కులం పై సెర్చిలైటు- కొరియా ‘పారసైటు’!?

మన దరిద్రమేమిటో కానీ, దరిద్రాన్ని ఒకేలా చూస్తాం. సినిమా వాళ్ళూ అలాగే చూపిస్తారు. నలభయ్యేళ్ళ క్రితం బిచ్చగాడెలా వున్నాడో, ఇప్పుడూ అలాగే వుంటాడు. అలాగే అడుక్కు తింటాడు. చూసి,చూసి ప్రేక్షకుడికే కాదు, తీసితీసి దర్శకుడికి కూడా చికాకు వస్తుంది. దాంతో ‘కడుపు మాడే బిచ్చగాడు’ కాస్తా, ‘తినమరిగిన బిచ్చగాడి’ గా కనిపిస్తాడు, అప్పుడు వాడి చేత ‘ధర్మం చెయ్యి తల్లీ’ అని దీనంగా అడిగించకుండా, ‘చికెనుంటెయ్యమ్మో, మటనుంటెయ్యమో..!’ అని దర్జాగా అరిపిస్తాడు. లేదా అందరూ టీ తాగే చోట, ‘హార్లిక్స్‌ తాగే’ ఆరోగ్యవంతుడయిన బిచ్చగాణ్ణి చూపిస్తాడు.
బిచ్చగాడనే కాదు, కూలీ, కార్మికుడు, నిరుద్యోగి- వీళ్ళవ్వరూ వేసుకునే ‘కాస్ట్యూవ్స్‌ు’ లో తప్ప పాత్ర స్వభావాల్లో మారరు. అదే సంపస్నుణ్ణి తీసుకోండి. ఎప్పటికప్పుడు ఆ పాత్రలు మారిపోతుంటాయి. ‘శ్రీమంతుడు’లో కార్పోరేట్‌ శ్రీమంతుడిగా జగపతిబాబునీ చూస్తాం, ‘సీతమ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో సంపన్నుడయిన రామభక్త శాసనసభ్యుడిగా మురళీమోహన్‌ నీ చూస్తాం. ఇవి అనుకూల పాత్రలు. ఇక ప్రతికూల పాత్రల్లో ఎన్నిరకాల సంపన్నులుంటారో చెప్పలేం.
దరిద్రానికీ పరిణామ క్రమం వుంటుంది. అదీ మారుతుంటుంది. అంటే వీర దరిద్రం, చోర దరిద్రం, నేర దరిద్రం- ఇలా దానికీ ఒక యుగ క్రమం (టైవ్‌ు లైన్‌) వుంటుంది. మన దేశంలో అయితే దరిద్రాలను నియంత్రించే దరిద్రం వుంటుంది. అదే కులం. ఏ కళ్ళజోడు లేకుండా చూసినా సరే- ‘ఘనంగా’ (‘త్రీడీ’ లో) కనబడుతుంది. కానీ తీసేవాళ్ళవరు? అలా పరభాషా చిత్రాల వైపో, పరదేశీ చిత్రాల వైపో తొంగి చూసినప్పుడు మాత్రమే, దరిద్ర పరిణామం తెలుస్తుంది.
ఈ మధ్య (2019 ప్రారంభంలోనే) దక్షిణా కొరియా చిత్రం వచ్చింది. దాని పేరు ‘పారసైట్‌’. తెలుగులో ఎవరూ ఇంకా ‘డబ్బు’ చేసుకోలేదు కాబట్టి, ‘పరాన్నజీవి’ అనేసుకోవచ్చు. ఒక జీవి పక్కనే నక్కేసి,దాని ఆహారంలో కొంత కొంత మెక్కేస్తూ బతికేసే జీవి. జీవశాస్త్రార్థమే. బోంగ్‌ జూన్‌ హ ో అనే చెయ్యి తిరిగిన దర్శకుడు అలవోకగా రాసి పారేశాడు; తీసి పారేశాడు. చూసిన ప్రపంచం విస్తుబోయింది. ‘ఏడ్వాలో, నవ్వాలో’ అర్థం కాలేదు. దాని జోనర్‌ అదే లెండి. ‘నవ్వేడ్పించే’ (ట్రాజోకామెడీ) చిత్రం. ఆ మాటకొస్తే, మనలో చాలా మంది జీవితాలు ఇదే జోనర్‌ లో నడుస్తాయి. అందుకే ఎవరికి వారు భుజాలు తడిమేసుకున్నారు. ‘ఇది నాకథేమో’- అని. ఒకాయనయితే ఇంకో అడుగు ముందుకేసి- ఇది నేను రాసిన కథే, నేను తీసిన కథే -అనేసుకున్నాడు. (పి. ఆర్‌. తెనప్పన్‌ అనే భారతీయ దర్శకుడు తాను1999లోనే తీసిన తమిళ చిత్రంలా వుందనకుని కేసుకు కూడా తెగబడ్డాడు.)
