హవ్వ!
బొంకేసింది. తనకి పిల్లలే లేరని అడ్డంగా బొంకేసింది.
జనాభా లెక్కల్లోంచి ఇద్దర్ని తీసేసింది. చెట్టంత కొడుకుల్ని కాలనీ లోనే పెట్టుకుని, తాను ‘గొడ్రాలి’ నని తన నోటితోనే చెప్పేసింది. చెబుతూ నవ్వేసింది కూడా. నవ్వొచ్చి కాదు. పురుటి నొప్పులు గుర్తొచ్చి.
రాసుకునే వాళ్ళు పదే పదే అడిగి, పిల్లల్లేని తల్లిగానే ఆమె పేరును నమోదు చేసుకున్నారు. రాసుకుంటున్నప్పుడు వాళ్ళూ నవ్వుకున్నారు… పిల్లల్లేని తల్లి పేరు సంతానమ్మ ఎలా అవుతుందని!
పేరనే కాదు, జనాభా ఎన్యుమరేటర్లకి, ఆమె ఏమి చెప్పినా నమ్మ బుధ్ధి కావటం లేదు. కానీ కేవలం పిల్లల విషయంలో తప్ప, అన్నీ నిజాలే చెబుతోంది.
వయసు అడిగితే యాభయి అంది. కానీ అలా కనిపించటం లేదు. కేవలం ఆమె కట్టుకున్న వస్త్రమే కాదు, దేహమే మాసిపోయింది. జుత్తు ముగ్గుబుట్టయి పోయింది. బైబిల్లో ఆదిమాత హవ్వకు అవ్వలా వుంది.
తాను పదిదాకా చదువుకున్నానని చెప్పినా, లెక్కల మనుషులు అనుమానంగానే చూశారు. కానీ, ‘మరి మీ ఆయనో..?’ అని వారడగ్గానే, ‘లేడు’ అని తెలుగులో చెప్పకుండా ‘లేటు’ అని ఇంగ్లీషులో చెప్పింది.
‘ఆయ్.. లేటు ఆదిమూలపు ఆదాము.. అని రాసుకోండే…!’ అని సంతానమ్మ చెప్పినప్పుడు మాత్రం ఆమె చదువుని నమ్మక తప్పలేదు.
‘ఏం చేసేవాడు..?’
‘మిలిట్రీవోడండి..!’
‘ఎలా పోయాడు.. యుధ్ధంలో పోయాడా..?’
‘అబ్బే.. ఇంట్లోనే పోయాడండి.. అప్పుడు అంబేద్కర్ కాలనీలోని ఇల్లింకా అమ్మలేదు లెండి..!’
‘మరి ఈ ఇల్లూ..? అద్దెదా..?’
ఈ ప్రశ్నకు మాత్రం` పెదవులు బిగించి భుజాలు కుదుపుకుని నవ్వుతారే` అలా నవ్వింది. జనాభా లెక్కల వాళ్ళు ఆమె వంక అదోలా చూశారు.
‘సచ్చినోళ్ళ మజ్జిన బతుకుతున్నాను గిందా…దీన్నీ ఇల్లంటారా..?’
ప్రశ్నే సమాధానమయ్యాక వాళ్ళకు మాటలేదు. ఇంటి అడ్రసు దగ్గర ‘బెతెస్థ బరియల్ గ్రౌండ్’ అని రాసుకున్నారు.
అవును. ఆమె ఉండేది సమాధుల దొడ్డిలోనే. సిమెంటు గోడల మీద రేకుల కప్పు. లోన రెండు గదులు, బయిట వరండా. లోన ఆటోనడుపుకునే అనధికార కాటికాపరి, అతడి భార్యా వుంటారు. ఈ వరండాలో అనగా, పంచన సంతానమ్మ వుంటుంది.
‘సంతానమ్మా..! మరి వుంటాం..!’ అన్నారు జనాభా లెక్కల వాళ్ళు వెళ్ళిపోతూ.
‘ఇక్కడకొచ్చి.. ఉంటాం.. అనకూడదయ్యా.. ఉండే సోటు కాదిది..!’ అని సంతానమ్మ హితవు పలికిందో లేదో.. నవ్వు..పేద్ద నవ్వు.. గుండెలదరిపోయే నవ్వు..! అది సమాధుల మధ్య నుంచి వస్తున్న నవ్వు.
శ్మశానంలో ఏడుపులు సహజం. అవి పెద్దగా భయపెట్టవు. కానీ నవ్వులే అసహజం. అందుకే ఉలిక్కి పడిరది సంతానమ్మ. అది పగలు పన్నెండు గంటలు కాబట్టి సరిపోయింది. రాత్రయితే.. వాచ్ మ్యాన్ గది తలుపులు కొట్టేసేదే..!
ఒక పెద్ద సమాధి వెనకనుంచి వస్తున్నాయి ఆ నవ్వులు. నడమంతరపు డబ్బు చేసే కొద్దీ, కొంపల ఎత్తులే కాదు, సమాధుల ఎత్తులూ పెరుగుతాయి. అందులోనూ ఆ మధ్య గల్ఫ్‌కు తమ కాలనీలోని వాళ్ళంతా కట్టకట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ తాలూకు ఎవరు పోయినా, ఇలా సిమెంటు సమాధులు పెద్ద పెద్దపెద్దగా కట్టిపారేశారు. కడసారి చూపు చూసుకోలేకపోయామన్న బెంగను ఇలా తీర్చుకునేవారు.
శ్మశానంలో ఏడుపులు సహజం. అవి పెద్దగా భయపెట్టవు. కానీ నవ్వులే అసహజం. అందుకే ఉలిక్కి పడిరది సంతానమ్మ. అది పగలు పన్నెండు గంటలు కాబట్టి సరిపోయింది. రాత్రయితే.. వాచ్ మ్యాన్ గది తలుపులు కొట్టేసేదే..!ఒక పెద్ద సమాధి వెనకనుంచి వస్తున్నాయి ఆ నవ్వులు. నడమంతరపు డబ్బు చేసే కొద్దీ, కొంపల ఎత్తులే కాదు, సమాధుల ఎత్తులూ పెరుగుతాయి.
ఆడ మనిషి నవ్వే..! గుక్కపట్టి నవ్వుతోంది..!
అప్పుడప్పుడూ..ఇలా పగలే ఎవరో ఒకరు వచ్చి, ఏదో ఒక సమాధి వద్ద నిలబడో, కూర్చునో, సమాధి మొత్తాన్ని చేతుల్లోకి తీసుకునో ఏడ్వటం సంతానమ్మకు కొత్త కాదు. కొన్ని సార్లు, ఆమె వెళ్ళి వాళ్ళని ఓదార్చేది కూడా.
కానీ ఇది నవ్వు. ఏడుపును మించి దిగులు కలిగిస్తోన్న నవ్వు. నవ్వేవాళ్ళను కూడా ఓదార్చవచ్చా?
ఆమె తెలియకుండానే.. ఆ పెద్ద సమాధివైపు అడుగులు వేసింది.
తెల్ల బ్లౌజూ, తెల్లచీరా. వయసులో వున్న పిల్ల. కానీ జుత్తు విరబోసుకుని లేదు. ముడివేసుకునే వుంది. ఆ ముడిపైన తెల్లని క్యాప్ కూడా వుంది.
దగ్గరకు వెళ్ళాక తెలిసింది. ఆమె నవ్వుతున్నది పెద్ద సమాధివైపు తిరిగి కాదు. దానికి ఆనుకునే అతి చిన్న సమాధి. అంతా చలువరాతితోనే చేసివుంది. దానిపై అతి చిన్న శిలువ. దాన్ని చూసే ఆమె నవ్వు.
సంతానమ్మకు దాదాపు అన్ని సమాధులూ తెలుసు. కానీ అక్కడ ఇంత అతి చిన్న శిలువతో చిన్న సమాధి వున్నట్టు అంతవరకూ గమనించనేలేదు.
దాంతో తేరిపార చూసింది. పేరు, పుట్టిన తేదీ, పోయిన తేదీ రాసి వున్నాయి. చిత్రమేమిటంటే పేరు స్థానంలో ‘కొడుకు’ అని రాసి వుంది.
‘చిన్నవయసులోనే పోయినట్టున్నాడు. ఎన్నేళ్ళు జీవించాడో’ అని అనుకుంటూ తేదీలు చూసింది సంతానమ్మ.
జననం: 31 జనవరి 2019 మరణం: 31 జనవరి 2019
మార్చి, మార్చి చదివింది. రెండు తేదీలు ఒకటే. అంటే…!?
‘పుట్టిన రోజే పోయినట్టునట్టున్నాడు.. పాపం!’
ఈ మాట లోపల అనుకున్నానుకుంది సంతానమ్మ. కానీ పైకి వచ్చేసింది. ఎదురుగా వున్న బిడ్డ తల్లి వినేసింది కూడా. దాంతో ఆమె నవ్వు ఆపేసి,
‘కాదు…! పోయాడనుకున్న రోజే పుట్టాడు…! అందుకేగా.. రోజూ నన్ను చంపుకు తింటన్నాడు…!’ అని బదులిచ్చింది.
అప్పుడుకానీ, సంతానమ్మ, పక్కనే సిమెంటు అరుగు అంత వున్న సమాధి మీద తెరచి వున్న లంచ్ బాక్సు చూడలేదు.
‘ఇంకొక్క ముద్ద.. ఒకే ఒక ముద్దరా కన్నా..! చూడమ్మా.. ఎలా ఏడిస్తున్నాడో.. రోజూ ఈ ఇదే తంతు..తినరా కొడుకా అంటే..తినడే..! పైనుంచి దూకుతాడు.. పిల్లిమొగ్గలేస్త్తాడు.. దొంగోడిలా వెనక నుంచొచ్చి నా కళ్ళు మూస్తాడూ..! ఎదవికి ఇంగ్లీషొకటీ.. ఐ డోంట్ ఈట్ మామ్.. అంటాడు..!’ అంటూ మళ్ళీ నవ్వు అందుకుంది.
ఆమె చేతిలో అన్నం ముద్ద కనిపిస్తోంది. కొడుకే కనిపించటంలేదు.
‘ఉంటే కదా.. కనిపించటానికి!’ అనుకుంది సంతానమ్మ. దుఃఖం ఏడుపుగా మారితే తట్టుకోగలం. అదే నవ్వుగా మారితేనో..!?
అందుకే.. ఆపాలి.. ఆమెను వాస్తవంలోకి తేవాలి..! అనుకుంది సంతానమ్మ.
ఆమెకూ తనకూ ఒక్కటే తేడా: లేని కొడుకుని ఉందనకుంటుందామె. ఉన్న కొడుకుల్ని లేరనకుంటోంది తాను.
‘తల్లీ..! నాకూ వున్నారు సెట్టంత కొడుకులు.. సచ్చినోళ్ళు. ఒక్కడూ ముద్దెట్టడు..!’ అంటూ ఆమె భుజాలు పట్టుకుని అరుగు లాంటి పెద్ద సమాధి మీద కూర్చోబెటి,్ట తాను పక్కన కూర్చుంది సంతానమ్మ..
చేతిలోని ముద్దను సంతానమ్మ నోట్లో పెట్టేసి, బిడ్డ సమాధిని వేలుతో చూపిస్తూ, నవ్వును ఏడుపు గా మార్చేసుకుంది బిడ్డ తల్లి. నవ్వంత బరువుగా లేదు ఈ ఏడుపు. అందుకే, ఎంత ఏడ్వాలో అంత ఏడ్వనిచ్చింది సంతానమ్మ. ఆ బిడ్డతల్లి ముందు భుజం మీద వాలింది, తర్వాత వొళ్ళోకి వాలింది. ఎందుకో సంతానమ్మకు గర్భం మరోమారు నిండినట్లయింది. తడిసిన ఆ పిల్ల ముఖాన్ని దగ్గరకు హత్తుకుంది. బిడ్డను కడుపున పెట్టుకోవటమంటే ఇదేనేమో!
‘ఆ డాక్టరమ్మ రాతి మనిషి ఆంటీ..! కొడుకే కానీ.. స్టిల్ బోర్నూ .చనిపోయి పుట్టాడూ..అనేసింది ఆంటీ..!’ అంటూ పెద్దగా బావురుమంది.
సంతానమ్మ పెద్దగా నిట్టూర్చి, నవ్వేడ్చి ఆ బిడ్డతల్లిని పైకి లేపుతూ ఆమె నుదుటి వైపు తేరిపార చూసింది. తన నుదురులాగే ఆమె నుదురు కూడా. ఏ చుక్కా కనిపించని విశాలాకాశంలా వుంది.
‘ఏం పేరు తల్లీ..?’
‘ఏంజెల్..!’ అంది తని తెల్లని కొంగుతో ముఖం తుడుచుకుంటూ.
‘ఏ పేట..?’
‘చర్చి పేట!’
‘సూడమ్మా ఏంజిలమ్మా..! బిడ్డ బతికి పుట్టలేదనీ, పెరిగి సెట్టంతవ్వలేదనీ బెంగెట్టుకోకు. నా కొడుకుల్ని సూత్తే.. ఏ ఆడమనిసికయినా పెల్లికి ముందే ఆపరేసన్ సేయించుకోవాలని అనిపిత్తాది.. ఏమాపరేసనమ్మా అదీ…!?’ అని సంతానమ్మ తడుముకుంటుంటే,
‘ఫామిలీ ప్లానింగా ఆంటీ..? ట్యూబెక్టమీ..!’ అంటూ ఠక్కున బదులిచ్చింది.
‘అంత కరట్టుగా సెప్పేసావ్.. నర్సువా ఏంటీ..?’ అని సంతానమ్మ అడగ్గానే, ఆమె తలూపింది.
‘నన్నడిగితే.. మన పేటల్లో ప్రతీ పిల్లకీ పెళ్ళికూతురు సేసే ముందే. ఈ ఆపరేసన్ సేయించెయ్యాలి’
సంతానమ్మ ఈ మాటకు ఏంజెల్ కిసుక్కుమంది.
‘నవ్వకమ్మా..దరిద్రపు నా కొడుకుల్ని సూత్తే ఎవత్తెకయినా ఇలాగే అనిపిత్తాది. ఆల్ల బాబుకి.. అదే నా మొగుడికి ముచ్చటెక్కువయి పోయి, పెద్దోడికి సీమోనూ, సిన్నోడికి ఏబేలూ అని పేరుపెట్టాడు. నా మొగుడి బతికి లేడు కానీ, పెద్దోడికి సీమోను తీసేసి కయీనూ అని మార్చేద్దుడూ..ఇప్పుడేమయిందిలే.. ఆడు పొడిసే పోట్లకి..ఆణ్నలాగే పిలుత్తారు. ఏలాకోలం ఎక్కువయినోల్లు కోయిను గాడంటారు. సచ్చినోణ్ణి అనాల్సిందే..’
అని సంతానమ్మ నోరు ఆవులించింది మాట కోసం కాదు, ముద్ద కోసం. ఏంజెల్ తన కొడుక్కని తెంచిన లంచ్ బాక్సులోని అన్నాన్ని ముద్దలు చేసి తినిపించటం మొదలు పెట్టింది. ముద్దముద్దకీ, మిక్కీ మౌస్ రూపంలో వున్న వాటర్ బాటిల్‌ను తెరచి నీళ్ళు కూడా తాగిస్తోంది.
‘కోయిన్ గురించి చెబుతున్నారాంటీ..?’
‘ఆ..ఆ..కయాను గాడే..! అయిస్కూలు దాకా..ఆణ్ణి ఆపినోడు లేడు. గవర్మెంటు బళ్ళేమో..ఎల్లకపోయినా వచ్చినట్టు ఏసేసుకుంటారు. మా పక్కింటి పిల్లలు.. ఆపనికీ.. ఈ పనికీ సేపలసెరువులోకో. పొలాల్లోకో పోయేవోరు.. యింట్లో యియ్యిటానికేంటీ..? సోకులికీ.. సికార్లకీను.. కానీ యీడి బాబు మిలట్రీ కదా… ఎంతంటే అంత అంపేవాడు ఈడికి..’ అని సంతానమ్మ చెప్పుకుంటూ కాదు, కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ పోతుంది. ఎంతయినా జీవితం కదా, కనిపించిపోతోంది. ఇలా:
పేటంటే పేటే. అది అంబేద్కర్ కాలనీ కావచ్చు, చర్చిపేట కావచ్చు. అక్కడ పెరిగినా అబ్బాయయినా, అమ్మాయయినా పది దగ్గర ఆగిపోతారు. పదంటే వయసు పదని కాదు, చదువు పది అని. ఏ సబ్జెక్టులని ఆడగక్కర్లేదు. ఒకటి: ఇంగ్లీషు, రెండు: లెక్కలు. టీచర్లు బోధించకుండా రాయలేనివి ఈ రెండే కాబోలు! అప్పుడప్పుడూ కొందరు ఈ లెక్కతప్పించి బయిటపడి, పట్నంలోని వెల్ఫేర్ హాస్టల్ తేలతారు. ఊళ్ళో వాళ్ళు వాడకు వదిలేసిన (చెప్పులు కుట్టటం, పారిశుధ్ధ్యం వంటి వృత్తుల్లా, కార్పోరేటు వాళ్ళు (ఇంజనీరింగూ, మెడిసినూ మినహాయించి) వదిలేసిన బియ్యేలూ, బికాంలూ వంటి బువ్వ కోర్సులుంటాయి. అంటే చేశాక బువ్వ దొరికే కోర్సులు కావు. హాస్టల్ బువ్వ కోసం చేసే కోర్సులు. వాటిని పేటల్లోని వాళ్ళు చదివిపెడతారు.
కోయినూ, ఏబేలూ ఇద్దరూ పేట లెక్క తప్పించకుండా పది దగ్గర ఆగిపోయాడు. పువ్వులు అక్కడ మరీ పుట్టగానే కాదు కానీ, పదిహేనెళ్ళొచ్చేసరికి పరిమళిస్తాయి. అందులోనూ కోయిను మరీ చురుకయిన వాడేమో రాత్రి పదయితే చాలు గుప్పుమనేవాడు. చౌక మద్యానికి గుబాళింపు ఎక్కువే! ఏబేలుకు, తన అన్నకున్నంత ధైర్యం లేక లోలోపలే వికసించేవాడు. పూర్తి బిడియస్తుడు.
పేట కదా! దేని ఫలం దానికి వుంటుంది. ధైర్యం ఫలితం ధైర్యానిది. బిడియ ఫలితం బిడియానిది.
కోయిన్‌కు మీసం ఇంకా పూర్తిగా మొలవకుండానే, స్మార్ట్‌ఫోన్ ఇచ్చిన చైతన్యంతో, పక్కింటి పిల్లను ప్రేమలో పడేశాడు. ఆ పిల్ల నెలతప్పితే, ఆ పిల్ల తల్లిదండ్రులు కోయిన్ కోసం గుట్టుగా దారి కాచారు. పారి పోవటానికే కోయిన్ పిరికి వాడు కాదు. వాడు చేసిన తప్పుకు వాళ్ళకి రెండు విడివిడి మొత్తాల్లో ఫైన్ వేశాడు. మొదటి మొత్తం: గర్భం వచ్చిన విషయం దాచటానికి. రెండవ మొత్తం: పెళ్ళిచేసుకోవటానికి. రెండూ జరిగిపోయాయి. తల్లి సంతానమ్మ కుయ్యో మొర్రో అంది. కాదంటే, ఉరేసుకుంటానన్నాడు కోయిన్. ఊరుకుంది సంతానమ్మ. దేశం బోర్డర్‌లో వున్న మిలట్రీ తండ్రికి తెలిసింది. ‘కాల్చిపారేస్తానన్నాడు’. ఆ పని చెయ్యటానికి కూడా ఓ ఏడు నెలలు ఆగాలి. అప్పటికికాని, తాను చేసే సిపాయి ఉద్యోగానికి సెలవు దొరకదు. తీరా వచ్చేక మిలట్రీ తండ్రి చేతుల్లో పసికూనను పెట్టేశాడు కోయిన్. దాంతో తండ్రీ కొడుకుల మధ్య ‘కాల్పుల విరమణ’ ఒప్పందం జరిగిపోయింది.
కోయిన్‌కు చదువులో పదిదాటాలన్న కోరిక ఏనాడో పోయింది. దాంతో ఒకే ఒక్క ఉద్యోగంతో స్థిరపడాలన్న చింత కూడా చచ్చిపోయింది. అడుక్కునే వాడికి అరవయ్యారు కూరలన్నట్టు, చేసుకోవాలి కానీ, పది తప్పినవాడికి ప్రతీదీ ఉద్యోగమే. సీజన్ కో జాబు. ప్రతీ జాబుకీ ఒక కేలెండర్.
వచ్చేది డిశంబరులో అయినా, నవంబరు నుంచే మొదలుపెట్టవచ్చు ‘పేట క్రిస్మస్’కు వసూళ్ళ కార్యక్రమం. పేటలో వుండిపోయిన వాళ్ళనుంచయితే వందల్లో.. గల్ఫ్‌లో వున్నవాళ్ళనుంచి వేలల్లో..!
పేటకు ఒక్కడే కోయిన్ కాదు కదా.. ఇలాంటి కోయిన్లెందరో..! అందరూ పంచుకుంటారు..ఈ పనిని. ఇది జనవరి పండుగవరకూ కొనసాగుతుంది.
అంబేద్కర్ జన్మదినం ఏప్రిల్లో. అందుకు ఫిబ్రవరి నుంచే మొదలవుతుంది. పేటకు ఒకటే బొమ్మ. అదీ ఈశాన్యం లో వుంది. నైరుతిలో లేదు. విగ్రహం పెట్టాలి.
ఈ మాత్రం ఐడియా చాలు కోయిన్‌కు ఇంకో మూడు నెలలు పని దొరికినట్లే. పది దాటి, బియ్యేబికాంలను తప్పించుకునో, దాటుకునో, పోటీ పరీక్షలు రాసుకునో సర్కారీ కొలువు వెలగబెట్టే వారు, పేటకో, కోటికో ఒక్కరుంటారు. ఎలా పట్టుకుంటాడో తెలీదు కానీ, ఏటి కొక్కణ్ణి పట్టుకుంటాడు కోయిన్.
‘‘అన్నా, నువ్వే బొమ్మ ముసుగు తీయాలి’ అంటాడు. ఆ క్షణం నుంచీ, విగ్రహావిష్కరణ అయ్యే వరకూ, ఆ ప్రభుత్వోద్యోగి, కోయిన్ పాలిటి ‘ఏటీయమ్మే’.
ఆ ఉద్యోగి కాకుండా, అవుట్ సోర్సింగో, కాంట్రాక్టు లేబరో చేసుకునే వాళ్ళనూ వదలడు. విగ్రహం కింద పెట్టే శిలాఫలకం మీద పేర్లు రాయిస్తానంటాడు. పేర్లు ఊరికే రావు కదా! కోయిన్ కు ప్రతీ పేరూ ఓ డెబిట్ కార్డే.
