సీమాంధ్రలో ‘ప్రత్యేక’ ఉద్యమమా?

self immolationఆత్మాహుతి. ఈ మాట తెలుగు నాట రాష్ట్ర విభజనకు ముందు విన్నాం. విడిపోయి ఏడాది దాటాక మళ్ళీ వినాల్సి వస్తోంది. అప్పుడు ఆత్మాహుతులు తెలంగాణలో జరిగాయి. ఇప్పుడు ఆంధ్రలో వినబడింది. విభజనకు ముందు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దీటుగా సమైక్యాంధ్ర ఉద్యమం చెయ్యాలని తీవ్రంగా ప్రయత్నించారు. ఉద్వేగాలు ఆంధ్రలో కూడా పతాక స్థాయిలో లేచాయి. తెలంగాణలో ఆ ఉద్వేగం ఆత్మహత్యలూ, ఆత్మాహుతుల వరకూ వెళ్ళి పోయింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆ దిశగా పయినించలేదు. కానీ రాష్ట్రం విడిపోయి ఏడాది దాటిపోయిన తర్వాత తెలంగాణ ప్రశాంతంగా వుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త ఉద్వేగం మొదలయ్యింది. అదే ‘ప్రత్యేక హోదా’కు చెందిన ఉద్యమం. ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్న ‘ప్రత్యేక హోదా’ వెనక్కి వెళ్ళిపోయేలా వుందన్న భయం ఆంధ్రప్రాంత వాసులకు పట్టుకున్నది. ఈ భయమే ఉద్యమంగా మారుతుందా? అన్న అనుమానం కలుగుతోంది. అందుకు ఉదాహరణ: తాజాగా జరిగిన పరిణామాం: బి. ముని కామ కోటి ఆత్మాహుతి.

చావమనరు కానీ, చావుల్ని వాడుకుంటారు!

ఆత్మహత్యల్నీ, ఆత్మాహుతుల్నీ ఏ పార్టీ కానీ, ఈ నేతకానీ పైకి స్వాగతించరు. కానీ ఇలాంటి తీవ్రచర్యలు జరిగినప్పుడు రాజకీయంగా ఉపయోగించుకోవటానికి వెనుకాడరు. కానీ ఎప్పుటికప్పుడు ‘దయచేసి యువకులెప్పుడూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ప్రాణాలు తీసుకోవద్దు. కలసి పోరాడదాం. పోరాడి సాధించుకుందాం’ అనే పిలుపులు మాత్రం ఇస్తుంటారు. ఈ పిలుపులు తెలంగాణ ఉద్యమకాలం లో కూడా ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన నేతలు కూడా ఇస్తూనే వున్నారు. నిజానికి ముని కామ కోటి ఆత్మాహుతే చిట్టచివరిది కావాలని మానవీయ దృష్టి వున్న వారెవరయినా కోరుకోవాలి.

అందరూ ఇవ్వమనేవాళ్ళే, ఇచ్చేదెవరు?

అయితే ఈ ఆత్మాహుతి ఆ ప్రాంతంలో వున్న ఉద్వేగ తీవ్రతకు అద్దం పడుతోంది. అదేమిటో ‘ప్రత్యేక’ంలో వున్న తీవ్రత ‘సమైక్యం’లో కనిపంచటంలేదు. నాడు ‘ప్రత్యేక రాష్ట్రం’ అన్నది రాజుకున్నట్టుగానే, నేడు ‘ప్రత్యేక హోదా’ అన్న నినాదం వెలిగిపోతోంది. నాడు వ్యక్తులుగా నేతలు ‘సమైక్య ఉద్యమాన్ని’ బలపరచినా, వారున్న పార్టీలు మాత్రం అన్నీ ‘ప్రత్యేక తెలంగాణ’కు మద్దతు నిచ్చాయి. ఒక్క సిపిఎం మాత్రం పేరుకు వ్యతిరేకతను చెప్పి, తీరులో పరోక్ష సహకారాన్ని అందించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను కల్పించే విషయంలో కూడా ఇదే స్థితి కనిపిస్తోంది. దాదాపు అన్ని పార్టీలు అంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కావాలనే అంటున్నాయి. కానీ అధికారంలో వున్న ఎన్డీయే నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ప్రకటనలు చేసున్నారు. అప్పుడు అధికారంలో వున్న యుపీయే నేతలు కూడా రాష్ట్ర విభజన గురించి కూడా ఇలా విరుధ్ధ ప్రకటనలు చేస్తూ వుండేవారు. ఈ విరుధ్ధ ప్రకటనలే ఉద్యమ తవ్రతను పెంచాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఒక మంత్రి ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెబుతారు. ఇంకో మంత్రి ఆర్డినెన్స్‌ ద్వారా కుదరదు- అంటారు.

