సోనియా కోపం- రాహుల్‌ కోసం!

సీన్‌ వన్‌ :28 ఆగస్టు 2014

సోనియా గాంధీ ‘బొగ్గు’ మన్నారు. పార్లమెంటు ‘మసి’బారింది. సమావేశాల్లో మరో రోజు ‘బ్లాక్‌’ డేగా మారింది. ఏమిటో అంతా ‘నలుపే’. బొగ్గు గనుల కేటాయిపుల అవకతకలపై ‘కాగ్‌’ నివేదిక చూశాక కాగి పోవాల్సింది ప్రతి పక్షం. కానీ, అదేమిటో పాలక పక్షం ఊగిపోతోంది. బీజేపీకి ‘బ్లాక్‌ మెయిలింగే బువ్వ’ అన్నారు సోనియా. బీజేపీ నేతలకు – ‘బ్లాక్‌’ మెయిలింగ్‌ లో ‘బ్లాక్‌’ ఒక్కటే అర్థమయింది. నలుపుకు నలుపే సమాధానం అనుకున్నారో ఏమో సమాధానం కూడా ‘నలుపు’తోనే ఇచ్చారు. ‘అలాగా! ‘నల్ల’ డబ్బు మీకు ఆహారం’ అని బదులిచ్చేశారు. సోనియా తాను మండటమే కాకుండా, ఇతర కాంగ్రెస్‌ సభ్యులను మండించారు. ‘సంజాయిషీలివ్వాల్సిన పనిలేదు.తీవ్రంగా విరుచుకు పడండి’ అని ఉసిగొలిపారు.

సీన్‌ టూ:8 ఆగస్టు 2014

సోనియా ‘అస్సో’నియా అయ్యారు. ‘అస్స’హనం తెచ్చుకున్నారు. అవును. కారణం- ఆస్సాంలో హింసే. సందు దొరికింది – కదా అని, బీజేపీ కురువృధ్ధుడు అద్వానీ యూపీయే సర్కారును ‘అక్రమ సర్కారు’ అభివర్ణించారు. సర్కారు అక్రమమయితే, పార్లమెంటూ అక్రమమే, అందులోని సభ్యులూ అక్రమంగా ఎన్నికయిన వారే. ప్రతిపక్షమూ అక్రమమే. ఈ పాయింటు మీద సోనియా పీక పట్టుకున్నారు. అపర కాళిక గా మారిపోయారు. జారిన అద్వానీ నోరును వెనక్కి తీసుకోవాలంటూ పట్టు పట్టారు. ఇదే సమయంలో తన సొంత పార్టీ సభ్యులు తెలంగాణ కోసం ధర్నా చేస్తుంటే , బయిట చేసుకోమని మందలించేశారు. మేడమ్‌ తిట్టును కూడా పొగడ్తలా భావించగలిగిన సభ్యులు క్రమ శిక్షణ గలిగిన విద్యార్థుల్లా బయిటకు వెళ్ళారు.

ముందు ముందు, ఇలాంటి సీన్లు చాలా వుంటాయి.

ఎప్పుడో కానీ పెదవి విప్పని సోనియా ఒక్కసారిగా ఈ శబ్దప్రళయాల్ని సృష్టిస్తుంటే ఆశ్చర్యంగానే వుంటుంది. ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేసిన తొలి నాళ్ళల్లో, ‘ఏది రాసిస్తే అది చదివే వారు.’ కడకు ‘కిరాణా సరుకుల జాబితా రాసిచ్చినా చదివేస్తారు’ అంటూ కార్టూనిస్టులు అప్పట్లో వెటకారాలాడారు కూడా. కానీ ఇప్పుడు, తాను మాట్లాడటమే కాదు, తాను ‘ఏది శాసిస్తే, అదే మాట్లాడాల’ని సాటి సభ్యులకు పార్లమెంటు నిండు కొలువులో మాట్లాడుతున్నారు.

ఈ మార్పు వెనుక ఎవరున్నారు? వెనుక కాదు ముందు వున్నారు. ఒకే ఒక్కరు: రాహుల్‌ గాంధీ.

రాహుల్‌ గాంధీని ప్రధానిని చెయ్యాలి. ఈ ఒక్క కోరిక కోసమే 2004 నుంచి పావులు కదుపుతున్నారు. ఈ కోరిక ఎవరికయినా వుండవచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌కు లేదూ? కేంద్ర మంత్రి శరద్‌ పవార్‌కు లేదూ? కానీ వీళ్ళు ప్రధాని కావాలనుకోవటానికీ, రాహుల్‌ ప్రధాని కావాలనుకోవటానికీ ఒక తేడా వుంది. ములాయమయినా, పవారయినా – ఏదోరకంగా ప్రధానయితే చాలు అనుకుంటారు. కానీ ‘రాజకుమారుడు’ మొదట్లో రాహుల్‌ అలాంటి ‘అల్లాటప్పా’ ప్రధాని కావాలనుకోలేదు. సోనియా కూడా రాహుల్‌ని ఒక ‘సంకీర్ణ’ ప్రధానిగా చూడాలనుకోలేదు.

ఏ పొత్తూ లేకుండా, ఎవరి మద్దతూ లేకుండా, కాంగ్రెస్‌ సర్వ స్వతంత్రంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ప్రధాని కావాలి. అంతే కానీ, మన్‌ మోహన్‌ సింగ్‌ లాగా యూపీయే సంకీర్ణ ప్రభుత్వానికి కాదు. ఈ కలను మోసుకు తిరుగుతున్న తల్లీ , కొడుకులకు అది కలగానే మిగిలిపోయింది. తాము అధికారంలో వున్న సర్కార్ల కౌంటింగ్‌ యూపీయే-2, యూపీయే-2 అంటూ మొదలయిందే తప్ప, గతంలో నెహ్రూ, ఇందిరా గాంధీ సర్కారుల్లాగా కాంగ్రెస్‌-1, కాంగ్రెస్‌-2 అంటూ లెక్క మొదలు కాలేదు. నెహ్రూ- గాంధీ కుటుంబ సభ్యులకు ‘కుర్చీ’ని పంచుకోవటం కుదరదు. చాలా ఇబ్బందిగా భావిస్తారు. వారు ప్రధానులుగా కొలువుతీరితే తమ సొంత పార్టీ మంత్రివర్గంతోనే, కొలువు తీరాలి.

అయితే ఇలాంటి ‘సంకీర్ణ’ ప్రధాని అవకాశాలు ఇంత వరకూ నెహ్రూ- గాంధీ కుటుంబ సభ్యులకు రానే లేదా? ఎందుకు రాలేదూ? ఒక సారి రాజీవ్‌ గాంధీకి వచ్చింది. మరో సారి సోనియా గాంధీకి వచ్చింది. ఇద్దరూ వేర్వేరు కారణాలతో తిరస్కరించారు. రాజీవ్‌ గాంధీకి స్వతంత్రంగా కాంగ్రెస్‌ పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేనప్పుడు, చంద్రశేఖర్‌ ను ప్రధానిగా కూర్చోబెట్టి తాను మద్దతు ఇచ్చారు కానీ, తాను ప్రధానిగా కూర్చోలేదు. మిత్రుల సహాయంతో యూపీయే సర్కారు-1 ను ఏర్పాటు చేసి తాను ప్రధానిగా వుండే అవకాశం వచ్చినా, ఆ పీఠంలో మన్‌ మోహన్‌ సింగ్‌ను కూర్చోబెట్టి, తాను అంతకన్నా పెద్ద కుర్చీ (యూపీయే చైర్‌ పర్సన్‌ కుర్చీ) వేసుకుని ఆయన నెత్తి మీద కూర్చున్నారు.

