ఆమె ఎవరో… ఖరీదయిన దుస్తుల్లో, విలువయిన ఆభరణాలతో, అరుదయిన పెర్ప్యూమ్ పూసుకుని
ఎదురుగా నిలబడింది. పట్టించుకోలేదు. నేనే కాదు. నా మిత్రులు కూడా. చిన్నగా నవ్వింది.
అందరమూ చూశాం. అవును నవ్వే చిన్నది. ఆ నవ్వు పూసిన పెదవులు మరీ చిన్నవి. నిలువెత్తు
అందగత్తెకు ఉనికి ఆ చిన్న నవ్వే. నేను రోజూ వెళ్ళే పార్కుకు ఉనికి చెరువుకు ఓ మూలగా వున్న
చిన్న సిమెంటు సోఫా కావచ్చు. అక్కడ కూర్చున్నప్పుడే పల్చటి గాలి వచ్చి పలకరించి పోతుంది.
చిరు అనుభూతే పెద్ద జీవితానికి ఉనికి.