రెండు కుటుంబాలు. ఒకటి కంపు కొట్టే దరిద్ర కుటుంబం. ఇంకొకటి వాసనే లేని సంపన్న కుటుంబం. (ఇలా అనగానే అలవాటయిన, చెక్కుచెదరని, అనేక దశాబ్దాలుగా మారని మన ‘అభ్యుదయ కథల్ని’ గుర్తుకు తెచ్చుకోకూడదు సుమీ! అలా చూస్తే, ‘ దరిద్రుల కష్టాల్ని దోచుకునే ఆ సంపన్న కుటుంబమే ‘పారసైట్‌’ అనే నిర్థారణకు వచ్చేసే ప్రమాదం వుంది.) దరిద్రపు కొంపకు రాజు కివ్‌ు. సంపన్న భవంతికి యజమాని పార్క్‌. రోడ్డు దిగి వెళ్ళితే కానీ, కివ్‌ు వాళ్ళ కొంపలో కెమెరా కూడా దూరలేదు. ఆ కొంప మునగటానికి వరదే రానవసర్లేదు, ఎవడన్నా రోడ్డు మీద ఒంటేలు పోసినా చాలు. ఆ ఇరికింట్లో కిమ్మూ, వాడి అమ్మా, వాడి బాబూ, వాడి అక్కా- వుండిపోతారు. తిండి మీద అందరికీ యావే, కానీ వచ్చే మార్గం వుండదు. కానీ కిమ్ము గాడి మీద- రాయి పడ్డట్టు- నెత్తి మీద అదృష్టం దభీల్నమని పడుతుంది. (వాడికి రాయి కూడా అప్పనంగా వస్తుంది. దాని పని చివర్లో వుంటుంది.). వాడి ఫ్రెండు ఒకడు తగిలి ఒక ఉద్యోగం చూపిస్తాడు. అందమైన, విలాసవంతమైన ఇంటికి వెళ్ళి, అంతకన్నా జిగేల్మని మెరిసే అమ్మాయికి ఇంగ్లీషు ట్యూషన్‌ చెప్పిరావటం.
ఎత్తయిన ప్రదేశంలో, ముంగిట పచ్చిక వుండే, ఆ నివాసమే, మన పార్క్‌ నివాసం. పార్క్‌ తేట తెల్లని వ్యాపారస్తుడు. పార్క్‌ భార్య అయితే స్పÛటికమే. వీళ్ళకి జిగేల్మనే ఈ డొచ్చిన కూతురుతోపాటు, ఓ బుడుగు కూడా వుంటాడు. వీడు హింసాత్మకంగా ఆడుతుంటాడు. అదే వాడి సమస్య. దరిద్రపు కివ్‌ు గాడు, మెల్లగా ‘జిగేలిని’ని లైన్లో పెట్టేస్తాడు. ఆకర్షణని ముద్దుల వరకూ తెచ్చేస్తాడు. ఆ తర్వాత మిగిలిన కుటుంబ సభ్యుల్ని కూడా ఆ ఇంట్లోకి తెచ్చేస్తాడు..అది కూడా వాళ్ళవరో తెలియనట్లు నటిస్తూ..! బుడుగ్గాడికి ట్రీట్‌ మెంట్‌ ఇచ్చే ‘ఆర్ట్‌ థెరపిస్టు’ గా అక్కనీ, డ్రైవర్‌గా నాన్ననీ, వంటమనిషిగా అమ్మనీ రప్పించేస్తాడు. అంతకు ముందు ఈ ఉద్యోగాల్లో వుండే వారినీ, ఒక్కో వేషం వేసి, ఒక్కో మాయ చేసి, ఒక్కో మోసానికి వొడి గట్టి తప్పించేస్తారు దరిద్రపు కివ్‌ు కుటుంబ సభ్యులు. సంపన్నుడి పార్క్‌ భవంతిలో దరిద్రుల నాటకానికీ ఓ పరీక్ష వస్తుంది. పార్క్‌ సకుటుంబ సమేతంగా టూర్‌కి వెళ్తాడు. ఆ రోజు దరిద్రపు కుటుంబ సభ్యులు, దర్జాగా విదేశీ మద్యంతో పార్టీ చేసుకుంటారు. కిమ్ముగాడు ‘జిగేలిని’ని లైన్లో పెట్టాడు కాబట్టి, ఆ ఇంటి అల్లుడు కాబోతున్నట్లు కలగంటారు. ఈ లోగా వాన. తలుపు కొట్టిన చప్పుడు. అదురుగా తీసి చూస్తే, మానేసిన- ఈ దరిద్రులు మాన్పించేసిన- పాత వంట మనిషి. అప్పుడు బయట పడుతుంది. ఆ ఇంటికి ఓ కందకం. లోపల దిగుడు మెట్లతో ఓ బంకరూ వుందని. అంతే కాదు, అందులో సజీవంగా ఈ పాత వంట మనిషి భర్త వుంటాడు. ఆ విషయంలో ఇంట్లోవున్న వాళ్ళకు తెలియదు. కానీ రహస్యంగా కొన్నేళ్ళ పాటు ఆ పాత వంటమనిషిని అతడిని పోషిస్తూ వుంటుంది. అది ఇంకో దరిద్ర కుటుంబం. రెండు దరిద్ర కుటుంబాలు కొట్టుకు చచ్చేలోగా, తుపాను వాతావరణం వుందని అసలు యజమానులు వెనక్కి రావటమూ, వీళ్ళు యధావిధిగా తమ పాత్రల్లో కి రావటమూ జరిగిపోతాయి.
ఆ తర్వాత తమ దరిద్రపు కొంపకు చేరుకునే సరికి, నిజంగా పీకలోతు మురికి నీటి వరద. ఆ కంపుతోనే వరద బాధితుల ఆశ్రయానికీ, అక్కడి నుంచి మళ్ళీ మార్క్‌ కుటుంబంలోని విధుల నిర్వహణలోకి వస్తారు. అప్పుడు లవర్‌ బోయ్‌ కిమ్మున్నాడే- వాడు నిజంగానే ‘రాయి’ ని తెచ్చుకుంటాడు. (సాధారణ లోహం లాంటి తమ భవిష్యత్తును బంగారంలా మార్చేసే ఫిలాసఫర్‌ స్టోన్‌ అనుకున్నాడు.) ఆ రోజు సంపన్న యజమాని పార్క్‌ ఇంట్లో ఫంక్షన్‌. కిమ్ము గాడు పాత వంటమనిషి భర్తను రాయితో చంపబోయి, మొత్తం కుటుంబాన్ని హింస, కేసుల పాలు చేసుకుంటాడు.
ఇంతకీ ఇంటి కింద బంకరేమిటి? ఊరు కింద వెలివాడలాగా, నగరం కింద మురికి వాడ లాగా, తెల్ల వాళ్ల కాలనీలకు చివర వుండే ‘ఘెట్లో’ల్లాగా..? పై వాళ్ళు వదలిన గాలిని పీల్చుకుంటూ, వాడేసిన నీరును తాగుకుంటూ,వదలేసిన వ్యర్థాలను భుజిస్తూ జీవించే వారే ‘పార సైట్లా?’ అందుకేనేమో- ఈ చిత్రం చూస్తుంటే ఏ దేశపు దరిద్రుల కథ వారికి గుర్తుకొస్తోంది. ఈ దేశంలో కులం విసిరేసిన ఊరు వెలుపల వారి కథ గుర్తుకొస్తోంది.
ఆ మధ్య వెలివాడలో ఎవడో ఇల్లు కట్టుకుంటుంటే, ‘వాస్తు’ లేదన్నాడట! ( వాడి ‘వాస్తు’ తగలెయ్య! ‘వాస్తు’ అంటే పోనీ గాలీ, వెలుతురూ చొరబడేలా వుండటమే అని కాస్సేపు అనుకుందాం.) ఇల్లు కు సరే వాడకు వాస్తుంటుందా..? మృత కళేబరాలను శుభ్రం చేసే చోటనే, ఊరి వ్యర్థాలను కుప్పగా పోసే చోటే, శవాలను కాల్చి పారేసే చోటే, గాలి వస్తుందా.. అని!? రాకేం?వస్తుంది. ఊరు విడిచేసిన గాలి. అలాగే ‘పారసైట్‌’లో కూడా, ఇల్లు ‘వెంటిలేట్‌’ చేసే గాలీ వస్తుంది.
గాలి సరే, నీళ్ళంటారా? వస్తాయి. అవీ ఊరు వదిలేసిన నీళ్ళే. ఇప్పుడు కనుక అలనాటి తెలుగు కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి బతికి వుంటే, ఆయన కూడా ఈ సినిమా చూసివుంటే, తనకి కూడా అనుమానం వచ్చేది. తన కథ (‘ఇలాంటి తవ్వాయి వస్తే’) ను ఈ ‘హ ో’ అనే కొరియా దర్శకుడు సినిమా తీసాడేమో- అని అనుమాన పడేవాడు.
ఊరికి ఒక చెరువు. దానికి నాలుగు రేవులు. నాలుగు వర్ణాల వారికి నాలుగున్నమాట. కానీ ఓ రోజు అక్కడి అస్పృశ్యస్త్రీలు, మురికి వస్త్రాలతో మట్టి కుండలు వేసుకుని, దొంగచాటుగా ఏకంగా బ్రాహ్మల రేవుకు వచ్చేస్తాడు. సమయానికి పురోహితుడు అక్కడ వుండబట్టి అడ్డగిస్తాడు. ఆసలు బ్రాహ్మల రేవులోకే కాదు, ఏరేవులోకీ వారికి అనుమతిలేదు. అలాంటిది అలా వచ్చేస్తే ఊరుకుంటాడా? మరి వాడలో వుండే అస్పృశ్యులు ఏం నీళ్ళు తాగాలీ? ఊరు మరీ దయలేనిది కాదు. ఊరు చెరువునుంచి ఒక తూము వుంటుంది. ఆ తూములో నీళ్ళు పల్లాన వున్న వాడ చెరువులోకి వెళ్తాయి. అంటే ఊరు వాడేసి వదిలేసిన నీళ్ళు వెళ్తాయి. కానీ వాళ్ళ ఖర్మ కాలి, అందులో మనిషి దూకి చచ్చిపోయి, ఉబ్బిపోయి వారం తర్వాత తేలాడు. పైగా చనిపోయిన వాడు కుష్టురోగి. అయినా సరే ‘ ఆ నీళ్ళు తాగొచ్చుగా’ అని సెలవిస్తాడు పురోహితుడు. ఇంటి కింద బంకరు వున్నట్లు, చూశారా నీళ్ళ కోసం ఏర్పాటు? చెరువు కింద చెరువూ..!?
గాలీ,నీరూ సరే.. మరి తిండో…? వదిలేసినవి ఏరుకోవాలి. ఊరు వాళ్లు చేలల్లో పంట కోసుకుని పోయాక, దొంగచాటుగా వెళ్ళి పరిగె ఏరుకోవాలి. లేదా చనిపోయిన జీవాలను తినాలి.
ఇది ఒక నాటి గ్రామీణ కుల వ్యవస్థ. మరి నగరాలకు వస్తేనో..!? వాడ మురికి వాడ అవుతుంది. అంటే ఊరు ముంబయి అవుతుంది. వాడ ధరావి అవుతుంది. అవే సౌకర్యాలు. డ్రైనేజీ పక్క ఇళ్ళు. దొంగచాటుగా గాలీ, నీరూ, బువ్వా పొందాలి. అవసరమైతే ఒక దరిద్రుణ్ణి ఇంకొకడు వంచించి బతకాలి. వేషాలు వెయ్యాలి. ఆ పూట రొట్టె కోసం వంద మోసాలు చెయ్యాలి. దరిద్రపు గొట్టు చొరవ చూపాలి. తెగబడాలి. దాక్కోవాలి.
వీళ్ళే మన ‘పారసైట్లు’. అలాగే ప్రభుత్వాలు చూస్తాయి. కార్పోరేటు సంస్థలూ చూస్తాయి. అసలు ‘పారసైట్లు’ ఎవరో అందరికీ తెలుసు. అయినా చప్పుడు చెయ్యకూడదు. అదే దేశభక్తి! అదే నాగరికత! అదే సహ జీవనం!?

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 16-22 మే 2020 సంచిక కోసం రాసిన సంపాదకీయం)

2 comments for “కులం పై సెర్చిలైటు- కొరియా ‘పారసైటు’!?

  1. జైభీం సార్.
    సంపాదకీయంలా చదివించకుండా
    కాకుండా సినిమా చూపించారు.
    అల్లరి నరేష్ గారిది ఇటువంటి సినిమా
    ఒకటి వచ్చింది. అతని వన్నీ కాపీరాగాలే కాదా !
    కృతజ్ఞతలు మీకు.
    -డాక్టర్ బండి

  2. ఇతరుల శ్రమని దోచుకొని బ్రతికే ప్రతి వాడూ పారసైటే సార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *