‘ఎత్తి పొడుపు’ కథలు!

అన్నీ వెక్కిరింతలే. వెవ్వెవ్వెలే. అలా కథలయిపోయాయంతే. వెక్కిరింత నేర్పిస్తే వచ్చేది కాదు. ఒక్క కాలు మీదే నిలబడి తపస్సు చేసినా రాదు. దానంతటదే అబ్బుతుంది. విన్నవాళ్ళూ, చదివిన వాళ్ళూ- ఓహో వ్యంగ్యం కాబోలు అని గుర్తిస్తారు. కాదు కాబోలు అన్నా, వెక్కిరింతల వాడికి వచ్చే నష్టం ఏమీ లేదు.

పతంజలికి మారు పేరు కాదు. అసలు వేరే వెక్కిరింత. పొడవ కుండా, ఎత్తి పొడవకుండా ఎవర్నీపలకరించడు. కడకి తనను తాను కూడా అలాగే పలకరించుకుంటాడు. తన మీద తాను హాస్యాలాడుకోలేని వాడు హాస్యమే రాయలేడు. ఇంక వ్యంగ్యం కూడానా?

‘ఆంధ్రప్రభ’ దినపత్రికలో ఆయనా నేను కలసి పనిచేస్తున్నాం. ఆ పత్రిక పునరుధ్దరణకు కొత్త యాజమాన్యం తెచ్చుకున్న సంపాదకుల్లో నేనూ, పతంజలీ వున్నాం. పక్కపక్కనే అయినా, ఎవరి గదులు(క్యాబిన్లు) వాళ్ళవి. ఆయనేమో అగ్నిహోత్రుడాయె! సిగరెట్టు వెలుగుతూనే వుండేది. నిప్పు ఆయనదీ, పొగ నాదీను. పొగతో పాటు మాటలు కూడా ప్రసారమయ్యేవి. ధూమ సందేశాలన్నమాట. అవే సంభాషణలు కూడా.

సంపాదకీయాన్ని మాత్రం ఆయన వెక్కిరింత వదిలేస్తుందా? ఆయనకి మండిందంటే, సంపాదకీయానికి వున్న గాంభీర్యాన్ని ఒక్క పోటు పొడిచి తీసెయ్యగలడు. నాకు బాగా గుర్తు. పంజాబ్ మీద ఆయన రాసిన సంపాదకీయం ఇలా మొదలయ్యింది: ఇప్పుడు  పంజాబ్ తీవ్రవాదులకు నాయకుడంటూ లేడు. ఒక్క బింధ్రన్ వాలే ప్రేతాత్మ తప్ప. అదృష్టం కొద్దీ పంజాబ్ తీవ్రవాదులకు తెలుగు రాదు కాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే వాళ్ళు- ఆత్మ పరిశీలన బదులు- ‘ప్రేతాత్మ పరిశీలన’ చేసుకుని, ఆయుధాలు ఈ సంపాదకీయం చదివిన మరుక్షణం విసిరి పారేసేవారు.

‘ఉదయం (పత్రిక) మూతబడే వరకూ మీరున్నారా?’ అని అడిగాను ఒకసారి ఊరికే.

‘ఉదయాన్ని కాదు, పులిని, నేను- బొబ్బలి పులి-ని చంపిన వాణ్ణండీ!’ అన్నాడు. (దాసరి నారాయణరావు సారథ్యంలో ఉదయం దినపత్రికే కాదు, ‘బొబ్బిలి పులి’ మ్యాగజైన్ కూడా వచ్చింది. ఆ పత్రికకు పతంజలే సంపాదకుడు.) అలా తనని తాను వెక్కిరించుకోవటానికి ఏ మాత్రం వెనకాడడు.

తిట్టుకే కాదు, పొగడ్తకూ వెక్కరింతే.

ఇది జరిగి ఇరవయ్యేళ్ళ కిందటే, మొదట పతంజలిని ‘ఉదయం’ కార్యాలయంలో చూశాను. ఆయన కూడా నన్ను చూడటం అదే మొదటి సారి.

‘మీ రాతలు చదివాను. వాటిని బట్టి మీరు- బక్కగా, సన్నగా ఆకలితో నకనకలాడుతున్నట్టుండాలే! బాగా ఉబ్బి వున్నారే!’ అన్నాడు నన్ను చూసి. ఎనభయ్యవ దశకం కదా? విప్లవ సాహిత్యం ఇంకా రచయితల నడినెత్తినే వున్న రోజుల్లెండి! రచనలాగే, రచయిత  కనిపించాలంటే, నాలా ‘ఉబ్బి’ తబ్బిబ్బయి వుండకూడదు కదా?

నేను వెళ్ళేసరికి ఆయన తలవంచుకుని తెగ రాసేస్తున్నాడు.

‘బిజీ గా వున్నట్టున్నారు? మీ పని చెడగొట్టినట్టున్నాను.’ అన్నాను ముఖమాటం వెలగబెడుతూ.

‘అవును. సంపాదకీయం రాయటమనే పనికిమాలిన పనిలో వున్నాను.’ అని బదులిచ్చాడు.

సంపాదకీయాన్ని మాత్రం ఆయన వెక్కిరింత వదిలేస్తుందా? ఆయనకి మండిందంటే, సంపాదకీయానికి వున్న గాంభీర్యాన్ని ఒక్క పోటు పొడిచి తీసెయ్యగలడు. నాకు బాగా గుర్తు. పంజాబ్ మీద ఆయన రాసిన సంపాదకీయం ఇలా మొదలయ్యింది: ఇప్పుడు  పంజాబ్ తీవ్రవాదులకు నాయకుడంటూ లేడు. ఒక్క బింధ్రన్ వాలే ప్రేతాత్మ తప్ప. అదృష్టం కొద్దీ పంజాబ్ తీవ్రవాదులకు తెలుగు రాదు కాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే వాళ్ళు- ఆత్మ పరిశీలన బదులు- ‘ప్రేతాత్మ పరిశీలన’ చేసుకుని, ఆయుధాలు ఈ సంపాదకీయం చదివిన మరుక్షణం విసిరి పారేసేవారు.

పతంజలికి మనుషులు నచ్చకపోవటం ఎంత ప్రమాదమో, నచ్చటమూ అంతే ప్రమాదం. ఒక్కొక్క సారి రచయితలు, కవులు తీవ్రంగా నచ్చేసేవారు.(రావిశాస్త్రి మాత్రం తీవ్రాతి తీవ్రంగా నచ్చేసేవారు. అది వేరే విషయం.)  అప్పుడు ఆయన పులకింత పులకింతలా వుంటుందేమిటీ? వెక్కరింతయి కూర్చోదూ?  కాళీపట్నం రామారావు గారు అలా నచ్చేశారు. ఇక పతంజలి ఆగుతారా? ‘కాళీ పట్నం చూడరా బాబూ!’ అని పత్రికలో పొగడి పారేశారు. తర్వాత కష్టం  పతంజలికి కాదు, కాళీపట్నానికి వచ్చింది. ఈ పొగడ్త ఓ పేద్ద రచయిత్రికి నచ్చలేదు. దాంతో ‘ఎడా పెడా పొగడర బాబూ’ అని ఆవిడ కౌంటర్ వేసేశారు. వేసెయ్యటమేమిటి? ఆ పేరుతో వ్యాసం రాసేసి, నేరుగా పతంజలికే పోస్టు చేసేశారు. పతంజలి వెక్కిరింత రెండితలయ్యింది. ఆవిడ కౌంటర్ను ప్రచురిస్తూనే, దాని కింద తన ‘ఎన్ కౌంటర్’ వ్యాసం వేశారు, ‘చెడామడా తిట్టర బాబూ!’ అని.

ఇంకోసారి ఎప్పుడో కవి నగ్నముని నచ్చేశాడు. పతంజలి వెక్కిరింతకు వొళ్ళు తెలియలేదు:

‘వాడు తాజమహల్ గోడల మీద పేడ పిడకలు చరచగలడు. మువ్వన్నె పతాకాన్ని పేలికలుగా చీల్చి, దిసమొలల్తో తిరుగుతున్న పసిపిల్లలకు గోచీలు పెట్టగలడు.’ అంటూ రాసుకుంటూ పోయాడు. పాపం. నగ్నమునికి తర్వాత శత్రుకోటి పెరిగే వుంటుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. నా ‘పంచమ వేదాని’కి ఆయన రాసిన ముందు మాట వల్ల నాకు మాత్రం మిత్రులతో, సమానంగా శత్రువులు తయారయ్యారు. ఫలితంగా  నా ‘బ్యాలెన్స్ షీట్ ’ టాలీ అయిపోయింది లెండి.  

‘మొదటి భాగం రాస్తున్నప్పటికి, నాకు రెండో భాగం తెలీదు. ఎక్కడో ఓ దగ్గర ప్రారంభిస్తే చచ్చినట్లు మరో దగ్గర పూర్తవుతుందనే నమ్మకం.’  ఇలా రాస్తున్నప్పుడు ఆయన తనకు తాను ఒక కొలంబస్ లాగా ఫీలవుతాడు. చేరుకున్న భూభాగం ఇండియా కాకపోవచ్చు. అదే అమెరికాయే కావచ్చు. కావాలంటే తన పాత్రల్ని ఇండియన్లని కాకుండా, రెడ్ ఇండియన్లని కూడా పిలుచుకోవచ్చు. కానీ ఆయన రచన వెంట పాఠకుడు వెళ్ళిపోతాడు. ముగింపుతో సంతుష్టి చెందుతాడు. గొప్ప ఆశ్చర్యానికి గురవుతాడు.

ఈ కథంతా ఎందుకంటే, పతంజలి కథల గురించి చెప్పాలి కాబట్టి. వచనానికి ఉత్కృష్ట రూపం (Highiest Form) వ్యంగ్యం. పతంజలి రాసే వ్యంగ్యమూ వచనమే. కానీ అది ‘చచ్చు వచనం’ కాదు. బతికున్న వచనం. నవల రాసినా అదే వచనం. కథ రాసినా అదే వచనం. మాట్లాడినా అదే వచనం. రాసినంత బిగువుగా మాట్లాడటం కష్టమనుకుంటారు కొందరు. కానీ కాదు. మాట్లాడినంత సరళంగానూ, నాటకీయంగానూ రాయటం అంతకన్నా కష్టం. పతంజలి ఎలా మాట్లాడతాడో, అలా రాస్తాడు:

‘క్రిమినల్స్ కు బేబీ పేస్ వుంటుంది. శోభారాజ్ ను చూడండి. దావూద్ ఇబ్రహీంన్ చూడండి. అదుగో ఇలా నడిచొస్తున్నాడే ఆ రైటర్ ఫేస్ చూడండి. బేబీ ఫేసే.’  

ఇవి ఆయన మాట్లాడిన వాక్యాలే. డ్రామా  లేదూ? యాంటీ క్లయిమాక్స్ లేదూ? అవే రచనల్లోనూ వచ్చిపడతాయి. వచనం అలా ఉద్విగ్నమవుతుంది.

నాతూ మాట్లాడుతూనే పతంజలి అన్నారు:

‘నాకు పార్కులు నచ్చవు. అడవి నచ్చుతుంది. అడవిలోని చెట్లు వాటి ఇష్టం వచ్చినట్లు ఎదుగుతాయి. పార్కులో కత్తిరించి పారేస్తుంటాం.’  

అదీ ఆయన రచనల్లోని రూప రహస్యం. రూళ్ళు గీసుకుని మొక్కలు పెరగవు కదా? రచనలు కూడా అంతే.

కథల్లో అయినా, నవలల్లో అయినా ఆయన తీరు ఒక్కటే: ‘మొదటి భాగం రాస్తున్నప్పటికి, నాకు రెండో భాగం తెలీదు. ఎక్కడో ఓ దగ్గర ప్రారంభిస్తే చచ్చినట్లు మరో దగ్గర పూర్తవుతుందనే నమ్మకం.’  ఇలా రాస్తున్నప్పుడు ఆయన తనకు తాను ఒక కొలంబస్ లాగా ఫీలవుతాడు. చేరుకున్న భూభాగం ఇండియా కాకపోవచ్చు. అదే అమెరికాయే కావచ్చు. కావాలంటే తన పాత్రల్ని ఇండియన్లని కాకుండా, రెడ్ ఇండియన్లని కూడా పిలుచుకోవచ్చు. కానీ ఆయన రచన వెంట పాఠకుడు వెళ్ళిపోతాడు. ముగింపుతో సంతుష్టి చెందుతాడు. గొప్ప ఆశ్చర్యానికి గురవుతాడు.

మరి పతంజలి రచనల్లో జీవితాలెవరివీ?  పతంజలిని చదువుతుంటే రావిశాస్త్రిని చదివినట్టే వుండొచ్చు. కానీ ఇద్దరి పాత్రలూ ఒకటి కావు.

పతంజలి రచనలకు- ముఖ్యంగా నవలలకు- తాహతుకు మించిన మర్యాదలూ, అప్పుల మీద నిర్మించిన గొప్పలూ, పరువుకోసం పోగొట్టుకునే ప్రాణాలూ ఆయనకు ఇతివృత్తాలయిపోతాయి. చితికి పోతున్న రాజలోగిళ్ళూ, దిక్కులేని దివాణాలూ ద్యోతకమవుతాయి. ఇవన్నీ భూస్వామ్య (ఫ్యూడల్) సమాజ అవశేషాలు.

రావిశాస్త్రి ఎంచుకునే జీవితాలు ఇందుకు భిన్నమయినవి. పారిశ్రామిక సమాజంలోని చితికిపోయిన బతుకులు. పూట కూటికోసం చిల్లర నేరాలు చేసి అల్లరయి పోయే ‘రాకెట్ అప్పారావు’లు రావి శాస్త్రి రచనల నిండా కనిపిస్తారు. వీళ్ళంతా ‘అధో జగత్ సహోదరులే’. పల్లెను వీడి పట్నమొచ్చికూడా, బతుకు తెరువు మీద పట్టు దొరకని వాళ్ళే. లంపెన్ ప్రాలిటేరియట్ అని అంటారే, వాళ్ళే వీళ్ళు. సందు దొరికితే చిన్న ప్రయోజనం కోసం సాటి బీద వాళ్ళకు ద్రోహం చేసి, సంపన్నులకు మేలు చేసెయ్యగలరు.

అయితే ఇద్దరి వ్యంగ్యమూ ఒక్కటే. వెక్కిరించే విధానమూ ఒక్కటే.

మనం చూడం కానీ వెక్కిరంతలు మూడు విధాలుంటాయి:

ఒకటి: పైవాళ్ళు కింది వాళ్ళను వెక్కిరించటం.

రెండు: కింది వాళ్ళు పైవాళ్ళను వెక్కిరించటం.

మూడు: ఎక్కడి వాళ్ళు అక్కడి వాళ్ళను వెక్కిరించటం.

మొదటిది వినోదాన్నిస్తుంది. తెల్లవాడు నల్లవాణ్ణి వెక్కిరించి ఆనందాన్ని పొందుతాడు.  పైజాతి వాడు, కడజాతి వాణ్ణి అపహాస్యం చేసి, వికృతానందం పొందుతాడు. అంతెందుకు? పురుషుడు స్త్రీమీద ఆడే హాస్యాలకు హద్దు వుంటుందా?  ఓ ముగ్గురు మగవాళ్ళు కలిస్తే, వారి జోకులకు బలిపశువు అక్కడ లేని స్త్రీయే. సామాజిక మాధ్యమాల నిండా ఇప్పుడు అలాంటి హాస్యమే ఏరులయి పారుతోంది. అలాగని అలనాటి ‘పండిత చమత్కారాల’న్నీ పరిశుధ్ధమయినవి కావు. వాటిల్లో కొన్ని ఇలాంటి వెకిలి హాస్యానికి పేద్ద పేద్ద పీటలు వేసినవే.

