శిశువు నేడు లేచెను

దాదాపు మూడు  దశాబ్దాల క్రితం చుండూరులోదళితుల మీద దాడి చేశారు.  అప్పడు చంపింది రెడ్డి భూస్వాములు. అప్పడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోవుంది. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన రెడ్డి. పంటపొలాల్లో దళితకూలీలను తరిమి తరిమి చంపి వారి శవాలను గోనె సంచుల్లో మూట కట్టి మురికి కాలువలో పడేశారు. ఈ ఘటనకు దేశం నలుమూలలా దళితుల తల్లడిల్లారు. దళిత సంఘాల వారు వారు శవాలను వెలికి తీసి, నిరసనగా ఊరి మధ్యలో పాతి పెట్టారు. పాత్రికేయుడిగా వార్త కోసం వెళ్ళి చూసి వచ్చాక నా మనసు మనసులో లేదు. అప్పడు రాసిందే ఈ కవిత. తెలుగు కవిత్వాభిమానులకు పరిచితమయినదే.

Photo By: Ken Banks

సమాధుల కడ్డంగా బండరాళ్ళెందుకు

పర్వతాల్నే పేర్చమనండి

ఉన్నట్టుండి జీసస్సులు

ఉషస్సుల్లా చివాల్న లేవకపోరు.

 

ఊరినే వెలివేసినట్లు

ఊరు మధ్య సమాధులా?

 

ఊరుకు నాలుగు మూలలు

జీవులకు నాలుగు కాళ్ళు

పొర్లడానికి నాలుగు వరసలు

కులం నాలుగు పాదాలా పాకేది.

 

ఎక్కడో అయిదో మూల దూరంగా

పశువుల పాకలో రెండు కాళ్ళ శిశువు జననం

 

తోకచుక్క పొడిచిందో లేదో కాని

ఊళ్ళో తోక తెగిన చప్పుడు.

 

శిశువు పాదస్పర్శకు మైలపడ్డ పశువుల ఆగ్రహం

మొరిగి, ఓండ్రపెట్టి, ఊళ వేసిన శోకాలపన

 

ఈ శిశువు-

బానిసల కంటిపాప

ఒక శతాబ్దపు స్వప్నశకలం

వందేమాతరపు తొలిచరణం

పశుధర్మశాస్త్రం ప్రకారం శిశుజననం మహాపాతకం

 

శిశువుకు-

రెండు కాళ్ళుండటం నేరం

మిగులు భూమ్మీద అడుగులు వేయకుండా

మేకులు కొట్టారు.

 

రెండు చేతులుండడం నేరం

పని చూపమని యాచించకుండా

చిల్లులు పెట్టారు.

 

శిరస్సులో మెదడుండడం నేరం

మళ్ళీమళ్ళీ రాజ్యాంగం రాయకుండా

ముళ్ళ కిరీటం గుచ్చారు.

 

ముఖవర్చస్సుండడం నేరం

ఏ తల్లీ ముద్దాడకుండా

కాండ్రించి వుమ్మారు.

 

అన్నిటికన్నా ఛాతీలోపల గుండెకాయ వుండడం నేరం

బానిస కొడుక్కి ప్రేమెందుకని

బరిసెలతో పొడిచారు

పంట పొలాల్లో శిశువుకు శిలువ మరణం

పట్టపగలు చీకటి కమ్మింది.

ఆకాశం అయిదు ముక్కలుగా చీలింది.

సూర్యుడు నాలుగు ముక్కలూ అతుక్కొని ముఖం కప్పుకున్నాడు.

 

శిలువ మీద శిశువు పలికిన చివరి మాట:

‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగుదురు.

నేను తిరిగి లేచువరకునూ వీరిని సజీవముగా వుంచుము’.

 

ఊళ్ళో పశువుల పరారీ.

నాలుగు రోడ్ల కూడలిలో

గర్భం దాల్చిన నేలతల్లి.

వీరుల సమాధులన్నీ నిండు చూలాళ్ళే.

 

పిరికి వాళ్ళు పశుపాలకులు!

శిశువింకా లేవకుండానే పశువధను నిషేధించారు.

‘పశువులను వెదకి శిక్షించుటకు

శిశువు ఈ లోకమునకు వచ్చును’

 

గర్భశోకతప్త హృదయులైన మాతృమూర్తులారా

కళ్ళు తుడుచుకుని

ధవళ వస్త్రాలతో స్వాగతం పలకండి.

 

‘శిశువు నేడు లేచెను. హల్లెలూయ’
-సతీష్ చందర్

2 comments for “శిశువు నేడు లేచెను

  1. మధ్యలో మతాన్ని ఇరికించి, సమస్యను పలుచన చేశారు. పక్కదారి పట్లించారు.
    అందులోనూ, చెప్పాల్సిన మంచి మాటలన్నీ చెబుతూనే, సహస్రాబ్దాల బాటు భావ స్వాతంత్ర్యాన్ని నొక్కి పెట్టి,లక్షల మందిని ఊచకోత కోసిన సాంప్రదాయాన్ని ఉటంకిస్తూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *