
లక్ష్మీ, సరస్వతుల్లాంటి తోబుట్టువులే మరో ఇద్దరున్నారు. వాళ్ళే రూపవతి, సారమతులు. ఇక్కడా అంతే. ‘ఏవండోయ్! ఆవిడొచ్చింద’ని సృష్టికర్త కు చెప్పి, ఈవిడ చల్లగా జారుకుంటుంది. దాంతో సృష్టికర్త ఎవరో ఒకరినే నమ్ముకోవాలి. రూపం వుంటే సారం వుండదు, సారముంటే రూపం వుండదు. నేలబారుగా చెప్పాలంటే, ‘బిల్డప్’ వుంటే విషయం వుండదు. విషయం వుంటే ‘బిల్డప్’ వుండదు. దాంతో సృష్టి కర్త అనబడే రచయిత ఏం చేస్తాడు? ఎవరో ఒకరితోనే సెటిలయపోతాడు. అయితే రూపవతీ, లేకపోతే సారమతి.