Category: తకిటతక..తోముతా

ఆంధ్రభూమి దినపత్రికలో ప్రతి ఆదివారం ప్రచురితమవుతున్న కాలమ్

కాక్ ‘పిట్ట’ కథలు

ఒక జీపు టాపూ, ఒక మైకూ, ఒక నోరూ, చుట్టూ వంద మంది జనం- ఉంటే చాలు, అదే ఎన్నికల ప్రచారం! ఇలా అనుకునే రోజులు పోయాయి.

ఒక తిట్టూ, ఒక జోకూ, ఒక కథా, ఒక ఫ్లాష్‌ బ్యాకూ- వీటితో పాటు ఓ వంద మంది ‘ఈల’పాట గాళ్ళు, మరో మంద మంది ‘చప్పట్ల’ మోత రాయుళ్ళూ వుంటేనే కానీ, ప్రచారం ఇవాళ రక్తి కట్టటం లేదు.

వీళ్ళుకూడా సుశిక్షితులయి వుండాలి. లేకపోతే, మాంచి ట్రాజెడీ సన్నివేశంలో మోతెక్కించేయగలరు. ‘మనల్ని ఎంతగానో ప్రేమించే మన దివంగత నేత మన మధ్య లేరు’ అన్నప్పుడు ఈల వేసేయగలరు. ‘కానీ ఆయన పేరు చెప్పి నేడు వోట్లు దండుకుంటున్నారు’ అన్నప్పుడూ చప్పుడు లేకుండానూ వుండగలరు. అందుకే, నాయకుల ‘కూత’లకే కాదు, కార్యకర్తల ‘మోత’లకు కూడా శిక్షణ అవసరం.

‘అబ్బోయ్’- ‘బాబోయ్’

కొంపన్నాక, కుటుంబం వుంటుంది. కుటుంబం అన్నాక కొన్ని వరసలుంటాయి. ఆ వరసల్లో కూడా రెండు రకాలుంటాయి:పడిచావని వరసలూ, పడి చచ్చే వరసలూ.

అత్తా-కోడలు. వామ్మో! నిప్పూ- గ్యాసూ అన్నట్లు లేదూ? అఫ్‌కోర్స్‌! కోడల్ని వదలించుకోవటానిక్కూడా అత్త ఈ వస్తువుల్నే వాడుతుందనుకోండి!

మామా-అల్లుడు. ఇదీ అంతే. అప్పూ- పప్పూ లాంటిది. మామ అప్పు చేస్తే, అల్లుడూ పప్పుకూడు వండిస్తాడు.

నవ్వు వెనక ఏడుపు!

నవ్వూ మందే.

ఇది తెలిసి పోయాక, పార్కుల్లో పువ్వులు బదులు, నవ్వులు పూసేస్తున్నాయి. చెట్లు కాదు, చెట్లంతంటి మనుషులు నవ్వేస్తున్నారు. ఎవరో చచ్చిపోతే, గుమిగూడి ఏడ్చినంత బిగ్గరగా గుండెలు పగిలేలా నవ్వేస్తున్నారు. ఇంకా చీకట్లు విడిపోకుండా, తెల్లవారకుండానే, క్రోటన్‌ పొదల మాటను తెల్లని దుస్తులతో, నిలబడి నవ్వుతుంటే, విఠలాచార్య తీసిన పాత సినిమాల్లో ‘కామెడీ దయ్యాలు’ నవ్వినంత విలాసంగా నవ్వేస్తున్నారు. చెమటోడ్చి, దిక్కులు పిక్కటిల్లేలా నవ్వేస్తున్నారు.

వోటు ‘వెయ్యి’

వోటు హక్కూ, వోటు హక్కూ- అని ఎవరూ గొంతు చించుకోనక్కర్లేదు.

వోటు హక్కు అంటే- వోటు కొనే హక్కూ, వోటు అమ్మే హక్కూ- అని వోటు రాని వాడిక్కూడూ తెలిసిపోయింది. ఎటొచ్చీ ఏ రేటుకి అమ్మాలీ, ఏ రేటుకి కొనాలీ- అన్న విషయంలోనే గందరగోళం- వుంది.

అన్నింటా బక్క వాడే నష్టపోతున్నాడు. పండిన పంట అమ్ముకోవటానికి పేద రైతుకు ఎన్ని కష్టాలున్నాయో- పేద వోటరుకి కూడా అన్ని కష్టాలున్నాయి. పంటకన్నా ‘మద్దతు ధర’ ఒకటి వుంటుంది. కానీ వోటుకి అలా కాదే..! ఏ రేటిస్తే, ఆ రేటే యిచ్చుకోవాలి.

‘ఇదేమి దురన్నాయం బాబూ!’ అంటే పట్టించుకునే నాధుడే లేడు.

బాబా! బాబా! బ్లాక్‌ షీప్‌!!

ఎదగ వచ్చు.

ఎవ్వరు ఎలాగయినా ఎదగ వచ్చు. నిలువుగా ఎదగవచ్చు. అడ్డంగా ఎదగవచ్చు.

లేదూ ముందు అడ్డంగా ఎదిగి, తర్వాత నిలువుగా ఎదగ వచ్చు.

ఎదగటం- ముఖ్యమనుకుంటే చాలు.

పదోతరగతి తప్పిన కుర్రాడు బస్సెక్కుతాడు. అతని కళ్ళ ముందే ఒక పెద్దాయన తన స్టాపులో గబగబా దిగిపోతుంటాడు. పర్సుజారి కుర్రాడి కాళ్ళ మీద పడుతుంది. తీసి కళ్ళకద్దు కుంటాడు. ‘తిరిగి పెద్దాయనకు ఇచ్చే వాణ్ణే కానీ, దిగి వెళ్ళిపోయాడు కదా!’ తనకు తాను సంజాయిషీ ఇచ్చుకుంటాడు. పర్సులో వెయ్యి. తర్వాత ఇలాగే బస్సు ఎక్కుతుంటాడు. ఎవరూ అతని కోసం పర్సు పారేసుకోరు. ఈ సారి తనే ఎవరి పర్సో కొడతాడు. పని తేలికయి పోయింది. తర్వాత కొంపలు కొడతాడు. అలా దొంగ పర్మిట్లూ, దొంగ కాంట్రాక్టులూ కొట్టి శత కోటీశ్వరుడయి పోతాడు. ఇంత వరకూ ఎదిగింది నిలువుగా.

‘కుట్టా’ లని వుంది!

‘కుట్టాలని వుంది.’

‘ఎవర్నీ? నన్నా?’

అనగనగా దోమ గురించో, చీమ గురించో చెబుతున్నట్టనిపిస్తుంది కదూ? కానీ కాదు. మనిషి గురించే. కాకుంటే కుట్టే మనిషి గురించి. కుట్టే మనుషులంటారా? ఉండటం ఏమిటి అదో వృత్తి. అలాగని ఏ టైలరింగో, ఎంబ్రాయిడరో అనుకునేరు. ఆ కుట్టటం వేరు. ఇంగ్లీషులో ఆలోచిస్తే ‘స్టిచ్‌’ చేయటం వేరు.

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ‘స్టింగ్‌’ చెయ్యటం గురించి. ఇదీ కుట్టటమే. కాకుంటే సూది లాంటి అవయవాన్ని వాటంగా దించి, గుటుక్కున గుక్కెడు రక్తం తాగెయ్యటం. ఇలా చేసేటప్పుడు మత్తిచ్చే ఏర్పాటు కూడా వుంటుంది కాబట్టి, ఇది ‘ఆపరేషన్‌’ కిందికి కూడా వస్తుంది. వెరసి మొత్తం ప్రక్రియను ‘స్టింగ్‌ ఆపరేషన’్‌ అంటారు.

‘ఎడమ’, ‘ఎడమ’గా…!

వారు కలవరు. విడిపోరు.

ఎవరనుకున్నారు? రోజూ కొట్టుకు చచ్చే భార్యాభర్తలు కారు.

కలి ‘విడి’గా పనిచేసే కమ్యూనిస్టు పార్టీలు. దేశంలో ఎలా వున్నా, రాష్ట్రంలో మాత్రం ఇదే తంతు.

ఒకే జెండా. ఒకే ఎరుపు. ఒకే సుత్తీ, ఒకే కొడవలి. కానీ పట్టుకునే చేతులు వేరు. ఒకటి: సిపిఐ, రెండు: సిపిఎం.

‘తారా’ గణం!

‘తార’ల్ని సృష్టించ వచ్చు. కూల్చేయ వచ్చు.

చాలా తారలు స్వయంప్రకాశకాలు కావు. ముఖ్యంగా వెండితెర మీద తారలు అస్సలు కారు. ముఖానికి అంగుళం మందాన మేకప్‌ కొట్టి, ఫ్లడ్‌లైట్లు వేస్తేనే కానీ కనిపించరు.

వాళ్ళు కొట్టే పంచ్‌ డైలాగుల్లో, పంచె వాళ్ళదీ కాదు, డై’లాగూ’ వాళ్ళది కాదు. ఎవరో డైలాగ్‌ రైటర్‌ది.

కడకు స్వరమూ వాళ్ళది కాదు. ఎవరో ‘స్వరదాత’ డబ్బింగ్‌ చెప్పాల్సిందే.

పీకుడందు ‘క్లాసు పీకుడు’ వేరయా!

పాఠమైనా, గుణపాఠమైనా, మార్పు కోసం.

కానీ, క్లాసు పీకుడు, యధాతథ స్థితి కోసం.

పాఠం మిత్రులకు చెబుతాం, గుణ పాఠం శత్రువులకు చెబుతాం.

మిత్రులూ, శత్రువులూ కానీ సన్నిహితులు వుంటారా? ఉంటారు. వారే మన నీడలు.

మిత్రుడూ మారొచ్చు. శత్రువూ మారొచ్చు. కానీ నీడ మారదు. మనం మారకుండా. మన నీడలు మారాలనే దురాశ లోనుంచే ఈ ‘క్లాసు పీకుడు’ పుట్టింది.

కాకా..కేకే..కికు!

ప్రవేశ పరీక్షలు రాజకీయాల్లో కూడా తప్పవు.

ఏ పార్టీ నేతయినా నేడు తెలంగాణలో ప్రవేశించాలంటే, ప్రవేశ పరీక్ష రాయాల్సిందే. ఈ పరీక్షలో ఒకే ఒక పేపరు. ఆ పేపర్లో ఒక్కటే ప్రశ్న. ‘ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తారా?’ అందులో సమాధానాలు రెండు: అవును, కాదు. ఈ రెంటిలో ఒక్కటే టిక్కు పెట్టాలి. అలా కాదని ఏ సమాధానం రాసినా పరీక్షలో తప్పుతారు. పరీక్ష తప్పిన వారికి ప్రవేశం వుండదు.

నవ్వేడ్పులు!

తీర్పులు ఎక్కడయినా ఒక్కటే. అవి ఓర్పునకు పరీక్షలు.

కోర్టులో న్యాయమూర్తి ఇచ్చే తీర్పుకూ, ఎన్నికల్లో వోటరు ఇచ్చే తీర్పుకూ పెద్ద తేడా వుండదు.

ఒకడు గెలుస్తాడు. ఇంకొకడు వోడిపోతాడు. కానీ చిత్రం. ఇద్దరూ ఏడుస్తారు. వోడిన వాడు కోర్టు ఆవరణలోనే ఏడ్చేస్తే, గెలిచిన వాడు ఇంటిక వెళ్ళి ఏడుస్తాడు. కారణం? కేసుఖర్చుల కోసం సమానంగా కొంపలు ఆర్పుకునే వుంటారు.

ఎంత అలుసయితే మాత్రం, గొలుసు లాగుతారా?

రైళ్ళు పట్టాలపైనా, బస్సులు రోడ్లపైనా, విమానాలు మబ్బులు పైనా నడుస్తాయని- చెబితే ఎల్‌కేజీ కుర్రాడు కూడా నమ్మడు. వాహనం ఏదయినా నడిచేది ఢరల పైన.

కేంద్రంలో ఒకప్పటి ఎన్డీయే సర్కారయినా, ఇప్పటి యుపీయే ప్రభుత్వమయినా నడిచేది పాలసీల మీద కాదు. ఉత్త పొత్తుల మీద.

అటు వాహనాలకూ, సర్కారుకూ సంబంధం వుందేమో! అబ్బే అవేమన్నా మోకాలూ, బోడిగుండూనా? ఉండనే ఉండదు- అని అనిపిస్తుంది. కానీ నిజం కాదు. రైల్లో ప్రయాణిస్తూ ఒక్క సారి గొలుసు లాగి చూడండి. ఆగేది రైలు కాదు. సర్కారు.

నేతల్లో నిత్య పెళ్ళికొడుకులు!

రోజూ పెళ్ళయితే, పెళ్ళిలేని రోజే పండగ రోజవుతుంది. ఆ లెక్కన చూస్తే తెలుగు వోటరు నిత్యపెళ్ళికొడుకే. తెలుగు నేలను చూడండి. నిత్యకళ్యాణం పచ్చతోరణంలాగా కళకళ లాడిపోవటం లేదూ? అసలు అసెంబ్లీయే కళ్యాణ మంటపం లా వుంది.( ఇంతటి శోభను చూసి కూడాకొందరు గౌరవ నేతలు చట్ట సభల్ని అగౌరవపరుస్తూ, ‘ఆ దొడ్డీ.. ఈ దొడ్డీ’ అంటూ వ్యాఖ్యలు ఎలా చెయ్యగలుగుతున్నారో అర్థం కావటం లేదు.). పెళ్ళి ప్రమాణం చేసినంత గొప్పగా, ఏదో ఒక వ్యక్తి శాసన సభ్యుడిగా ప్రమాణం చేస్తూనే వున్నాడు. అదే పెళ్ళి.. మళ్ళీ మళ్ళీ. అదే శాసనసభ్యుడు తిరిగి తిరిగి అదే సభకు. 2009లో కొత్త అసెంబ్లీ వచ్చాక, అన్నీ ఉపఎన్నికలే.

‘కుర్చీ’ వేయు వాడు కొడుకు!

గుడ్డొచ్చి ప్రతీసారీ పిల్లను వెక్కిరించదు. ఒక్కొక్కసారి రక్షిస్తుంది. తాతకు దగ్గుల్నే కాదు, పెగ్గుల్ని నేర్పించే మనుమలుంటారు. తండ్రిని మించిన .. కాదు,కాదు, తండ్రిని పెంచిన తనయులు కూడా వుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ములాయం పరపతిని, అఖిలేష్‌ అలాగే పెంచారు. భారత రాజకీయాలకు కొడుకులూ కొత్త కాదు, కూతుళ్ళూ కాదు. కానీ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వచ్చాక, పేరుమోసిన రాజకీయ నేతలు ఒక్కసారి ఇళ్ళల్లోకి చూసుకున్నారు.

‘హౌస్‌’ అరెస్ట్‌!

హౌస్‌ అంటే ఇల్లే కదా!

గౌరవ శాసన సభ్యులు చాలా మంది ఇలాగే అనుకుంటున్నట్లున్నారు. ‘హౌస్‌'(అసెంబ్లీ)లో కూర్చుంటే ఇంట్లో వున్నట్టే వారికి అనిపిస్తోంది. ఇష్టం వచ్చినట్టుండేదే ఇల్లు-అన్నది స్థిర

పడిపోయింది.

ఆదర్శ పాలక పక్షనేత, ఆదర్శ ప్రతిపక్షనేతలో ఒకే ‘హౌస్‌’ లో వున్నట్టే ముట్టెపొగరు ఇంటాయనా, మూతివిరుపుల ఇల్లాలూ ఒకే ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికీ, ఇరుగుపొరుగువారికీ ఉచిత

వినోదమే.

ఇద్దరి మధ్యా అన్యోన్యతా ఎప్పుడు పుట్టుకొస్తుందో తెలీదు. అది వచ్చాక క్షణం ఆగరు.

‘తాగే’ రూపాయి! ‘ఊగే’ రూపాయి!!

తాగటం వేరు. పుచ్చుకోవటం వేరు. రెండూ మందుకొట్టే ప్రక్రియలే. గ్లాసు ఒక్కటే. మాస్‌ వాడు కొడితే తాగాడంటారు. క్లాస్‌ వాడు కొడితే పుచ్చుకున్నాడంటారు.

తాగేవాడు వొళ్ళూ, ఇల్లూ గుల్ల చేసుకుంటే, పుచ్చుకునే వాడు జాగ్రత్తగా వొళ్ళుమాత్రమే గుల్ల చేసుకుంటాడు. ఇల్లు గుల్ల చేసుకునే వాడు ఏలిన వారికి ముద్దు. వాడే సర్కారును నడుపుతాడు. అధికారుల్నీ, అడపా దడపా మంత్రుల్నీ తడుపుతాడు. వాడే లేకుంటే ముడుపులూ లేవు, తడుపులూ లేవు. వాడి పేరు చెప్పుకునే.. కేట్లూ, డూప్లికేట్లూ, సిండికేట్లూ చక్రం తిప్పుతారు. తాగితే వాడికి పూట గడవక పోవచ్చు. అది వేరే సంగతి. కానీ, వాడు తాగక పోతే, ‘పార్టీ’యే లేదు. పార్టీలు లేకుంటే ప్రజాస్వామ్యమే లేదు.

ఒకప్పుడు ప్రేమలేఖ వుండేది!

పువ్వే ముందు. కాయ తర్వాత. పువ్వు రాలిపోతుంది. కాయ మిగిలిపోతుంది.
ప్రేమే ముందు. పెళ్ళి తర్వాత. ప్రేమ రాలిపోతుంది. పెళ్ళి మిగిలిపోతుంది.
ప్రేమ లేఖే ముందు. శుభలేఖే తర్వాత.
అందుకే కాబోలు. ప్రేమలేఖ అంతరించిపోయింది. శుభలేఖ మాత్రం ఫోటో ఆల్బమ్‌లో కొంచెం వెకిరిస్తూ, కాస్త మురిపిస్తూ మిగిలిపోయింది.

ప్రజాస్వామ్యం కేరాఫ్‌ ‘చంచలా’లయం!

జైళ్ళకి మళ్ళీ పాత కళ వచ్చేసింది. ఎందులో చూసినా పెద్దలే. కాకపోతే ఒక్కటే తేడా. పూర్వం, జైలుకి వెళ్ళాక పెద్దవాళ్ళయ్యేవారు.ఇప్పుడేమో, పెద్దవాళ్ళయ్యాక జైళ్ళకు వెళ్తున్నారు.
అప్పట్లో సామాన్యుడికి కూడా జైళ్ళు అందుబాటులో వుండేవి. ఇప్పట్లాగా జైలుగా వెళ్ళాలంటే విధిగా విఐపి అయి వుండాలనే ఆచారం వుండేది కాదు.

నటనలు చాలించరా!

నటనే కదా-ఎక్కడయినా అనుకుని నటులు రాజకీయాల్లోకి దిగిపోతారు. ఆ తర్వాత తెలుస్తుంది- తేడా. అది సాంఘికానికీ, పౌరాణికానికీ వుండే మామూలు తేడా కాదు. ఇక్కడా ‘లైట్స్‌, కెమెరా’ వుంటాయి. కానీ తర్వాత ‘యాక్షన్‌’ వుండదు. ‘రియాక్షన్‌ ‘ వుంటుంది. నటనకు మెచ్చి ‘ఆస్కార్‌’ ఎవ్వరూ ఇవ్వరిక్కడ. ఇస్తే గిస్తే, ‘తిరస్కారే’. ‘నింద’ వస్తుందేమో కానీ, కనీసం ‘నంది’ కూడా రాదు.

నిగ్రహం కోల్పోయిన ‘విగ్రహ’ వాక్యం!

ఉలకని, పలకని వాళ్ళని పట్టుకుని- ‘అలా బొమ్మలా నిలుచున్నావేమిటి?’ అని అనకండి. బొమ్మలు కదలగలవు. కదిలించగలవు. కొంపలు అంటించగలవు.
మనిషి విగ్రహమయ్యాక వంద రెట్లు శక్తిమంతుడయిపోతాడు. మనిషిగా వున్నంతకాలం అతణ్ణి ప్రేమించే వాళ్ళూ ద్వేషించే వాళ్లు మాత్రమే కాకుండా, మధ్యస్తంగా వుండేవాళ్ళు కూడా వుంటారరు. ఒక్కసారి రాతి(పోనీ సిమెంటు) బొమ్మయి పోయాక అతడి చుట్టూ భక్తీ, లేదా ద్వేషం వుంటాయి.