రెండవది కోపాన్ని తీర్చిపెడుతుంది. పైవాడిని కింది వాడు నేరుగా తిట్టలేడు. అప్పుడు తిట్టుకు మారు వేషం వేస్తాడు. అంటే నల్లవాడు, తెల్లవాణ్ణి ఎత్తిపొడుస్తాడు. కూలీ, భూస్వామితో పరిహాసాలడతాడు. స్త్రీ పురుషుణ్ణి ఆటపట్టిస్తుంది. కింది కులం వాడు పై కులం వాడిని అధిక్షేపిస్తాడు. హాస్యమే ఆగ్రహం (Humour is anger) అన్నాడు అమెరికా వ్యంగ్య రచయిత ఆర్ట్ బుచ్ వాల్డ్ ఈ కోణంలో నుంచే.

మరి మూడవదో? ఒకడు తన ఎక్సరే లోని బొమికల గూడును చూసి, తానే నవ్వుకున్నట్టుంటుంది. ఎవరి సమూహపు దుఃఖాన్ని, వారి నవ్వుగా మార్చిపెడుతుంది.  ఏడ్చి తేరుకోవాల్సిన రచయిత, నవ్వి తేరుకుంటాడు. ఇదే విషాద హాస్యం (Trago-comedy).

పతంజలి వరకూ  మొదటి రకపు వెక్కిరింత ఒకటి అరా కథల్లో మినహా పెద్దగా కనిపించదు.  రెండో రకపు వెక్కిరింత (రాక్షస వృధ్ధుని  అసహజ మరణం, చూపున్న పాట వంటి) కొన్ని కథల్లో కనిపిస్తుంది. అధిక భాగం మూడో రకపు వెక్కిరింతే వుంటుంది. వాటిని చదివిన పాఠకుడు కూడా అంతే. పైకి నవ్వానని అనుకుంటాడు. కానీ లోన కుమిలి, కుమిలి ఏడుస్తాడు.

వెన్న తీసిన పాలులా, తడిలేని ప్రేమలుంటాయి. అలాంటి ప్రేమను వొలక బోసే ప్రేమికులు- మజ్నూ కన్నా, రోమియో కన్నా, షాజహాన్ కన్నా.. ఆఖరికి  దేవదాసు కన్నా  గొప్పవాళ్ళు. ప్రియురాళ్ళకు హృదయాలను ఇచ్చేస్తానని అనరు. అద్దెకిస్తామంటారు. ఒకే ఇంట్లో పోర్షన్లున్నట్లు, వీళ్ళ హృదయాలకు కూడా గదులు వుంటాయి.  ఒక్కో గదినీ ఒక్కో పిల్లకి ఇచ్చెయ్యగలరు:

‘వాడి గుండెకు నాలుగర్లున్నాయ్ట. అందులో ఒక్కో అరా, ఒక్కో అందమయిన అమ్మడికి ఒక్కోవారానికి అద్దెకిస్తాట్ట. అంచేత ఈ వారం సునీద్దట…’ అని రాస్తాడు పతంజలి ‘పాత సీసాలో కొత్త సారా లేకక.. కొస్సీసాలో పాస్సారా’ అన్న కథలో.

వ్యంగ్యరచయితకి సరదా ఒకటి వుంటుంది. అదే ముసుగులు తీసెయ్యటం. మనుషుల నంగితనాన్నీ, వెకిలి తనాన్నీ బయిట పెట్టెయ్యటం. ఈ ముచ్చట మాత్రం పతంజలి వొంటి నిండా వుంటుంది.

నాజుగ్గా కనిపించేవాళ్ళూ, ‘ఎక్స్ క్యూజ్ మీ’, ‘ఇఫ్ యూ డోంట్ మెండ్’ అంటూ వొద్దికగా వుండే ‘సోకాల్డ్ సివిలైజ్డ్’ మనుషులూ పతంజలి కంటపడ్డారో, అంతే సంగతులు. వలిచాస్తాడంతే. చర్మం కాదు. వస్త్రాల్ని. ‘మోటు మనిషి’ కథలో అదే చేస్తాడు. బస్సులో ప్రధాన పాత్ర కు భళ్ళున వాంతి అయితే,  ‘మంచివాడులాగానూ, సంస్కారవంతుడులాగానూ’ వున్న కుర్రాడు ‘ఏక్’ అని అసహ్యించుకుంటే, ‘గడ్డి తవ్వటానికీ, కట్టెలు చీల్చటానికీ, వేరుశనగ ఒలవటానికి పుట్టాయనుకున్న మోటు చేతులే జాలిపడి’ ప్రధాన పాత్ర తలను ఒడిలో పడుకోబెట్టుకుంటాయి.