కళ్ళల్లో వొత్తులేసుకుని చూస్తే, అయిదేళ్ళకు కాని ఎన్నికలు రావు. కానీ కళ్ళల్లో కాసులేసుకుని చూస్తే అయిదేళ్ళూ ఎన్నికలే. అసెంబ్లీ, పార్లమెంటుకే కాదు, జెడ్పీటీసీ, ఎంపిటీసీ, గ్రామ సర్పంచ్, సహకార సంఘ, మార్కెటింగ్ కమిటీలూ.. అన్నిటికీ జరుగుతూనే వుంటాయి. ఏ దిక్కుమాలిన పార్టీ నీడకు కార్యకర్తగా వెళ్ళినా బీరూ, బిర్యానీలతో పొట్టపోసుకోవచ్చు.
మరి పెళ్ళామో..! ఆమెనెలా పోషించాలి? ఈ ప్రశ్నే పరమ అసహ్యంగా తోచింది కోయిన్‌కి. ‘పెళ్ళామే నన్ను పోషించాలి’ అన్న రూలు ప్రకారం, బిడ్డను అత్తగారింట్లో పెంపకానికిచ్చేసి, ఆమెను అబుదబీకి ఆయాగా విమానం మీద పంపేశాడు. నెల వచ్చేసరికి, ఎంతో కొంత అకౌంట్ ట్రాన్సఫర్ అవ్వాలి. అయ్యేది కూడా.
‘సచ్చినోడికి..ఎన్ని పైసలొచ్చిసా సాలేవి కావు..తాగితాగి ఓ నాడు మంచమెక్కేశాడు..ఆసుపత్రిలో.. లబోదిబో మంటూ ఏడుసుకుంటూ ఎల్లాను. బాగా తాగేత్తే పోయేది లివరంట కదా..? కానీ ఈడికి కిడ్నీ పోయిందన్నారు.. నేనే ఇచ్చాను.. నాదే తీశారు.. ఆ తర్వాత ఎప్పుడుకో తెలిసింది ఏంజిలా..! ఈడూ, ఆసుపత్రోడూ కుమ్మక్కయ్యి నా కిడ్నీ ఆమ్మేసుకున్నారనీ.!’ అంటూ గుబులు గుబులుగా ఏడ్చింది సంతానమ్మ.
‘ఒక కడుపున పుట్టినోళ్ళు ఒకలా వుండరు కదా ఆంటీ? పెద్ద కొడుకు అలా అయినా, నీ చిన్న కొడుకు మంచోడే అయివుండాలి.. కదా..!?’ అడిగింది ఏంజెల్.
‘అవును బుల్లే..!’ అంటూ చనువు పెంచేసుకుని, ‘ఇద్దరూ కత్తులే. ఆడు ఇనప కత్తెయితే, యీడు ఐసు కత్తి..!’ అంటూ ఏబేలు జీవితం ముందు పెట్టింది సంతానమ్మ:
కోయిన్ తప్పినట్టే, రెండు క్లాసులు వెనక వచ్చిన, ఏబేలూ పది తప్పాడు. సిగ్గెక్కువ కదా! దాంతో బయిటకొచ్చేవాడు కాదు. అలాగని ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కాదు, ‘వర్క్ ఎట్ హోమ్’. ఇంటినుంచి కాదు, ఇంట్లో పని. అదే నిద్ర. ఎప్పుడూ నిద్రేనా అంటే..కాదు. మధ్య మధ్యలో లేచే వాడు. ఈ స్వల్ప అంతరాయాలు కూడా తిండికోసం.
సంతానమ్మ తిడుతూనే వుండేది. విసిగిపోయి, ఒక రోజు బోర్లాపడుకున్న ఏబేలు నడ్డివిరగ్గొడదామని అమ్మమ్మలనాటి రోకలి తీసుకు వెళ్ళింది. కానీ అతడు నిజంగా పడుకుని లేడు. మోకాళ్ళ మీద వున్నాడు. ముందుగా బైబిలు వుంది. రోకలి అవతల విసిరేసి చెంపలు వాయించుకుంది. క్షమించమని దేవుణ్ణి వేడుకుంది.
ప్రార్థన నుంచి మేల్కొని, తనకు సేవ చెయ్యమని దేవుని పిలుపు వచ్చిందన్నాడు ఏబేలు. ఏ కష్టంలో ఎవరు ఇంటికి వచ్చినా, ఏబేలు బైబిలు చదివి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయించుకున్నవారు, తృణమో, పణమో ఏబేలుచేతుల్లో పెట్టేవారు. ఆ తర్వాత ఎవరి ఇంట్లో ఎవరికి సుస్తీ చేసినా, ఏబేలును పిలిచేవారు. ఈ సారి పైసలే కాదు, భోజనం పెట్టి కూడా పంపేవారు. పుట్టిన రోజు ఫంక్షన్లకీ, ఎవరన్నా పోతే.. జ్ఞాపకార్థ కూటములకీ వెళ్ళినప్పుడయితే, మటనూ, బిర్యానీ తప్పనిసరి వుండేది.
రెండు మూడేళ్ళవరకూ ఇలావుండేసరికి, ‘ఏబేలు మంచి విశ్వాసి’ అని నమ్మేసి, ఒక తండ్రి ఎవరో డిగ్రీ (బువ్వ చదువే లెండి!) చదివిన పిల్లనిచ్చేస్తే, సంతోషంగా పెళ్ళి చేసేశారు, సంతానమ్మా, అప్పటికే రిటయిరయిన ఆమె మిలట్రీభర్తా కలసి. అంగన్ వాడీ ఉద్యోగానికి ప్రయత్నిసానంది ఏబేలును కట్టుకున్న అమ్మాయి. ‘చూద్దాంలే’ అన్నాడు. బిడియస్తుడు కదా ‘వద్దూ’ అని కటువుగా చెప్పలేడు. ఏబేలు అప్రకటిత పాస్టరు కావటంతో, అతని భార్యగా ఆమెకు కూడా ‘పాస్టరమ్మ’ హోదావచ్చింది. అందరూ అలాగే పిలవటంతో, భర్తకిష్టమైన మాంసం, చేపలూ రుచికరంగా వండిపెట్టటంలో తరించింది.
వాళ్ళిద్దర్నీ చూస్తే, సంతానమ్మకు వాళ్ళ నాన్నా, అమ్మ గుర్తుకొచ్చేవారు. సంతానమ్మ తండ్రి మిషన్ హైస్కూలులో చదివి, తర్వాత నిజంగానే పాస్టరు ట్రయినుంగు పూర్తి చేశాడు. చర్చిలో ఆయన ప్రసంగం చేస్తే, అందరూ కంట తడిపెట్టుకునే వారు. ‘గుళ్ళల్లోకి ప్రవేశంలేని మనం చర్చిల్లో బోధకులమయ్యాం సంతమ్మా!’ అని తండ్రి అన్న మాటల్ని మాటి మాటికి గుర్తు తెచ్చుకునేది సంతానమ్మ. మిషనరీలే అప్పట్లో పాస్టర్ల జీత భత్యాలు చూసుకునే వారు. ఇక తల్లయితే గవర్నమెంటు స్కూల్లో టీచరు. తన తండ్రి చేసే ప్రసంగాలకు వాడలోని వాళ్ళే కాదు, ఊళ్లోని ఇతర వర్ణాల వారు కూడా మతం మార్చుకునేవారు.
బైబిలు పట్టుకున్న ఏబేలులో అలా తన తండ్రిని చూసుకోబోయిన సంతానమ్మకు మెల్లమెల్లగా నిరాశే మిగిలింది. ఏబేలును ఇళ్ళకు పిలిచే వాళ్ళే కాదు, ఏబేలు ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళు కూడా తగ్గిపోయారు. కారణం మరేమీ కాదు. ఏబేళ్ళ సంఖ్య పేటలో పెరిగిపోవటం. ప్రతీ రెండో ఇంట్లో ఒక ఏబేలు పుట్టుకొచ్చాడు. దాంతో వీళ్ళే ఒకరి నెత్తి మీద ఒకరు చెయ్యి పెట్టి దీవించేసుకుంటున్నారు. ఇక కానుకలు ఎక్కడినుంచి వస్తాయి? ఒక వేళ వచ్చినా, ఇచ్చిన కానుకకు పుచ్చుకున్న కానుక చెల్లు.
అన్నట్లు, ఊళ్ళల్లో మతం పుచ్చుకున్న ‘సవర్ణ’ విశ్వాసులుండాలి కదా! వాళ్ళల్లో కొందరు భక్తులనుంచి బోధకులుగా రూపాంతరం చెందారు. అందులో ఒకరు రెవరెండ్ నీలేష్.
ఆయన బోధించటానికి చర్చి సరిపోదు. పేద్ద కన్వెన్షన్ సెంటర్ లాంటిది వుండాలి. ఆదివారం వస్తే చాలు, నీలేష్ ప్రసంగం వినటానికి వేలల్లో వస్తారు. వెళ్లేదంతా చర్చిపేట, అంబేద్కర్ కాలనీల వంటి వెలివాడల్లోని భక్తులే. స్థలమే కాదు, కాలమూ సరిపోదు. దాంతో మూడు షిఫ్టుల్లో రెవరెండ్ నీలేష్ బోధిస్తారు. ఆయనకు తెలుగు వచ్చు. కానీ ఇంగ్లీషు బాగావచ్చనుకుని ఇంగ్లీషులో బోధించేవాడు. అది తెలుగు వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే ఇంగ్లీషు. అయినా ఎత్తులో తనలో సగం కూడా లేని ఒక తెలుగు అనువాదకుణ్ణి పెట్టుకునేవాడు. అతడు ఎగిరెగిరి అనువాదం చేసేవాడు. తర్వాత తర్వాత వేదిక మీద రెండో వ్యక్తి వుండటం ఇష్టంలేక, రెవరెండ్ నీలేష్ ఒక్కడే తెలుగులోకి దిగిపోయాడు.
వచ్చిన వాళ్ళందరికీ మధ్యాహ్నం చక్కటి భోజనం. దాంతో వెళ్ళిన వాళ్ళు వచ్చిన కూలిడబ్బుల్లో పదిశాతం లెక్కకట్టి మరీ చందాగా వేయటం మొదలు పెట్టారు. సర్కారు వారు కొసరే వృధ్దాప్య పించన్లో పదోవంతు కూడా అలా పడిపోతుందంతే.
ఇప్పుడు ఏబేళ్ళు ఏంకావాలి? భక్తులా? బోధకులా?
రెవరెండ్ నీలేష్ వీళ్ళ సమస్యను అర్థం చేసుకున్నాడు. రెంటికీ మధ్య కొన్ని ఉద్యోగాల్ని సృష్టించాడు. ‘ప్రేయర్ హెల్పర్స్.’
అలా ఏబేలు, ‘రెవరెండ్ నీలేష్ ప్రేయర్ కాల్ సెంటర్లో’ చేరాడు. ఒకరోజు పగలయితే, ఇంకో రోజు రాత్రి డ్యూటీ. ప్రార్థన అవసరమయ్యే వాళ్లు ఎప్పుడయినా కాల్ చెయ్యవచ్చు. ‘నా కొడుకు దుబాయ్ వెళ్త్తున్నాడు. క్షేమంగా చేరాలా ప్రార్థన చెయ్యండి’ ఇలా అడగవచ్చు. ‘లేదా మా ఆయన తాగుడికి బానియ్యాడు. మానేలా ప్రార్థన చెయ్యండి’ అని కూడా అడగవచ్చు. అప్పుడు మొబైల్లోనే ప్రేయర్ హెల్పెర్స్ ప్రార్థన చేస్తాడు.