సీమాంద్రులను ముంచిన పార్టీలు!

అదీ కాక ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో ప్రత్యేక హోదా ఒక ఉద్వేగపూరితమైన అంశంగా మారటం వెనుక అక్కడ వున్న ప్రతీ పార్టీకీ ఎంతో కొంత పాత్ర వుంది. ఇంకా కొన్ని గంటల్లో రాష్ట్ర విభజనకు చెందిన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందబోతున్నప్పుడు కూడా, సీమాంధ్రలో ప్రతీ నేతా ‘విభజన ఆగుతుందని’ నమ్మబలికారు. తీరా విభజన జరిగాక, తెలంగాణ ప్రజలు తమ ఆరు దశాబ్దాల కల ఫలించిందని ఎంతగా ఆనందించారో, సీమాంధ్ర ప్రజలు అంతగా డీలా పడిపోయారు. ఆ తర్వాత వారిని ఊరడించటానికి హడావిడిగా వాడిన అస్త్రమే ‘ప్రత్యేక హోదా’. ఈ హోదాను అడిగిన డిమాండ్‌ చేసిన పక్షాలకు కానీ, హోదాను ఇస్తామని ప్రధాని మన్‌మోహన్‌ చేత ప్రకటన చేయించిన యూపీయేకు కానీ, ఈ హోదా ఎలా వస్తుందన్న అంశం మీద శ్రధ్ధ లేదు. మొత్తానికి సమర్థవంతంగా పార్టీలన్నీ కలసి సీమాంధ్ర ప్రజల మనసుల్లో ‘సమైక్య రాష్ట్ర’ నినాదం స్థానంలో, ‘ప్రత్యేక హోదా’ ను ఉంచగలిగారు.

టాపిక్ డైవర్టయితే టీడీపీకి మంచిదా?

ఇప్పుడది యేకు మేకయ్యింది. రాష్ట్రాలకు విధివిధానాలను రూపొందించిన ప్రణాళికా సంఘం మనుగడలో లేదు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే, పర్వత ప్రాంతమయి వుండాలని, జన సాంద్రత తక్కువ వుండాలనీ, గిరిజనుల సంఖ్య ఎక్కువ వుండాలనీ – అప్పట్లో పెట్టిన షరతులను ఉటంకిస్తున్నారు. అయితే ఇందుకు పార్లమెంటు అనుమతే అవసరంలేదనీ, కేవలం కేబినెట్‌ నిర్ణయంతో అమలు జరప వచ్చనీ, ఉత్తర ప్రదేశ్‌ను ఉత్తరాఖండ్‌ ను వేరు చేసిన రెండేళ్ళకు అప్పటి ఎన్డీయే సర్కారు ఇలాగే చేసిందనీ, ఇప్పుడలా ఎందుకు చెయ్యరనీ కాంగ్రెస్‌ అడుగుతోంది. ఏమయితేనేం..? ఈ పేరు మీద ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రతి పక్షాలకు పని దొరికింది. కడకు అసెంబ్లీలో ‘సున్నా’ స్థానాలకు పడిపోయిన కాంగ్రెస్‌ దీనిని ఒక అవకాశంగా చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అధికారపక్షం (తెలుగుదేశం) ఈ స్థితి ముందు సౌకర్యవంతంగా అనిపించినా, ఇప్పుడు అసౌకర్యంగా వుంది. రాజధాని నిర్మాణం దగ్గర నుంచి నిరుద్యోగుల నియామకాల వరకూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్న రాష్ట్రంలో వైఫల్యాలను కప్పి పుచ్చుకోవటానికి ‘ప్రత్యేక హోదా’ సాకుగా చూపే ప్రయత్నం ముందు చేసింది. కానీ ఉద్యమం తీవ్రమయ్యే సరికి, కేంద్రంతో ఘర్షణకు దిగాలా, సామరస్యంగా వుండాలా- అన్న మీమాంసలోకి వెళ్ళిపోయింది. ఈ ‘ప్రత్యేక హోదా’ సినిమా ఇప్పుడే మొదలయ్యింది. దీనికి ఇంకా ఎన్ని ట్విస్టులూ, టర్నులూ వుంటాయో… వేచి చూడాల్సిందే.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 15-22 ఆగస్టు 2015 సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *