Category: ‘భయో’డేటా

‘సెన్సేషనల్‌’ కుమార్‌ షిండే.

పేరు : సుశీల్‌ కుమర్‌ షిండే

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘హోమ్‌’ మేకర్‌( ఇల్లు అనగా దేశాన్ని చక్కదిద్దే ఉద్యోగం. అయినా మహిళల సమస్యల్ని అర్థం చేసుకోవటం లేదని ఆడిపోసుకుంటారు.)

ముద్దు పేర్లు : ‘షిండేలా'(నల్లజాతి నుంచి మండేలా వచ్చినట్లు, దేశంలో అట్టడుగు వర్గాలనుంచి నేను వచ్చానని నా భక్తులూ, అభిమానులూ భావిస్తారు.), పెద్ద పోలీసు. ‘సెన్షేషనల్‌ కుమార్‌ షిండే’

‘రోబో’ కాంత్‌

పేరు :రజనీ కాంత్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: స్టారాధిస్టారుడు.

ముద్దు పేర్లు : వాజీ. శివాజీ. శివాజీరావు గైక్వాడ్‌ ( అసలు పేరు ఇప్పటికీ ముద్దుగానే వుంటుంది.)

విద్యార్హతలు : బీ.ఎస్‌.సి . అంటే తెలుసా? (బ్యాచిలర్‌ ఆఫ్‌ స్వింగింగ్‌ సిగార్‌) చేతిలో సిగార్‌ను(సిగరెట్టును) విసిరితే అది రెండు పల్టీలు కొట్టి నోట్లో పడుతుంది.(నాలా చాలా మంది ప్రయత్నం చేసి మూతులు కాల్చుకున్నారు.బ్రహ్మానందం లాంటి ‘పొట్టి రాయుడు’ పక్కవాళ్ళ మూతుల్ని కాలుస్తారు.)

‘హిందీ’త్వ మోడీ

పేరు : నరేంద్ర మోడీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: భారతీయ(జనతా) ప్రధాని

ముద్దు పేర్లు : మూడీ(వోటర్ల మూడ్స్‌ మారుస్తానని) త్రీడీ( మూడు సార్లు గెలవటమే కాదు, త్రీడీలోప్రచారం చేశానని), కేఢీ(అపార్థం చేసుకోకండి. ‘కే’ అంటే కేశూభాయ్‌ పటేల్‌, గుజరాత్‌లో రాజకీయ భీష్ముడు. ఆయన్నే ఎదుర్కొన్నాను.)

విద్యార్హతలు : బి.పి.ఎల్‌( అంటే ఐపిల్‌ అనుకునేరు. కానీ కాదు. బ్యాచిలర్‌ ఆఫ్‌ పోల్‌ మేనేజ్‌మెంట్‌. వోట్లు ఎలా వేయించుకోవాలో తెలిపే శాస్త్రం.) రాజనీతి శాస్త్రంలో నేను చేసిన మాస్టర్స్‌ డిగ్రీ కంటె ఇది పెద్దది.

‘ఏక్‌’ నారాయణ్‌!

పేరు :జయప్రకాష్‌ నారాయణ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం : తెలుగు ‘లోక్‌’ నాయక్‌ (నా పార్టీ ‘లోక్‌ సత్తా’లోనే ‘లోక్‌’ వుంది. ‘లోక్‌’ పాల్‌ను సమర్థించాను. ఇప్పుడు ‘లోకా’యుక్త కోసం ఉద్యమిస్తాను. కానీ నా ప్రయత్నాలను ప్రతీసారీ మీడియా గుర్తిస్తున్నట్లుగా ‘లోకం’ గుర్తించటం లేదు.)

ముద్దుపేర్లు :ఆంధ్రప్రదేశ్‌లో ‘జెపి’. మిగతా రాష్ట్రాల్లో జూనియర్‌ జెపి.(అక్కడ జయప్రకాశ్‌ నారాయణ్‌ అంటే, యమర్జన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన సీనియిర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ గుర్తుకొస్తారు.

పిల్ల ‘మర్రి’!

పేరు మర్రి శశిధర రెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: నాలుగో కృష్ణుడు… అనగా రాష్ట్రానికి నాలుగో ముఖ్యమంత్రి

ముద్దు పేర్లు : పిల్ల ‘మర్రి'( అవును. నాన్న పెద్ద ‘మర్రి’. మర్రి చెట్టు నీడన మరో మొక్క పెరగదంటారు. కావచ్చు. కానీ మరో మర్రి పెరుగుతుంది.) జూ.మర్రి

విద్యార్హతలు : ముఖ్యమంత్రి కావటానికి కావలసిన అర్హతలన్నీ వున్నాయి. మరీ ముఖ్యంగా రిజర్వేషన్‌ వుంది. కొన్ని ఉద్యోగాల్లో మాజీ సైనికులకు కోటా ఇచ్చినట్లు, రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వోద్యోగాలకు మాజీ ముఖ్యమంత్రుల తనయులకు రిజర్వేషన్‌ ఇస్తున్నారు.

‘ఉత్తర'(ఆంధ్ర) కుమారుడు!

పేరు బొత్స సత్యనారాయణ

దరఖాస్తు చేయు ఉద్యోగం: మార్పులేదు. ముఖ్యమంత్రి ఉద్యోగమే( కలిసి వుంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, విడిపోతే సీమాంధ్ర ముఖ్యమంత్రి. మరోమారు విడిపోతే ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి.) ముఖ్యమంత్రి పదవిని ఆశించటంలో తప్పులేదని ఎన్నోసార్లు చెప్పాను.

ముద్దు పేర్లు : ‘ఉత్తర’ కుమారుడు(ప్రగల్బాలు పలుకుతానని కాదు సుమా! ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాడిని. ఉత్తరాంధ్ర ప్రజలకు రాకుమారుడిని కూడా. నేనంటే అంతటి అభిమానం చూపిస్తారు.) చదివింది మహారాజా కాలేజిలో కదా- ఆమాత్రం రాజసం ఉట్టిపడుతుంది లెండి.

‘నల్లాని’ కిరణం!

పేరు నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: ఎన్నికల ముఖ్యమంత్రి.( ఇప్పటికయితే ముఖ్యమంత్రిగా వున్నాను. కానీ 2014 ఎన్నికలకు జనాకర్షణ వున్న వ్యక్తిని నియమిస్తారని ఊహాగానాలు వున్నాయి. కానీ నేనయితే నమ్మటం లేదు. ఎందుకంటే నాకున్నంత జనాకర్షణ కాంగ్రెస్‌లో మరెవరికి వుంది. చీకటి రాత్రుల్లో కూడా (కరెంటు పీకేశాను కదా!) నేను ప్రకాశించటం లేదూ..!? అందుకే ఎన్నికల ముఖ్యమంత్రిగా నన్ను మించిన నేత కాంగ్రెస్‌కు మన రాష్ట్రంలో దొరకరని చెబుతున్నాను.)

‘కుప్పిగంతుల’ హనుమంతరావు

పేరు వి.హనుమంత రావు

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘వీర భక్త హనుమాన్‌’. అవును నా పేరు మాత్రమే కాదు, నా ఉద్యోగం పేరు కూడా. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం దగ్గర ఇలాంటి ఉద్యోగాలు వుంటాయి. పూర్వం డి.కె. బరూవా అనే ఒకాయన వుండే వారు. ఆయన ఈ ఉద్యోగమే చేశారు. కాబట్టే ‘ఇందిర అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర’ నినాదం ఇవ్వగలిగారు. ఇప్పుడు నేను ‘ఇందిర’ బదులు ‘సోనియా’ అంటాను. అంతే తేడా.

అన్నా ‘బేజారే’!

పేరు : అన్నా హజారే

దరఖాస్తు చేయు ఉద్యోగం: మాజీ మహాత్ముడు ( అంతా రాని ‘లోక్‌పాల్‌’ మహిమ. లేకుంటే, మాజీ సైనికుడిగానే మిగిలిపోయేవాణ్ణి)

ముద్దు పేర్లు : అన్నా( ముచ్చటొచ్చి ‘అన్నా’నంటారు. నిజంకాదు. నేనేదయినా ‘అన్నా’నా? కేవలం విన్నానంతే-కిరణ్‌ బేడీ చెప్పిందీ,కేజ్రీవాల్‌ చెప్పిందీ.), ‘బేజారే'(లక్షల్లో జనాన్ని చూసి ఏడాది తర్వాత వందల్లో చూడాల్సి వస్తే బేజారు గా వుండదూ!)

విద్యార్హతలు : నేనొప్పుకోను.. విద్యే అర్హత అంటే నేనొప్పుకోను. ఏడవతరగతి వరకూ చదువుకున్నాను. మనదేశంలో రాజ్యాంగాన్ని విమర్శించటానికి, మార్చటానికి చదువు అవసరమంటారా?(రాయటానికయితే చదువులు కావాలేమో లెండి.)

‘ఫెరా’ సారథి!

పేరు : కె.పార్థ సారధి

దరఖాస్తు చేయు ఉద్యోగం: అంత ఆశ లేదు. ఉన్న ఉద్యోగం(రాష్ట్ర మాధ్యమిక విద్యా శాఖామంత్రి పదవి) ఊడకుండా వుంటే చాలు. (రెండేళ్ళ శిక్ష పడింది. నిజమే. రెండేళ్ళ పదవీ కాలం కూడా వుంది.)

ముద్దు పేర్లు : ‘ఫెరా’సారధి, పార్థ ‘ఫెరా’రథి. ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఫెరా) ఉల్లంఘించాననే శిక్ష వేశారు లెండి. (రాజీనామా చేయకుండా పదవినే అంటి పెట్టుకుని వుంటున్నానని కిట్టని వారు కొందరు -‘స్వార్థ’ సారధి అంటున్నారు లెండి. నా అనుచరులయితే ఇప్పటికీ నన్ను ‘నిస్వార్థ’ సారధి అంటారు)

‘రణ’బ్‌ ముఖర్జీ

పేరు : ప్రణబ్‌ ముఖర్జీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: క్రియాశీల రాష్ట్రపతి( కలామ్‌, ప్రతిభాపాటిళ్ళు ‘నామమాత్రపు’ రాష్ట్రపతుల్లాగానే వున్నారు.) రాష్ట్రపతి పదవి వచ్చింది కానీ, తర్వాత మెట్టు ఇదే.

ముద్దు పేర్లు : ‘దా’.. ‘దాదా’.. ‘రణ’బ్‌ ముఖర్జీ( రణం చేస్తాను కానీ, రాజీ పడి, ‘రబ్బర్‌ స్టాంపు’ గా మారి ‘ప్రణబ్బర్‌’ ముఖర్జీ అని పించుకోను.)

విద్యార్హతలు : మాస్టర్‌ ఇన్‌ ట్రబుల్‌ షూటింగ్‌( కాంగ్రెస్‌ గడ్డుకాలంలో వున్నప్పుడెల్లా గట్టెక్కించే వాడిని.. ఆ పార్టీ గడ్డుకాలంలో లేనిదెప్పుడు లెండి!)

టేకి’టీజీ’ వెంకటేష్‌

పేరు : టి.జి.వెంకటేష్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: హై.సీమ ముఖ్యమంత్రి( అంటే హైదరాబాద్‌తో కూడిన రాయలసీమ ముఖ్యమంత్రి)

ముద్దు పేర్లు :’టేకిటీజీ’ వెంకటేష్‌(నన్ను ఎవరైనా తిడితే ‘టేకిటీజీ’ అంటాను. నేను తిట్టిన ఈ ‘ఐయ్యేఎస్‌’లు ఎందుకు తీసుకోరో?

విద్యార్హతలు : బీ ‘కామ్‌’. (అయినా ఎప్పుడూ ‘కామ్‌’ గా వుండను. ఏదో ఒక ఆందోళన చేస్తూనే వుంటాను)

హోదాలు : ఎంత వ్యాపారం చేసినా, ప్రభుత్వాధికారులు పోజుకోడుతున్నారనే కదా- ఎమ్మెల్యే అయ్యాను. తర్వాత మంత్రి అయ్యాను. మీరే చెప్పండి

‘ఏటూజెడ్‌’ యూరప్ప!

పేరు : బి.ఎస్‌. యెడ్యూరప్ప

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘నాజీ’ ముఖ్యమంత్రి. (అంటే మామూలు ‘మాజీ’ ముఖ్యమంత్రి అని కాదు. నియతలా శాసించే ముఖ్యమంత్రి అన్న మాట.)

ముద్దు పేర్లు : ఎ-టూ-జెడ్‌ యూరప్ప(కర్ణాటక లో బీజేపీ యూనిట్‌ వరకూ ఆది నుంచి అంతం వరకూ నేనే.)

విద్యార్హతలు : గుమస్తా పనికి సరిపోయే చదువనుకునేరు. అదే సమస్తానికి సరిపోతుంది. నా క్యాంపులో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో, లెక్కలేసుకోవటానికి ఆ మాత్రం చదువు చాలదా?

కొక్కొ ‘రోకో’ నారాయణ

పేరు : నారాయణ

దరఖాస్తు చేయు ఉద్యోగం: ఉపగ్రహ ప్రతిపక్షనేత.( చంద్రుడే-అనగా చంద్రబాబే- విక్రయమయిన ‘భూమి’ చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తిరుగుతున్నారు. తిరిగి ఆ చంద్రుడు చుట్టూ తిరిగే ఉపగ్రహం నారాయణ)

‘సంఘ్’మా

పేరు : పి.ఎ.సంగ్మా

దరఖాస్తు చేయు ఉద్యోగం: తొలి గిరిజన రాష్ట్రపతి అభ్యర్థి( గెలవవచ్చు. గెలవక పోవచ్చు. అసలు ఒక గిరిజనుడు ఈ పదవికి నామినేషన్‌ వేయటంతో నే చరిత్ర సృష్టించాను. ఓటమి తప్పదని ఇలా మాట్లాడుతున్నానని అనుకోకండి.)

ముద్దు పేర్లు : ‘సంఘ'(పరివార)మా.( క్రైస్తవమతస్తుడయి వుండి కూడా హిందూత్వ సంఘపరివారం మద్దతుతో నామినేషన్‌ వేశాను. పదవి కోసం సెక్యులరిజాన్ని కాస్సేపు పక్కన పెట్టవచ్చు.) పీయ్యే.( ఎవరికీ పర్సనల్‌ అసిస్టెంట్‌ను కాను. పీయ్యే- అంటే ప్రెసిడెన్షియల్‌ యాస్పిరెంట్‌ అనగా రాష్ట్రపతి ఆశావహుణ్ణి.

‘కలతా’ బెనర్జీ

పేరు : మమతా బెనర్జీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: యావజ్జీవ ముఖ్యమంత్రి వైభవం (పశ్చిమ బెంగాల్‌ జ్యోతిబసు రికార్డును కొట్టాలి కదా!)

ముద్దు పేర్లు : కోల్‌కొతా కాళిక, యుపీయే చండిక,

విద్యార్హతలు : సంకీర్ణ రాజకీయాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, ఇంటిపోరులో డాక్టరేట్‌. ‘దీదీ’గిరిలో డిప్లమా.

పగటి ‘చంద్రుడు’

పేరు : నారా చంద్రబాబు నాయుడు

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘అప్రధాన’ ప్రతిపక్షనేత( పేరుకు ప్రతిపక్షనేతనే. కానీ ఎక్కడా ప్రధానమైన పోటీ ఇవ్వను.)

ముద్దు పేర్లు : పగటి ‘చంద్రు’డు.(ఉంటాను. కానీ కనపడను. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలలోనూ వున్నాను. సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికలలోనూ వున్నాను. అంకెల్లో మిగలను. అదే ఇబ్బంది.)

‘జగడ’ పాటి!

పేరు : లగడపాటి రాజగోపాల్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘సమైక్యాంధ్ర’ ముఖ్యమంత్రి

ముద్దు పేర్లు : ‘రగడ’ పాటి, ‘జగడ’పాటి,

విద్యార్హతలు : బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫాస్టింగ్‌( బిఎఫ్‌). నరాల ద్వారా శరీరానికి కావలసినవి పొందుతూ, కేవలం నోటి ద్వారా తిండిని బంద్‌ చేసే నిరాహార దీక్షలు చెయ్యటం నా స్పెషలైజేషన్‌. అయితే ఇందులో నా కన్నా ముందు ‘కేసీఆర్‌’ మాస్టర్స్‌ డిగ్రీ తీసుకున్నారు

‘ఆత్మ’రాముడు!

పేరు : కెవిపి రామచంద్రరావు

దరఖాస్తు చేయు ఉద్యోగం: రెండు ఉద్యోగాలు: కాంగ్రెస్‌లో వైయస్‌ వాది, వైయస్సార్‌ కాంగ్రెస్‌లో కాంగ్రెస్‌ వాది.

ముద్దు పేర్లు : ‘ఆత్మ’రాముడు.(వైయస్‌ నన్ను తన ‘ఆత్మ’ గా పిలిచేవారు)

విద్యార్హతలు : బ్యాచిలర్‌ ఆఫ్‌ సీక్రెట్స్‌( రహస్యాలు మింగెయ్యటంలో పట్టా)

‘తడిసి మోపి’ దేవి

పేరు : మోపిదేవి వెంకటరమణ

దరఖాస్తు చేయు ఉద్యోగం: నిరపరాధి( ఒకసారి అరెస్టయిన మంత్రికి ఈ హాదా కన్నా గొప్పది వుండదు.)

ముద్దు పేర్లు : ‘తడిసి మోపి’ దేవి, సంతకాల వీరుడు.