ఏబేలుకు ఈ ఉద్యోగం నచ్చింది కానీ, దానికి కూడా ‘పై’ వర్ణాలవారినుంచి పోటీవచ్చింది. అప్పుడు ఈ ఏబెళ్ళకు ‘ఫీల్డ్’ వర్క్ అప్పగించాడు రెవరెండ్ నీలేష్. అంటే మరేమీ కాదు. పేద విశ్వాసులు చనిపోతే, వారి శవాలను సమాధి చేయించే కార్యక్రమం.
‘… సర్వశక్తిమంతుడయిన దేవా..ఈ మా సహోదరి ఆత్మను మేము మీ చేతుల్లోకి అప్పగించుచున్నాము. ఈమెకు మీరు ఖచ్చితమైన ఓదార్పునూ, విశ్రాంతినీ కలుగచేస్తారని నమ్ముతున్నాము..దుఃఖించు వారు ధన్యులు..వారు ఓదార్చబడుదురు..’
‘అడుగో బుల్లీ! ఆడే నా కొడుకు..వొచ్చేసాడు..బువ్వెట్రా కొడుకా..అంటే నెత్తిమీద చెయ్యెట్టి దీవించేత్తాడు. నాలుగు రోజుల్నించి తిండిలేదమ్మా.. బరియల్ వాచ్ మేనూ, ఆల్లావిడా ఊరెల్లి పోయారు.. ఈ ఏబేలు గాడు రోజూ ఏదో సెవాన్నేసుకుని ఇక్కడికే వొత్తాడు. సావు కూడన్నా అట్టుకు రావచ్చు కదా.. ఎబ్బే..! దేముడు దీయించుగాక` అని, అలాగే ఎల్లిపోతాడు. దేముడి పంపిన ఏంజెల్లా నువ్చొచ్చి నాలుగు మెతుకులు తినిపిచ్చావు కామట్టి, నా పేనం లేసొచ్చింది. నువు నిజంగా దేవదూతవమ్మా ఏంజిలా..!’ అని ఏంజెల్ రెండు చేతుల్నీ, తన చేతుల్లోకి తీసుకుంది సంతానమ్మ.
తడిసి తేరుకున్న కళ్ళతో ఏంజెల్, సంతానమ్మ కళ్ళల్లోకి చూసింది.
‘ఇప్పుడు సెప్పు తల్లీ.. ఈ పేటల్లో తల్లులు బిడ్డల్ని కనటం అవసరమంటావా..? అందుకే దుక్కపడకు తల్లీ..! పుట్టిద్దామన్న దేవుడికే డౌటొచ్చి ఎనక్కి తీసేస్కున్నాడమ్మా నీ బిడ్డని..! ఆయన దగ్గరే సల్లగా వుండినియ్యి..సూడు.. నీ కొడుకు ఆయన సన్నిదిలో ఎలా ఆడుకుంటున్నాడో.. ఆడరా.. రేయ్ బుజ్జికన్నా.. ఆడరా.. ఆడూ…!’ అంటూనే సంతానమ్మ స్పృహ తప్పింది.
బరియల్ గ్రౌండ్ గేటులోపలికి వచ్చి ఆగింది ఆటో. నడిపింది వాచ్ మేన్ జాకబే. అందులోంచి దిగిన జాకబ్ భార్య రిబ్కా సిమెంటు రేకుల కప్పున్న ఇంటి తాళం తీస్తూ, వరండాలోని మంచం మీద సంతానమ్మ లేక పోవటం గమనించింది.
అటూ, ఇటూ చూస్తే, ఏబెల్ ఒక పక్కన సమాధి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. అక్కడ లేదు. జాకబ్ ఆటోలోంచి బ్యాగులు దించుతుంటే, ‘పెద్దమ్మ ఏమయ్యిందీ’ అంటూ శ్మశాన వాటిక అంతా కలయతిరిగింది రిబ్కా. అతి పెద్ద సమాధి పక్కనే సంతానమ్మ పడివుండటం గమనించి ‘ఏమయ్యో..జాకబా..! రా..రా.. పెద్దమ్మ పడిపోయింది.’ అని అరచింది.
జాకబ్ వాటర్ బాటిల్ తో వచ్చాడు. సంతానమ్మ ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. ఆ తర్వాత నాడి చూశాడు. ఎంతయినా కాటికాపరి కదా.. ఊపిరి లేని వాళ్ళ మధ్య, ఊపిరి వున్న వాళ్ళని ఇట్టే పోల్చుకోగలడు.
జాకబ్ వాటర్ బాటిల్ తో వచ్చాడు. సంతానమ్మ ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. ఆ తర్వాత నాడి చూశాడు. ఎంతయినా కాటికాపరి కదా.. ఊపిరి లేని వాళ్ళ మధ్య, ఊపిరి వున్న వాళ్ళని ఇట్టే పోల్చుకోగలడు. రిబ్కా బాటిల్ తీసుకుని సంతానమ్మ ముఖం మీద నీళ్ళు కొట్టింది.
‘ఏంజిలా.. ఏంజిలా..’ అంటూ లేచి ‘రీబక్కా.. నువ్వా..? ఏంజెలేదీ.. ఏమయ్యిందీ..!’ అంటూ గాబరాగా వెతికింది. ‘సంటోడి సమాది కూడా లేదే..!? తవ్వేసారా ఏంటీ..?’ అని వెతక పోయి, మళ్ళీ పడిపోయింది. ఈ సారి నీళ్ళు కొట్టినా లేవలేదు.
జాకబ్, రిబ్కాలిద్దరూ సంతానమ్మను ఒకరు కాళ్ళూ, ఇంకొకరు చేతులూ పట్టుకుని తమ సిమెంటు రేకుల ఇంటికి తరలించి, బయిట మంచం మీద పడుకోపెట్టారు.
‘ఏం చేద్దాం?’ అంది రిబ్కా.
‘ఈవిడ సిన్న కొడుకు ఏబేలు ఇక్కడే వున్నాడుగా.. ఆణ్ణి పిలుసుకురా…ఈ లోగా కోయిన్ గాడికి పోను కొడతాను.’ అని జాకబ్ అనగానే.. రిబ్కా సమాధి కార్యక్రమం దగ్గరకు పరుగెట్టింది.
క్షణాలు.. నిమిషాలు… దాటి అర్థగంట గడచిపోయింది. చిత్రమేమిటంటే, అక్కడున్న ఏబేలు కన్నా, కోయినే ఆయసపడుతూ ముందు వచ్చాడు. కానీ బతికే వుందని జాకబ్ చెబుతున్నా వినకుండా
‘అమ్మా.. అమ్మా.. అమ్మా..! నన్నొదిలేసి ఎల్లిపోతావంటే..!’ సంతానమ్మ మీద పడి ఏడ్చాడు. అంతలోనే తేరుకున్నాడు. ఫ్యాంటు జేబులోని స్మార్ట్ ఫోను తీసి, నిశ్చలనంగా వున్న తల్లిని కాళ్ళ దగ్గర నుంచి ఒకటీ, తల దగ్గరనుంచి ఒకటీ ఫోటోలు తీసుకున్నాడు. ఫోను చూసుకుంటూనే కాస్త పక్కగా నడచి వెళ్ళి, కాల్ చేయటాన్ని వాచ్‌మేన్ జాకబ్ గమనించాడు. ‘అంబులెన్స్‌కు కాబోలు’ అని అనుకున్నాడు కానీ, కోయిన్ ఒకరి తర్వాత ఒకరికి కాల్స్ చేస్తూ, రకాల రకాల వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. మాటల సారాంశ ఒక్కటే:
‘అమ్మ చచ్చిపోయింది రా.. ఇప్పుడే.. నీకు ఫోటో వాట్సాప్ లో పెట్టాను. ఇంతని కాదు.. ఎంతుంటే అంత నాకు పేటీఎం చేయి.. కార్యక్రమం చెయ్యాలి.’
ఆశ్చర్యాలు అలవాటయిపోయిన చోట కాపురముంటున్న జాకబ్, రిబ్కాలకు కూడా కాస్సేపు మాట రాలేదు.
ఈలోగా ఏబేలు అదే శ్మశాన వాటికలో తన కార్యక్రమం ముగించుకుని, మెల్లగా నడుచుకుంటూ తల్లి దగ్గరకు వచ్చి, వంగి, ముక్కు దగ్గర వేలు పెట్టి చూసి, నిటారుగా నిలబడి, ఎడమచేత్తో బైబిలును గుండెకు హత్తుకుని, కుడిచేతిని ఆమె ముఖం వైపు చాచి, కళ్ళు మూసుకుని సంక్షిప్త ప్రార్థన చేశాడు:
‘తండ్రీ, ఈ బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈమెను స్వస్థత పరచి, సజీవురాలిగా వుంచి, నిన్ను మహిమ పరచే భాగ్యము దయచేయి నాయనా…! ఆమెన్!’
అక్కడితో వదలకుండా, ‘అంతా దేవుని దయ! బాగా చూసుకోండి’ అని జాకబ్, రిబ్కాలకు చెప్పి వెళ్ళిపోయాడు ఏబేలు.
సమయం వృధా చెయ్యకూడదనుకున్న రిబ్కా, జాకబ్‌లు సంతానమ్మను అలాగే తీసుకువెళ్ళి ఆటోలో వెనక సీటు మీద కాళ్ళు ముడిచి వెల్లికిలా పడుకోబెట్టారు.
డ్రైవింగ్ సీటునే భార్యా, భర్తలిద్దరూ పంచుకుని, ఆటోని ప్రభుత్వాసుపత్రి వైపు పోనిచ్చారు.
‘జాకబా..మన ఆశగాని బతుకుతుందంటావా..?’ రిబ్కా అంది.
‘బతికితే నరకమే. మల్లీ మల్లీ..ఏదోరకంగా కొడుకులు ముకాలు సూడాలి. ఎందుకా బతుకూ..?’
పోలీసులు బళ్ళు ఆపి లైసెన్సులు చెక్ చేస్తున్నారు.
ఆటో ఆగింది. జాకబ్ భుజం మీద చెయ్యి.
‘లైసెన్సు వుంది సారూ..! మా పెద్దమ్మ పోయేలాగుంది.. ఆసుపత్తిరి కెల్లాలి. బేగే సూడండాయ్యా’ అని ముందుకు వంగి కాగితాలు తీయబోతున్నాడు.
‘బుల్లోడా..?’ దీన స్వరం. అది సంతానమ్మదే. ఆ చెయ్యీ సంతానమ్మదే.
రిబ్కా, జాకబ్‌లిద్దరూ వెనక్కి తిరిగి చూశారు. వెనక సీట్లో లేచి కూర్చుని వుంది సంతానమ్మ.
‘కాసిన్ని టీ నీల్లు పోయించరా జాకబ్బా..!’ అని మూలుగుతూ అంది.
రిబ్కా ఒక్క ఉదుటున పరుగెత్తింది, రోడ్డు పక్కన టీస్టాల్ వున్న వైపు.
‘పోయావునుకున్నానే పెద్దమ్మా..!’ ఊపిరి పీల్చుకున్నాడు జాకబ్.
‘మనమనుకుంటే సరిపోద్దా..! కొడుకులు వొద్దనుకున్నట్టు, దేముడు కూడా వొద్దనుకున్నాడేమో..ఇలా వదిలేశాడు..!’ అంది సంతానమ్మ.
ఆమెకిప్పుడు చావే అవసరమయన చికిత్స. కానీ అది రాదు!!
(ఈ కథ ‘సారంగ’ అంతర్జాల పత్రికలో ప్రచురితమయ్యింది)