ఇప్పుడు నడుస్తున్నది ‘సంకీర్ణ’ యుగమని తెలిసి కూడా- తల్లీ, కొడుకులు( సోనియా, రాహుల్‌లు) గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్‌ స్వతంత్ర సర్కారును కేంద్రంలో ఏర్పాటు చేయాలని చూస్తూ వచ్చారు అందు కోసం, రాహుల్‌ ను అత్యంత ‘జనాకర్షక ప్రధాని అభ్యర్థి’ గా తీర్చిదిద్దటానికి ప్రయత్నించారు. కానీ, రాను, రాను చిన్నా, చితకా పార్టీల ప్రభావం వివిధ రాష్ట్రాలలో పెరిగి పోయింది. వారిని మిత్రులుగా చేసుకుంటేనే కానీ, సర్కారు ఏర్పాటు చేయలేని స్థితి మరింతగా పెరిగింది. గత ఏడాది కాలంగా అయితే, అసలు కాంగ్రెస్‌, బీజేపీ వంటి మేజర్‌ పార్టీలే, చిన్న పార్టీల కూటమికి మద్దతు ఇచ్చి సర్కారును ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందేమో నన్న జోస్యాలు కూడా వెలువడుతున్నాయి.( ఇలాంటి జోస్యం అద్వానీ కూడా చెప్పారు.)

ఈ వాస్తవాన్ని అతికష్టం మీద తల్లీ,కొడుకులు స్వీకరించారు. అంతే రాజకీయం మారిపోయింది. 2014 నాటికి రాహుల్‌ గాంధీయే యూపీయే ప్రధాని అభ్యర్థి అని దాదాపు ఖరారు అయిపోయింది. గత మూడు వారాల్లోనూ, కేంద్ర మంత్రుల, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల నోటి వెంట ఈ ఆకాంక్ష వెలువడింది. కేంద్ర మంత్రి బెని ప్రసాద్‌ వర్మ అయితే- ప్రధాని పీఠంలో రాహుల్‌ కూర్చుంటారని ఖరాఖండిగా చెప్పేస్తే, సోనియాకు అత్యంత సన్నిహితురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ ‘భావి ఆశాకిరణం’ గా రాహుల్‌ ను కొనియాడారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అయితే 2014 లో రాహులే అభ్యర్థి అని తేల్చి పారేశారు. అయితే ఇంకొందరు- ఈ లోపుగానే మన్‌ మోహన్‌ సింగ్‌ ను తొలగించి, రాహుల్‌ గాంధీని కూర్చోబెడతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బొగ్గు గనులను అపాత్రులకు ధారాదత్తం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మన్‌ మోహన్‌ సింగ్‌ రాజీనామా చేయాలన్న ఎన్డీయే డిమాండ్‌ను పెరగనీయటం వెనుక ‘కాంగ్రెస్‌ అంతర్నాటకం’ వుందని మిత్రపక్షమైన సమాజ్‌ వాదీ పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వంకన రాహుల్‌ గాంధీనే ఆ సీట్లో కూర్చోబెట్టే కుటిల యత్నం చేస్తున్నారని వారి ఆరోపణ. అయితే సోనియా చేతి లో ‘రోబో’ గా వున్న మన్‌మోహన్‌ను పక్కన పెట్టటానికి కూడా ఇంత నాటకం అవసరమా? మద్దతు ఇచ్చే పక్షాల దృష్టిలో నుంచి చూసినప్పుడు, మన్‌ మోహన్‌ కాకుండా, రాహుల్‌ అని హఠాత్తుగా వుంటే, వారు వెనువెంటనే మద్దతు ఉపసంహరించుకునే అవకాశం కూడా వుంది. కాబట్టి ‘మసి’ అంతా మన్‌ మోహన్‌కు పూసేశాక, రాహుల్‌ ని ముందుకు తెస్తే, వారు కాదనలేరు కదా!

