Category: Panchamavedam(పంచమ వేదం)

’పంచమ వేదం‘ నా(సతీష్ చందర్) తొలి కవితా సంకలనం. 1995 లో తొలి ముద్రణ వెలువడింది. ఇప్పటికి మూడు ముద్రణలు వచ్చాయి. ఈ కవితలు నేను 1987-1994 మధ్యకాలంలో రాసినవి. ఈ పుస్తకంలోని పలు కవితలు ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషల్లోకి అనువదించబడ్డాయి. మొత్తం పుస్తకాన్నే కన్నడంలో ’పంచమ వేద‘ పేరుతో కన్నడ సాహిత్య అకాడమీ ప్రచురించింది. ఈ పుస్తకం మీద తెలుగు సాహిత్య లోకంలో దుమారం రేగింది 1995-1997 మధ్యకాలంలో తెలుగు దినపత్రికలలో వాద ప్రతివాదాలు జరిగాయి. ఈ కవితలు తెలుగులో దళిత కవిత్వానికి శ్రీకారం చుట్టాయంటూ పుస్తక రూపం దాల్చకుండానే సాహిత్య విమర్శకుడు కె.శ్రీనివాస్ ‘దళిత సూర్యోదయ కవిత‘ పేరు తో ’ఉదయం‘ దినపత్రకలో వ్యాసం రాశారు.
ఈ పుస్తకాన్ని ఆంధ్ర యూనివర్శిటీ ఎమ్యే తెలుగు లో పాఠ్యపుస్తకంగా చేసింది. రాష్రటంలోని అన్ని ఇతర విశ్వవిద్యాలయాలూ ఎమ్యే (తెలుగు) సిలబస్ లో ఇందులోని కవితలను విడి,విడిగా స్వీకరించాయి. యు.పి.యస్.సి. నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల మెయిన్స్ ఆప్షనల్స్ లోని తెలుగు సాహిత్యంలో ఈ పుస్తకంలోని కవితలను కొన్నింటిని పరిగణించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శటీ ముద్రించిన ’మోడర్నర్ పొయిట్రీ‘ సంకలనంలో ఈ కవితలును కొన్నింటిని వెల్చేరు నారాయణ రావు అనువదించారు. ఈ పుస్తకానికి ఫ్రీ వర్స్ ఫ్రంట్ అవార్డు, తెలుగు యూనివర్శటీ అవార్డుతో పాటు పలు ఇతర పురస్కారాలు లభించాయి.

కలవని కనుపాపలు

రెప్పవాల్చని కన్నుల్లా రెండు బావులు

ఒకటి: మాకు

రెండు: మా వాళ్ళకు

మధ్యలో ముక్కుమీద వేలేసుకున్న రోడ్డు

ఎవడో జల్సారాయుడు

వాడక్కూడా

అంటరాని రోగం తగిలించాడు

పుట్టుమచ్చల్లేని కవలల్ని

పచ్చబొట్లతో వేరు చేశాడు

కోడి పందాలు

నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాల హడావిడి నడుస్తోంది. ఈ కవిత ఎప్పుడో

20యేళ్ళ క్రితం రాసింది. నా ‘పంచమ వేదం’ కవితా సంపుటిలో వుంది. ఈ కోడిపందాలకు నేపథ్యం

పండుగ కాదు, ఒక విషాదం. ముంబయిలో హిందూ,ముస్లింల మధ్య మతకలహాలు చెలరేగిన

నేపథ్యంలో, ఇరు వర్గాలలోని అమాయకపు ప్రజలు బలయ్యారు. నిజానికి ప్రజల మధ్య మత

సామరస్యం ఎప్పుడూ వుంటుంది. స్వార్థ రాజకీయ శక్తులే వారిని రెచ్చగొడతారు. వాళ్ళకాళ్ళకు

కత్తులు కట్టి బరిలోకి దించుతారు. అనుకోకుండా ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం రాష్టంలో

వుంది. చార్మినార్ పక్కన భాగ్యలక్ష్మి మందిర వివాదంతో పాటు, అక్బరుద్దీన్, తొగాడియాల

వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇబ్బంది కరవాతావరణం నెలకొని వుంది. దాని స్థానంలో స్నేహ

పూర్వక వాతావరణం తిరిగి నెలకొలాని కాంక్షిస్తూ, నా మిత్రుల కోసం మరో మారు ఈ కవిత.

చదవండి.

శిశువు నేడు లేచెను

రెండు దశాబ్దాల క్రితం చుండూరు(ప్రకాశం జిల్లా)లో ఇప్పుడు లక్ష్మీపేటలో జరిగినట్లే దళితుల మీద దాడి చేశారు. ఇప్పుడు చంపింది కాపుకులస్తులయితే, అప్పడు చంపింది రెడ్డి

భూస్వాములు. అప్పడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోవుంది. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన రెడ్డి. పంటపొలాల్లో దళితకూలీలను తరిమి తరిమి చంపి వారి

శవాలను గోనె సంచుల్లో మూట కట్టి మురికి కాలువలో పడేశారు. ఈ ఘటనకు దేశం నలుమూలలా దళితుల తల్లడిల్లారు. దళిత సంఘాల వారు వారు శవాలను వెలికి తీసి, నిరసనగా

ఊరి మధ్యలో పాతి పెట్టారు. పాత్రికేయుడిగా వార్త కోసం వెళ్ళి చూసి వచ్చాక నా మనసు మనసులో లేదు. అప్పడు రాసిందే ఈ కవిత. తెలుగు కవిత్వాభిమానులకు

పరిచితమయినదే. అయిన లక్ష్మీపేట దాడి నేపథ్యంలో ఎందుకో మిత్రులతో పంచుకోవాలనిపించింది.

పంచమ వేదం

దాదాపు పాతికేళ్ళ క్రితం నాటి మాట. నేను ఆంధ్రభూమి దినపత్రిక విజయవాడ ఎడిషన్లో చీఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. సిధ్ధార్థ ఇంజనీరింగ్ కాలేజిలో దాకె బాలాజీ అనే విద్యార్థి తనను ప్రిన్సిపాల్ కులం పేరుతో అందరిలోనూ తిట్టినందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్తను నేనే రాసి పత్రికలో వేశాను. ఆ తర్వాత మూడేళ్ళకు రాజమండ్రిలో ’కోస్తావాణి‘ అనే ప్రాంతీయ దినపత్రికకు సంపాదకుడిగా వున్నప్పుడు ఇలాంటిదే మరో ఘటన జరిగింది. అక్కడ కూడా ప్రిన్సిపాల్ కులం పేరుతో తిట్టినందుకు డొక్కా పద్మనాభ రావు అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకుని గాయాల పాలయి ఆసుపత్రిలో మరణించాడు. అప్పుడూ వార్త ప్రచురించాను. కానీ లోలోపల రెండు ఘటనలూ కుదిపేస్తూనే వున్నాయి. దు:ఖమో, ఆగ్రహమో తెలీదు కానీ, ఓ సాయింత్రం పూట కవిత్వరూపంలో పెట్టాను. అదే ’పంచమ వేదం‘.