Category: Poetry (కవితలు)

మోహ ఫలం

కరచాలనమొక స్పర్శ. కౌగలింత మహా స్పర్శ. ముద్దు మహోన్నత స్పర్శ. అవును. దేశ భాషలందు ‘దేహ భాష’ లెస్స. తల్లి తల నిమిరినా, తండ్రి గుండెలకు హత్తుకున్నా, గురువు వెన్ను తట్టినా, ప్రియురాలు ఒంటికి ఒంటిని అంటుకట్టినా స్పర్శే కదా! మనిషిని మనిషి తాకవద్దన్నవాడు ‘దేహ’ద్రోహి!తాకని తనాన్ని వెలి వేద్దాం.

మెత్తని సంభాషణ!

కఠినంగా ఏది కనిపించినా మనం ఊరుకోం. కొబ్బరి పెంకును బద్దలు కొట్టి మెత్తని తెల్లదనాన్ని చూస్తాం. రాయి కఠినం. చెక్కేసి ఒక సుకుమారిని చేసేస్తాం. ప్రపంచమంతా పైకి కఠినమే. పై కవచాన్ని తొలిచేస్తే లోన పసిపాపే. అప్పడు భూగోళాన్ని ఒళ్ళోకి తీసుకోవచ్చు. అరమరికలు మరచి ముద్దాడ వచ్చు. ఈ భోగం ఒక కవి కి తెలుస్తుంది. తప్పితే తెలిసేది కళాకారుడికే.

శిశువు నేడు లేచెను

రెండు దశాబ్దాల క్రితం చుండూరు(ప్రకాశం జిల్లా)లో ఇప్పుడు లక్ష్మీపేటలో జరిగినట్లే దళితుల మీద దాడి చేశారు. ఇప్పుడు చంపింది కాపుకులస్తులయితే, అప్పడు చంపింది రెడ్డి

భూస్వాములు. అప్పడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోవుంది. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన రెడ్డి. పంటపొలాల్లో దళితకూలీలను తరిమి తరిమి చంపి వారి

శవాలను గోనె సంచుల్లో మూట కట్టి మురికి కాలువలో పడేశారు. ఈ ఘటనకు దేశం నలుమూలలా దళితుల తల్లడిల్లారు. దళిత సంఘాల వారు వారు శవాలను వెలికి తీసి, నిరసనగా

ఊరి మధ్యలో పాతి పెట్టారు. పాత్రికేయుడిగా వార్త కోసం వెళ్ళి చూసి వచ్చాక నా మనసు మనసులో లేదు. అప్పడు రాసిందే ఈ కవిత. తెలుగు కవిత్వాభిమానులకు

పరిచితమయినదే. అయిన లక్ష్మీపేట దాడి నేపథ్యంలో ఎందుకో మిత్రులతో పంచుకోవాలనిపించింది.

నానుంచి నేను

ఎక్కడెక్కడికో కదలిపోతుంటాం. పోటెత్తి ప్రవహిస్తూ వుంటాం. సముద్రంలో కలసిపోతుంటాం. సూర్యుడి వెచ్చని కౌగలింతకు ఆవిరయి పోతూ వుంటాం. మేఘాలయి గర్జిస్తుంటాం. కాని పిల్లగాలికే పులకించి పోతుంటాం. నిలువెల్లకరిగి వర్షిస్తుంటాం. ప్రవాహంలో నేనొక బిందువూ. నీవొక బిందువూ. కాస్సేపు వేరు వేరుగా. కాస్సేపు సమూహంగా. మధ్యలో వచ్చి పోయే చావు పుట్టుకలు కమర్షియల్‌ బ్రేకులు.

దళిత ప్రేమ లేఖ

సునీత ఒక దళిత విద్యార్థిని. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్( పెంట్రల్ యూనివర్శిటీ)లో చదువుతూ వుండేది.అక్కడే చదువుతున్నయోగేశ్వర రెడ్డి అనే అగ్రవర్ణ యువకుణ్ణి ప్రేమించింది. అతడి కారణంగా ఆమె మూడుసార్లు గర్భవతియై అతని సలహా మేరకు అబార్షన్ చేయించుకుంది. కడకు అతడు ఒక రోజున ఆమెకు ఓ వార్త చెప్పాడు తనకు తన వాళ్ళు వేరే రెడ్ల అమ్మాయితో పెళ్ళి నిశ్చయించారని. ఈ వార్త విన్న సునీత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన 1995 లో జరిగింది. ఆమె చనిపోతూ ఒక ఉత్తరం రాసి పెట్టింది. అప్పుడు నేను వార్త దిన పత్రికకు అసోసియేట్ ఎడిటర్ గా వున్నాను. ఈ లేఖను చదివాను. వాడినేమీ చెయ్యలేమా అనిపించింది. ఆమె మరణ వార్తను ప్రముఖంగానే ప్రచురించాను. కానీ ఏదో తెలియని అవమానం. ఇలాంటి సునీతలు ప్రతీ క్యాంపస్ లోనూ రహస్య వేదనను అనుభవిస్తుంటారు కదా- అని పించింది. ఫలితమే ఈ కవిత. తొలుత ఇండియాటుడే సాహిత్య సంచికలో వెలువడింది. నా ’ఆదిపర్వం‘ కవితా సంకలనం ఈ కవితతో ముగుస్తుంది.

పంచమ వేదం

దాదాపు పాతికేళ్ళ క్రితం నాటి మాట. నేను ఆంధ్రభూమి దినపత్రిక విజయవాడ ఎడిషన్లో చీఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. సిధ్ధార్థ ఇంజనీరింగ్ కాలేజిలో దాకె బాలాజీ అనే విద్యార్థి తనను ప్రిన్సిపాల్ కులం పేరుతో అందరిలోనూ తిట్టినందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్తను నేనే రాసి పత్రికలో వేశాను. ఆ తర్వాత మూడేళ్ళకు రాజమండ్రిలో ’కోస్తావాణి‘ అనే ప్రాంతీయ దినపత్రికకు సంపాదకుడిగా వున్నప్పుడు ఇలాంటిదే మరో ఘటన జరిగింది. అక్కడ కూడా ప్రిన్సిపాల్ కులం పేరుతో తిట్టినందుకు డొక్కా పద్మనాభ రావు అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకుని గాయాల పాలయి ఆసుపత్రిలో మరణించాడు. అప్పుడూ వార్త ప్రచురించాను. కానీ లోలోపల రెండు ఘటనలూ కుదిపేస్తూనే వున్నాయి. దు:ఖమో, ఆగ్రహమో తెలీదు కానీ, ఓ సాయింత్రం పూట కవిత్వరూపంలో పెట్టాను. అదే ’పంచమ వేదం‘.

సన్న జాజికి సాక్ష్యముండదు

పర్వతం ఏడ్చింది

నేల చెక్కిళ్ళ మీద లావా

చెట్టు నగలన్నీ వలుచుకుంది

కింద పండుటాకుల వాన

నేను గుండెను దిమ్మరించాను

రాలిన కత్తుల గుత్తులు

చినుకంత బతుకు

చిన్నవే. ఎప్పుడూ చూసేవే. అనుక్షణం వినేవే. ఎప్పటిప్పుడు తాకేవే. అను నిత్యం ఆఘ్రాణించేవే. రోజూ రుచి చూసేవే. కొత్తగా, కొత్తగా వుంటాయి. పొద్దుపొడుపు ఎండలో ఆకు మీద మెరిసే మంచు బిందువూ, ప్రశాంత సమయంలో పసిబిడ్డ కేరింతా, రాత్రి పూట మెత్తటి గాలి మోసుకొచ్చిన సంపెంగల సువాసనా, కలత నిద్దురలో నుదుటి మీద అమ్మ చేతి స్పర్శా, నాలుక చివర్న ఉప్పూ,కారం కలిసిన పచ్చిమామిడి కాయ ముక్కా- ఎప్పుడయినా పాతబడ్డాయా? మరి బతుకేమిటి? రెడీమేడ్‌ చొక్కాలా, ఇలా వేసుకుంటే అలా మాసిపోతోంది..!?

యాభయ్యేళ్ళ పాపాయి

అప్పటికి స్వరాజ్యం వచ్చి యాభయేళ్ళయింది. స్వాతంత్ర్యం రాక ముందు అందరూ నడిచే వారు. అది కాస్తా వచ్చేసాక పరుగులే పరుగులు. కేవలం రూపాయి కోసం. అవును రూపాయి కోసమే నవ్వూ, లవ్వూ. రూపాయి కోసమూ వ్యాపారం, ఉద్యమం. రూపాయి కోసమే పెళ్ళిళ్ళూ, పెటాకులూ. అందరూ రూపాయి వెంట పడిపోతునేవువ్నారు. అందుకేనేమో రూపాయి కూడా పడిపోతూనే వున్నది.

కంటి కింది బతుకు

దిగులు. ఎక్కడినుంచో రాదు. నానుంచే. నాకు నచ్చని నానుంచే. జీవించాల్సిన నేను నటించానన్న చికాకు. నాదయిన జీవితంలో నాది కాని భావన. అసహ్యం.

ఈ చికాకులే చిక్కబడితే దిగులు. నన్ను నేను కుదుపు కుంటాను. అయినా దిగులు వీడిపోదే..!? యుధ్ధం.. నా మీద నేను చేసుకునే మహోద్రిక్త సంగ్రామం. నటించే నా మీద, జీవించే నేను చేసే సమరం. గెలుస్తాను. నటన ఓడిపోతుంది. అప్పుడు నిద్దురొచ్చి ముద్దు పెడుతుంది.

రుతు గీతిక

నోరెత్తకుండా బతికేసిన వాడెల్లా మౌని కాడు. ఆ మాటకొస్తే మాట్లాడక పోవటమూ మౌనం కాదు. తన్నుకొస్తున్న నూరు అలజడులను లోలోపలే అణచి వేసి ధ్యానమంటే- కుదరదు. అదే ధ్యానమయితే దరిద్రాన్ని మించిన ధ్యానం వుండదు. పరిచిన దేహం మీద అనుదినాత్యాచారం జరిగిపోతూనే వుంటుంది. నోరు లేవదు. అందుకే నోరు మూయించాలనుకున్న ప్రతి వ్యవస్థా ఖాళీకడుపు మీదే గురిపెడుతుంది

పిడికెడు గుండె!

శత్రువు లేని వాణ్ణి నమ్మటం కష్టం. శత్రువు లేని వాడికి మిత్రులు కూడా వుండరు. నా ఇష్టాలూ, నా అభిప్రాయాలూ, నా తిక్కలూ వున్న వాళ్ళే నాకు మిత్రులవుతారు. నా మిత్రులకు పడని వాళ్ళంటే నా అభిప్రాయాలు పడని వాళ్ళే. శత్రువు లేని వాడంటే ఒకటే అర్థం- సొంత అభిప్రాయం లేనివాడని. అందుకే అజాత శత్రువు(ధర్మరాజును) సొంత ఆలి కూడా నమ్మదు. ఏదో ఒక రోజు-‘నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా?’ అని అడుగుతుంది. పగపట్టటం చేతకాని వాడికి, ప్రేమించటమూ రాదు.

సముద్రం

వెళ్ళీ వెళ్ళగానే

నా వస్త్రాల్ని వలిచింది

పసివాణ్ణయ్యాను

బెంగ

ఎవరూ లేరే..అని అనుకుంటాం అప్పుడప్పుడూ. నాకు నేనూ, మీకూ మీరూ క్షణంలో హాజరు. అవును కదా! నాతో నేను మాట్లాడి ఎన్నాళ్ళయింది? దేని గురించి మాట్లాడను- అని అనుకుంటాను ముఖం కడుక్కోవటానికి టాప్‌ విప్పుతూ…! నీళ్ళు.. చేతుల్ని తడిమేస్తూ. జల స్పర్శ! ఏదో గుర్తు. చిన్నప్పటి జ్ఞాపకం. అందరూ ఆడుతూనే వున్నారు. నా ముంజేతి మీద పెద్ద చినుకు. వాన పిల్ల పెట్టిన తొలిముద్దు. వాళ్ళకింకా తెలీదు- కాస్సేపేట్లో మేం ‘వానా, వానా వల్లప్పా ఆడబోతున్నామని…!’ నీరు గుర్తొస్తే చాలు, నాలోకి నేను వెళ్తూ, మీలోకి మిమ్మల్ని పంపిస్తాను. నా బెంగను మీ బెంగగా చేసేస్తున్నాను. మన్నించండి.

బొమ్మా, బొరుసూ..!

వువ్వు పక్కనే ముల్లూ, గంధపు చెట్టు పక్కనే పామూ, నవ్వులోనే ఏడుపూ- అన్నీ ద్వంద్వాలే. ప్రతి రెంటిలోనూ ఒక్కటే ప్రియం. మిగతాది భయం. రెండూ అవసరమే. పులి ఎదురొస్తేనే కాదు, ప్రియురాలు చేతులు చాచినా, ముందు గుండె ఝళ్ళుమంటుంది. తొలుత తుళ్ళింతే. తెగిస్తేనే కౌగలింత.

ఎడతెగని కలలు

పువ్వు కోసమే చెయ్యి చాపేది. కానీ ముల్లు గుచ్చుకుంటుంది. హఠాత్తుగా నిద్రలేచి కిటికీలోంచి చూస్తే.. నింగిలో ఎర్రని నారింజ. ఉదయమే అనుకుంటాం. కాని అది సాయింత్రం. రేపటి కోసమనే.. ఒక తుపాకీ తోనో, పెట్రోలు డబ్బాతోనో బయిలు దేరతాం.. ఆగి చూసుకుంటే నిన్నలో వుంటాం. అడుగులే కదా, అని వేసేయకూడదు. ముందుకో, వెనక్కో ..తెలుసుకోవద్దూ. లేకుంటే ఖరీదయిన త్యాగం కాస్తా, సాదాసీదా మరణమయిపోతుంది.

గురి పాఠం!

గొర్రెలు నడుస్తాయనుకుంటాం. నడవబడతాయి. చిలుకలు పలుకుతాయనుకుంటాం. పలుకబడతాయి. గాడిదలు మోస్తాయనుకుంటాం. కానీ మోయబడతాయి. తలకాయలు ఎవరికయినా ఇచ్చేస్తే, మనమూ అంతే..! బతకం. బతకబడతాం. గురిని మరచి ఉరి వైపు పరుగులు పెడతాం.

అడుగు జాడ!

మబ్బుకీ మబ్బుకీ మధ్య ఎండలా, ఏడుపుకీ ఏడుపుకీ మధ్య నవ్వులా, విశ్రాంతికీ విశ్రాంతికీ మధ్య పనిలా ఏమిటో ఈ కవిత్వం? గాఢాలింగనంలో కూడా ఇంకా ఏదో దూరం మిగిలిపోయినట్లూ, ఎంతో గొప్పగా నడిచిపోతున్న జీవితంలో కూడా ఏదో వెలితి. ఏ ఫర్వాలేదు.. ఎక్కడ జాగా వుంటే అక్కడ బతకటానికి కాసింత అమాయకత్వం అవసరమయిందన్న మాట. నిజం చెప్పొద్దూ..? కవిత్వమూ, అమాయకత్వమూ రెండూ ఒక్కటే…!

సమాచార కాంక్ష

కడలికి నింగిని చేరాలనీ, నింగికి కడలిని చేరాలనీ కోరిక. కడలి రగిలి రగిలి ఆవిరయి వెండి మేఘంలాగా పైకి చేరిపోతే, నింగి పొగిలి పొగిలి ఏడ్చి వానగా కడలికి చేరుతుంది. గుండెకు గుండెను చేరాలనే కోరిక. దేహానికి మరో దేహంతో పెనవేసుకోవాలనే కోరిక. మనిషికి మనిషి చేరుకునే కోరికే లేకుంటే జీవితం పుట్టగానే ముగిసిపోతుంది.

ప్రేమకు నిర్వచనాలు

ఇదే జీవితాన్ని ఇంతకు ముందు ఎంత మంది జీవించలేదు. కొత్తగా జీవించటానికి ఏమి వుంటుంది? ఇదే సముద్రం. ఎన్ని సార్లు చూడలేదు? కొత్తగా చూడటానికి ఏముంటుంది? ఇలా అనుకునేది జీవితమే కాదు. కడలి వొడ్డున మన కాళ్ళనే ఒక్క రీతిగా తడుపుతాయా అలలు? వెండి పట్టీలు తొడిగినట్లు ఒక మారూ, పడి వేడుకున్నట్టు ఇంకో మరూ, కాళ్ళకింది ఇసుకను తొలచి పట్టు తప్పిస్తున్నట్టు మరో మారూ- అలలు తాకిన ప్రతీ సారీ ఒక కొత్త అనుభూతి. ఒక్కతే చెలి. కానీ ప్రతీ ఆలింగనమూ ఒక కొత్త అనుభవం. అన్నీ ఎప్పటికప్పుడు కొత్తగా నిర్వచించుకోవాల్సిందే.!