ఎన్నికలలో ఎవరి టెన్షన్ వారికి వుంది. కారణం కోరిక. గెలిచితీరాలనే పట్టుదల. కానీ ఎలాంటి ఆందోళన లేని వారు కూడా రాష్ట్రంలో వున్నారు. వారే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు. నిండా మునిగిన వారికి కొత్తగా చలి పుట్టుకు రాదు. వీరి పరిస్థితి అంతే. ఎలాగూ గెలవమని తెలిసిపోయాక, ‘అవశేషాంధ్రప్రదేశ్’లో అధికారానికీ, తమకీ సంబంధం లేదనీ ముందే అర్థమయి పోయాక, అన్ని పనుల్లూ తంతుల్లా జరిగిపోతాయి. పార్టీ టిక్కెట్ల పంపిణీ దగ్గర నుంచి, ప్రచారం వరకూ పధ్ధతి ప్రకారం జరిగిపోతాయి. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నప్పుడే కాంగ్రెస్ అధిష్ఠానం ఈ పరిస్థితి ఊహించి వుండాలి. కాబట్టి ఇక్కడి స్థితి వారిని ఎలాంటి ఆందోళనకూ గురి చెయ్యదు.