజు రానంత వరకూ పార్టీలు బడుగులకు ఇలా ‘బిచ్చం’ వేస్తాయని అంటూ వుంటాయి. అవి కూడా ఆ పార్టీలు ఏకాకులయినప్పుడో, వెనుకబడినప్పుడో మాత్రమే చేస్తాయి.

రాష్టాన్ని ఇలాగే వుంచేసి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టేస్తే, సర్కారు ఏర్పాటు చేయగలిగనన్ని సీట్లు ఏ ఒక్క పార్టీకి రాక పోవచ్చు. సీమాంధ్రలో ఒకటి రెండు పార్టీలూ, తెలంగాణాలో ఒకటి రెండు పార్టీలూ ముందు వరసలో వున్నా, చేసుకోవాల్సింది ‘సంకీర్ణ’ సంసారమే. అందుకే ఇలా వోట్ల కోసం ‘వెనకబడుతున్నా’రు!

న్యూస్‌ బ్రేకులు:

బీసీలకు ‘వంద’నాలు

రాష్ట్ర శాసనసభలో బీసీలకు లాటరీ ద్వారా జనాభా ప్రాతిపదికన వంద సీట్లిద్దాం రండి

-వైయస్‌. విజయమ్మ, వైస్సార్‌ కాంగ్రెస్‌ గౌరవాధ్యక్షురాలు

ఎలాగూ బీసీల వృత్తుల లాటరీ లే లెండి.వారితో మీరు కూడా లాటరీ ఆడేస్తే ఎలా చెప్పండి!

బీసీ సంక్షేమ శాఖకు అగ్రవర్ణపు నేతను మంత్రిగా వై.యస్‌ రాజశేఖరెడ్డి నియమించారు. ఆయన సతీమణి గా విజయమ్మకు బీసీలపై మాట్లాడే నైతిక హక్కు లేదు.

-టి. దేవేందర్‌ గౌడ్‌, టీడీపీ రాజ్యసభ పక్ష నేత

అయ్యో! అలాగా? సదరు అగ్రవర్ణపు నేత ‘ఆర్థిక’ంగా వెనుకడి వుండి వుండొచ్చు. ఆదుకోవాలి కదా! మీరు అపార్థం చేసుకుంటే ఎలా?

ట్విట్టోరియల్‌:

ఫీల్‌ మై హేట్‌!

‘ప్రేమ తరిగి పోదు తెలుసా?’ అన్నాడు గాలిలో బైకు నడుపుతూ ఓ కుర్రాడు.( వెనక సీట్లో కుర్రది కూర్చున్నాక బైక్‌ రోడ్డు మీదే నడుస్తుందని ట్రాఫిక్‌ పోలీసు కూడా ఆశించడు.) ‘అవును ప్రేమ మీద ఎన్ని సినిమాలు తీసినా తరిగి పోదు.’ అంది కుర్రది. నిజమే. హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీ వుడ్‌- ఈ ‘వుడ్‌’ లోనైనా ఏ ప్రేమ సబ్జెక్టుకు తిరుగులేదు. కాకపోతే, కట్నంతీసుకుని నిర్మించుకున్న ‘ఆలీ’ వుడ్‌ లో తప్ప. (ఆలి- అంటే భార్య అనే వివరణ అవసరం లేదు లెండి.) సినిమా పరిశ్రమ ఎలా ‘ప్రేమ’ మీద బతికేస్తుందో, రాజకీయ పరిశ్రమ అలా ‘ద్వేషం’ మీద బతికేస్తుంది. ప్రేమ ఖరీదయినది. ద్వేషం కారు చౌకే. తక్కువ వోట్లు వున్న సమూహాన్ని చూసుకుని వారి మీద ‘ద్వేషం’ రెచ్చగొడితే చాలు రాజకీయం సూపర్‌ హిట్టయి పోతుంది. అనుమానం వుంటే సీనియర్స్‌లో ‘అద్వానీ’నీ, జూనియర్స్‌లో ‘నరేంద్ర మోడీ’ నీ అడగొచ్చు. ఒక్క ‘నోరు జారుడు’ చాలు- చిచ్చు రగిలించటానికి. ఒక్క పుకారు చాలు ఆ చిచ్చును దేశ మంతా వ్యాప్తి చేయటానికి. తమ ఉనికి కోసం తాము పోరాటం చేస్తున్న ఒక ‘తెగ’కు కూడా మతం అద్ది, వేరొక మతానికీ ఆ ‘తెగ’కు మధ్య పెట్టిన చిచ్చుతో ఒక రాష్ట్రం వణికి పోతోంది. అదే ‘అసోం’! ఎప్పుడో కప్పుడు జనమే ద్వేషాన్నే కాదు, ద్వేషరాజకీయ వేత్తల్ని కూడా ద్వేషించక మానరు. అప్పుడు ఈశాన్య భారతంలో కూడా ప్రేమ వర్షించక మానదు.

‘ట్వీట్‌’ ఫర్‌ టాట్‌

‘గ్యాస్‌’ బుక్‌!

పలు ట్వీట్స్‌: ట్విట్టర్లూ, ఫేస్‌బుక్‌ల వంటి సోషల్‌ మీడియా నెట్‌ వర్క్‌లు లేనప్పుడు పుకార్లు లేవా? రాజకీయాల మీద కోపం మీడియా మీద చూపితే ఎలా?

కౌంటర్‌ ట్వీట్‌: అవును. ముంబయిలో వినాయకుడు పాలుతాగుతున్నాడని దేశం నలుమూలలా వినాయకులు క్షణాల్లో పాలు తాగేశారు. అప్పుడు ట్విట్టరూ, ఫేస్‌ బుక్కూ లేదు.

ఈ-తవిక:

‘మసి’ మోహన్‌ సింగ్‌!

‘అలా నల్లని ముఖంతో

వస్తున్నదెవరు? మారు వేషమా?’

‘కాదు. ‘తారు’ వేషం.’

‘మసి పూసుకున్నారెందుకు?’

‘అవును బొగ్గు మసి. కాగ్‌ నివేదిక చదివారులే.’

‘ఇంతకీ ఎవరాయిన’

‘మిస్టర్‌ క్లీన్‌. మన ప్రధాని’

 

బ్లాగ్‌(బ్లాక్‌) స్పాట్‌:

‘తన అత్త కన్నా, తన కుక్క అందమైనదన్నారట ఒబామా.’

‘ఇంతకీ ఆ కుక్క పేరు- ఒ’భౌ’మా- కాదు కదా!’

కొట్టేశాన్‌(కొటేషన్‌)

ఎదగడానికెందుకు రా తొందరా? ఎదర బతుకంతా ‘ఎంసెంట్‌’ ముందరా!

-సతీష్ చందర్

20-8-12

Leave a Reply