
Photo By: Maciej Szczepaniak
పర్వతం ఏడ్చింది
నేల చెక్కిళ్ళ మీద లావా
చెట్టు నగలన్నీ వలుచుకుంది
కింద పండుటాకుల వాన
నేను గుండెను దిమ్మరించాను
రాలిన కత్తుల గుత్తులు
ఓదార్పు మీ వల్ల కాదు
కవ్వింపు మీకు చేత కాదు
భగ్గుమంటాను
తగ్గుతుంటాను
చావుబతుకులతో
మూడేసి రోజులు దోబూచులాడతాను
తెగింపు మీకు తెలీదు
సందేహం మీకు కుదరదు
చిన్నదాని ముద్దుకు సైతం
ఒక చేవ్రాలు అడుగుతారు
నేను ఎంగిలి పెదవుల్ని చూపుతాను
రాత్రంతా పరిమళించిన సన్నజాజికి
ఒక సాక్షి సంతకాన్ని అడుగుతారు
నా ప్రియురాలిని తలవిరబోయమంటాను
కలలు కన్న నేరానికి
కళ్ళను ఆధారాలడుగుతారు
రెండు కన్నీటి బొట్లను జారవిడుస్తాను
నేల నేలంతా నవ్వింది
తళుక్కుమన్నాయి నదులు
వరిచేను పండింది
నెరసిన బంగారు శిరోజాలు
చొక్కా పై గుండీ విప్పాను
వేకువ పిట్టల కువకువలు
నేలమీద చిందు
నింగికొక ముద్దు
కన్నీరే గుడ్డు
చిరునవ్వే పిల్ల
నటనంతా క్షణం
బతికిందే యుగం
-సతీష్ చందర్
(ఆదిపర్వం కవితా సంకలనం నుంచి)
పరితపించినా, పరిమళించినా
పదిమందిలోనే
అభిరుచి మీకు రాదు
అభిప్రాయం మీది కాదు
తెలుపు కోసం
మల్లెకూడా సబ్బు వాడిందని మీ ఆరోపణ
చెరపట్టటం మీ వల్ల కాదు
చెలిమి మీకు చేత కాదు
వాడిపోతాను
కానీ, ఓడిపోను.
కీర్తి కోసమే
మలిసంజె నెత్తురు కక్కిందని మీ అభియోగం.
తెల్లవారిపోతాను
కానీ, తల్లడిల్లను
వాడబిడ్డ
వొంటి కింత పొగరెందుకని మీ ఆవేదన
క్షమించాలి
మా ఆత్మగౌరవమెప్పుడూ
మీకు ఆహంకారమే
Maa aatma gouravam eppudu meeku ahankarame ! nijam sir!
ahankaaraaniki entha chakkani arthaanni chepperu. fine.