2014- ఎ హేట్‌ స్టోరీ!

టాపు(లేని) స్టోరీ:

‘ఐ హేట్‌ యూ’

Photo By: rajkumar1220

ఈ మాట అనటం ‘అ లవ్‌ యూ’ అన్నంత ఈజీ కాదు. అందుకే రచయితలు- ప్రేమ కథలు రాసినంత సులువుగా ద్వేష కథలు రాయలేరు. కానీ రహస్యమేమిటంటే- ద్వేషం ఇచ్చిన కిక్కు, లవ్వు ఇవ్వదు. తెలుగులో ఫార్ములా ఫ్యాక్షన్‌ సినిమాలే తీసుకోండి. ఫస్ట్‌ హాఫ్‌ ముద్దులూ, సెకండ్‌ హాఫ్‌ తొడ కొట్టుళ్ళూ. అంటే ఇంటర్వెల్‌కు ముందు డ్యూయెట్లూ, ఇంటర్వెల్‌ తర్వాత నరుకుళ్ళూ, చంపుళ్ళూ. ఈలలు దేనికి వస్తాయి?పగకే. ప్రేమకే. రాజకీయాల్లోనూ అంతే.

ప్రేమకు పడే వోట్ల కన్నా, పగకు కురిసే వోట్లే ఎక్కువ.

ద్వేషానికి కానీ, పగ పట్టటానికి కానీ పెద్ద ధైర్యం అక్కర్లేదు. అయితే చిన్న జాగ్రత్త తీసుకోవాలి. చూసి, చూసి ఏ ‘సిక్స్‌ ప్యాక్‌’ బాడీ వున్నవాణ్నో ద్వేషించ కూడదు. బలహీనుణ్ణీ, ‘ఉఫ్‌’ అంటే ఎగిరి పోయేవాణ్నీ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు అందరూ చూస్తుండగానే, అతడి చెంప మీదవీరోచితంగా లాగి ఒక్కటివ్వ వచ్చు. వాడు స్పృహ తప్పి పడిపోయి, మళ్ళీ లేచి,

‘అన్నా, నాది గాంధీ మార్గమన్నా. కొంచెం గ్లూకోజ్‌ వుంటే ఇప్పించన్నా, రెండో చెంప చూపుతాను’ అంటాడు.

‘అదీ. అలా బుధ్ధిగా మసలుకో’ అని వార్నింగ్‌ ఇచ్చి వెళ్ళిపోవచ్చు.

అప్పుడు ద్వేషించటానికి మిగిలిన వాళ్ళకు కూడా ఒక మార్గం దొరుకుతుంది. ‘లేవ లేని వాళ్ళని కొట్టి, శక్తిమంతులమని నిరూపించుకోవచ్చన్న’ ద్వేష రాజకీయం అందరికీ అర్థమయి పోతుంది.

మెజారిటీ ప్రజలకు ఇలాగే మైనారిటీల మీద అకారణమయిన నూరి పోసి, తద్వారా తాము బలవంతులమన్న సంతృప్తిని మిగల్చవచ్చు.

జూనియర్లను సీనియర్లు చేసే ర్యాగింగ్‌లో ఇలాంటి ప్రతీకారమే వుంటుంది. మొ..మొ..మొద్దు సీనియరుకు కూడా మెరిక లాంటి జూనియర్‌ని … దే..దే..దే శానికి రాజధాని ఏ…ఏ..ది? అన్న ప్రశ్న అడగాలన్న కుతూహలం పెరిగి పోతుంది. అంతే కాదు నీటిఎనుమలా ఉబ్చిన మరో సీనియర్‌ వచ్చి- ‘నా అంత హేండ్‌ సమ్‌ గా వుండాలంటే ఏమి చెయ్యాలో తెలుసా?’ అని అడిగినా ఆశ్యర్యపోనవసరం లేదు. ‘తెలుసు సార్‌. డైటింగ్‌ చెయ్యాలి సార్‌. పూటకు ఆరు చికెన్‌ బిర్యానీలకు మించి ఎక్కువ తినకూడదు సార్‌’ అని జూనియర్‌ వణుకుతూ చెప్పినప్పుడు, నీటి ఎనుమ ఆనందానికి అంతువుండదు. అప్పుడు మెజారిటీ సీనియర్లంతా చప్పట్లే చప్పట్లు, ద్వేషానికున్న సానుభూతి ప్రేమకెక్కడ వుంటుంది చెప్పండి!?

తల వంచీ, వంచీ కుంచించుకుపోయిన కొత్త కోడల్నిచూస్తే, ఆమె యెత్తులో సగమున్న కోడల్ని చూస్తే మొత్తబుధ్ధి వేస్తుంది. ఇక ఆగుతుందా? మొత్తేస్తుంది. ఆమెకున్న కండలో పావు కండకూడా లేని ఆడపడచుకి కూడా వెంటనే మద్దతు ఇవ్వాలని పించి తానూ చెయ్యివేస్తుంది. ఒక్క కొత్త కోడలికి వ్యతిరేకంగా ఇల్లుఇల్లుంతా ఏకమవుతుంది. మోజు తగ్గాక, కట్నం ఖర్చయిపోయాక భర్త మద్దతుకు కూడా మెజారిటీకి చేరిపోతుంది. ఇక తర్వాత ఆమె ఏడిస్తే చాలు, అందరికీ ఆనందమే. కుమిలి కుమలి నవ్వే వికృతానందమే. ఈ ఆనందాన్ని రప్పించాలేకానీ, దావానలం లాగా ఇల్లు ఇల్లంతా వ్యాపించి పోతుంది.

ఈ ‘హేట్‌ స్టోరీని ఇంట్లోనే కాదు, ఒక ప్రాంతంలో నడప వచ్చు. ఒక రాష్ట్రంలో నడప వచ్చు. మొత్తం దేశంలోనే నడప వచ్చు.

సరిగ్గా ఇలాంటి ఫిలాసఫీనే నమ్ముకున్న నరేంద్ర మోడీ ఇంట గెలిచారు. రచ్చగెలవటానికి సిధ్ధంగా వున్నారు. ఆయన రాష్ట్రంలో పేరు మోసిన గుండాలను శిక్షించలేదు. అడ్డంగా బలిసిన లేద అడ్డగోలు గా సంపాదించిన వారిని నిలువరించలేదు. సంపన్నులను కొట్టి పేదలకు పెట్టలేదు. ఆయనంటే మైనారిటీలకు భయం. అంతే ఈ ఒక్క పాయింటూ చాలు. దీంతో మెజారిటీ వాదులు ఎక్కడ లేని ఆనందం. ఇదే ఫార్ములా దేశానికి వర్తింప చేస్తే ఎలా వుంటుంది? బ్రిలియంట్‌ ఐడియా. మెజారిటీని కూడ గట్ట వచ్చు. మైనారిటీ మత విశ్వాసం గల వారిని తిట్టుకుంటూ పోవటానికి పెద్ద సిధ్ధాంతమూ అవసరం లేదు. పెట్టు బడీ అవసరం లేదు. అయితే ఈ ద్వేషం మీద రాజకీయం నడపటంలో ఆయన ఆద్యుడూ కాడు. చివరి వాడూ కాడు. ఏమయినా ఆయన ప్రదాని అయితే 2014 ఎన్నికలలో ఒక చక్కటి ‘హేట్‌ స్టోరీ’ రాజకీయ తెరమీద చూస్తూ, కన్నీళ్ళు వచ్చేంతగా మెజారిటీ ప్రజలు చప్పట్లు కొట్టవచ్చు.

న్యూస్‌ బ్రేకులు:

వాయిదాల’ రవి

తెలంగాణ పై నిర్ణయం తీసుకోవటం అప్పడం , దోశ వేసినట్లు కాదు. -కేంద్ర మంత్రి, వాయిలార్‌ రవి

ఆశ, దోశ, అప్పడం- అంటే ఇదేనా ‘వాయిదాల’ రవి గారూ!?

పోలవరం టెండర్ల ఖరారు ఖచ్చితంగా రాజకీయ నిర్ణయమే.

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి. నారాయణ

అదెప్పుడూ ‘పోల్‌’ వరమే లెండి!!

ట్విట్టోరియల్‌

పెద్ద మనుషులంటేనే ‘బుడ్డు’లన్ని వేరురా!

‘హౌస్‌’ అన్నాక రెండు గుమ్మాలుండాలి. ఒకటి: వీధి గుమ్మం. రెండు:దొడ్డి గుమ్మం. ‘హౌస్‌’ యజమానులయినంత మాత్రాన, ప్రతీ సారీ వీధి గుమ్మం నుంచే రావాలని రూలు లేదు. ఒక్కొక్క సారి వెనక నుంచే రావాలిసి వుంటుంది. ఇంటి సభ్యుల్లో మరీ ‘పెద్ద మనుషులు’ంటే, వారు వీధి గుమ్మం నుంచి అసలు రాలేరు. గుమ్మం తలకు తగిలి తల బొప్పి కడుతుంది. వారు చచ్చినట్టు దొడ్డి గుమ్మం నుంచి రావలసిందే. లోకులు చూస్తుండగా, లోకుల మద్దతుతో వీరు వీధి లోనుంచి రాలేరు. ‘హౌస్‌’లు వ్యక్తులకే కాదు, రాష్ట్రాలకూ దేశాలకూ వుంటాయి. దేశంలో అయితే లోక్‌ సభ వీధిగుమ్మం. రాజ్య సభ దొడ్డి గుమ్మం. రాష్ట్రంలో అయితే శాసన సభ వీధి గుమ్మం. శాసన మండలి దొడ్డి గుమ్మం. ఇప్పుడు దొడ్డి గుమ్మం ద్వారా వెళ్ళటానికి కొంత మందికి రాష్ట్రంలో అవకాశం వచ్చింది. ఇక చూడండి. పెద్ద మనుషులు ముసుగు వీరుల్లా మారిపోయారు. ఒకరికి తెలియకుండా ఒకరు ‘హౌస్‌’లోకి చొరబడాలని రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ‘పరమానందయ్య శిష్యుల కద’¸ లో ఒక పాట గుర్తుకొస్తోంది: ‘పెద్ద మనుషులంటేనే బుధ్ధులన్ని వేరురా!’

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

లెఫ్టే రైటు!

పలు ట్వీట్స్‌: త్రిపురలో వరుసగా లెఫ్ట్‌ గవర్నమెంట్‌ వస్తుంది. ఇది ‘రైట్‌’ కాదు!

కౌంటర్‌ ట్వీట్‌: అవును కదా! అక్కడ ‘రైటిస్టులు’ లేరు. మోడీ ఇంకా పర్యటించినట్టు లేరు.

ఈ- తవిక

తలుపు బార్లా!

అదుగో

అదే పల్లెటూరు!

ఎలా చెప్పానో తెలుసా?

పచ్చని ప్రకృతీ, పక్షులూ, గోవులూ-

ఇవేమీ కావు.

అక్కడ గుమ్మాలకు తలుపులు పీకేశారు-

గాలి కోసం

కరెంటు ఎప్పటికీ రాదని

వారికి తెలిసి పోయింది.

బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘నువ్వు ప్రేమించాల్సింది కారున్న కుర్రాణ్ణి కాదు, పెట్రోలు బంకున్న కుర్రాణ్ని’

‘ఎందుకు నాన్నా? సైకిల్‌ షాపున్న కుర్రాణ్ని ప్రేమించేశాను . పెట్రోలుతో పనేలేదు’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

పాదయాత్ర చేస్తే పోయేదేమీ లేదు, జత చెప్పులు తప్ప!

-సతీష్ చందర్

(సూర్య దినపత్రిక 4మార్చి 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply