బ్యాంకుల్ని ప్రయివేటు పరం చేసినట్లే, వోటు బ్యాంకుల్ని పార్టీల పరం చేస్తుంటారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క బ్యాంకులో వోట్లను డిపాజిట్టు చేసుకుంటూ వుంటుంది.
ఇందిరాగాంధీ రోజుల్లో ఎస్సీ, ఎస్టీల వోటు బ్యాంకులో కాంగ్రెస్‌కు పెద్ద యెత్తున నిల్వలు వుండేవి. అయితే రాను రాను, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ ‘టేకోవర్’ చేస్తూవుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ చాలా వరకూ ఈ బ్యాంకుమీద గుత్తాధిపత్యం సాధించింది.
బీసీ, మైనారిటీ, మహిళా వోటు బ్యాంకుల మీద కూడా ‘చేతి’ ముద్రే వుండేది. తర్వాత వాటి మీద కూడా ప్రాంతీయ పార్టీలు పట్టు సాధిస్తూ వచ్చాయి.
తర్వాత బీజేపీ వచ్చి ‘మెజారిటీ హిందూత్వ’ వోటు బాంకు ఒక దానిని సృష్టించి, మధ్య అధికారంలోకి కూడా వచ్చేసింది. ఇంకా గుజరాత్ వంటి రాష్ట్రాలలో ఈ బ్యాంకులు చెలామణిలోనే వున్నాయి.
ఈ తరహా మార్పులు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరిగాయి. ఒకప్పుడు బీసీ వోటు బ్యాంకును కాంగ్రెస్ నుంచి ఎన్టీరామారావు కొల్లగొట్టి తెలుగుదేశానికి తెచ్చిపెట్టారు. కానీ ఇప్పుడు ఆ బ్యాంకు మీద ఆ పార్టీ పట్టు కోల్పోయింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కారణంగా గత రెండేళ్ళలో తెలంగాణ వరకూ టీఆర్‌ఎస్ వైపునకు వచ్చింది. సీమాంధ్రలో ఎక్కువ భాగం వైయస్సార్ కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు.
అలాగే రాష్ట్రం మహిళా వోటు బ్యాంకు ‘తెలుగింటి ఆడపడుచులు’ అన్న ఎన్టీఆర్ మాట నమ్మి కొన్నేళ్ళు తెలుగుదేశం పార్టీలో వున్నా, వైయస్ రాజశేఖర రెడ్డి ‘పావలా వడ్డీ’ రుణాలతో మళ్ళీ కాంగ్రెస్‌లోకి వచ్చేశారు.
విశేషమేమిటంటే, ఎన్ని పార్టీలు అవతరించినా, ఎస్సీ వోటు బ్యాంకు మాత్రం- చాలా యేళ్ళ పాటు కాంగ్రెస్‌తోనే వుండి పోయారు. కడకు ఎన్టీఆర్ హయాంలో కూడా ఎస్సీలు తెలుగుదేశం వైపు రాలేదు. ఇది గమనించిన చంద్రబాబు రిజర్వేషన్లలో ‘వర్గీకరణ’ మంత్రం జపించారు. ఫలితంగా ఎస్సీవోటు బ్యాంకు రెండు ఉపకులాల బ్యాంకు గా చీలిపోయింది. మాదిగలు కేవల ఒక ఎన్నికల కాలంలో మాత్రమే తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. మాలలు కాంగ్రెస్ తోనే వుండిపోయారు. వై.యస్ ముఖ్యమంత్రి అయ్యాక రెండు వర్డాలూ మళ్లీ ఒకే వోటు బ్యాంకుగా మారాయి.
అయితే మళ్లీ ఈ వోటు బ్యాంకు రెండుగా చీలింది. తెలంగాణ ప్రాంతంలో (అధికంగా మాదిగలు వుంటారు) టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపారు. సీమాంధ్ర ప్రాంతంలో( అధికంగా మాలలుంటారు, వీరిలో క్రైస్తవమతాన్ని ఆచరించేవారు ఎక్కువ) వైయస్సార్ కాంగెస్ వైపు మొగ్గు చూపారు.( వైయస్ కుటుంబానికి క్రైస్తవ మతం మీద వుండే విశ్వాసం కూడా ఇందుకు కొంత కారణమయ్యింది.) ఎటొచ్చీ ఎస్సీల వోటుబ్యాంకులో కాంగ్రెస్‌కే డిపాజిట్లు గల్లంతయ్యాయి.
ఈ సమయంలో వారికి ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కంపోనెట్ ప్లాన్ కు చట్ట బధ్ధత కల్పించటం ఒక అస్త్రంగా పనికి వచ్చింది. ఇందుకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ పూనుకున్నారు. ఏటా ఈ ప్లాన్ కింది విడుదలయ్యే నిధులను వరసగా అధికారంలో వున్న రాష్ట్రప్రభుత్వాలు వేర్వేరు పద్దులకు మళ్ళిస్తున్నారనే విమర్శలు తీవ్రంగా వచ్చిన నేపథ్యంలో, ఈ నిధులను ఎస్సీ,ఎస్టీల సంక్షేమానికే తప్పని సరిగా ఖర్చు చేసే విధంగా చట్టం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందుకు సబ్ కమిటీ వేసి, బిల్లును తయారు చేసింది. దానికి కేబినెట్ ఆమోదం వచ్చింది. ఇప్పుడు ఈ బిల్లును ఆమోదించేందుకు శాసనసభను ప్రత్యేకంగా సమవేశ పరుస్తున్నారు. కానీ, ఈ బిల్లును వ్యతిరేకించేటంత సాహసం ప్రతిపక్షాలు చేయవు. కానీ ముసాయిదా తప్పుల తడకగా వుందనో, మళ్ళించిన నిధులను వెనక్కితెచ్చే విధంగా వుండాలనో, కారణాల మీద అభ్యంతరం పెట్టటానికి ఇప్పటికే తెలుగుదేశం, మజ్లిస్ పార్టీలు రంగం సిధ్ధం చేశాయి. అదే జరిగితే, ఈ బిల్లు కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులాగానో, లోక్ పాల్ బిల్లులాగానో అయ్యే ప్రమాదం వుంది. అణగారిన వర్గాల ప్రజలను మనుషులుగా కాకుండా, కేవలం వోటు బ్యాంకులు గా చూస్తే ఇలాగే జరుగుతుంది. వారికి ప్రయోజనం చేకూర్చటం కన్నా, వారి మన్ననలను పొందటం మీదే ఎక్కువ ధ్యాస వుంటుంది.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 30 నవంబరు-6డిశంబరు 2012 వ సంచిక లో ప్రచురితమయింది.)