కళ్ళు మూసుకుంటే పదేళ్ళు గడిచిపోయాయి.
కాదు.. కాదు.. మనమంతా కళ్ళు మూసుకుంటూనే గడిచిపోయాయి..
పులులు ప్రోటీన్లున్న గడ్డి తిని బలుస్తున్నాయన్నారు. కళ్ళు తెరిచి చూడలేక పోయాయి.
లేళ్ళు కేవలం కార్బోహైడ్రేట్లు అన్నం తిని చిక్కి పోతున్నాయన్నారు. చూసే ధైర్యం చెయ్యలేక
పోయాం.
నీళ్లు లేని చోటకు నీళ్ళొస్తున్నాయి- అంటే పొలాల్లో వెతికాం. కానీ మునిగినవి కొంపలు.
చూసినా ప్రయోజనం లేదని కళ్ళు తెరవలేదు.
రైతుల ఆత్మహత్యలు వుండవు. అన్నారు. ఈ మాట మాత్రం నిజం. రేపు రైతే వుండడు. ఆ
పని కార్పోరేటు వ్యాపారి చేస్తాడు. ఆ సుందర దృశ్యం రేపు తర్వాత చూడవచ్చని కళ్ళు తెరవలేదు.
అతనెవరో ‘నాటు బాంబు నెత్తిమీద ఖద్దరు టోపీ’ పెట్టి- ‘అహింసా వర్థిల్లాలి’ అన్నాడు. చాలా
మంది ప్రత్యర్థులు నెత్తుటి మడుగుల్లో తేలారు. భయం వేసి కళ్ళు తెరవలేదు.
మిగిలిన ఒకరిద్దరూ ‘కంప్యూటర్’లో దాక్కుండి పోయి, సౌకర్యవంతంగా సవాళ్లు విసిరారు.
చూడటానికి విసుగనిపించి కళ్ళు తెరవలేదు.
అందితే బేరం! అందకుంటే నేరం!
మనమంతా కళ్ళు మూసుకుంటేనే పదేళ్ళూ గడిచిపోయాయి.