అదేమి ‘దరిద్రమో’ కానీ, డెభ్భయ్యవ దశకంలో కథలు అందుకున్నవాళ్ళలో చాలావరకూ ‘దరిద్రం’ చుట్టూనే తిరిగారు. వాళ్ళ పాత్రలూ అంతే. పేదవాడయితే ‘దరిద్రాన్ని’ ప్రదర్శించేవాడు, మధ్యతరగతి వాడు ‘దాచుకునే’ వాడు అంతే తేడా. పతంజలి కథల్లో ఇద్దరూ కనిపించేవారు. కానీ పతంజలికి మాత్రం ‘మధ్యతరగతి’ వాడే లోకువ. వాడి దాపరికాన్ని బయిటపెట్టేసి ‘నవ్వేడిపించే’వాడు. వాళ్ళ విసుగుల్నీ, లొసుగుల్నీ రోడ్డు మీద కు లాగేసేవాడు. ఒక కథ (‘సిగ్గులేదు’) లో అయితే ‘దరిద్రమూ, విసుగూ తోడెద్దులు’ అనేశాడు కూడా.

దానికి తోడు, అప్పటికి కవులు కూడా వెలుపలి ఉద్యమాల కారణంగా ‘ఆగ్రహోదగ్రుల’యి వున్నారు. హక్కులను కాలరాసిన ‘యమర్జన్సీ’ రోజులవి. ఆ ప్రభావాలు కూడా ఆయన కథల్లోకి తోసుకుని వచ్చేశాయి. పతంజలి అధ్యయనం కూడా ప్రత్యేకం. అప్పట్లో కథలు రాసేవాళ్ళు విశ్వకథకులు- ఓ హెన్రీ, గై డి మొపాసా, చెఖొవ్ వంటివారిని- విధిగా చదివే వారు.

అందుకే  ఆ కాలపు గొప్ప రచయితలు భూమి గుండ్రంగా వుందని మళ్ళీ మళ్ళీ నిరూపించే పనిపెట్టుకోకుండా, ఒక్కో కథని ఒక్కో ‘డిస్కవరీ’ లాగా రాసేవారు. వాళ్ళ కథా బీజాలు (germs) వాళ్ళ వాళ్ళ సొంతాలుగానే వుండేవి. పతంజలి కూడా అంతే. ‘మరణాన్ని మించింది భయం’ (మరణ మృదంగం’) అనో, ‘నేనొద్దనుకున్నది నాతే చెయ్యించేది చట్రం’ (దిక్కుమాలిన కాలేజి) అనో, ‘జాలి కుక్కకూ, మనిషి ప్రేమకూ పంచకుండా తలకిందులుగా పంచుతున్నారనో’ (జాలి కథ) ‘ధనిక,పేదల అంతరాలు బతుకుల్లోనే కాదు, చావుల్లో కూడా వుంటాయనో (రాక్షస వృధ్ధుని అసహజ మరణం) నిరూపించే బీజాలు మచ్చుకు కొన్ని.

ఇక మరి కొన్నయితే ఏకంగా  ప్రపంచ కథల్నే తలపించేస్తాయి. ‘వెళ్ళొస్తాను భానూ!’ అన్న కథ, అమెరికా రచయిత ఓ హెన్రీ 1905 లో రాసిన ‘ది గిఫ్ట్ ఆఫ్ ది మాగీ’ ని స్పురణకు తెస్తుంది. శ్రీనివాసరావు సగటు జీతగాడు. ఏ నెలకానెలకి బొటాబొటిగా ఖర్చులకు సరిపెట్టుకుని సంసారం నెట్టుకొస్తుంటుంది భానుమతి. అన్ని నెలలూ ఒక లాగుండవు. నెలలోని అన్ని రోజులూ ఒకలాగుండవు. వాళ్ళ దరిద్రం కొద్దీ ఒక ఓ దరిద్రపు గొట్టు నెలలో పెళ్ళి రోజు వచ్చేస్తుంది. ఆ ఒక్క రోజు దిగుల్లేకుండా గడిపెయ్యాలని అనుకుని- పెళ్ళి ఉంగరమే అనుకుంటా- దాన్నమ్మేసి, ధూం ధాం చేసేసి, భార్యను తెగసంతోష పెట్టేస్తాడు భర్త. పొద్దున్నే భార్య పసిగట్టేశాక ఇద్దరి దిగుళ్ళూ పదింతలయి పోతాయి. కడకు అతణ్ణి ఆఫీసుకు పంపించటానికి రెండు రూపాయిలు తడిమి తడిమి ఇస్తుంది భార్య. ఇదీ పతంజలి కథ సారాంశం.

హెన్రీ కథలో భార్యా భర్తలు ఇలాగే చేస్తారు. వాళ్ళకది పెళ్ళిరోజు కాదు కానీ, క్రిస్మస్ రోజు. వాళ్ళూ దరిద్రగొట్టు ప్రేమికులే. ఆవిడ కున్న పొడవాటి కురులను అడ్డమైన దువ్వెనల్తో దువ్విస్తుంది దరిద్రం. అతడి చేతికున్న బంగారు గడియారానికి పనికిమాలిన బెల్టు పెట్టించేస్తుంది అదే దరిద్రం. కానీ క్రిస్మస్ రోజు ఆమెకివ్వటానికి ఖరీదయిన దంతపు దువ్వెనతో తయారవుతాడు భర్త. కానీ ఆమెకు జుత్తు వుండదు. భర్త వాచీకి ప్లాటినం చైను కొనుక్కొస్తుంది భార్య. అతడి చేతికి వాచీ వుండదు. ముగింపు ఊహకందేదే. అతడు వాచీ అమ్మి దువ్వెన తెస్తే, ఆమె తన జుత్తును విగ్గులు తయారు చేసేవాడికి అమ్మేసి చైను తెస్తుంది. అలా వచ్చాయి ఇద్దరికీ పైసలు. దరిద్రుల ప్రేమలంతే. ఇదీ ఓ హెన్రీ కథ. గ్రేట్ మెన్ థింక్ ఎలైక్- అంటారు కదా! గ్రేట్ రైటర్స్ కూడా, అని అనుకోవాలి. ‘వెళ్ళొస్తాను భానూ’ కథను అంత హృద్యంగానూ మలుస్తారు పతంజలి.

కథను చెక్కటంలో చెఖొవ్ కు ఎవరూ సాటి రారని అనుకునే వారు. పతంజలి కూడా అంతే. ’చెఖొవ్- వాంకా- కథ చదివే వుంటారు కదా?’ అని అడిగారు ఆయన నన్నొకసారి. ఆ కథ నిజంగానే మనసును మెలిపెట్టేస్తుంది. ఒక షూమేకర్ దగ్గర పనిచేసే కుర్రాడు- చాలీ చాలని తిండీ, చచ్చేటంత చాకిరీల మధ్య నలిగి పోతూ- తనని అతని దగ్గరనుంచి తీసుకు పొమ్మని వాళ్ళ తాతకు ఉత్తరం రాస్తాడు. తాతకు అంతటి తాహతే వుంటే, కుర్రాణ్ణి షూమేకర్ దగ్గర పెట్టేవాడే కాడు కదా? ఆ ఉత్తరాన్ని పోస్టు బాక్సులో వేస్తాడు కూడా. కానీ ఉత్తరం మీద తాత అడ్రసు వుండదు. చేరదని తెలిసే సేద తీరటానికి రాసే ఉత్తరం అది.

ఈ కథను సైతం తలదన్నే కథను, అంతకు మించిన గొప్ప శిల్పంతో రాయగలిగాడు పతంజలి. పస్తులుండి మాత్రమే కాదు, పస్తులు చూడలేక అమ్మ చచ్చిపోతుంది. అంత్యక్రియలక్కూడా కొడుకు రాజేశ్వరరావుకు పైసల్లేక పోతే, మిత్రుడొకడు తనువు తాకట్టుపెట్టి కొంత పైకాన్నిరాజేశ్వరరావు జేబులో పెట్టేస్తాడు. అమ్మ బూడిదయ్యాక, ఆఖరికి మిగిలినవి పది పైసలు. అమ్మ సోదరుడు, స్వయానా తన మామయ్యకు అమ్మ చనిపోయినట్టు ఉత్తరం రాయాలని, తాగాలనుకున్న టీ మానేసి, పోస్టాఫీసుకు వెళ్తాడు. కానీ అప్పటికే పోస్టు కార్డు ధర పదిహేను పైసలయ్యి వుంటుంది. చావటానికే కాదు, చచ్చినట్టు తెలపటానిక్కూడా దరిద్రం ఇంత దరిద్రంగా అడ్డుపడుతుందని ‘పదిపైసలు’ కథలో పతంజలి నిరూపించేస్తారు.

పతంజలి పేరు చెప్పగానే గుర్తు కొచ్చే ‘చూపున్న పాట’ లో కథనం మొత్తం మార్క్వెజ్ మార్కు  ‘మాంత్రిక వాస్తవం’ తోనే నడుస్తుంది. అందుకే మార్క్వెజ్ కే ప్రేమగా అంకితమిచ్చేశారు.

పతంజలి కథలన్నీ ఒక యెత్తు. ‘పోయే కాలం’ ఒక యెత్తు. పచ్చళ్ళు… మాంసంతో పచ్చళ్ళు.. నరమాంసంతో పచ్చళ్ళు. వాణిజ్య క్రౌర్యం మీద ఇంత పెద్ద ‘ఎత్తిపొడుపు కథ’ ఇంకెవ్వరూ రాయలేరేమో! ‘మరో మాట.. మన ప్రజలకి కులాలమీద వున్నవిశ్వాసాన్ని మనం దృష్టిలో వుంచుకోవాలి. ఏ కులం వాళ్ళకి ఆ కులం పచ్చడి దొరకేలాగ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సీసా మీద కులం పేరు ప్రింటు చేయిస్తే సరిపోతుంది.’  అనటం వెటకారానికి పరాకాష్ట. బీభత్సహాస్యమిది!

‘ఉదయం’ దినపత్రిక వచ్చిన కొత్తల్లో ఆదివారం ప్రత్యేకం లో పతంజలి ‘వేటకథలు’ వస్తుండేవి. కళ్ళకు కట్టినట్లే కాదు, గుండెలు పిండినట్టు రాసేసేవారు. అవి చదువుతుంటే జిమ్ కార్బెట్ రాసిన ‘మేన్ ఈటర్స్ ఆఫ్ కుమావోన్’ లోని అనుభవాలు గుర్తుకొచ్చేవి. (కుమావోన్ అనే ప్రాంతం ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వుంది.) కార్బెట్ స్వయంగా వేటాడి, నరమాంసం మరిగిన పులుల్ని చంపాడు. వాటినే ‘జ్ఞాపకాలు’ గా రాశాడు. నాకు నిజంగానే అనుమానం వచ్చి ‘మీరే స్వయంగా వేటకు వెళ్ళి పులుల్నీ గట్రా చంపేవారా?’ అని. ‘ఎన్నిసార్లు చెప్పాలి? నేను-బొబ్బిలి పులిని (పత్రికను) -చంపిన వాణ్ణని’ అని తేల్చిపారేసేవారు పతంజలి.

తెలుగు సాహిత్యానికి చెందినంత వరకూ పతంజలి ఒక ఆశ్చర్యం! ఆశ్చర్యాలకు నకళ్ళుండవు. ఉండకూడదు కూడా.

(అభ్యుదయ రచయితల సంఘం ప్రచురణ ‘కె యన్ వై పతంజలి కథలు’ గ్రంథానికి నేను రాసిన ముందు మాట. పుస్తకం ధర: రు.160. విశాలాంధ్ర, నవచేతన, నవోదయ బుక్ హౌస్ లలో దొరుకుతుంది.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *