సుష్మా ‘హిందూ’ రాజ్‌!

caricature: balaram

caricature: balaram

పేరు : సుష్మా స్వరాజ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: తొలి మహిళా ఎన్డీయే ప్రధాని అభ్యర్థిని( వెంటనే కాదు లెండి. సార్వత్రిక ఎన్నికలు జరగాలి. అత్యధిక సీట్లు సాధించిన ఏకైక కూటమిగా ఎన్డీయే నిలవాలి. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఇంకా డెభ్యయ్యో, ఎనభయ్యో సీట్లు తక్కువ కావాలి. అప్పుడు ప్రాంతీయ పార్టీలు నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని నిరాకరించాలి. అప్పుడు మహిళ ప్రధాని కావాలి-అని దేశమంతటా ఉద్యమం తేవాలి. అప్పుడు మనకి ఛాన్స్‌ వుంది. అయితే నేను ప్రధాని అయితే, గుండు గీయించుకుంటాను అని ఏ కాంగ్రెస్‌ మహిళా నేతా శపథం మాత్రం చెయ్యకూడదు. ఎందుకంటే, 2004 లో సోనియాని ప్రధానిని చేస్తారని అనుకున్నప్పుడు, నేను అలాంటి శపథమే చేశాను లెండి.)

ముద్దు పేర్లు : సుష్మా ‘హిందూ’ రాజ్‌. ( మేమున్నది ‘స్వరాజ్యాన్ని’ తేవటానికి కాదు, హిందూ రాజ్యాన్ని తేవటానికి) ‘గ్రీష్మ’ స్వరాజ్‌ (లోక్‌ సభలో పాలక పక్షం మీద నిప్పులు చెరుగుతుంటాను. కానీ తెలంగాణ బిల్లుకు మద్దతు విషయంలోనే కొంచెం నీళ్లు చల్లాల్సి వచ్చింది.)

విద్యార్హతలు : ‘లా’ చేశాను. అందుకనే వాదనను ఎ’లా’ గయినా మలచగలను. లోక్‌ సభను సవ్యంగా జరగమనీ కోరతాను, అంతరాయం కలిగించే సభ్యుల్ని సస్పెండ్‌ చెయ్యొద్దనీ కోరతాను.

హోదాలు : ఎన్నో హోదాలు నిర్వహించాను. ముఖ్యమంత్రి పదవీ నిర్వహించాను; కేంద్ర మంత్రి పదవీ చేశాను. కానీ ఇప్పుడు నేల ‘నేల’ మీద.. ఐ మీన్‌ ‘ఫ్లోర్‌’ మీదనే వున్నాను. కానీ ఇదే పెద్ద హోదా ‘ఫ్లోర్‌’ లీడర్‌ని కదా!

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: భారతీయ స్త్రీలా నుదుటి మీద పెద్ద బొట్టు పెడతాను. ‘హిందూ’త్వానికి చిహ్నమనుకునే దాన్ని. కానీ కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) నాయకురాలు, నా కన్నా పెద్ద బొట్టు పెడతారు. అయినా ‘హిందూత్వ’ పార్టీగా మా సిధ్ధాంతం ఎదుటి వారికి ‘నామాలు’ పెట్టటం కానీ, బొట్లు పెట్టటం కాదు లెండి.

రెండు: పొగడబోయి తిడుతుంటాను. నిడో టానియమ్‌ అనే ఈశాన్య రాష్ట్రాల విద్యార్థి హత్యను ఖండించబోయి, నేను ఇబ్బందుల్లో పడ్డాను. దేశంలో ఏ ప్రాంతం వారయినా సమానమే అని చెప్పబోయి, ‘ఎత్తు ముక్కుల వాళ్లూ, చప్పిడి ముక్కుల వాళ్లూ ఒక్కరే’ అన్నాను. ఆ తర్వాత అందరూ అనే వరకూ నాకూ అనిపించలేదు, ‘ఈశాన్య రాష్ట్రాల వారిని చప్పిడి ముక్కుల వారూ’ అని అనేశానని.

సిధ్ధాంతం : రాజకీయాల్లోకి రావటానికి ఉపయోగపడుతుంది. వచ్చాక అడ్డు వస్తుంటుంది. లేక పోతే, బళ్ళారిలో ‘గనులు’ ‘గాలి’ బ్రదర్స్‌ను( జనార్థన రెడ్డి, అతని సోదరుణ్ని) భరతమాతలా దీవిస్తూ ఫోటో దిగే దాన్ని కాదు.

వృత్తి : రాజకీయమే నాకు జీవితం. వృత్తి అంటారా.. ‘వాదనే’

హబీలు :1. సోనియా పట్ల ‘వైరి భక్తి’ని ప్రదర్శించటం. అంటే ఆమెను విమర్శించటంలో నా ఉనికిని చూసుకోవటం. బళ్ళారిలో ఆమెకు ప్రత్యర్థిగా నిలబడటంతో నాకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది.

2. అద్వానీ అడుగుజాడల్లో నడవటం. ( అలాగని ఆయనలాగా మరీ ‘జిన్నా’ను పొగడను లెండి.) కాక పోతే, స్వంత పార్టీలో ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలో ఆయననుంచే నేర్చుకున్నాను. పొగడుతూనే పొడుస్తుండటం రాజనీతి అని నాకు అర్థమయింది. అప్పటినుంచే నేను కూడా ‘న.మో'(నరేంద్ర మోడ)ీ మంత్రాన్ని జపించటం మొదలు పెట్టాను.

అనుభవం : నగరాలనుంచి వచ్చిన విద్యావంతులయిన వారే బీజేపీలో అంతిమంగా ఎదుగుతారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి, పెద్దగా విద్యలేని, ఉమాభారతి వేగంగానే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అంతే వేగంగా పదవి కోల్పోయారు. ఒకప్పుడు ఆమె పాపులారిటీ ముందు, నా ఖ్యాతి చాలా తక్కువ. ఇప్పుడు జాతీయ స్థాయిలో మోడీ కూడా ఉమా భారతి నేపథ్యం నుంచి వచ్చారు. ఇంతకు మించి వ్యాఖ్యానించను.

మిత్రులు : మీకు తెలియదా? మా పార్టీలో గురువులూ, శిష్యులే వుంటారు. మిత్రులు వుండరు.

శత్రువులు : శత్రువుల కోసం బయిట పార్టీల వైపు చూసే ఖర్మ, మా పార్టీ(బీజేపీ) లో ఎవ్వరికీ వుండదు.

మిత్రశత్రువులు : వెళ్ళిపోయారు కదా. నితిష్‌ కుమార్‌, నవీన్‌ పట్నాయక్‌లు

వేదాంతం : మాట మార్చకుండానే చేత మార్చవచ్చు. తెలంగాణ మీద మాట తప్పకుండానే చేతల్లో చూపించవచ్చు. అదే చూపిస్తున్నాం.

జీవిత ధ్యేయం : కాంగ్రెస్‌కు సోనియా ఎలాగో, బీజేపీకి నేను అలా కావాలని.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంద్ర వార పత్రిక 8-15 ఫిబ్రవరి 2014 వ తేదీ సంచికలో ప్రచురితం)

1 comment for “సుష్మా ‘హిందూ’ రాజ్‌!

Leave a Reply