అందుకే (రాష్ట్రపతి అయ్యాక ) ప్రణబ్‌ లేని సమయంలోనూ, (నామ్‌ సమావేశాలకు వెళ్ళాక) మన్‌మోహన్‌ లేని వేళలోనూ, సోనియా గాంధీ స్వరం పెంచారు. తామిక ‘దాదా’లతోనూ, ‘రోబో’లతోనూ రాజకీయం నడపమనీ, తామే రంగంమీదకు వచ్చేస్తామనీ, సోనియా గాంధీ సంకేతాన్నిచ్చేశారు. ఇప్పటికే రాహుల్‌ గాందీకి పార్టీలో వున్నత స్థానం కల్పించారు. ఆమె చికిత్స కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా పగ్గాలు రాహుల్‌ చేతికే ఇచ్చారు. రాహుల్‌ కూడా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించేశారు. అంతే కాదు, తన రాజకీయ భవిష్యత్తును పార్టీ అధినాయకురాలు నోనియా, ప్రభుత్వ నేత మన్‌మోహన్‌ నిర్ణయించాలని- అన్నారు. అంటే, మన్‌మోహన్‌ కేబినెట్‌లో పనిచేయించటానికి రాహుల్‌ని సిధ్దం చేసినట్టుగా విశ్లేషకులు భావించారు. అయితే రాహుల్‌ వెంటనే మంత్రిగా పనిచేయవచ్చు. చేయక పోవచ్చు. కానీ, ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను ముందు నిలబెట్టాలంటే, మన్‌ మోహన్‌ సింగ్‌ను ఏదో మేరకు చిన్నబుచ్చాలి. ‘ప్రయోజకుడ’ని పొగడిన అధిష్ఠానమే ఏదో రోజున ‘అప్రయోజకుడు’ అని తేల్చాల్సి వుంటుంది. లేకుంటే, రాహుల్‌ కు దారి ఏర్పడదు. అందుకే సోనియా ‘మన్‌మోహన్‌’ తో మాట్లాడించటం మాని , తానే మాట్లాడుతున్నారు.

ఇప్పుడు రాహుల్‌ ప్రధానిగా అర్హుడు- అన్న విషయాన్ని తమకు మద్దతు ఇచ్చే, ఇవ్వబోయే పక్షాలతో ముందుగానే ఒప్పించాలి. అవసరమయితే ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కాస్త వెనక్కి తగ్గి ఆ పార్టీల చేత ప్రభుత్వాలు ఏర్పాటు చేయించటానికి సహకరిస్తుంది. అందుకే, గతంలో లాగా కాంగ్రెసేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను స్థాపించాలన్న దీక్షకు స్వస్తి చెప్పారు. ఇప్పుడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఏమవుతుందన్నది అప్రస్తుతం. సోనియా కు కావలిసింది. రాహుల్‌ని ప్రధానిని చేయటానికి అవసరమైనన్ని ఎంపీ సీట్లు కావాలి. అందుకు ‘కేంద్రం మాది- రాష్ట్రం మీది’ అనే రాజకీయ పథకానికి తెర లేపారు. ఈ పార్టీలు పార్లమెంటు రాజకీయాల్లో సోనియా ప్రత్యక్ష పాత్రను ఆమోదిస్తే, రాహుల్‌ ప్రత్యక్ష పాత్రను కూడా అమోదిస్తాయి. ఇది అధికారికమయిన ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’!! పాపం! నెహ్రూ- గాంధీ కుటుం సభ్యులను ‘సంకీర్ణం’ రాజకీయం కడకు ఈ స్థితికి తీసుకు వచ్చింది.

-సతీష్‌ చందర్‌

29-8-12

 

 

 

 

1 comment for “సోనియా కోపం- రాహుల్‌ కోసం!

  1. Sir, The article is informative. In this connection no comments on Comrades Prakash Karat,Suravaram Sudhakara Reddy, B. V. Rahavulu, k. Narayana and other left parties leaders and their role to show an alternative for the people. what is the alternative.

Leave a Reply